దీవుల సంపూర్ణ అభివృద్ధి దిశ గా చోటుచేసుకొంటున్న పురోగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వం ఐలాండ్స్ డివెలప్‌మెంట్ ఏజెన్సీ ని 2017 జూన్ 1వ తేదీన ఏర్పాటు చేసింది. 26 దీవులను అన్ని రంగాలలోనూ అభివృద్ధి పరచాలని పట్టికీకరించారు.
కీలక అవస్థాపన పథకాలు, డిజిటల్ కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ, నిర్లవణీకరణ ప్లాంటులు, వ్యర్థాల నిర్వహణ, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, ఇంకా వినోద పర్యటన ప్రధానమైనటువంటి పథకాలు సహా సంపూర్ణ అభివృద్ధి కి సంబంధించిన అంశాలపై నీతి ఆయోగ్ ఒక ప్రెజెంటేశన్ ను ఇచ్చింది.
అండమాన్ మరియు నికోబార్ దీవులలో జరిగిన పనులపైన ప్రధాన మంత్రి సమీక్ష జరుపుతూ, వినోద పర్యటన రంగంలో అభివృద్ధి కి ఎంపిక చేసిన అంశాలు, పర్యటన ప్రధానమైనటువంటి సమగ్ర ఇకో సిస్టమ్ ను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. దీవులలో శక్తి సంబంధి స్వయం సమృద్ధిని సాధించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిస్తూ, దీని కోసం సౌర శక్తి పై ఆధారపడవచ్చని సూచించారు.
అండమాన్ మరియు నికోబార్ దీవులను సందర్శించే విదేశీయులకు నిషిద్ధ ప్రాంత అనుమతి ని తీసుకోవలసిన అగత్యాన్ని తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందన్న విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకురావడమైంది. ఈ దీవులను ఆగ్నేయ ఆసియా తో మరింతగా సంధానించే అంశాన్ని కూడా చర్చించారు.
లక్షద్వీప్ లో అభివృద్ధి పనులను సమీక్షించిన సందర్భంగా ట్యూన చేపల వేటను ముమ్మరంగా చేపట్టేందుకు తీసుకొన్న చర్యలను మరియు ‘‘లక్షద్వీప్ ట్యూన’’ ను ఒక బ్రాండు గా ప్రచారం చేసేందుకు చేపట్టిన చర్యలను ప్రధాన మంత్రి కి తెలియజేయడమైంది. పరిశుభ్రత అంశం లో లక్షద్వీప్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
అండమాన్ మరియు నికోబార్ దీవులతో పాటు లక్షద్వీప్ లో సైతం కీలక అవస్థాపనను అభివృద్ధి చేయడం పైనా చర్చించడమైంది.
సముద్రం లో పెరిగే మొక్కల జాతులను పెంచేందుకు ఉన్నటువంటి అవకాశాలను అన్వేషించాలని, అలాగే వ్యవసాయ రంగానికి దోహదాన్ని అందించగల ఇతర కార్యకలాపాలను గురించి కూడా శోధించాలని సంబంధిత అధికారులకు ప్రధాన మంత్రి సూచించారు.
ఈ సమావేశానికి హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింహ్, అండమాన్ & నికోబార్ దీవుల మరియు లక్షద్వీప్ యొక్క లెఫ్టెనంట్ గవర్నర్ లు, నీతి ఆయోగ్ సిఇఒ, ఇంకా కేంద్ర ప్రభుత్వం లోని సీనియర్ అధికారులు హాజరయ్యారు.