జులై 1వ తేదీ నుండి అమలు కావలసి ఉన్న వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) యొక్క స్థితిని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమీక్ష జరిపారు. రెండున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ప్రధాన మంత్రి కార్యాలయానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులు మరియు కేబినెట్ కార్యదర్శి హాజరయ్యారు.
సమావేశంలో భాగంగా సమాచార, సాంకేతిక, విజ్ఞాన సంబంధ సన్నద్ధత, మానవ వనరుల విభాగానికి సంబంధించిన సన్నాహాలు, అధికారులకు శిక్షణ, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే పద్ధతి మరియు పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రధాన మంత్రి ప్రత్యేకంగా సమీక్షను నిర్వహించారు. సమాచార, సాంకేతికతకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, అధికారుల శిక్షణ, బ్యాంకులతో సమన్వయం, ప్రస్తుత పన్ను చెల్లింపుదారుల నమోదు తదితర జిఎస్ టి వ్యవస్థలను అమలు తేదీ అయిన జులై 1 కన్నా ముందుగానే సన్నద్ధం చేయడం జరుగుతుందని ప్రధాన మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. సమాచార భద్రతతో ముడిపడిన వ్యవస్థలపై సమగ్రంగా చర్చించారు.
ప్రశ్నలకు ఎప్పటికప్పుడు జవాబును అందించడం కోసం @askGst_GOI పేరిట ఒక ట్విటర్ హ్యాండిల్ ను ప్రారంభించడమైంది. అలాగే ఇదే పనిని దృష్టిలో పెట్టుకొని 1800-1200-232 టోల్ ఫ్రీ ఫోన్ ను కూడా పని చేయించడం మొదలు పెట్టారు. ఈ ఫోన్ నెంబర్ అఖిల భారత స్థాయిలో ఉపయోగపడుతుంది.
రాజకీయ పక్షాలు, వ్యాపార మరియు పరిశ్రమ సంఘాలు సహా సంబంధిత వర్గాల వారందరూ సమష్ఠిగా చేసిన ప్రయత్నాలు పూర్తి అయినందువల్ల జిఎస్ టి జులై 1వ తేదీ నుండి అమలులోకి రానుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. జిఎస్ టి ఆర్థిక వ్యవస్థకు ఒక మేలు మలుపు అని, చరిత్రలో ఇంత వరకు జరగని ఘటన అని ఆయన అభివర్ణించారు. "ఒకే దేశం - ఒకే విపణి - ఒకే పన్ను'' వ్యవస్థ యొక్క ఆవిర్భావం సామాన్య మానవుడికి గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అధికారులతో అన్నారు. జిఎస్ టి తో సంబంధం ఉన్నటువంటి ఐటి వ్యవస్థల విషయంలో సైబర్ సెక్యూరిటీ పై గరిష్ట స్థాయిలో శ్రద్ధ తీసుకోవాలని కూడా ప్రధాన మంత్రి ఆదేశించారు.