ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నీటిపారుదల పథకమైనటువంటి ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ (పిఎమ్ కెఎస్ వై) పురోగతిని ఈ రోజు సమీక్షించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ ఒ), నీతి ఆయోగ్ లకు చెందిన సీనియర్ అధికారులతో పాటు సంబంధిత వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రాధాన్యం కలిగివున్న 99 నీటిపారుదల ప్రాజెక్టులలో 5.22 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సదుపాయాన్ని సమకూర్చగల 21 నీటిపారుదల ప్రాజెక్టులు 2017 జూన్ కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
వీటికి అదనంగా ప్రాధాన్యం కలిగివున్నటువంటి 45 నీటిపారుదల ప్రాజెక్టుల పనులు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మరియు ఒడిశాలలో చక్కని పురోగమన దశలో ఉన్నాయి; ఇవి అనుకున్న సమయం కన్నా ముందుగానే పూర్తి అయ్యేందుకు అవకాశం ఉంది.
త్వరలో పూర్తి కానున్న నీటిపారుదల పథకాలలో భాగంగా బిందు సేద్యంపైన, సూక్ష్మ సేద్యంపైన గరిష్ఠ శ్రద్ధ తీసుకోవలసిందిగా అధికారులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కమాండ్ ఏరియాలలో జల వినియోగ పద్ధతులను, సమర్ధమైన పంటల నమూనాలను రూపొందించడంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య సమన్విత చర్యలు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
పిఎమ్ కెఎస్ వై కోసం సమగ్రమైన, అవిభాజ్యమైన విజన్ తో పని చేయాలని అధికారులకు ప్రధాన మంత్రి ఉద్బోధించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు స్పేస్ అప్లికేషన్ లతో సహా అందుబాటులోని అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఆయన సూచించారు.