కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల మధ్య వైద్య ఆక్సిజన్ అవసరాన్ని ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి పెంపు దిశగా ప్రస్తుతం నత్రజని ఉత్పత్తి కేంద్రాలను ఆక్సిజన్ ప్లాంట్లుగా మార్పిడి చేయడంలోగల సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. తదనుగుణంగా వివిధ పరిశ్రమలలోగల ఇటువంటి నత్రజని తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని ఆక్సిజన్ ఉత్పత్తికి కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రస్తుతం ‘పీఎస్ఏ’ నత్రజని ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లుగా మార్చడంపై ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన సమావేశం చర్చించింది. ఇందుకోసం నత్రజని తయారీ ప్లాంట్లలో ఆక్సిజన్ తయారుచేయాలంటే ప్రస్తుతం వాటిలో వాడే ‘‘కర్బన అణుసంబంధ జల్లెడ’’ (సీఎంఎస్)ల స్థానంలో ‘‘జియోలైట్ అణుసంబంధ జల్లెడ’’ (జడ్ఎంఎస్)లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ‘సీఎంఎస్’ బదులు ‘జడ్ఎంఎస్’ను అమర్చడంతోపాటు ‘ఆక్సిజన్ ఎనలైజర్, కంట్రోల్ పానెల్ సిస్టమ్, ఫ్లోవాల్వ్స్’ వంటి కొన్ని ఇతర మార్పులు చేపట్టడం ద్వారా నత్రజని తయారీ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్పిడి చేయవచ్చు.
పరిశ్రమలతో చర్చల అనంతరం ఇప్పటిదాకా 14 పరిశ్రమలను ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో నత్రజని ప్లాంట్ల మార్పిడి ప్రగతి పథంలో సాగుతోంది. దీనికితోడు పారిశ్రామిక సంఘాల సాయంతో మరో 37 నత్రజని ప్లాంట్లను కూడా గుర్తించారు. ఇలా మార్పిడి చేసిన ప్లాంట్లను సమీపంలోని ఆస్పత్రులకు తరలించవచ్చు. ఒకవేళ ప్లాంటును మార్చడం సాధ్యంకాని పక్షంలో అక్కడికక్కడే ఆక్సిజన్ తయారీకోసం వాడుకోవచ్చు. తద్వారా ప్రాణవాయువును ప్రత్యేక ఉపకరణాలు లేదా సిలిండర్ల ద్వారా ఆస్పత్రులకు రవాణా చేయవచ్చు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, మంత్రిమండలి కార్యదర్శి, దేశీయాంగ శాఖ కార్యదర్శి, రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.