ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య హామీ కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా సాగుతున్న సన్నాహాల తాలూకు పురోగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు సమీక్షించారు.
ఆరోగ్య హామీ కార్యక్రమం త్వరితంగా, సాఫీగా ఆరంభమయ్యేందుకు వీలుగా రాష్ట్రాలతో సంప్రదింపులు సహా ఇంతవరకు జరిగిన సన్నాహాల పరంపరను ఈ సందర్భంగా ప్రధాన మంత్రి దృష్టికి తీసుకురావడమైంది.
ఈ పథకం ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు రక్షణ ను కల్పిస్తుంది. 10 కోట్లకు పైగా పేద, దుర్బల కుటుంబాలకు రక్షణ ను అందించడం ఈ పథకం యొక్క లక్ష్యంగా ఉంటుంది.
సమాజం లోని పేదలు మరియు అణగారిన వర్గాల వారికి గరిష్ఠ ప్రయోజనాన్ని ఈ పథకంలో భాగంగా అందజేయాలని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ ఇంకా పిఎమ్ ఒ ల అగ్రగామి అధికారులు ఈ పథకం యొక్క వివిధ అంశాలను గురించి ప్రధాన మంత్రికి తెలియజెప్పారు.
ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఒకటో హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ను ఛత్తీస్ గఢ్ లోని మహత్వాకాంక్ష కలిగిన జిల్లా అయినటువంటి బీజాపుర్ లో ప్రధాన మంత్రి గత నెలలో ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా ప్రారంభించారు.