ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రకటించిన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ఆరంభించే దిశగా సాగుతున్నటువంటి సన్నాహాల తాలూకు పురోగతిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు సమీక్షించారు.
రెండు గంటలకు పైగా కొనసాగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిఎమ్ఒ మరియు నీతి ఆయోగ్ లకు చెందిన అగ్ర స్థానాలలోని అధికారులు పాల్గొని ఈ పథకాన్ని అమలుపరచేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు సంబంధించి ఇంతవరకు చేపట్టిన పనులను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు.
ఈ పథకం ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల మేరకు రక్షణ ను అందించనుంది. పేదలు మరియు దుర్బల కుటుంబాలు కలుపుకొని మొత్తంమీద 10 కోట్ల మందికి పైగా రక్షణను కల్పించడం లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకురానున్నారు. ఈ పథకం యొక్క లబ్దిదారులు భారతదేశమంతటా నగదు రహిత ప్రయోజనాలను పొందగలుగుతారు.
ఆరోగ్య కేంద్రాలు మరియు వెల్ నెస్ సెంటర్ ల ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించేందుకు తగ్గ సన్నాహాలను సైతం ప్రధాన మంత్రి సమీక్షించారు.
సమాజంలో పేదలు మరియు బలహీన వర్గాల వారికి మేలు చేయగల ఒక చక్కని రూపురేఖలు కలిగినటువంటి ఒక లక్షిత పథకం దిశగా కృషి చేయవలసిందంటూ ప్రధాన మంత్రి ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు.