ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాల్ దీవ్స్ కు వెళ్ళే ముందు విడుదల చేసిన విడుదల పాఠం ఈ కింది విధంగా ఉంది.
“రిపబ్లిక్ ఆఫ్ మాల్‌దీవ్స్ అధ్యక్ష పదవి కి ఎన్నికైన శ్రేష్ఠులు శ్రీ ఇబ్రాహిమ్ మొహమద్ సోలిహ్ చరిత్రాత్మకమైన పదవీ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం మాల్ దీవ్స్ రాజధాని మాలే ను సందర్శించనుండడం నాకు సంతోషాన్ని ఇస్తోంది.
ఇటీవలి ఎన్నికల లో ఆయన విజేత గా నిలచినందుకు ఆయన కు ఇదే నా ఆత్మీయతాపూర్వక అభినందన. ఇది ప్రజాస్వామ్యం, న్యాయబద్ధ పాలన మరియు సమృద్ధమైన భవిష్యత్తు లకై రిపబ్లిక్ ఆఫ్ మాల్‌దీవ్స్ ప్రజల యొక్క సమష్టి ఆకాంక్షల కు ప్రతీక గా నిలుస్తోంది.
భారతదేశం, ఇంకా మాల్‌దీవ్స్.. ఈ రెండు దేశాల మధ్య ఒక బలమైన భాగస్వామ్యం చరిత్ర లో వేళ్ళూనుకొని నిలబడింది. మన ఉభయ దేశాల ప్రజల మధ్య బలమైన అనుబంధం ఉంది. వారు శాంతి ని, సమృద్ధి ని ఆకాంక్షిస్తున్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ కై అన్ని వర్గాలను కలుపుకొని పోవాలన్న మా ప్రభుత్వం యొక్క దార్శనికత అనేది మా ఇరుగు పొరుగు దేశాలన్నింటికీ వర్తిస్తుంది. రిపబ్లిక్ ఆఫ్ మాల్‌దీవ్స్ లో ప్రజాస్వామ్య వాతావరణం తో పాటు సమృద్ధి, శాంతి కూడా వర్ధిల్లాలని, భారతదేశం లోని మేమందరం గట్టిగా కోరుకొంటున్నాం.
మాల్‌దీవ్స్ లో శ్రీ సోలిహ్ నేతృత్వం లో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంబంధ ప్రాధమ్యాలను, ప్రత్యేకించి మౌలిక సదుపాయలు, ఆరోగ్యం, సంధానం, ఇంకా మానవ వనరుల వికాసం వంటి రంగాల లో నెరవేర్చుకొనేటందుకు నా ప్రభుత్వం వారి తో సన్నిహితంగా పని చేస్తుందని నేను స్పష్టం చేయదలచాను.
మన రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం మరియు ఆదాన ప్రదానాల లో ఒక నూతన యుగారంభానికి నా పర్యటన దోహదం చేయగలదన్న నమ్మకం నాలో ఉంది’’.