ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశంలోనే అత్యంత పొడవాటి వంతెన అయిన ఢోలా- సాదియా నదీ వంతెనను ఈ రోజు ప్రారంభించారు. ఈ వంతెన అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పైన నిర్మితమైంది. దీని పొడవు 9.15 కిలోమీటర్లు. శ్రీ మోదీ ప్రధాన మంత్రిగా పదవీబాధ్యతలను స్వీకరించి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఇదే ఆయన పాల్గొన్న తొలి కార్యక్రమం.
ఈ నదీ వంతెన ప్రాజెక్టు అస్సామ్ కు, అరుణాచల్ ప్రదేశ్ కు మధ్య అనుసంధానాన్ని పెంపొందించడంతో పాటు ప్రయాణ సమయాన్ని గణనీయ స్థాయిలో తగ్గించగలుగుతుంది.
నదీ వంతెన ప్రారంభసూచకంగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం, ప్రధాన మంత్రి కొద్ది నిమిషాల పాటు వంతెనపై ప్రయాణించారు; ఆయన వంతెనపై నడిచి చూశారు కూడా.
అనంతరం, ఢోలా లో ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. వంతెన ప్రారంభంతో ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాల నిరీక్షణ అంతమైందని ఆయన అన్నారు.
అభివృద్ధి కోసం అవస్థాపన చాలా ముఖ్యమని, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నమల్లా ప్రజల కలలను, ఆకాంక్షలను నెరవేర్చడమేనని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ వంతెన అస్సామ్ కు, అరుణాచల్ ప్రదేశ్ కు మధ్య అనుసంధానాన్ని పెంచి, పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధికి ద్వారాన్ని తెరుస్తుందని కూడా ఆయన చెప్పారు.
దేశంలోని తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలు భారీ ఆర్థిక పురోగతి సామర్థ్యాన్ని కలిగివున్నాయని, ఈ వంతెన ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ దార్శనికతలో కేవలం ఒక అంశం మాత్రమేనని ఆయన వివరించారు.
సామాన్య ప్రజల జీవితాలలో ఒక సకారాత్మకమైనటువంటి మార్పును ఈ వంతెన తీసుకురాగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. నదీమార్గాలను అభివృద్ధి చేయడానికి సైతం కేంద్ర ప్రభుత్వం గొప్ప ప్రాధాన్యాన్నిస్తోందని ఆయన చెప్పారు.
దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య అనుసంధానాన్ని పెంచడమనేది కేంద్ర ప్రభుత్వ ప్రాథమ్యాలలో ఒకటని, ఈ విషయంలో పనులను అమిత వేగంతో చేపడుతున్నామని ప్రధాన మంత్రి తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో చక్కటి అనుసంధానాన్ని సంతరించడం ఈ ప్రాంతాన్ని ఆగ్నేయ ఆసియా యొక్క ఆర్థిక వ్యవస్థతో ముడి వేయగలుగుతుందని కూడా ఆయన వివరించారు.
ఈశాన్య భారతదేశపు పర్యటక రంగానికి ఉన్న విస్తృతమైనటువంటి శక్తిని గురించి కూడా ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఢోలా- సాదియా నదీవంతెనకు గొప్ప సంగీతకారుడు, గేయ రచయిత, కవి శ్రీ భూపేన్ హజారికా పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి వెల్లడించారు.