ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు మాన్య శ్రీ మాటెమెలా సిరిల్ రామాఫోసా తో శుక్రవారం నాడు టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇప్పటికీ ఎదురవుతున్న సవాళ్ళను గురించి నేతలు ఇరువురూ చర్చించారు. వారు తమ దేశాల లో టీకా ఇప్పించే కార్యక్రమాన్ని గురించి కూడా చర్చించారు.
ఔషధ నిర్మాణానికి, టీకా మందులకు సంబంధించి భారతదేశాని కి గల గణనీయమైన ఉత్పాదక సామర్ధ్యం ఆఫ్రికా సహా, అన్ని దేశాల అవసరాల కు అనుగుణం గా సేవల ను అందించడానికి ముందుకు వస్తూనే ఉంటుందని దక్షిణ ఆఫ్రికా అధ్యక్షునికి ప్రధాన మంత్రి మరో మారు స్పష్టం చేశారు.
మందులను, టీకామందులను తక్కువ ఖర్చు తో, అందరికి అందుబాటు లో ఉంచేందుకు వివిధ అంతర్జాతీయ స్థాయి వేదికల లో దక్షిణ ఆఫ్రికా, భారతదేశం పరస్పరం సహకరించుకోవడానికి గల అవకాశాల ను గురించి కూడా ఉభయ నేతలు చర్చించారు.
ఒక పక్షం అనుభవాన్ని మరొక పక్షానికి ఇచ్చి పుచ్చుకొనేందుకు, మహమ్మారి కి వ్యతిరేకం గా కలసి ప్రయాసలను చేపట్టడానికి ఆస్కారం ఉన్న రంగాల ను అన్వేషించేందుకు రెండు దేశాల అధికారులు రాబోయే కాలం లో పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలన్న అంశం లో నేతలు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు.