భారతదేశం మరియు ఫార్ ఈస్ట్ మధ్య సంబంధాలు కొత్తవి కావు, పాతవి: ప్రధాని మోదీ
వ్లాదివోస్టాక్‌లో తన కాన్సులేట్‌ను ప్రారంభించిన మొదటి దేశం భారతదేశం: ప్రధాని మోదీ
ఫార్ ఈస్ట్ అభివృద్ధి కోసం 1 బిలియన్ డాలర్ల విలువైన రుణ శ్రేణిని ప్రధాని మోదీ ప్రకటించారు

అధ్యక్షుడు పుతిన్,

అధ్యక్షుడు బతుల్గా,

ప్రధానమంత్రి అబే,

ప్రధానమంత్రి మహతిర్,
 
మిత్రులారా, 

నమస్కార్,

డోబ్రీ డెన్,

వ్లాదివోస్తోక్ లోని ఆహ్లాదకరమైన, తేలికపాటి వాతావరణంలో మీ అందరితో చర్చలు జరపడం ఆనందదాయకమైన అనుభవం. తెల్లవారి వెలుగులు ఇక్కడ నుంచే ప్రపంచానికి ప్రసరిస్తాయి. ప్రపంచం అంతటిలోనూ శక్తిని నింపుతాయి. ఈ రోజు ఇక్కడ మనం జరుపుతున్న ఈ ఆలోచనాపూర్వకమైన చర్చలు దూర ప్రాచ్య దేశాలకు ఒక కొత్త శక్తిని అందిండమే కాదు, మొత్తం మానవాళి సంక్షేమానికి తీసుకునే చర్యలకు కూడా కొత్త ఉత్తేజం అందిస్తాయన్న నమ్మకం నాకుంది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు నా మిత్రుడు అధ్యక్షుడు పుతిన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కన్నా ముందే అధ్యక్షుడు ఈ ఆహ్వానం నాకందించారు. 130 కోట్ల మంది భారత ప్రజలు నాపై విశ్వాసాన్ని మరోసారి ప్రకటించారు. మీ ఆహ్వానం ఆ విశ్వాసానికి ఒక ముద్ర వేసింది. రెండేళ్ల క్రితమే సెయింట్ పీటర్స్ బర్గ్ ఆర్థిక వేదికకు ప్రెసిడెంట్ పుతిన్ నన్ను ఆహ్వానించారు. యూరప్ సరిహద్దు నుంచి పసిఫిక్ గేట్ వే వరకు మొత్తం ట్రాన్స్ సైబీరియా ప్రాంతం అంతటా నేను పర్యటించాను. వ్లాదివోస్తోక్ యూరేసియా, పసిఫిక్ ప్రాంతాల సంగమ ప్రదేశం. ఆర్కిటిక్, ఉత్తర సముద్ర మార్గాలకు ఇది చక్కని అవకాశం అందిస్తుంది. రష్యన్ భూభాగంలో మూడు వంతులు ఆసియాలోనే ఉంది. దూర ప్రాచ్యం ఈ మహోన్నతమైన దేశానికి గల ఆసియా గుర్తింపును ప్రపంచానికి చాటుతుంది. ఈ ప్రాంతం భారత విస్తీర్ణం కన్నా రెండింతలు అధికంగా ఉంటుంది. మొత్తం జనాభా 60 లక్షలే అయినా ఇది అపారమైన ఖనిజ, చమురు సహజవాయు సంపద గల ప్రదేశం. కఠోరంగా శ్రమించే స్వభావం గల ఈ ప్రాంత ప్రజలు తమ శ్రమశక్తి, సాహసం, కొత్త ఆలోచనా ధోరణితో ప్రకృతి విసురుతున్న సవాలును దీటుగా ఎదుర్కొనగలుగుతున్నారు. అంతే కాదు, కళలు, సైన్స్, సాహిత్యం, పరిశ్రమ, సాహసోపేత కార్యకలాపాలకు దూరప్రాచ్యం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నా వ్లాదివోస్తోక్ కు ఆ విజయం అందలేదు. కాని అదే సమయంలో రష్యాకు, తమ ఇతర మిత్రులకు ఆ దేశం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉంచింది. మంచు గడ్డలు కట్టిన ప్రదేశాన్ని పూలపాన్పుగా మార్చి బంగారు భవిష్యత్తుకు చక్కని వేదికగా చేశారు. నిన్న అధ్యక్షుడు పుతిన్ తో కలిసి నేను దూర ప్రాచ్య వీధి ప్రదర్శనను (స్ర్టీట్ ఆఫ్ ఫార్ ఈస్ట్) సందర్శించాను. ప్రజల్లోని భిన్నత్వం, ప్రతిభ, సాంకేతికంగా వారు సాధించిన అభివృద్ధి నన్నెంతో ఆకట్టుకున్నాయి. అభివృద్ధి, సహకారానికి ఎన్నో అవకాశాలు వారి ముందున్నాయని నేను భావిస్తున్నాను.

మిత్రులారా, 

భారత, దూర ప్రాచ్య దేశాల స్నేహబంధం ఈ నాటిది కాదు, ఎంతో ప్రాచీనకాలం నాటిది. వ్లాదివోస్తోక్ లో తొలి రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన దేశం భారత్. అంతకన్నా ముందు కూడా భారత, రష్యా మధ్య ఎంతో విశ్వాసపూరితమైన వాతావరణం ఉండేది. సోవియెట్ రష్యా కాలంలో కూడా విదేశీ సందర్శకులపై ఆంక్షలున్నప్పటికీ వ్లోదివోస్తోక్ భారత పౌరుల సందర్శనకు తెరిచి ఉండేది. భారీ పరిమాణంలో రక్షణ, అభివృద్ధి పరికరాలు వ్లాదివోస్తోక్ ద్వారా భారత్ చేరేవి. ఆ స్నేహవృక్షం ఈ రోజున మరింత బలంగా వేళ్లూనుకుంటోంది. ఉభయ దేశాల ప్రజల సంపన్నతకు అది ఒక మూలస్తంభంగా ఉంది. వ్లోదివోస్తోక్ లో భారత్ ఇంధనం, వజ్రాలు వంటి ప్రకృతి వనరుల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. భారత పెట్టుబడుల విజయానికి సఖాలిన్ ఆయిల్ క్షేత్రాలే సజీవ నిదర్శనం.
 
మిత్రులారా, 

దూర ప్రాచ్యంతో అధ్యక్షుడు పుతిన్ సాన్నిహిత్యం, ఆయన దృక్పథం ఆ ప్రాంతానికే కాకుండా భారత్ వంటి భాగస్వాములకు కూడా అపారమైన అవకాశాలు ముందు నిలిపింది. రష్యాలోని దూర ప్రాచ్య ప్రాంతం అభివృద్ధి 21వ శతాబ్దిలో తమ జాతీయ ప్రాధాన్యతగా ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతం పట్ల ఆయన అనుసరించే పరిపూర్ణమైన వైఖరి విద్య, ఆరోగ్యం, క్రీడలు, సంస్కృతి, కమ్యూనికేషన్, వాణిజ్యం, వ్యాపారం వంటి భిన్న రంగాల్లో ప్రాంతీయ ప్రజల జీవనాన్ని ఎంతో మెరుగ్గా చేసింది. మరో పక్క పెట్టుబడులకు చక్కని అవకాశాలు ఇచ్చారు. సామాజిక రంగాల పురోగతికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన ముందు చూపు పట్ల నేను ఎంతో లోతుగా ఆకర్షితుడనవడమే కాదు, దాన్ని పంచుకుంటూ ఉంటారు. ముందుచూపుతో సాగే ఈ ప్రయాణంలో రష్యాతో భారత్ భుజంభుజం కలిపి నడుస్తుంది.  దూరప్రాచ్యం, వ్లాదివోస్తోక్ ప్రాంతాల వేగవంతం, సమతూకం, సమ్మిళిత అభివృద్ధి పట్ల అధ్యక్షుడు పుతిన్ కు గల ముందుచూపు, అక్కడ అందుబాటులో ఉన్న విలువైన వనరులు, ప్రజలకు గల అపారమైన ప్రతిభ దాన్ని విజయవంతం చేసి తీరగలవని నాకు గల అనుభవంతో చెబుతున్నాను. ఈ ప్రాంతం, ప్రజల పట్ల ప్రేమ, గౌరవం ఆయన ముందుచూపులో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భారతదేశంలో కూడా సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ (అందరి పట్ల విశ్వాసంతో అందరూ కలిసి అభివృద్ధి పథంలో ప్రయాణించడం) అనే సూత్రంతో మేం నవభారత నిర్మాణానికి ప్రయాణం చేస్తున్నాం. 2024 నాటికి భారత్ ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలన్నది మా లక్ష్యం. త్వరితగతిన అభివృద్ధి సాధిస్తున్న భారత్, చారిత్రకంగా ఈ ప్రాంతంలో గల ప్రతిభ “ఒకటితో ఒకటి జోడిస్తే పదకొండు” అనే తరహాలో అవకాశంగా మారింది.
 
మిత్రులారా, 
 
ఈ స్ఫూర్తి తూర్పు ప్రాంత ఆర్థిక వేదికలో మా భాగస్వామ్యానికి కనివిని ఎరుగని రీతిలో సన్నాహాలకు దారి తీసింది. నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఎందరో మంత్రులు, 150 మంది వరకు వ్యాపార దిగ్గజాలు ఇక్కడకు వచ్చారు. వారు దూరప్రాచ్యానికి అధ్యక్షుని ప్రత్యేక రాయబారిని, మొత్తం 11 మంది గవర్నర్లను, వ్యాపారవేత్తలను కలిశారు. దూరప్రాచ్య ప్రాంతానికి చెందిన రష్యన్ మంత్రులు, వ్యాపారవేత్తలు భారత్ సందర్శించారు. ఈ ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను అందిస్తూ ఉండడం నాకెంతో ఆనందదాయకం. ఇంధనం నుంచి ఆరోగ్య, విద్య, నైపుణ్యాభివృద్ధి వరకు, గనుల తవ్వకం నుంచి కలప పరిశ్రమ వరకు భిన్న విభాగాలకు సహకారం విస్తరించింది. దూరప్రాచ్యానికి చెందిన పలు ప్రాంతాలతో 50 వరకు వ్యాపార ఒప్పందాలున్నాయి. వారంతా ఎన్నో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

మిత్రులారా, 
 
దూరప్రాచ్య అభివృద్ధిలో మరింతగా భాగస్వామి అయ్యేందుకు భారత్ 100 కోట్ల డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ అందిస్తుంది. మా దేశం మరో దేశంలో ఒక ప్రాంతానికి ఇలా రుణసదుపాయం కల్పించడం ఇదే తొలిసారి. మా ప్రభుత్వం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ తూర్పు ఆసియాతో భారత్ మరింత చురుగ్గా కలిసి పని చేసే అవకాశం కల్పించింది. ఈ రోజున వెలువడుతున్న ఈ ప్రకటన యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీకి కూడా నాంది పలుకుతుందని, మా ఆర్థిక దౌత్యానికి కొత్త కోణం ఆవిష్కరిస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మా మిత్రదేశాలన్నింటిలోనూ వారి వారి ప్రాధాన్యతలకు లోబడి ప్రాంతీయాభివృద్ధిలో మేం చురుకైన భాగస్వాములు కాబోతున్నాం.
 
మిత్రులారా, 
 
ప్రకృతి నుంచి మనకి కావలసినంత మాత్రమే తీసుకోవాలని ప్రాచీన భారత నాగరికత మాకు బోధించింది. ప్రకృతి వనరులను పరిరక్షించాలని మేం నమ్ముతున్నాం. మా అస్తిత్వం, అభివృద్ధి కూడా శతాబ్దాలుగా మేము ప్రకృతిలో ఒక భాగంగా ముడిపడేలా చేశాయి.
 
మిత్రులారా, 

భారతీయ సంతతి ప్రజలు నివశిస్తున్న దేశాలన్నింటి నాయకులను నేను కలిసినప్పుడల్లా భారతీయుల శ్రమశక్తి, హుందాతనం, క్రమశిక్షణ, విశ్వాసాన్నిఎంతో ప్రశంసిస్తూ ఉంటారు. భారతీయ కంపెనీలు, వ్యాపారవేత్తలు ప్రపంచవ్యాప్తంగా భిన్న దేశాల్లో పలు రంగాల అభివృద్ధిలో భాగస్వాములవుతూ సంపద సృష్టికి సహాయపడుతున్నారు. భారతీయులు, కంపెనీలు కూడా ఎప్పుడూ స్థానిక సంస్కృతిని, సునిశితత్వాన్ని గౌరవించడం పరిపాటి. భారతీయుల ధనం, స్వేదం, ప్రతిభ, వృత్తిపరమైన నైపుణ్యం దూర ప్రాచ్య ప్రాంతాలు కూడా త్వరితగతిన అభివృద్ధి పథంలో పయనించేందుకు దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. తూర్పుదేశాల ఆర్థిక వేదికలో సాధించిన ఈ విజయాన్ని మరింతగా ముందుకు నడిపించేందుకు దూర ప్రాచ్య ప్రాంతానికి చెందిన మొత్తం 11 మంది గవర్నర్లను భారత్ సందర్శించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను.
 
మిత్రులారా, 
 
అధ్యక్షుడు పుతిన్, నేను ఇద్దరం భారత, రష్యా సహకారానికి ఎంతో ఉత్సాహపూరితమైన లక్ష్యాలు నిర్దేశించాం. మేం ఈ మైత్రికి కొత్త కోణాన్ని ఇవ్వడంతో పాటు దాన్ని విభిన్న రంగాలకు విస్తరించాం. ప్రభుత్వ సహకారానికి అతీతంగా ఈ మైత్రిని విస్తరించడం ప్రయివేటు పరిశ్రమల మధ్య పటిష్ఠమైన సహకారానికి దారి తీసింది. రాజధానులకు అతీతంగా ఈ బంధాన్ని విస్తరించడం వారిని రాష్ర్టాలు, ప్రాంతాలకు సన్నిహితం చేసింది. ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యం పరిధిలోనే  ప్రతీ ఒక్క రంగానికి విస్తరించే విధంగా మేం సరికొత్త సహకార నమూనా ఆవిష్కరించాం. ఉభయులం కలిసికట్టుగా అంతరిక్ష దూరతీరాలను చేరగలం, సాగరాల లోలతుల నుంచి సంపద వెలికి తీయగలం.

మిత్రులారా, 
 
భారత, పసిఫిక్ ప్రాంత సహకారంలో కొత్త శకాన్ని ఆవిష్కరించబోతున్నాం. వ్లాదివోస్తోక్ నుంచి చెన్నైకి నౌకల ప్రయాణం ప్రారంభమైతే ఈశాన్య ఆసియా మార్కెట్లకు భారత్ ఒక కేంద్రంగా మారుతుంది. భారత, రష్యా భాగస్వామ్యం మరింత లోతవుతుంది. దూరప్రాచ్యం యూరేసియా యూనియన్ కు సంగమ ప్రాంతం కావడమే కాకుండా మరోపక్క భారత-పసిఫిక్ స్వేచ్ఛా, సమ్మళితత్వానికి బాటలు వేస్తుంది. నిబంధనలను, సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను  గౌరవించడం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా నిలవడం ప్రాతిపదికన ఈ ప్రాంతంలో మా మైత్రి బలమైన పునాది ఏర్పరుస్తుంది.
 

మిత్రులారా, 
 
ప్రముఖ తత్వవేత్త, రచయిత టాల్ స్టాయ్ భారతీయ వేద విజ్ఞానం పట్ల ఎంతగానో ప్రభావితం అయ్యారు. ఆయన ఏకం సాత్ విప్రః బహుధా వదంతి అనే వాక్యం ఆయన ఎంతో ఇష్టపడేవారు. 

దాన్ని తన మాటల్లోనే “అన్నీ ఒక్క దానిలోనే ఉన్నాయి, కాని ప్రజలు దాన్నే భిన్న నామాలతో వ్యవహరిస్తారు” అని చెప్పే వారు. 

ఈ ఏడాది ప్రపంచం యావత్తు మహాత్మా గాంధీ 150వ జయంతిని నిర్వహించుకుంటోంది. టాల్ స్టాయ్, గాంధీ ఇద్దరూ తమదైన ప్రత్యేక ముద్ర ఒకరిపై ఒకరు వేసుకున్నారు. ఈ భాగస్వామ్య స్ఫూర్తిని మనం మరింత శక్తివంతం చేయడం ద్వారా భారత, రష్యా దేశాలు పరస్పర పురోగతిలో విస్తృత భాగస్వాములు కావడానికి దోహదపడదాం. మన భాగస్వామ్య విజన్ తో పాటు ప్రపంచానికి స్థిరమైన, భద్రమైన భవిష్యత్తు అందించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం. మన భాగస్వామ్యంలో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది అవుతుంది. నేను ఎప్పుడు రష్యా వచ్చినా ప్రేమ, స్నేహపూర్వకమైన వాతావరణంతో పాటు భారత్ పట్ల గౌరవ భావం చూస్తూ ఉంటాను. ఈ రోజున కూడా నేను ఇదే భావాల విలువైన కానుకతో పాటుగా సహకారాన్ని మరింత లోతుగా పాదుగొల్పాలన్న తీర్మానంతో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నాను. నా మిత్రుడు పుతిన్ కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం ఎప్పుడు కలిసినా విశాలమైన హృదయం ప్రదర్శిస్తూ ఎంతో సమయం కేటాయిస్తూ ఉంటాం. ఎంతో పనుల ఒత్తిడి ఉన్నా భిన్న ప్రాంతాలు సందర్శించిన సమయంలో నిన్న పుతిన్ చాలా గంటల పాటు నాతో గడిపారు. రాత్రి ఒంటి గంట వరకు కూడా మే కలిసే ఉన్నాం. నా పట్ల, భారత్ పట్ల ఆయనకు గల ప్రేమను అది ప్రతిబింబిస్తోంది. అలాగే భారత్ లోను, ఇక్కడ కూడా ఒక సాంస్కృతిక ఏకీకరణను నేను గమనించారు. నా సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇద్దరు విడిపోయినప్పుడల్లా బైబై అని కాకుండా ఆవాజో అని వీడ్కోలు పలుకుతూ ఉంటాం. త్వరలోనే తిరిగి కలవండి అని దాని అర్ధం. ఇక్కడ దాన్ని – దాస్విదానియా – అని వ్యవహరిస్తారు.
 
నేను ప్రతీ ఒక్కరికీ ఆవాజో, దాస్విదానియా అంటూ వీడ్కోలు పలుకుతున్నాను. 

ధన్యవాదాలు

స్పాసిబో బోల్షాయ్.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study

Media Coverage

Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 జనవరి 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises