నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 'మన్ కీ బాత్' 91వ ఎపిసోడ్. మనం ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వివిధ అంశాలపై మన అభిప్రాయాన్ని పంచుకున్నాం. కానీ, ఈసారి 'మన్ కీ బాత్' చాలా ప్రత్యేకమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నసందర్భంలో నిర్వహించుకుంటోన్న స్వాతంత్ర్య దినోత్సవమే ఇందుకు కారణం. మనమందరం చాలా అద్భుతమైన, చారిత్రాత్మక క్షణానికి సాక్షులుగా ఉండబోతున్నాం. ఈశ్వరుడు మనకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించాడు. మీరు కూడా ఆలోచించండి. మనం బానిసత్వ యుగంలో జన్మించి ఉంటే ఈ రోజు ఊహ ఎలా ఉండేది? బానిసత్వం నుండి విముక్తి పొందాలనే ఆ తపన, పరాధీనతా సంకెళ్ళ నుండి స్వేచ్ఛ పొందాలనే ఆకాంక్ష - ఎంత గాఢంగా ఉండి ఉండాలి. ఆ రోజుల్లో ప్రతిరోజూ లక్షలాది మంది దేశప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడడం, త్యాగాలు చేయడం చూసి ఉండేవాళ్లం. మన భారతదేశం ఎప్పుడు స్వాతంత్ర్యం పొందుతుందో అనే ఆలోచనతో ఉండేవాళ్లం. వందేమాతరం, భారత్ మా కీ జై అంటూ నినాదాలు చేస్తూ మన జీవితాలను రాబోయే తరాలకు అంకితం చేయాలని యవ్వనాన్ని కోల్పోయినా సరేనని భావించేవాళ్ళం. స్వాతంత్ర్యం పొందే రోజు మన జీవితంలోకి వస్తుందనే కలతో మనం ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచేవాళ్ళం.
మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.
మిత్రులారా! స్వతంత్ర భారత అమృతోత్సవం ప్రజాఉద్యమ రూపం దాల్చడం చూసి చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు దీనికి సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలాంటి కార్యక్రమమే ఈ నెల ప్రారంభంలో మేఘాలయలో జరిగింది. మేఘాలయ వీర యోధులు యు. టిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయనను స్మరించుకున్నారు. ఖాసీ కొండలను నియంత్రించడానికి, అక్కడి సంస్కృతిపై దాడి చేయడానికి బ్రిటిష్ వారు చేసిన కుట్రను టిరోత్ సింగ్ జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు చక్కని ప్రదర్శనలు ఇచ్చారు. చరిత్రను సజీవంగా చూపారు. ఇందులో భాగంగా మేఘాలయ మహోన్నత సంస్కృతిని చాలా అందంగా చిత్రీకరించిన ఉత్సవాన్ని కూడా నిర్వహించారు.
కొన్ని వారాల కిందట కర్ణాటకలో అమృత భారతి కన్నడార్థి అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో రాష్ట్రంలోని 75 చోట్ల స్వతంత్ర భారత అమృతోత్సవాలకు సంబంధించిన భారీ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో కర్ణాటకలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడంతో పాటు స్థానిక సాహిత్య విజయాలను కూడా తెరపైకి తెచ్చేందుకు కృషి చేశారు.
మిత్రులారా! ఈ జూలైలో చాలా ఆసక్తికరమైన ప్రయత్నం జరిగింది. దీనికి స్వాతంత్ర్య రైలు, రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయ రైల్వే పాత్ర గురించి ప్రజలకు తెలియడమే ఈ ప్రయత్నం లక్ష్యం. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉన్న ఇలాంటి రైల్వే స్టేషన్లు దేశంలో చాలా ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ల గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. జార్ఖండ్‌లోని గోమో జంక్షన్‌ను ఇప్పుడు అధికారికంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జంక్షన్ గోమో అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఈ స్టేషన్‌లో నేతాజీ సుభాష్ కాల్కా మెయిల్ ఎక్కి, బ్రిటిష్ అధికారుల నుండి తప్పించుకోవడంలో విజయం సాధించారు. లక్నో సమీపంలోని కాకోరి రైల్వే స్టేషన్ పేరు మీరందరూ విని ఉంటారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ , అష్ఫాక్ ఉల్లా ఖాన్ వంటి ధైర్యవంతుల పేర్లు ఈ స్టేషన్‌తో ముడిపడి ఉన్నాయి. రైల్లో వెళ్లే బ్రిటిష్ వారి ఖజానాను ఇక్కడ దోచుకోవడం ద్వారా వీర విప్లవకారులు తమ శక్తిని బ్రిటిష్ వారికి తెలియజెప్పారు. తమిళనాడు ప్రజలతో ఎప్పుడైనా మాట్లాడితే తూత్తుకుడి జిల్లాలోని వాంచీ మణియాచ్చీ జంక్షన్ గురించి తెలుసుకుంటారు. ఈ స్టేషన్‌కు తమిళ స్వాతంత్ర్య సమరయోధుడు వాంచినాథన్ పేరు పెట్టారు. బ్రిటిష్ కలెక్టర్‌ను ఆయన చర్యల ఫలితంగా 25 ఏళ్ల యువకుడు వాంచి శిక్షించిన ప్రదేశం ఇదే.
మిత్రులారా! ఈ జాబితా చాలా పెద్దది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 75 రైల్వే స్టేషన్లను గుర్తించడం జరిగింది. ఈ 75 స్టేషన్లను చాలా అందంగా అలంకరించారు. వీటిలో అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీకు సమీపంలోని అటువంటి చారిత్రక స్టేషన్‌ని సందర్శించడానికి మీరు సమయాన్ని వెచ్చించాలి. మీకు తెలియని స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర గురించి అక్కడ మీరు వివరంగా తెలుసుకుంటారు. నేను ఈ స్టేషన్లకు సమీపంలోని పాఠశాల విద్యార్థులను కోరుతున్నాను. ఆ పాఠశాలలలోని చిన్న పిల్లలను ఆ స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ పిల్లలకు జరిగిన మొత్తం సంఘటనల క్రమాన్ని వివరించమని ఉపాధ్యాయులను కూడా కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! స్వాతంత్ర్య అమృత మహోత్సవం లో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుండి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా- హర్ ఘర్ తిరంగా' అనే ప్రత్యేక ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీరు తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. లేదా మీ ఇంటి దగ్గర పెట్టుకోవాలి. త్రివర్ణ పతాకం మనల్ని కలుపుతుంది. దేశం కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తినిస్తుంది. ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు మనమందరం మన సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాలలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని నేను సూచిస్తున్నాను. మీకు తెలుసా! ఆగస్టు 2వ తేదీకి మన త్రివర్ణ పతాకంతో కూడా ప్రత్యేక సంబంధం ఉంది. ఆ రోజు మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారి జయంతి. వారికి నా గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. మన జాతీయ జెండా గురించి మాట్లాడుతూ నేను గొప్ప విప్లవకారురాలు మేడమ్ కామాను కూడా గుర్తుంచుకుంటాను. త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర చాలా కీలకం.
మిత్రులారా!స్వాతంత్ర్య అమృతోత్సవంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమాలన్నింటిలో అతిపెద్ద సందేశం ఏమిటంటే దేశవాసులుగా మనమందరందరం మన కర్తవ్యాన్ని పూర్తి నిష్ఠతో నిర్వహించాలి. అప్పుడే అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల కల నెరవేరుతుంది. వారి కలల భారతదేశాన్ని నిర్మించగలుగుతాం. అందుకే రాబోయే 25 సంవత్సరాల ఈ అమృత కాలం ప్రతి దేశవాసికి కర్తవ్యకాలం లాంటిది. దేశాన్ని పూర్తిగా విముక్తి చేయడానికి మన వీర యోధులు ఈ బాధ్యతను మనకు ఇచ్చారు. దాన్ని మనం పూర్తిగా నెరవేర్చాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! కరోనాపై మన దేశవాసుల పోరాటం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం నేటికీ పోరాడుతోంది. సమగ్ర ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఇందులో చాలా సహాయపడింది. ఇందులో భారతీయ సంప్రదాయ పద్ధతులు ఎంతగా ఉపయోగపడతాయో మనందరికీ తెలిసిందే. కరోనాపై పోరాటంలో ప్రపంచ స్థాయిలో ఆయుష్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంపై, భారతీయ వైద్యంపై ఆసక్తి పెరుగుతోంది. ఆయుష్ ఎగుమతులు రికార్డు వృద్ధిని సాధించడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఈ రంగంలో అనేక కొత్త స్టార్టప్‌లు కూడా ఆవిర్భవించడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవల గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్ సమ్మిట్ జరిగింది. ఇందులో దాదాపు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కరోనా కాలంలో ఔషధ మొక్కలపై పరిశోధనలు చాలా పెరిగాయి. దీని గురించి అనేక పరిశోధన అధ్యయనాల ప్రచురణలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా మంచి ప్రారంభం.
మిత్రులారా! వివిధ రకాల ఔషధ మొక్కలు, మూలికలకు సంబంధించి దేశంలో మరో గొప్ప ప్రయత్నం జరిగింది. ఇండియన్ వర్చువల్ హెర్బేరియం ప్రారంభం జులై నెలలో జరిగింది. మన మూలాలతో అనుసంధానం అయ్యేందుకు డిజిటల్ ప్రపంచాన్ని ఎలా ఉపయోగించవచ్చో కూడా ఇది ఒక ఉదాహరణ. ఇండియన్ వర్చువల్ హెర్బేరియం సంరక్షిత మొక్కలు లేదా మొక్కల భాగాల డిజిటల్ చిత్రాల ఆసక్తికరమైన సేకరణ. ఇది అంతర్జాలంలో ఉచితంగా లభిస్తుంది. ఈ వర్చువల్ హెర్బేరియంలో లక్షకు పైగా నమూనాలు, వాటికి సంబంధించిన శాస్త్రీయ సమాచారం అందుబాటులో ఉన్నాయి. వర్చువల్ హెర్బేరియంలో భారతదేశంలోని వృక్ష సంబంధ వైవిధ్యం కూడా కనిపిస్తుంది. భారతీయ వృక్షజాలంపై పరిశోధనలో ఇండియన్ వర్చువల్ హెర్బేరియం ఒక ముఖ్యమైన వనరుగా మారుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! ప్రతిసారీ 'మన్ కీ బాత్'లో మన ముఖాల్లో మధురమైన చిరునవ్వు తెప్పించే దేశప్రజల విజయాల గురించి చర్చిస్తాం. ఒక విజయగాథ మధురమైన చిరునవ్వులను పంచడంతో పాటు తీపి రుచిని కూడా పంచితే మీరు దాన్ని ఖచ్చితంగా బంగారానికి తావి అబ్బినట్టుందని అంటారు. ఈ రోజుల్లో మన రైతులు తేనె ఉత్పత్తిలో ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారు. తేనెలోని తీపి మన రైతుల జీవితాలను కూడా మారుస్తోంది. వారి ఆదాయాన్ని కూడా పెంచుతోంది. హర్యానాలోని యమునానగర్‌లో సుభాష్ కాంబోజ్ జీ అనే తేనెటీగల పెంపకందారు నివసిస్తున్నారు. సుభాష్ గారు తేనెటీగల పెంపకంలో శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ తీసుకున్నారు. దీని తరువాత ఆయన కేవలం ఆరు పెట్టెలతో తన పనిని ప్రారంభించారు. ఈరోజు సుమారు రెండు వేల పెట్టెల్లో తేనెటీగల పెంపకం చేస్తున్నారు. వాటి తేనె అనేక రాష్ట్రాలకు సరఫరా అవుతుంది. వినోద్ కుమార్ గారు కూడా జమ్మూలోని పల్లీ గావ్ లో ఒకటిన్నర వేలకు పైగా యూనిట్లలో తేనెటీగల పెంపకం చేస్తున్నారు. గత ఏడాది రాణి తేనెటీగ పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. ఈ పనితో ఏటా 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
కర్ణాటకకు చెందిన మరో రైతు మధుకేశ్వర్ హెగ్డే గారు. 50 తేనెటీగల యూనిట్లకు భారత ప్రభుత్వం నుంచి సబ్సిడీ తీసుకున్నట్టు మధుకేశ్వర్ గారు తెలిపారు. నేడు ఆయన 800 యూనిట్లను నిర్వహిస్తున్నారు. టన్నులకొద్ది తేనెను విక్రయిస్తున్నారు. ఆయన తన పనిలో కొత్తదనం చూపుతున్నారు. జామున్ తేనె, తులసి తేనె, ఉసిరి తేనె వంటి రకరకాల వృక్షాల తేనెను కూడా తయారు చేస్తున్నారు. మధుకేశ్వర్ గారూ.. తేనె ఉత్పత్తిలో మీ వైవిధ్య భరితమైన కార్యాచరణ, విజయం మీ పేరును సార్థకం చేస్తున్నాయి.
మిత్రులారా! మన సాంప్రదాయిక ఆరోగ్య శాస్త్రంలో తేనెకు ఎంత ప్రాధాన్యత ఉందో మీకందరికీ తెలుసు. ఆయుర్వేద గ్రంథాలలో తేనెను అమృతంగా వర్ణించారు. తేనె మనకు రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈరోజుల్లో తేనె ఉత్పత్తిలో అనేక అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తున్న యువత కూడా దాన్ని తమ స్వయం ఉపాధిగా చేసుకుంటోంది.
అలాంటి ఒక యువకుడు – ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ కు చెందిన నిమిత్ సింగ్. నిమిత్ గారు బీటెక్ చేశారు. ఆయన తండ్రి కూడా వైద్యులే. కానీ తన చదువు తర్వాత నిమిత్ గారు ఉద్యోగం కాకుండా స్వయం ఉపాధిని నిర్ణయించుకున్నారు. తేనె తయారీ పనులను ప్రారంభించారు. నాణ్యత తనిఖీ కోసం లక్నోలో తన సొంత ల్యాబ్‌ను కూడా నిర్మించారు. నిమిత్ గారు ఇప్పుడు తేనె, బీ వ్యాక్స్ ద్వారా బాగా సంపాదిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అలాంటి యువకుల కృషి వల్లనే నేడు దేశం ఇంత పెద్ద తేనె ఉత్పత్తిదారుగా మారుతోంది. దేశం నుండి తేనె ఎగుమతి కూడా పెరిగిందని తెలిస్తే మీరు సంతోషిస్తారు. దేశం జాతీయ తేనెటీగల పెంపక ప్రచారాన్ని ప్రారంభించింది. రైతులు కష్టపడి పనిచేశారు. మన తేనె మాధుర్యం ప్రపంచానికి చేరడం ప్రారంభించింది. ఈ రంగంలో ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయి. మన యువత ఈ అవకాశాలతో అనుసంధాన కావాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, కొత్త అవకాశాలను స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశ వాసులారా! హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 'మన్ కీ బాత్' శ్రోత ఆశిష్ బహల్ గారి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. ఆయన తన లేఖలో చంబాకు చెందిన 'మింజర్ మేళా' గురించి ప్రస్తావించారు. మొక్కజొన్న పూలను మింజర్ అంటారు. మొక్కజొన్నలో పూలు వచ్చినప్పుడు మింజర్ మేళా కూడా జరుపుకుంటారు. ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. యాదృచ్ఛికంగా మింజర్ మేళా కూడా ఈ సమయంలోనే జరుగుతోంది. మీరు హిమాచల్ వెళ్లి ఉంటే ఈ మేళాను చూడటానికి చంబాకు వెళ్లవచ్చు.
చంబా ఎంత అందమైందంటే ఇక్కడి జానపద గేయాల్లో ఇలా పేర్కొన్నారు..
“చంబే ఏక్ దిన్ ఓణా-కనే మహీనా రౌణా”అని.
అంటే.. చంబాకి ఒకరోజు వచ్చేవాళ్లు.. దాని అందాలను చూస్తూ నెలల తరబడి ఇక్కడే ఉండిపోతారు.
మిత్రులారా! మన దేశంలో జాతరలు గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. జాతరలు ప్రజలను, మనస్సులను కలుపుతాయి. హిమాచల్‌లో వర్షాలు కురిసిన తరువాత- ఖరీఫ్ పంటలు పండినప్పుడు- సెప్టెంబర్‌లో సిమ్లా, మండి, కులు, సోలన్ లకు విహారయాత్ర జరుపుకుంటారు. జాగ్ర జాతర కూడా సెప్టెంబర్ లోనే రాబోతోంది. జాగ్ర జాతరలలో మహాసూ దేవతను ఆహ్వానిస్తూ బీసు పాటలు పాడతారు. మహాసు దేవత మేల్కొలుపు హిమాచల్‌లోని సిమ్లా, కిన్నౌర్, సిర్మౌర్‌లతో పాటు ఉత్తరాఖండ్‌లో కూడా జరుగుతుంది.
మిత్రులారా! మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆదివాసీ సమాజానికి సంబంధించిన అనేక సాంప్రదాయిక జాతరలు ఉన్నాయి. ఈ జాతరలలో కొన్ని ఆదివాసీ సంస్కృతికి సంబంధించినవి. కొన్ని జాతరలు ఆదివాసీల చరిత్ర, వారసత్వానికి సంబంధించినవి. ఉదాహరణకు మీకు అవకాశం దొరికితే తెలంగాణలోని మేడారంలో నాలుగు రోజులపాటు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను తప్పక సందర్శించండి. ఈ జాతరను తెలంగాణ మహాకుంభమేళాగా పిలుస్తారు. సారలమ్మ జాతరను ఇద్దరు ఆదివాసీ మహిళా నాయకురాళ్లు సమ్మక్క, సారలమ్మల గౌరవార్థం జరుపుకుంటారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోయ ఆదివాసీ సమాజానికి కూడా అతి పెద్ద విశ్వాస కేంద్రం. ఆంధ్ర ప్రదేశ్‌లోని మరిడమ్మ జాతర కూడా ఆదివాసీ సమాజ విశ్వాసాలకు సంబంధించిన పెద్ద జాతర. మరిడమ్మ జాతర జ్యేష్ట అమావాస్య నుండి ఆషాఢ అమావాస్య వరకు జరుగుతుంది. ఇక్కడి ఆదివాసీ సమాజం దీన్ని శక్తి ఆరాధనతో అనుసంధానిస్తుంది. ఇక్కడే తూర్పుగోదావరిలోని పెద్దాపురంలో మరిడమ్మ గుడి కూడా ఉంది. ఇదేవిధంగా రాజస్థాన్‌లోని గరాసియా తెగ ప్రజలు వైశాఖ శుక్ల చతుర్దశి నాడు 'సియావా కా మేళా' లేదా 'మన్ ఖాన్ రో మేళా' నిర్వహిస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఉన్న నారాయణపూర్‌లోని 'మావలీ మేళా' కూడా చాలా ప్రత్యేకమైంది. అక్కడికి సమీపంలోనే మధ్యప్రదేశ్‌లోని భగోరియా మేళా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. భోజరాజు కాలంలో భగోరియా జాతర ప్రారంభమైందంటారు. అప్పుడు భిల్లు రాజులు కాసూమరా, బాలూన్ వారి రాజధానుల్లో మొదటిసారి నిర్వహించారు. నాటి నుంచి నేటి వరకు ఈ జాతరలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.
అదేవిధంగా తరణేతర్, మాధోపూర్ వంటి అనేక జాతరలు గుజరాత్‌లో చాలా ప్రసిద్ధి చెందాయి. జాతరలు మన సమాజానికి, జీవితానికి గొప్ప శక్తి వనరులు. మీ చుట్టూ కూడా ఇలాంటి జాతరలు ఎన్నో జరుగుతూ ఉండవచ్చు. ఆధునిక కాలంలో 'ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలోపేతం చేయడానికి సమాజంలోని ఈ పురాతన బంధాలు చాలా ముఖ్యమైనవి.
మన యువత తప్పనిసరిగా వాటితో అనుసంధానం కావాలి. మీరు ఇలాంటి జాతరలకు వెళ్ళినప్పుడల్లా అక్కడి చిత్రాలను సోషల్ మీడియాలో కూడా పంచుకోండి. మీకు కావాలంటే ప్రత్యేకమైన హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఆ జాతరల గురించి ఇతరులకు కూడా తెలిసిపోతుంది. మీరు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో కూడా ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా ఒక పోటీని ప్రారంభించబోతోంది. జాతరాల ఉత్తమ చిత్రాలను పంపిన వారికి బహుమతులను కూడా అందిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయొద్దు. జాతరలను సందర్శించండి. వాటి చిత్రాలను పంచుకోండి. బహుశా మీరు బహుమతి కూడా పొందవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! మీరు తప్పక గమనించి ఉంటారు- బొమ్మల ఎగుమతిలో పవర్‌హౌస్‌గా మారడానికి భారతదేశానికి పూర్తి సామర్థ్యం ఉందని 'మన్ కీ బాత్'లోని ఒక ఎపిసోడ్‌లో నేను చెప్పాను. క్రీడలు, ఆటలలో భారతదేశం గొప్ప వారసత్వం గురించి నేను ప్రత్యేకంగా చర్చించాను. భారతదేశంలోని స్థానిక బొమ్మలు సంప్రదాయం, ప్రకృతి రెండింటికీ అనుగుణంగా ఉంటాయి. పర్యావరణ అనుకూలమైనవి. ఈ రోజు నేను భారతీయ బొమ్మల విజయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన యువకులు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తల కారణంగా, మన బొమ్మల పరిశ్రమ చేసిన పనులను, సాధించిన విజయాలను ఎవరూ కనీసం ఊహించలేరు. భారతీయ బొమ్మల విషయానికి వస్తే వోకల్ ఫర్ లోకల్ అనే స్వరం ప్రతిచోటా వినిపిస్తోంది. ఇప్పుడు భారతదేశానికి విదేశాల నుండి వచ్చే బొమ్మల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ విషయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో 3 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బొమ్మలు విదేశాల నుంచి వచ్చేవి. ఇప్పుడు వాటి దిగుమతులు 70 శాతం వరకు తగ్గాయి. ఈ కాలంలో భారతదేశం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన బొమ్మలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సంతోషించదగ్గ విషయం. గతంలో భారతదేశం నుండి 300-400 కోట్ల రూపాయల విలువైన బొమ్మలు మాత్రమే విదేశాలకు వెళ్ళేవి. ఇదంతా కరోనా కాలంలో జరిగిందని మీకు ఇప్పటికే తెలుసు. భారతదేశపు బొమ్మల రంగం రూపాంతరం చెందడం ద్వారా తనను తాను నిరూపించుకుంది. భారతీయ తయారీదారులు ఇప్పుడు భారతీయ ఇతిహాసాలు, చరిత్ర , సంస్కృతి ఆధారంగా బొమ్మలను తయారు చేస్తున్నారు. దేశంలో ప్రతిచోటా బొమ్మల ఉత్పత్తిదారుల సమూహాలు ఉన్నాయి. బొమ్మలు తయారు చేసే చిన్న పారిశ్రామికవేత్తలు వాటి నుండి చాలా ప్రయోజనం పొందుతున్నారు. ఈ చిన్న వ్యాపారవేత్తలు తయారు చేసిన బొమ్మలు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. భారతదేశానికి చెందిన బొమ్మల తయారీదారులు ప్రపంచంలోని ప్రముఖ గ్లోబల్ టాయ్ బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తున్నారు. మన స్టార్టప్ రంగం కూడా బొమ్మల ప్రపంచంపై పూర్తి శ్రద్ధ చూపడం నాకు చాలా నచ్చింది. వారు ఈ ప్రాంతంలో చాలా సరదా వస్తువులు కూడా తయారు చేస్తున్నారు. బెంగుళూరులో శూమీ టాయ్స్ అనే స్టార్టప్ పర్యావరణ అనుకూల బొమ్మలపై దృష్టి సారిస్తోంది. గుజరాత్‌లో ఆర్కిడ్జూ కంపెనీ భౌతిక వాస్తవిక ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే సాంకేతికత ఆధారిత ఫ్లాష్ కార్డులను, కథాపుస్తకాలను తయారు చేస్తోంది.
పూణేకి చెందిన ఫన్‌వెన్షన్ అనే సంస్థ అభ్యసన, బొమ్మలు, కృత్యాల ప్రహేళికల ద్వారా పిల్లల్లో విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలపై, గణితశాస్త్రంపై ఆసక్తిని పెంచడంలో నిమగ్నమై ఉంది. బొమ్మల ప్రపంచంలో గొప్ప కృషి చేస్తున్న తయారీదారులను, స్టార్ట్-అప్‌లందరినీ నేను అభినందిస్తున్నాను. మనమందరం కలిసి భారతీయ బొమ్మలను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందేలా చేద్దాం. దీంతో పాటు మరింత ఎక్కువగా భారతీయ బొమ్మలు, పజిల్స్, ఆటల సామగ్రిని కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను కోరుతున్నాను.
మిత్రులారా! తరగతి గది అయినా, ఆట స్థలం అయినా నేడు మన యువత ప్రతి రంగంలోనూ దేశం గర్వించేలా చేస్తున్నారు. ఈ నెలలో పివి సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా తన అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి రజత పతకాన్ని సాధించారు. ఐర్లాండ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో కూడా మన క్రీడాకారులు 11 పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారు. రోమ్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చూపారు. గ్రీకో-రోమన్ ఈవెంట్‌లో మన అథ్లెట్ సూరజ్ అద్భుతం చేశారు. 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఈవెంట్‌లో రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఆటగాళ్ల విషయంలో ఈ నెల మొత్తం ఉత్తమ ప్రదర్శనలతో నిండిపోయింది. చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గొప్ప గౌరవం. ఈ టోర్నమెంటు జులై 28వ తేదీన ప్రారంభమైంది. టోర్నమెంటు ప్రారంభ వేడుకలకు హాజరయ్యే అవకాశం నాకు లభించింది. అదే రోజున యు. కె. లో కామన్వెల్త్ క్రీడోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. యువ ఉత్సాహంతో నిండిన భారత జట్టు అక్కడ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశప్రజల తరపున క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడా సమాఖ్య- ఫిఫా ఆధ్వర్యంలో జరిగే పదిహేడేళ్ల లోపు బాలికల ప్రపంచకప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుండడం సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంటు అక్టోబర్ కు కాస్త అటూ ఇటూగా జరుగుతుంది. ఇది దేశ యువతుల్లో క్రీడల పట్ల ఉత్సాహాన్ని పెంచుతుంది.
మిత్రులారా! కొద్ది రోజుల కిందట దేశవ్యాప్తంగా 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ప్రకటించారు. కృషి, అంకితభావంతో విజయం సాధించిన విద్యార్థులందరినీ నేను అభినందిస్తున్నాను. మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలు చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. ఈ పరిస్థితుల్లో మన యువత చూపిన ధైర్యం, సంయమనం ఎంతో అభినందనీయం. అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్యంపై చర్చను దేశ పర్యటనతో ప్రారంభించాం. వచ్చేసారి మనం కలిసినప్పుడు మన తర్వాతి 25 సంవత్సరాల ప్రయాణం కూడా ప్రారంభమవుతుంది. మన ప్రియమైన త్రివర్ణ పతాకాన్ని మన ఇళ్ల వద్ద, మన ప్రియమైనవారి ఇళ్లలో ఎగురవేయడానికి మనం అందరం సంఘటితం కావాలి. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం ఎలా జరుపుకున్నారు, ఏమైనా ప్రత్యేకంగా చేశారా అనే వివరాలను నాతో పంచుకోండి. మన ఈ అమృతోత్సవంలోని వివిధ రంగుల గురించి వచ్చేసారి మాట్లాడుకుందాం. అప్పటి వరకు వీడ్కోలు చెప్పేందుకు నన్ను అనుమతించండి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు
इस बार ‘मन की बात’ बहुत खास है।
— PMO India (@PMOIndia) July 31, 2022
इसका कारण है, इस बार का स्वतंत्रता दिवस, जब भारत अपनी आज़ादी के 75 वर्ष पूरे करेगा।
हम सभी बहुत अद्भुत और ऐतिहासिक पल के गवाह बनने जा रहे हैं।
ईश्वर ने ये हमें बहुत बड़ा सौभाग्य दिया है: PM during #MannKiBaat https://t.co/ByoPHD02AO
Tributes to Shaheed Udham Singh Ji and other greats who sacrificed their all for the country. #MannKiBaat pic.twitter.com/Dt0M8m77ab
— PMO India (@PMOIndia) July 31, 2022
Glad that the Azadi Ka Amrit Mahotsav is taking the form of a mass movement.
— PMO India (@PMOIndia) July 31, 2022
People from all walks of life and from every section of the society are participating in different programmes across the country. #MannKiBaat pic.twitter.com/eJWpHBXi5P
An interesting endeavour has been undertaken by @RailMinIndia named 'Azadi Ki Railgadi Aur Railway Station.'
— PMO India (@PMOIndia) July 31, 2022
The objective of this effort is to make people know the role of Indian Railways in the freedom movement. #MannKiBaat pic.twitter.com/fs3LYmbuiG
Under the Azadi Ka Amrit Mahotsav, from the 13th to the 15th of August, a special movement – 'Har Ghar Tiranga' is being organised.
— PMO India (@PMOIndia) July 31, 2022
Let us further this movement by hoisting the National Flag at our homes. #MannKiBaat pic.twitter.com/NikI0j7C6Z
There is a growing interest in Ayurveda and Indian medicine around the world.
— PMO India (@PMOIndia) July 31, 2022
AYUSH exports have witnessed a record growth. #MannKiBaat pic.twitter.com/cGOcgYO5cu
Initiatives like National Beekeeping and Honey Mission are transforming the lives of our farmers by helping increase their income.
— PMO India (@PMOIndia) July 31, 2022
Here are some success stories... #MannKiBaat pic.twitter.com/aQzSYIaLay
Fairs have been of great cultural importance in our country.
— PMO India (@PMOIndia) July 31, 2022
PM @narendramodi refers to various fairs organised across the country... #MannKiBaat pic.twitter.com/DQz7saQDK9
Fairs strengthen the spirit of 'Ek Bharat, Shreshtha Bharat'. #MannKiBaat pic.twitter.com/K9MqXeUCWL
— PMO India (@PMOIndia) July 31, 2022
India is becoming a powerhouse in toys exports. #MannKiBaat pic.twitter.com/O6wPyOmRSX
— PMO India (@PMOIndia) July 31, 2022
The month of July has been full of action, when it comes to sports.
— PMO India (@PMOIndia) July 31, 2022
Indian players have performed exceptionally well on world stage. #MannKiBaat pic.twitter.com/v3flQQHob1
Few days ago the results of class 10th and 12th have been declared across the country.
— PMO India (@PMOIndia) July 31, 2022
I congratulate all those students who have achieved success through their hard work and dedication: PM @narendramodi during #MannKiBaat pic.twitter.com/WDkNdRm7mP