21 వ శతాబ్దంలో జన్మించిన వారు దేశ అభివృద్ధిని వేగవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తారు: ప్రధాని మోదీ
స్వామి వివేకానంద యువత ఎల్లప్పుడూ శక్తితో మరియు చైతన్యంతో నిండి ఉంటుందని మరియు వారు పెద్ద మార్పులకు దారితీస్తారని చెప్పేవారు: ప్రధాని
వివేకానంద రాక్ స్మారకం ప్రతి ఒక్కరికీ పేదలకు సేవ చేయడానికి స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ
2022 నాటికి, మేము 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని గుర్తించినప్పుడు, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం: ప్రధాని మోదీ
హిమాయత్ కార్యక్రమం కింద, గత 2 సంవత్సరాల్లో, 77 వేర్వేరు ట్రేడ్‌లలో 18000 మంది యువతకు శిక్షణ ఇవ్వబడింది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
ఖగోళ శాస్త్ర రంగంలో భారతదేశం చేపట్టిన కార్యక్రమాలు అద్భుత ఫలితాలిస్తున్నాయి: ప్రధాని మోదీ
17 వ లోక్సభ స్వర్గధామంలో గత ఆరు నెలలు ఎంతో ఉత్పాదకత సాధించింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

నా ప్రియదేశవాసులారా! నమస్కారం. 2019 కి వీడ్కోలు ఇచ్చే సమయం ఆసన్నమైంది. మూడు రోజుల లోపలే 2019 వీడ్కోలు పలుకుతుంది, మనము 2020 లో ప్రవేశించడం మాత్రమే కాదు, కొత్త సంవత్సరం లోకి, కొత్త దశాబ్దంలోకి ఇరవై ఒకటో శతాబ్దం లోని మూడవ దశాబ్దం లోకి ప్రవేశిస్తాము. నేను దేశవాసులందరికీ 2020 హార్ధిక శుభాకాంక్షలను అందజేస్తున్నాను. ఈ దశాబ్దానికి సంబంధించినంత వరకు ఒకటి మాత్రం నిజం. ఈ ఇరవై ఒకటో శతాబ్దం లో జన్మించి, ఈ శతాబ్ది యొక్క ముఖ్య విషయాలను అర్థం చేసుకుంటూ పెరుగుతున్న యువజనులే దేశాభివృద్ధి ని వేగవంతం చేయడం లో ముఖ్య పాత్ర వహిస్తారు. ఈ యువకుల ను నేడు రకరకాల పేర్లతో పిలుస్తారు. కొందరు వారిని millennials అంటారు. కొందరు జనరేషన్ z లేక జెన్ z అని కూడా అంటారు. ఒకమాట మాత్రం ప్రజల మనసులో స్థిరమైపోయింది, అదేమిటంటే ఇది సోషల్ మీడియా జనరేషన్ అని. ఈ యువతరం ఎంతో ప్రభావశాలురు అనేది మనకందరికీ అనుభవమైన విషయమే. కొత్తగా ఏదైనా చేయాలని, ప్రత్యేకంగా ఏదైనా చేయాలని వారి కల. వారికి స్వంత అభిప్రాయాలు ఉంటాయి. ఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే, అదీ ముఖ్యంగా భారతదేశం గురించి నేను చెప్పాలనుకునేదేమిటంటే మనం చూస్తున్న ఈ యువత వ్యవస్థ ను అభిమానిస్తారు. సిస్టమ్ ను ఇష్టపడతారు. అంతే కాదు, వీరు సిస్టమ్ ను అనుసరించడానికి ఇష్టపడతారు. ఎప్పుడైనా సిస్టమ్ సరిగా స్పందించక పోతే అశాంతికి గురి అవడమే కాక ధైర్యంగా సిస్టమ్ ను ప్రశ్నిస్తారు. ఇదే మంచిదని నేను నమ్ముతాను. ఒకమాట నిశ్చయంగా చెప్పవచ్చు. మన దేశ యువతకు అరాచకం అంటే ద్వేషము. అవ్యవస్థ, అస్థిరత ఇవంటే అసలు నచ్చదు. వారు కుటుంబవాదము, జాతివాదము, తన-పర, స్త్రీ-పురుష భేదాలను ఇష్టపడరు. అప్పుడప్పుడూ మనం చూస్తూనే ఉంటాము. విమానాశ్రయం లో కానీ లేదా సినిమా థియేటర్ లలో కానీ వరుస లో నుంచున్న వారి మధ్యలోకి ఎవరైనా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వెంటనే అడ్డుకునేదీ, గొంతెత్తి మాట్లాడి ఆపేదీ యువతే అయి ఉంటుంది. మనము చూశాము, ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే మరొక యువకుడు వెంటనే తమ మొబైల్ ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తాడు, చూస్తుండగానే ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఇక తప్పు చేసిన వాడు అయ్యో, ఎంత పని జరిగింది అని అవగాహన చేసుకుంటాడు. కాబట్టి ఒక కొత్త రకమైన వ్యవస్థ, కొత్త యుగము, కొత్త రకమైన ఆలోచన, మన యువతరం ఏర్పరుస్తున్నది. నేడు భారతదేశం ఈ తరం మీద ఆశలు పెట్టుకున్నది. ఈ యువతరం దేశాన్ని కొత్త శిఖరాల మీదకు చేర్చాలి. స్వామి వివేకానందుడు చెప్పాడు –“My faith is in the Younger Generation, the Modern Generation, out of them, will come my workers.” వారన్నారు – ‘‘నా నమ్మకం యువతరం మీద, ఆధునిక తరం మీద, మోడరన్ జెనరేషన్ మీద. వారి నుంచే నా కార్యకర్తలు వస్తారు.” అని నమ్మకంగా చెప్పారు. యువత గురించి మాట్లాడుతూ వారు అన్నారు –“యవ్వనము యొక్క విలువను కొలువజాలము, వర్ణింపజాలము.” ఇది జీవితం లోని అత్యంత అమూల్య దశ. మీ భవిష్యత్, మీ జీవితము మీరు యవ్వన దశను ఎలా ఉపయోగించుకున్నారన్న దాని మీదనే ఆధారపడి ఉంటాయి. వివేకానందుడు చెప్పిన ప్రకారము ఎవరైతే ఎనర్జీ, డైనమిజం తో నిండి ఉంటారో, ఎవరైతే మార్పు తెచ్చే శక్తిని కలిగి ఉంటారో వారే నిజమైన యువకులు. భారతదేశం లో ఈ దశాబ్దం లో యువత యొక్క అభివృద్ధి మాత్రమే కాక యువత యొక్క సామర్థ్యం వల్ల దేశం యొక్క అభివృద్ధి కూడా జరుగుతుందని నాకు పూర్తి నమ్మకముంది. భారతదేశాన్ని ఆధునికం చేయడం లో ఈ తరం పెద్ద పాత్ర ను పోషించనుందని నేను భావిస్తున్నాను. వచ్చే జనవరి 12 వ తేదీన వివేకానంద జయంతి ని దేశము, యువ జన దినోత్సవం గా జరుపుకునేటప్పుడు, ప్రతి యొక్క యువజనత ఈ దశాబ్దం లో తమ బాధ్యత ను గురించి ఆలోచించాలి. ఈ దశాబ్దం కొరకు ఏదైనా ఒక సంకల్పం చేసుకోవాలి.

నా ప్రియ దేశవాసులారా, కన్యాకుమారి లో ఏ రాతి మీద కూర్చొని వివేకానందుడు ధ్యానం చేశాడో అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ఉందని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, దానికి ఇప్పుడు యాభై ఏళ్ళు పూర్తయినాయి. గత ఐదు దశాబ్దాల లో ఈ స్థానం భారత్ కు గర్వకారణం గా నిలిచింది. కన్యాకుమారి దేశాని కి, ప్రపంచాని కి ఆకర్షక కేంద్రమైంది. దేశభక్తి తో పాటు ఆధ్యాత్మిక చైతన్యము అనుభూతి చెందాలనుకొనే ప్రతి ఒక్కరి కీ ఇది ఒక పుణ్యక్షేత్రం గా, భక్తి కేంద్రం గా విలసిల్లింది. స్వామీజీ యొక్క స్మృతి చిహ్నము అన్ని ధర్మముల, అన్ని వయస్సుల, అన్ని వర్గముల ప్రజల కు దేశభక్తి పట్ల ప్రేరకం గా నిలిచింది. ‘దరిద్ర నారాయణుని సేవ’ ఈ మంత్రాన్ని జీవనమార్గం గా చేసుకునేలా చేసింది. అక్కడికి ఎవరు వెళ్ళినా వారి లో శక్తి జాగృతం కావడం, సకారాత్మక భావాలు మేల్కొనడం, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన కలగడం ఎంతో సహజమైన విషయం.

గౌరవనీయులైన మన రాష్ట్రపతి గారు కూడా ఈ మధ్యనే యాభై ఏళ్ళ క్రితం నిర్మింపబడిన ఈ రాక్ మెమోరియల్ పర్యటన చేసి వచ్చారు. మరి మన ఉప రాష్ట్రపతి గారు కూడా గుజరాత్ లోని కచ్ లోని రణ్ లో ఒక ఉత్తమ రణోత్సవ్ జరిగే చోటకు ప్రారంభోత్సవాని కి వెళ్ళడం నాకు సంతోషం కలిగించింది. మన రాష్ట్రపతి గారు, ఉప రాష్ట్రపతి గారు కూడా భారత లో ఇటువంటి ముఖ్యమైన పర్యాటక స్థలాల కు వెళ్తున్నారంటే దేశవాసుల కు దీన్నుంచి తప్పకుండా ప్రేరణ లభిస్తుంది-మీరు కూడా తప్పక వెళ్ళండి.

నా ప్రియదేశవాసులారా, మనము వేర్వేరు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, బడుల్లో చదువుతాము. కానీ చదువు పూర్తయ్యాక alumni meet ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఈ అందరు యువకులు కలిసి పాత జ్ఞాపకాల లోకి జారిపోతారు. పది, ఇరవై , ఇరవై ఐదు ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ, అప్పుడప్పుడూ ఒక alumni meet విశేషం గా ఆకర్షిస్తుంది. దేశవాసుల దృష్టి కూడా అటువైపు మళ్ళడం ఎంతో అవసరం. Alumni meet, నిజానికి పాత మిత్రులతో కలవడం, అన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, ఆ ఆనందమే వేరు. కానీ దీంతో పాటు ఒక Shared purpose ఉంటే, ఒక సంకల్పం ఉంటే, ఏదైనా అనుభూతి పరమైన సంబంధం ఉంటే అప్పుడిది ఇంకా వన్నెకెక్కుతుంది. మీరు చూసే ఉంటారు, alumni group అప్పుడప్పుడూ తమ స్కూళ్ళ కు ఎంతో కొంత విరాళమిస్తూ ఉంటుంది. కొందరు కంప్యూటరైజ్డ్ చేయడానికి ఏర్పాట్లు చేయిస్తే, కొందరు మంచి గ్రంథాలయం ఏర్పాటు చేయిస్తారు, ఇంకొందరు మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయిస్తారు, మరికొందరు అదనపు గదులను నిర్మించడానికి ఏర్పాటు చేయిస్తారు, ఇంకా కొందరు sports complex తయారు చేయిస్తారు. ఏదో ఒకటి చేస్తారు. తమ జీవితం మెరుగు పడిన చోటు ఇది అని ఆయా చోట్లకు కావలసినదేదో తమ జీవితం లో కొంతైనా చేయాలని వారి మనసు లో ఉంటుంది. ఉండాల్సిందే. దీనికోసం ప్రజలు ముందుకొస్తారు. అయితే, నేను ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భాన్ని మీకు చెప్తాను. ఈ మధ్యే మీడియా లో బీహార్ యొక్క పడమటి చంపారణ్ జిల్లాలో భైరవగంజ్ హెల్త్ సెంటర్ యొక్క కథ ను నేను విన్నప్పుడు నాకెంత సంతోషం కలిగిందంటే, మీతో పంచుకోకుండా ఉండలేను. ఈ భైరవ్ గంజ్ హెల్త్ సెంటర్ లో అంటే ఆరోగ్యకేంద్రం లో ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది ప్రజలు చేరుకున్నారు. ఈ మాటలో మీకు ఆశ్చర్యం కలిగించేదేమీ లేదు. మీరనుకోవచ్చు, ఇందులో కొత్త సంగతేముంది? వచ్చుంటారు ప్రజలు అని. కాదండీ, చాలా కొత్త సంగతుంది. ఈ కార్యక్రమము ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం యొక్క initiative కూడా కాదు. ఇది అక్కడి KR High School యొక్క పూర్వ విద్యార్థులది. వారి యొక్క alumni meet దాని ద్వారా తీసుకున్న చర్య ఇది. దీని పేరు ‘సంకల్ప్ ‘Ninety Five.’ ‘సంకల్ప్ Ninety Five’ యొక్క అర్థము – ఆ హైస్కూల్ యొక్క 1995 (నైన్ టీన్ నైన్ టీ ఫైవ్) బాచ్ యొక్క విద్యార్థుల సంకల్పము అని. నిజానికి ఈ బాచ్ విద్యార్థులు ఒక alumni meet పెట్టుకున్నారు, అందులో కొత్తగా ఏదైనా చేద్దామనుకున్నారు. ఈ విద్యార్థులు సమాజం కోసం ఏదైనా చేద్దామని నిశ్చయించారు, పబ్లిక్ హెల్త్ అవేర్ నెస్ పట్ల తమ వంతు బాధ్యత తీసుకున్నారు. ‘సంకల్ప్ Ninety Five’ ఈ ఉద్యమంలో బేతియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, అనేక ఆసుపత్రులు కూడా పాల్గొన్నాయి. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ గురించి ఒక సంపూర్ణ ఉద్యమమే నడిచింది. ఉచిత పరీక్షలు కానివ్వండి, ఉచిత మందుల పంపిణీ కానివ్వండి, అవేర్ నెస్ పెంచడం కానివ్వండి, ‘సంకల్ప్ Ninety Five’ ప్రతి ఒక్కరి కీ ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. మనం తరచూ చెప్తుంటాం, దేశం లో ప్రతి పౌరుడు ఒక అడుగు ముందుకు వేస్తే దేశం నూట ముప్పై కోట్ల అడుగులు ముందుకు వేసినట్టేనని. ఇటువంటి మాటలు సమాజం లో ప్రత్యక్ష రూపం లో అమలు కావడం చూస్తున్నపుడు ప్రతి ఒక్కరికీ ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. జీవితం లో ఏదైనా కొంత చేయడానికి స్ఫూర్తి కలుగుతుంది. ఒక వైపు బీహార్ లోని బేతియా లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆరోగ్య సేవల గురించి ఉద్యమిస్తే, ఇంకోవైపు ఉత్తర ప్రదేశ్ లోని ఫూల్ పూర్ యొక్క కొందరు మహిళలు తమ ఉత్తేజం తో పూర్తి ప్రాంతానికే స్ఫూర్తిగా నిలిచారు. ఐకమత్యంగా ఒక సంకల్పం చేసుకుంటే పరిస్థితుల ను మార్చడాన్ని ఎవరూ ఆపలేరని ఈ మహిళలు నిరూపించారు. కొంత కాలం క్రిందట ఫుల్ పూర్ లోని మహిళలు ఆర్థిక ఇబ్బందులు మరియు బీదరికం తో బాధపడేవారు. కానీ వీరిలో తమ కుటుంబం మరియు సమాజం కొరకు ఏదైనా చేసి తీరాలన్న పట్టుదల ఉండేది. ఈ మహిళలు కాదీపూర్ స్వయం సహాయ బృందం women self help group తో కలిసి చెప్పులు తయారుచేసే కళను నేర్చుకున్నారు. దీని ద్వారా వారు తమ కాళ్ళల్లో గుచ్చుకున్న బలహీనతలనే ముళ్ళను పెకలించివేయడమే గాక, స్వావలంబన ను సాధించి తమ కుటుంబానికి ఆధారమయ్యారు. గ్రామీణ ఉపాధి మిషన్ యొక్క సహాయం ద్వారా అక్కడ చెప్పులు తయారుచేసే కర్మాగారం కూడా నెలకొల్పబడింది. అక్కడ ఆధునిక యంత్రాల ద్వారా చెప్పులు తయారు చేయబడుతున్నాయి. నేను అక్కడి స్థానిక పోలీసులకు, వారి కుటుంబాలకు కూడా శుభాకాంక్షలు ప్రత్యేకం గా తెలుపుతున్నాను, వారు తమ కోసం, తమ కుటుంబం కోసం, ఈ మహిళల ద్వారా తయారుచేయబడిన చెప్పులను కొని వారిని ప్రోత్సహిస్తున్నారు. నేడు ఈ మహిళల సంకల్పం వారి కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాక వారి జీవన స్థాయిని కూడా పెంచింది. ఫుల్ పూర్ పోలీసు వారి , వారి కుటుంబాల వారి మాట విన్నప్పుడు మీకు నేను ఎర్రకోట నుంచి 15 ఆగస్ట్ నాడు దేశవాసులను స్థానిక వస్తువుల ను కొనమని చేసిన మనవి గుర్తు వచ్చి ఉంటుంది. నేను నేడు మళ్ళీ ఒకసారి అదే సలహా ఇస్తున్నాను, మనము స్థానిక స్థాయి లో తయారైన వస్తువుల ను ఎందుకు ప్రోత్సహించకూడదు? మన కొనుగోళ్ళలో వారికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు? మన లోకల్ ప్రాడక్ట్స్ ను మన గౌరవంగా, ప్రతిష్ట గా ఎందుకు భావించకూడదు? ఈ భావనతో మనము మన తోటి దేశవాసుల సమృద్ధి ని పెంచడానికి మాధ్యమం కాలేమా? సహచరులారా! మహాత్మా గాంధీ ఈ స్వదేశీ భావన ను లక్షలాది ప్రజల జీవితాల ను వెలిగించే జ్యోతి గా భావించారు. అతి బీదవాడి జీవితం లో కూడా సమృద్ధి నిండుతుంది. నూరేళ్ళ మునుపే గాంధీ గారు ఒక ప్రజా ఉద్యమాన్నే ప్రారంభించారు. దీని లక్ష్యం ఒక్కటే – స్థానిక ఉత్పత్తుల ను ప్రోత్సహించడం. స్వావలంబన పొందే ఈ మార్గాన్ని గాంధీజీ చూపించారు. రెండు వేల ఇరవై రెండు (2022) లో మన స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఏ స్వతంత్ర భారతం లో మనము ఊపిరి పీలుస్తున్నామో ఆ భారతాన్ని స్వతంత్రం చేయడానికి భారత సుపుత్రులు, సుపుత్రికలు, అనేక యాతనల ను అనుభవించారు. అనేకులు తమ ప్రాణాలను ఆహుతి ఇచ్చారు. అనేక ప్రజల త్యాగము, తపస్సు, బలిదానాల వల్ల మనకు స్వాతంత్ర్యం లభించింది. ఏ స్వాతంత్ర్యాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకుంటున్నామో, ఏ స్వేచ్ఛా జీవనాన్ని మనం అనుభవిస్తున్నామో, దాని కొరకు జీవితాన్ని పోగోట్టుకున్న వారున్నారు, బహుశా ఎంతో కష్టం మీద మనము చాలా కొద్ది మంది పేర్లనే తెలుసుకోగలమే కానీ, తమ కలల ను, స్వతంత్ర భారతవని కలల ను – సమృద్ధ, సుఖకర, సంపన్న, స్వతంత్ర భారతావని కోసమే ఎంతో మంది త్యాగాలు చేశారు.

నా ప్రియ దేశవాసులారా, 2022 లో స్వాతంత్ర్యానికి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో కనీసం ఈ రెండు మూడేళ్ళు మనం స్థానిక ఉత్పత్తులను కొనాలన్న సంకల్పం చేసుకోలేమా? భారత్ లో తయారైన, మన దేశవాసుల స్వహస్తాల తో తయారైన, మన దేశవాసుల స్వేదం పరిమళించే ఈ వస్తువుల ను మనం కొనాలన్న విన్నపం చేయలేమా? నేను దీర్ఘకాలం గురించి చెప్పడం లేదు, కేవలం 2022 వరకు స్వాతంత్ర్యం యొక్క 75 ఏళ్ళు నిండే వరకు. ఈ పని కేవలం ప్రభుత్వాలు కాదు, ప్రతిచోటా యువకులు ముందుకు వచ్చి చిన్న చిన్న సంస్థలు గా ఏర్పడి, ప్రజల కు ప్రేరణ కలిగించి, నచ్చజెప్పి, నిశ్చయింఛేలా చేయండి – రండి మనమంత లోకల్ వి కొందాము, స్థానిక ఉత్పత్తుల కు, దేశవాసుల స్వేద పరిమళాల కు మద్దతు ఇద్దాము – అదే మన స్వతంత్ర భారతం యొక్క స్వర్ణిమ ఘడియగా ఈ కలల ను తోడుగా తీసుకుని మనం నడుద్దాం.

నా ప్రియ దేశవాసులారా, మనందరికీ ఒకటి చాలా ముఖ్యమైనది. దేశం లోని పౌరులు స్వావలంబన సాధించాలి. గౌరవం గా తమ జీవితాన్ని గడపాలి. నా దృష్టిని ఆకర్షించిన ఒక ప్రయత్నం గురించి చర్చించాలనుకుంటున్నాను. అదేమిటంటే, జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ యొక్క హిమాయత్ ప్రోగ్రామ్. హిమాయత్ నిజానికి స్కిల్ డెవలప్ మెంట్ /కౌశల్య అభివృద్ధి మరియు ఉపాధి తో కూడినది. ఇందులో 15 నుంచి 35 వరకూ వయస్సున్న బాలలు, యువకులు పాల్గొంటారు. జమ్ము, కశ్మీర్ లోని చదువు ఏదో కారణం వల్ల పూర్తి చేయలేకపోయినా, మధ్యలో స్కూలు, కాలేజ్ వదిలివేయాల్సిన పరిస్థితి లో ఉన్న వారికోసం.

నా ప్రియదేశవాసులారా, మీకు తెలిస్తే సంతోషిస్తారు. ఈ కార్యక్రమం లో గత రెండేళ్ళలో పద్దెనిమిది వేల యువకుల కు, 77 (seventy seven) వేర్వేరు ట్రేడ్ లలో శిక్షణ ఇవ్వ బడింది. ఇందులో దాదాపు ఐదు వేల మంది ఎక్కడో ఒకచోట ఉద్యోగాలు పొందారు, చాలా మంది స్వయం ఉపాధి లో ముందుకు సాగుతున్నారు. హిమాయత్ ప్రోగ్రామ్ లో తమ జీవితాన్ని మార్చుకున్న ఈ ప్రజల కథలు వింటే నిజంగా హృదయాన్ని కదిలించేవి గా ఉంటాయి.

పర్వీన్ ఫాతిమా, తమిళనాడు లోని తిరుపూర్ లోని ఒక గార్మెంట్ యూనిట్ లో ప్రమోషన్ వచ్చాక సూపర్ వైజర్ కమ్ కోఆర్డినేటర్ అయింది. ఒక సంవత్సరం ముందరి వరకు కార్గిల్ లో ఒక చిన్న ఊళ్ళో ఉండేది. ఈ రోజు ఆమె జీవితం లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఆత్మవిశ్వాసం వచ్చిది- స్వావలంబన సాధింఛింది. తన కుటుంబానికంతా ఆర్థిక పురోగతి కి అవకాశం తీసుకొచ్చింది. పర్వీన్ ఫాతిమా లాగా హిమాయత్ ప్రోగ్రామ్ లేహ్-లద్దాఖ్ క్షేత్రం లోని నివాసులకు, ఇతర బిడ్డల కు తమ అదృష్టాన్ని మార్చివేసింది. ఈరోజు వీళ్ళంతా తమిళనాడు లోని అదే సంస్థ లో పని చేస్తున్నారు. ఇదే విధంగా హిమాయత్ డోడా లోని ఫియాజ్ అహ్మద్ కు కూడా వరమైంది. ఫియాజ్ 2012 లో 12 వ తరగతి పాసయినాడు. కానీ అనారోగ్య కారణం గా తన చదువు కొనసాగించలేకపోయాడు. ఫియాజ్ రెండేళ్ళ వరకూ గుండె జబ్బు తో బాధపడ్డాడు. ఈ లోపల అతని సోదరుడు, ఒక సోదరి మరణించారు. ఒకరకంగా తన కుటుంబం కష్టాల లో కూరుకుపోయింది. చివరికి, హిమాయత్ సహాయం దొరికింది. హిమాయత్ ద్వారా ITES అంటే ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్’ లో ట్రైనింగ్ దొరికింది. ఇప్పుడు పంజాబ్ లో పని చేస్తున్నాడు.

ఫియాజ్ అహ్మద్ యొక్క గ్రాడ్యుయేషన్ చదువు, దీనితో పాటే మొదలుపెట్టి, ఇప్పుడు దాదాపు పూర్తి చేస్తున్నాడు. ఈ మధ్యలో ఒక హిమాయత్ కార్యక్రమం లో తన అనుభవాలను పంచుకోడానికి పిలిపించారు. తన కథ చెప్తూ ఉండగా అతని కళ్ళ లో నీళ్ళు తిరిగాయి. ఈ విధంగా అనంత నాగ్ లోని రకీబ్-అల్-రహమాన్ ఆర్థిక ఇబ్బందుల తో తన చదువు పూర్తి చేయలేకపోయాడు. ఒకరోజు, రకీబ్ తన బ్లాక్ లో ఒక మొబలైజేషన్ క్యాంప్ ఏర్పాటయినపుడు హిమాయత్ కార్యక్రమం గురించి తెలుసుకున్నాడు. రకీబ్ వెంటనే రీటైల్ టీమ్ లీడర్ కోర్స్ లో చేరాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే ఒక కార్పొరేట్ హౌస్ లో ఉద్యోగం లో చేరాడు. ‘హిమాయత్ మిషన్’ ద్వారా లాభం పొందిన ప్రతిభావంతులైన అనేక యువకుల కథలు జమ్మూ-కాశ్మీర్ లో పరివర్తన కు ఉదాహరణలు గా నిలుస్తాయి. హిమాయత్ కార్యక్రమము, ప్రభుత్వము, ట్రైనింగ్ పార్ట్నర్, ఉద్యోగం ఇచ్చే కంపెనీలు మరియు జమ్ము, కశ్మీర్ ప్రజల మధ్య ఒక మెరుగైన మేళవింపు ఒక ఆదర్శ ఉదాహరణ.

ఈ కార్యక్రమం జమ్ము, కశ్మీర్ యువకుల లో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది మరియు ముందుకు వెళ్ళే దారిని మెరుగు పరచింది.

నా ప్రియదేశవాసులారా, 26 వ తేది ఈ దశాబ్దం లోని చివరి సూర్యగ్రహణం మనం చూశాం. బహుశా సూర్యగ్రహణం యొక్క ఈ సంఘటన వల్ల MY GOV లో రిపున్ ఒక చాలా ఆసక్తికరమైన కామెంట్ వ్రాశారు. వారు ఏమని వ్రాస్తున్నారంటే, “….. నమస్కారం సర్, నా పేరు రిపున్. …నేను నార్త్ ఈస్ట్ వాస్తవ్యుడిని. కానీ ఈ మధ్య సౌత్ లో పని చేస్తున్నాను. నేను ఒక సంగతి షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు గుర్తుంది. మా ప్రాంతం లో ఆకాశం స్వచ్ఛం గా ఉండడం వల్ల మేము గంటల తరబడి ఆకాశం లోని చుక్కల ను తదేకంగా చూస్తుండేవాళ్ళము. Star gazing నాకు చాలా ఇష్టమైనది. నేను ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ను. నా దిన చర్య వలన నేను ఇప్పుడు వీటికి సమయం ఇవ్వలేకపోతున్నాను. … మీరు దీని గురించి ఏమైనా చెప్పగలరా? ముఖ్యంగా astronomy గురించి యువతలో ఎలా ప్రచారం చేయవచ్చు?”

నా ప్రియదేశవాసులారా! నాకు ఎన్నో సూచనలు వస్తూ ఉంటాయి. కానీ, ఇటువంటి సూచన బహుశా మొదటి సారి వచ్చింది. ఆ విధం గా విజ్ఞానం యొక్క అనేక కోణాల గురించి మాట్లాడే అవకాశం దొరికింది. ముఖ్యం గా యువతరం యొక్క కోరిక మీద నేను మాట్లాడే అవకాశం దొరికింది. కానీ, ఇంతవరకు ఈ విషయం అలా ఉండిపోయింది. ఇప్పుడు 26 వ తేది సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి, మీకు కొద్దిగా ఆసక్తి ఏర్పడి ఉంటుంది. దేశవాసులందరిలా, ముఖ్యంగా నా యువ సహచరుల వలెనే నేను కూడా 26 వ తేది సూర్యగ్రహణం మీద ఉత్సాహంతో ఉన్నాను. నేను కూడా చూడాలనుకున్నాను. కానీ ఆ రోజు దిల్లీలో మబ్బు పట్టి ఉండడంతో ఆ ఆనందం దొరకలేదని చింతించినా, టీవిలో కోఝీకోడ్ మరియు భారత్ లోని ఇతర ప్రదేశాల లోని సూర్యగ్రహణం యొక్క అందమైన దృశ్యాలు చూశాను. సూర్యుడు వెలుగుతున్న ring ఆకారంలో కనిపించాడు. నాకు ఆరోజు ఈ విషయానికి సంబంధించిన experts తో మాట్లాడే అవకాశం కూడా లభించింది. వాళ్ళు చెప్పారు, ఇలా ఎందుకు జరుగుతుందంటే చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉండడం వల్ల ఆ ఆకారం పూర్తిగా సూర్యుడిని కప్పలేకపోతుంది. అందుకే ఒక ring ఆకారంలో కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక annular solar eclipse దీనినే వలయ గ్రహణం లేదా కుండల గ్రహణం అని కూడా అంటారు. ఈ గ్రహణం మనకు గుర్తు చేస్తుంది, మనము భూమి మీద ఉండి అంతరిక్షం లో తిరుగుతున్నాము అని. అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు, మరియు అన్య గ్రహాలు, ఖగోళ పిండాలు తిరుగుతూ ఉంటాయి. చంద్రుని నీడ వలన మనకు గ్రహణం రకరకాలుగా కనిపిస్తుంది. సహచరులారా, భారతంలో astronomy అంటే ఖగోళ విజ్ఞానానికి చాలా ప్రాచీన గౌరవ ప్రదమైన చరిత్ర ఉంది. ఆకాశంలో మెరిసే నక్షత్రాలతో మన సంబంధం మన సంస్కృతి అంత ప్రాచీనమైనది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. భారతం లో వేర్వేరు స్థానాల లో ఎన్నో భవ్యమైన జంతర్-మంతర్ లు చూడదగ్గవి ఉన్నాయి. ఈ జంతర్-మంతర్ లకు astronomy తో ప్రగాఢ సంబంధం ఉంది. ఆర్యభట్టు మహాశయుని విలక్షణ ప్రతిభ గురించి తెలీని వాళ్ళెవరు? తన కాలక్రియ లో వారు సూర్యగ్రహణం గురించీ, చంద్రగ్రహణం గురించి విస్తృతం గా వ్యాఖ్యానం చేశారు. అది కూడా philosophical మరియు mathematical రెండు కోణాల నుంచీ కూడా. వారు mathematically భూమి యొక్క నీడ లేదా shadow సైజ్ ను ఎలా లెక్కిస్తారు అని చెప్పారు. వారు గ్రహణం యొక్క కాల వ్యవధి మరియు extent ను calculate చేసే పద్ధతుల ను వివరం గా చెప్పారు. భాస్కరుడు వంటి వారి శిష్యులు ఈ spirit ను, ఈ knowledge ను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం పూర్తిగా చేశారు. తర్వాత పధ్నాలుగు-పదిహేనవ శతాబ్దం లో కేరళ లో సంగం గ్రామాని కి చెందిన మాధవుడు ఉండేవారు. వీరు బ్రహ్మాండం లో ఉన్న గ్రహాల స్థితి ని లెక్కించడానికి calculus ను ఉపయోగించారు. రాత్రి కనిపించే ఆకాశం, కేవలం ఆసక్తి ని రేకెత్తించేదే కాదు, గణిత దృష్టి తో ఆలోచించేవారికి, వైజ్ఞానికుల కు ఒక ముఖ్యమైన source గా ఉండేది. కొన్నేళ్ళ క్రిందట నేను ‘Pre-Modern Kutchi (కచ్ఛీ) Navigation Techniques and Voyages’ అనే పుస్తకాన్ని విడుదల చేశాను. ఈ పుస్తకం ఒకరకంగా ‘మాలమ్(maalam) యొక్క డైరీ’ . మాలమ్ అనే వ్యక్తి, నావికుని రూపం లో తన అనుభవాలను తన పద్ధతి లో డైరీగా వ్రాసుకున్నాడు. ఆధునిక యుగం లో ఆ మాలమ్ యొక్క పోథీ అది కూడా గుజరాతీ పాండులిపుల సంకలనము. అందులో ప్రాచీన Navigation technology యొక్క వర్ణన ఉంటుంది. ‘మాలమ్ నీ పోథీ’ లో అనేక మార్లు ఆకాశము, నక్షత్రాలు, నక్షత్రగతుల వర్ణన ఉంటుంది. సముద్ర యాత్ర చేసే సమయం లో నక్షత్రాల ద్వారానే దిశానిర్దేశం జరుగుతుందని అందులో స్పష్టం గా చెప్పబడింది. Destination చేరే దారి నక్షత్రాలే చూపిస్తాయి.

నా ప్రియ దేశవాసులారా, Astronomy రంగం లో భారతదేశం ఎంతో ముందుంది. మన initiatives, path breaking కూడా. మన దగ్గర పూనే లో విశాలమైన Meter Wave Telescope ఉంది. అంతే కాదు, కొడైకెనాల్, ఉదగమండలం, గురుశిఖర్ మరియు హాన్లే లదాఖ్ లలో కూడా పవర్ ఫుల్ టెలిస్కోప్ లు ఉన్నాయి. 2016 లో నాటి బెల్జియమ్ ప్రధాన మంత్రి మరియు నేను నైనిటాల్ లోని 3.6 మీటర్ దేవస్థల optical telescope ను ప్రారంబించాము. ఇది ఆసియా లోనే అతి పెద్ద టెలిస్కోప్ అంటారు. ISRO దగ్గర ASTROSAT అనబడే ఒక Astronomical satellite ఉంది. సూర్యుని గురించి రీసెర్చ్ చేయడానికి ISRO ‘ఆదిత్య’ పేరుతో ఒక వేరే satellite ను కూడా లాంచ్ చేయబోతోంది. ఖగోళ విజ్ఞానాని కి సంబంధించిన మన ప్రాచీన విజ్ఞానం గానీ, నవీన ఉపకరణాలు గానీ వీటి గురించి మనం తెలుసుకోవాలి, గర్వపడాలి. మన యువ వైజ్ఞానికుల లో మన వైజ్ఞానిక చరిత్ర మీద ఆసక్తితో పాటు, astronomy యొక్క భవిష్యత్ గురించి ఒక దృఢమైన ఇచ్ఛాశక్తి కూడా కనిపిస్తుంది.

మన దేశం యొక్క Planetarium, Night sky ని అర్థం చేసుకోవడం తో పాటు Star Gazing ను ఒక అభిరుచి గా వికసింప చేయడానికి motivate చేస్తుంది. ఎంతోమంది Amateur telescope లను బాల్కనీలలో, డాబాల మీద పెట్టుకుంటారు. Star Gazing తో Rural Camps మరియు Rural Picnic లకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఇంకా ఎన్నో స్కూల్-కాలేజ్ లు కూడా Astronomy club లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయోగాలను ముందుకు తీసుకెళ్ళాలి.

నా ప్రియదేశవాసులారా, మన పార్లమెంట్ ప్రజాస్వామ్యమందిరం అని మనకు తెలుసు. నేను ఈరోజు ఒక మాట ఎంతో గర్వం తో చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎన్నుకొని పంపించిన ప్రతినిధులు గత 60 ఏళ్ళ రికార్డ్ ను బద్దలు కొట్టారు. గత ఆరునెల్లలో 17 వ లోక్ సభ యొక్క రెండు సమావేశాలు ఎంతో productive గా ఉన్నాయి. లోక్ సభ అయితే 114% పని చేసింది. రాజ్యసభ 94% పని చేసింది. ఇంతకు ముందు బడ్జెట్ సమావేశాల్లో 135 శాతము పని చేసింది. రాత్రులు పొద్దు పోయేవరకూ పార్లమెంట్ నడుస్తూనే ఉంది. నేనెందుకు చెప్తున్నానంటే పార్లమెంట్ సభ్యులందరూ ఈ విషయంలో అభినందనకు పాత్రులు, ప్రశంసకు యోగ్యులు. మీరు ఏ జన ప్రతినిధుల ను పంపించారో వారు అరవయ్యేళ్ళ రికార్డ్ లను బద్దలు కొట్టారు. ఇంత పని జరగడము భారత్ యొక్క ప్రజాస్వామ్యపు శక్తి ని, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని పరిచయం చేస్తుంది. నేను రెండు సభల సభాధ్యక్షుల కు, అన్ని రాజకీయ పార్టీల కు, అందరు సభ్యుల కు ఈ చురుకైన పాత్రకై ఈ సందర్భం గా అనేకానేక అభినందనల ను తెలియ చేస్తున్నను.

నా ప్రియదేశవాసులారా, సూర్యుడు, భూమి, చంద్రుని గతులు కేవలం గ్రహణాన్ని నిర్ణయించడం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాల తో ముడిపడి ఉన్నాయి. సూర్య గతి ని బట్టి జనవరి మధ్య లో భారతమంతటా భిన్న ప్రకారములైన పండుగలు చేసుకుంటారని మనకందరి కీ తెలుసు. పంజాబ్ నుంచి తమిళనాడు వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రజలు అనేక పండుగల ను జరుపుకుంటారు. జనవరి లో ఎంతో గొప్పగా మకర సంక్రాంతి, ఉత్తరాయణం చేసుకుంటారు. వీటిని శక్తి ప్రతీకలు గా నమ్ముతారు. ఈ కాలం లో పంజాబ్ లో లోహడీ, తమిళనాడు లో పొంగల్, అసమ్ లో మాఘ్-బిహూ జరుపుకుంటారు. ఈ పండుగలు రైతుల సమృద్ధి మరియు పంటలతో ఎంతో దగ్గరగా ముడిపడి ఉన్నాయి. ఈ పండుగలు మనకు భారత్ యొక్క ఐక్యత మరియు వివిధతల గురించి గుర్తు చేస్తాయి. పొంగల్ యొక్క చివరి రోజు గొప్పవారైన తిరువళ్ళువర్ జయంతి ని జరుపుకునే అదృష్టం మన దేశవాసుల కు లభిస్తుంది. ఆ రోజు గొప్ప రచయిత, చింతనాపరుడు సంత్ తిరువళ్ళువర్ కు వారి జీవితాని కి అంకితం చేయబడుతుంది.

నా ప్రియ దేశవాసులారా, 2019 లో ఇది చివరి ‘మన్ కీ బాత్’. 2020 లో మళ్ళీ కలుద్దాం. కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం, కొత్త సంకల్పం, కొత్త శక్తి, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం తో రండి, ముందుకు పోదాం. సంకల్పము ను పూర్తి చేయడానికి సామర్థ్యాన్ని ప్రోది చెసుకుంటూ పోదాం. చాలా దూరం నడవాలి, చాలా చేయాలి, దేశాన్ని కొత్త శిఖరాల మీదకు చేర్చాలి. 130 కోట్ల దేశవాసుల ప్రయత్నం మీద, వారి సామర్థ్యము మీద, వారి సంకల్పము మీద, అపారమైన గౌరవం తో రండి, ముందుకు పోదాం.

అనేకానేక ధన్యవాదాలు,

అనేకానేక శుభాకాంక్షలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India has the maths talent to lead frontier AI research: Satya Nadell

Media Coverage

India has the maths talent to lead frontier AI research: Satya Nadell
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 జనవరి 2025
January 09, 2025

Appreciation for Modi Governments Support and Engagement to Indians Around the World