(బాంగ్లాదేశ్ కు) బయలుదేరి వెళ్ళే ముందు విడుదల చేసిన ప్రకటన
బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు ఆహ్వానించిన మీదట, ఈ నెల 26వ, 27వ తేదీల లో బాంగ్లాదేశ్ ను నేను సందర్శించనున్నాను.
కోవిడ్-19 మహమ్మారి తలెత్తిన తరువాత ఒక విదేశాన్ని నేను సందర్శించనుండడం, అదీ మన పొరుగు న ఉన్న మిత్ర దేశం అయిన బాంగ్లాదేశ్ కావడం తో నేను సంతోషిస్తున్నాను. బాంగ్లాదేశ్ తో భారతదేశాని కి గాఢమైన సంస్కృతి పరంగాను, భాషా పరంగాను బంధం ఉండడమే కాకుండా ఇరు దేశాల ప్రజల మధ్య కూడా చక్కని సంబంధాలు ఉన్నాయి.
రేపటి రోజు న జరిగే జాతీయ దినోత్సవాల లో పాలుపంచుకోవడం కోసం నేను నిరీక్షిస్తున్నాను. ఆ ఉత్సవాలలో భాగం గా బాంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు కీర్తిశేషులు శేఖ్ ముజీబుర్ రహమాన్ గారి శత జయంతి ని స్మరించుకోవడం జరుగుతుంది. గత శతాబ్ది తాలూకు సమున్నత నేతల లో బంగబంధు ఒకరు. ఆయన జీవనం, ఆయన ఆదర్శాలు లక్షల మంది కి ప్రేరణ ను అందిస్తూ వస్తున్నాయి. ఆయన స్మృతి కి నా వందనాల ను అర్పించడానికి గాను తుంగీపాడా లో బంగబంధు సమాధి ని సందర్శించుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను.
పురాతనమైనటువంటి జశోరేశ్వరి కాళీ దేవాలయం లో, కాళీ మాత సమక్షం లో ప్రార్థనల లో పాలుపంచుకోవడానికి సైతం నేను వేచి ఉన్నాను. ఆ దేవాలయం పురాణాల లో పేర్కొన్న 51 శక్తి పీఠాల లో ఒకటి గా ఉంది.
నేను మరీ ముఖ్యం గా ఒడాకండీ లో గల మతువా సముదాయం ప్రతినిధుల తో భేటీ కోసం ఉత్సుకత తో ఉన్నాను. శ్రీ శ్రీహరిచంద్ర ఠాకుర్ గారు తన పవిత్ర సందేశాన్ని ఇచ్చింది ఆ ప్రదేశం లోనే.
ప్రధాని శేఖ్ హసీనా గారితో నేను ముఖ్యమైన చర్చల ను జరుపనున్నాను. కిందటి ఏడాది డిసెంబరు లో వర్చువల్ మాధ్యమం ద్వారా మేము జరిపిన సమావేశానికి తరువాయి గా ఈ భేటీ చోటు చేసుకోనుంది. అధ్యక్షులు శ్రీ అబ్దుల్ హామిద్ తో నా సమావేశం విషయం లో సైతం నేను ఉత్సాహం గా ఉన్నాను. అదే విధం గా బాంగ్లాదేశ్ కు చెందిన ఇతర ప్రముఖుల తోనూ నేను సమాలోచనలు జరుపుతాను.
ప్రధాని శేఖ్ హసీనా గారి దార్శనికత భరిత నాయకత్వం లో బాంగ్లాదేశ్ ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా సాధిస్తున్నటువంటి విశిష్ట విజయాల పట్ల అభినందనలను వ్యక్తం చేసేందుకు నా పర్యటన ఒక అవకాశాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ కార్య సాధనల లో భారతదేశం తరఫున మద్ధతు ను అందించడానికి కూడా ఉద్దేశించినటువంటిది అని చెప్పాలి. కోవిడ్-19 కి వ్యతిరేకం గా బాంగ్లాదేశ్ జరుపుతున్న యుద్ధానికి భారతదేశం పక్షాన సమర్ధన ను, సంఘీభావాన్ని కూడా నేను వ్యక్తం చేయబోతున్నాను.