India has undergone a major purification drive to release it from the grip of corruption & black money: PM
125 crore Indians have decided not to step behind in the drive against corruption: PM Modi
Demonetisation has seriously impacted black money and terror-financing: PM Modi
In this fight against corruption & black money, it is clear that people wish to walk shoulder to shoulder with Govt: PM
Officials exposed through raids after notesban won't be spared: PM Modi
PM Modi announces a series of schemes that provide cheap housing for the rural and urban poor
Prime Minister Modi announces new financial schemes to support farmers and small businesses

ప్రియమైన నా దేశవాసులారా,

మరికొన్ని గంటలలో మనం 2017 నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. భారతదేశపు 125 కోట్ల మంది పౌరులు ప్రపంచంలోని మిగిలిన దేశాల ప్రజలతో కలిసి ఒక కొత్త సంకల్పంతోను, ఒక కొత్త ఉత్సాహంతోను, కొత్త కలలతోను నూతన సంవత్సరాన్ని ఆహ్వానించనున్నారు.

దీపావళి నాటి నుండి మన దేశం ఒక ఐతిహాసిక శుద్ధి యజ్ఞానికి సాక్షిగా నిలచింది. 125 కోట్ల మంది దేశ ప్రజల ధైర్యం మరియు సంకల్ప శక్తితో ఈ యజ్ఞం సాగింది.

ఈ శుద్ధి యజ్ఞం రానున్న అనేక సంవత్సరాల తరబడి దేశ భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్రను పోషించగలుగుతుంది.

ఈశ్వరుడి సృష్టి అయిన మానవుల స్వభావం మేలు గుణాలతో నిండి ఉంటుంది. అయితే, కాలంతో పాటు వచ్చే దుష్టత్వాల వలలో చిక్కిన  మనుషులు దాని నుండి బయటపడడానికి సంఘర్షిస్తారు. అవినీతి, నల్లధనం మరియు నకిలీ నోట్లు భారతదేశ సామాజిక  వ్యవస్థను కమ్మివేసి, నిజాయితీపరులను సైతం మోకాళ్లు నేలకు ఆన్చివేసే స్థితికి తీసుకువచ్చేశాయి.

ప్రజలు పరిస్థితులకు లోనై, వారి లోపల ఇమిడివున్న మంచిని వ్యతిరేకించక తప్పలేదు. ఒక్కొక్క సారి అనిపిస్తుంటుంది తెలిసో తెలియకో, ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశరహితంగానో సమాజంలోని చెరుపులు, అవినీతి మన నిత్య జీవనంలో ఒక భాగమైపోయాయని. దీపావళి తరువాత నుండి చోటు చేసుకొన్న పరిణామాలు, ఈ ఊపిరాడని స్థితి నుండి తప్పించుకొని బయటపడడం కోసం కోట్లాది భారతీయులు ఎదురుచూస్తున్నారని నిరూపించాయి.

మనం 1962, 1965, 1971 సంవత్సరాల నాటి వెలుపలి దురాక్రమణల వేళల్లోను, ఇంకా కార్గిల్ కాలంలోను మన దేశ పౌరుల స్వతస్సిద్ధ బలం ఏమిటనేది తెలుసుకున్నాం. దేశం వెలుపలి నుండి బెదరింపులు వచ్చిన సందర్భాలలో అటువంటి సమష్టి శక్తి, వెల్లువెత్తిన దేశ భక్తి అర్థం చేసుకోదగ్గవి. అయితే, అంతర్గత చెడులపై పోరాడడానికి కోట్లాది భారతీయులు ఏకమైనప్పుడు- ఆ శక్తి సాటిలేనిదవుతుంది.

భారతీయులు కష్టాలను కృత‌ నిశ్చయంతోను, అంతులేని సహనంతోను చిరునవ్వు నవ్వుతూ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వారు త్యాగమనే భావనను పునర్ నిర్వచించారు. ఈ ఆదర్శాల కోసమే మనం మనుగడ సాగిస్తున్నాం. 125 కోట్ల మంది భారతీయులు వారి సంకల్పానికున్న బలాన్ని, నిజం పట్ల మరియు మంచి పట్ల మనం ఇచ్చే ప్రాముఖ్యం ఎంతటిదన్న దానిని నిరూపించారు.  ఇది సుస్థిరంగా నిలచిపోయేటటువంటిది.

ప్రజాశక్తి యొక్క బలం ఏమిటన్నది, అత్యంత క్రమశిక్షణ ఎలా ఉంటుందన్నది, దుష్ప్రచారపు తుపాను నడుమ నిజాన్ని నిగ్గుతేల్చగల సామర్థ్యం యొక్క ఉనికి.. వీటన్నింటినీ భారతీయులు కళ్లకు కట్టారు. నిజాయితీ లేమి పైన స్థిర చిత్తం గల నిజాయితీ విజయం సాధించగలుగుతుందని వారు తేల్చారు.

భవ్యమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం ఎంత సుముఖంగా ఉన్నదీ పేదరికంలో మగ్గుతున్న ప్రజలు సైతం వ్యక్తపరిచారు. మరింత ప్రకాశవంతమైన దేశాన్ని ఆవిష్కరించడం కోసం పౌరులు పట్టు వీడని తనం ద్వారా, స్వేదం ద్వారా, పరిశ్రమ ద్వారా అసమానమైన త్యాగాన్ని చేయగలరని ప్రపంచానికి ఉదాహరణపూర్వకంగా తెలియజెప్పారు.

సాధారణంగా ప్రజా ఉద్యమాలు తల ఎత్తినపుడల్లా ప్రజలు మరియు ప్రభుత్వమూ కత్తులు నూరుకొంటూ ఉంటాయి.

చెడుపై జరుపుతున్న ఈ పోరాటంలో ప్రభుత్వమూ, ప్రజలూ ఒకే వైపున మోహరించడమనేది చరిత్రాత్మకం. ఈ సమయంలో, మీరు బారులు తీరవలసి వస్తుందని, మీ సొంత డబ్బును తీసుకోవడానికి కూడా కష్టపడవలసి వస్తుందని ప్రభుత్వానికి ఎంతో బాగా ఎరుకే. నేను చాలా మంది వద్ద నుండి ఉత్తరాలు అందుకున్నాను; వారు వారి బాధలను, దు:ఖాన్ని నాతో పంచుకున్నారు. అయితే, వారు వారి మద్దతును కూడా వారి లేఖలలో స్పష్టంచేశారు. మీరు నాతో మీ సొంత మనిషి మాదిరిగా మనసు విప్పి మాట్లాడారు. అవినీతి పైన, నల్లధనం పైన జరుగుతున్న ఈ యుద్ధంలో మాతో భుజం భుజం కలిపి మీరు నడవాలని అనుకుంటున్నారన్న విషయం స్పష్టం అయింది. ప్రభుత్వంలో ఉన్న మాకు, ఇది ఒక ఆశీస్సు.

కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థను సాధ్యమైనంత వేగంగా సాధారణ స్థాయికి చేర్చాలనేదే నా ప్రయత్నం. ఈ పని మీదే ఉండాలని ప్రభుత్వంలోని సంబంధిత అధికారులందరికీ నేను చెప్పాను. మరీ ముఖ్యంగా పల్లె సీమలు, సుదూర ప్రాంతాలలోని సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరించవలసిందిగా వారికి సూచించాను.

మిత్రులారా,

భారతదేశం చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ఇలా ఇంతకు ముందు జరిగిన దాఖలా లేదు. మనను పోలివున్న దేశాల వద్ద కరెన్సీ నోట్లు మనదగ్గరున్నంత రాశిలో లేవు. గత పది పన్నెండు సంవత్సరాలుగా న్యాయబద్ధమైన లావాదేవీల కోసం 500 రూపాయల, 1000 రూపాయల కరెన్సీ నోట్లను వాడింది తక్కువ. అవి ఎక్కువగా సమాంతర ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడ్డాయి. అధిక నగదు ద్రవ్యోల్బణాన్ని, నల్లబజారును ఎగదోసింది. ఇది పేదలకు చెందవలసినదానిని వారికి చెందకుండా చేసింది. నగదు లేమి అనేది కష్టాలను కొనితెస్తుంది, కానీ మితిమీరిన నగదు ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. సమతూకాన్ని సాధించాలనేది మా ధ్యేయం. లాంఛనప్రాయమైన ఆర్థిక వ్యవస్థకు వెలుపల నగదు ఉంటే, అది ఆందోళనకరమైందని ఆర్థిక వేత్తలు కూడా ఒప్పుకొంటారు. అది ప్రధాన స్రవంతిలోకి వస్తే, అప్పుడు అది అభివృద్ధికి ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది.

శ్రీ జయప్రకాశ్ నారాయణ్, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీ రామ్ మనోహర్ లోహియా, మరియు శ్రీ కామరాజ్ ల వంటి భారతదేశపు గొప్ప పుత్రులు ఇవాళ మన మధ్య ఉండి ఉంటే, దేశ ప్రజల ఓరిమిని, క్రమశిక్షణను, సంకల్పాన్ని వారు శ్లాఘించి ఉండే వారు.

గత కొద్ది వారాలలో సంతోషపెట్టే సందర్భాలు అనేకం సంభవించాయి. వాటన్నింటినీ ఏకరువు పెట్టాలంటే కొన్ని వారాలు పడుతుంది.

ప్రజలు చట్టానికి కట్టుబడుతూ ప్రధాన స్రవంతిలోకి చేరాలని అనుకొన్నప్పుడూ, పేదలకు సేవలందించడంలో ప్రభుత్వానికి తోడ్పడుతూ ఉన్నప్పుడూ- అటువంటి పరిణామం ఏ దేశానికైనా ఆరోగ్యదాయకమైన ధోరణే అవుతుంది.

మిత్రులారా,

మన ముఖంలోకి తొంగి చూస్తూ ఉన్న వాస్తవాలను మనం ఎంత కాలమని పట్టించుకోకకుండా ఉండగలం ? నేను మీతో కొంత సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మీకు నవ్వు తెప్పించడమో, లేదా కోపం తెప్పించడమో చేసేటటువంటి సమాచారం. ప్రభుత్వానికి అందిన సమాచారాన్ని బట్టి చూస్తే, భారతదేశంలో వారి వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు అంగీకరిస్తున్న వారు 24 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇది మనకు మింగుడు పడే విషయమేనా ? మీ చుట్టుపక్కల ఉన్న పెద్ద భవంతులు, ఇంకా పెద్ద కార్లకేసి ఒకసారి చూడండి.

మనం ఏదైనా పెద్ద నగరాన్ని చూసినప్పుడు, ఆ నగరంలో 10 లక్షల రూపాయలకు మించిన వార్షిక ఆదాయం ఉన్న ప్రజలు లక్షల సంఖ్యలో ఉంటారు. దేశ హితం కోసం, నిజాయితీ కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని మరింత పటిష్టపరచవలసిన అవసరం ఉందని మీకు తోచడం లేదా ?

అవినీతి మరియు నల్లధనం పై సాగే ఈ సమరంలో, నిజాయితీపరులు కాని వారి కర్మపై చర్చ జరగడమనేది సహజం. వారు ఎటువంటి శిక్షకు లోనవుతారు ? చట్టం తన పనిని తాను పూర్తి శక్తితో చేసుకు పోతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ప్రాథమ్యమల్లా నిజాయితీపరులకు ఎలా సాయపడాలనేదీ, వారిని ఎలా కాపాడాలనేదీ, ఇంకా.. వారిని కష్టాల బారి నుండి ఎలా గట్టెక్కించాలనేదీనూ. నిజాయితీ మరింత ప్రతిష్టను ఎలా పొందగలుగుతుంది ?

మంచి వారికి నేస్తం ప్రభుత్వం. నిజాయితీ లోపించిన వారు మళ్లీ మంచి దారి లోకి రావడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలని ప్రభుత్వం తలపోస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం చేతులలోను, ఇంకా కొంత మంది ప్రభుత్వ అధికారుల కారణంగాను చెడు అనుభవాలు చవిచూసినట్లు ప్రజలు ఫిర్యాదులు చేశారనేది కఠోరమైన వాస్తవం. ఈ నిజాన్ని తోసిపుచ్చలేం. సాధారణ పౌరుల కన్నా  ప్రభుత్వ అధికారులకు మరింత గొప్ప బాధ్యత ఉంటుందనే మాటను ఎవ్వరూ కూడా కాదనలేరు.

అందుకని, ప్రభుత్వంలో..కేంద్ర ప్రభుత్వంలోను, రాష్ట్రాల ప్రభుత్వాలలోను, స్థానికి సంస్థలలోను.. ఉన్న మన అందరి బాధ్యత ఏమిటయ్యా అంటే, సామాన్యుడిని కాపాడడమూ, నిజాయితీపరులను ఆదుకోవడమూను, అలాగే- నిజాయితీ లోపించిన వారిని ఒంటరివారిని చేయడం కూడాను.

మిత్రులారా,

ప్రపంచం అంతటా ఆమోదించిన విషయం ఏమిటంటే, ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిజం, నకిలీ కరెన్సీ వ్యాపారం, మత్తు మందుల వ్యాపారం, మానవుల అక్రమ రవాణా.. ఇవన్నీ నల్లధనం మీద ఆధారపడ్డవన్న సంగతి.

ఈ చెడులు ఇటు సమాజానికీ, అటు ప్రభుత్వాలకూ ఒక వ్రణంగా మారాయి.  

ఈ వ్యాపారాన్నింటినీ నోట్ల చెలామణి రద్దు పెద్ద దెబ్బ కొట్టింది.

ఇవాళ, చెడ్డ దారిలోకి మళ్లిన యువత పెద్ద సంఖ్యలో ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉంటే, మన పిల్లలను తిరిగి హింస, క్రూరత్వాల చెడు దోవలలోకి వెళ్లకుండా రక్షించుకోగులుగుతాం. చెలామణిలో ఉన్న భారీ నగదు రాశి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరడమనేది మన ఈ పనిలో విజయాన్ని సాధించామన్న విషయాన్ని సూచిస్తోంది.

గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలు నిజాయితీ లోపించిన వారికి తప్పించుకొనే మార్గాలన్నీ మూసుకుపోయాయని చెబుతున్నాయి. సాంకేతిక విజ్ఞానం పెద్ద పాత్రను పోషించింది. అలవాటుగా నేరాలు చేసే వారికి వారు వారి తప్పుడు పనులను వదలిపెట్టి ప్రధాన స్రవంతిలోకి చేరక తప్పని పరిస్థితిని కల్పించడం జరుగుతుంది.

మిత్రులారా, దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు ఇది ఒక సువర్ణావకాశం కూడా అని చెప్పాలి. ఈ కాలంలో, బ్యాంకు ఉద్యోగులు పగలనక, రాత్రనక పనిచేశారు.

మహిళా ఉద్యోగులు సైతం ఈ పనిలో భాగంగా రాత్రిళ్లు పొద్దు పోయాక కూడా శ్రమించారు.

తపాలా కార్యాలయాల సిబ్బంది, బ్యాంకింగ్ కరెస్పాండెంట్ లు.. అంతా అసాధారణమైన విధంగా వారి విధులను నిర్వర్తించారు.

ఈ మహత్కార్యంలో, కొన్ని బ్యాంకులలోని కొందరు అధికారులు ఘోరమైన నేరాలకు ఒడిగట్టినట్లు వెల్లడి అయింది. కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు. వారు పరిస్థితుల నుండి లాభపడాలని చూశారు. వారిని వదలిపెట్టేది లేదు.

ఈ చరిత్రాత్మక సమయంలో, నేను బ్యాంకులకు ఒక మనవి చేయాలనుకుంటున్నాను.

భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంలో డబ్బును అందుకొన్న ఘట్టం చరిత్రలోనే లేదు.

బ్యాంకుల స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవిస్తూనే, అవి వాటి సాంప్రదాయక ప్రాధాన్యాలకు మించి  ముందడుగు వేయాలని,  వాటి కార్యకలాపాలలో పేదలను, దిగువ మధ్య తరగతి వర్గాన్ని, మధ్య తరగతి వర్గం వారినికేంద్ర బిందువుగా ఉంచుకోవాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

భారతదేశం పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త‌ జ‌యంతిని గ‌రీబ్ క‌ల్యాణ్ సంవ‌త్స‌రంగా నిర్వహించుకుంటోంది. ఈ అవ‌కాశాన్ని బ్యాంకులు జార‌విడుచుకోకూడ‌దు.  ప్ర‌జాప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా చిత్త‌శుద్ధితో అవ‌స‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాలి.

మ‌న‌సులో స్ప‌ష్ట‌మైన దృక్ప‌థంతో నిర్ణ‌యాలు తీసుకున్న‌ప్పుడు ల‌బ్ధిదారుల్లో సాధికారిత రావ‌డ‌మే కాదు.. స్వ‌ల్ప‌కాలిక‌ ప్రయోజనాలు, దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు కూడా సాధ్యం అవుతాయి. వ్య‌యాల‌ను జాగ్ర‌త్త‌గా పరిశీలించుకొంటూ ఉంటే గ‌రిష్ఠ స్థాయిలో స‌త్ఫ‌లితాలు చేకూర‌తాయి.
 
గ్రామాలు, పేద‌ వ‌ర్గాలు, రైత‌న్న‌లు, ద‌ళితులు, గిరిజ‌నులు, నిర్ల‌క్ష్యానికి గురి అవుతున్న వ‌ర్గాలు, అణ‌చివేత‌కు లోనవుతున్న వారు, మ‌హిళ‌లు ఎంత‌గా సాధికారితను పొంద‌గ‌లిగితే, ఆర్థికంగా త‌మ కాళ్ళ‌పై తాము నిల‌బ‌డ‌గ‌లిగితే దేశం అంత శ‌క్తిమంతం అవుతుంది. అభివృద్ధి కూడా వేగ‌వంతం అవుతుంది.

మిత్రులారా,

‘స‌బ్ కా సాత్ - స‌బ్ కా వికాస్’ సిద్దాంతాన్ని మ‌రింత‌గా ముందుకు న‌డిపించ‌డానికి ఈ కొత్త సంవ‌త్స‌ర వేళ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం కొత్త కార్య‌క్ర‌మాలను ఆవిష్క‌రిస్తోంది.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ద‌శాబ్దాల త‌రువాత కూడా కోట్లాది పేద‌లు సొంత ఇల్లు లేకుండా జీవిస్తున్నారు. ఆర్థిక రంగంలో న‌ల్ల‌ధ‌నం పెరిగిపోవ‌డంతో ఇళ్ళు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా పోయాయి. పేద‌లు, కొత్తగా మ‌ధ్య‌త‌ర‌గ‌తిలోకి వచ్చి చేరిన వారు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంద‌రికీ ఇళ్ళను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌భుత్వం కొన్ని భారీ నిర్ణ‌యాలు తీసుకుంది.

‘ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న’ లో భాగంగా రెండు కొత్త మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలను ప‌ట్ట‌ణ ప్రాంతాలలో ఏర్పాట‌య్యాయి. 2017 సంవ‌త్స‌రంలో 9 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు గృహ‌ రుణం తీసుకునే వారికి 4 శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది. 2017 సంవ‌త్స‌రంలో 12 ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కు గృహ‌ రుణం తీసుకునే వారికి 3 శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది.

‘ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న’ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ళ సంఖ్యను 33 శాతం పెంచుతున్నాం.

అదనంగా, గ్రామీణ ప్రాంతాలలో నివ‌సిస్తున్న న‌వ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కోసం మ‌రో పథకాన్ని కూడా ప్ర‌వేశ‌పెడుతున్నాం. 2017 సంవ‌త్స‌రంలో గ్రామీణ ప్రాంతాల్లో న‌వ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి శ్రేణిలోకి వ‌చ్చే వారు నూతన గృహ‌ నిర్మాణం, పాత గృహ‌ విస్త‌ర‌ణల కోసం తీసుకునే 2 ల‌క్ష‌ల రూపాయ‌ల రుణంపై 3  శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది.

మిత్రులారా,

వ్య‌వ‌సాయ రంగాన్ని పూర్తిగా నాశ‌నం చేస్తున్నార‌నే భావం ప్ర‌జ‌ల్లో నాటుకునేలా చేసేందుకు గ‌త కొద్ది వారాలుగా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. దీనికి స‌రైన జ‌వాబును వ్యవసాయదారులే చెప్పారు. ర‌బీ పంట దిగుబ‌డులు గ‌త ఏడాదితో పోల్చితే 6 శాతం పెరిగాయి. ఎరువుల కొనుగోళ్ళు 9 శాతం పెరిగాయి. విత్త‌నాలు, ఎరువులు, రుణం కొర‌త కార‌ణంగా రైతాంగం ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని భావించి ప్ర‌భుత్వం కొన్ని చ‌ర్య‌లు తీసుకుంది. వ్యవసాయదారుల ప్ర‌యోజ‌నం కోసం ఇప్పుడు మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకున్నాం.

జిల్లా స‌హ‌కార బ్యాంకులు, కేంద్ర సహ‌కార బ్యాంకులు, ప్రాథ‌మిక స‌హ‌కార సంఘాల నుంచి ర‌బీ పంట రుణాలు తీసుకున్న రైతులు ఆ రుణంపై 60 రోజుల పాటు ఎలాంటి వ‌డ్డీ చెల్లించ‌న‌క్క‌ర‌లేదు. గ‌త రెండు నెల‌లుగా రుణాల‌పై వ‌డ్డీ చెల్లించిన వారికి ఆ వ‌డ్డీ మొత్తం ఎంతైతే అంత వాప‌సుగా వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ అవుతుంది.

రైతుల‌కు స‌హ‌కార బ్యాంకులు, స‌హ‌కార సంఘాల నుండి మ‌రింత ఇతోధికంగా రుణాలు అందుబాటులోకి తేవ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. గ‌త నెల‌లో నాబార్డ్ 21,000 కోట్ల రూపాయ‌ల నిధిని ఏర్పాటు చేసింది. ఆ నిధికి ఇప్పుడు ప్ర‌భుత్వం మ‌రో 20,000 కోట్ల రూపాయ‌లు జ‌త చేస్తోంది. స‌హ‌కార బ్యాంకుల‌కు, స‌హ‌కార సంఘాల‌కు త‌క్కువ వ‌డ్డీపై రుణాలు అందించ‌డం వ‌ల్ల నాబార్డ్ కు ఏర్ప‌డిన న‌ష్టాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకున్న 3 కోట్ల మంది వ్యవసాయదారుల‌కు మూడు నెల‌ల్లోగా  రూపే డెబిట్ కార్డులను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కిసాన్ క్రెడిట్ కార్డులు 1998లోనే ప్ర‌వేశ‌పెట్టినా ఇప్ప‌టి వ‌ర‌కు వాటిని ఉప‌యోగించుకోవాలంటే బ్యాంకుకు వెళ్ళ‌డం త‌ప్ప‌నిస‌రి. ఇప్పుడు వ్యవసాయదారుల‌కు రూపే డెబిట్ కార్డులు అంద‌డంతో వారు వాటిని ఎక్క‌డ కావాలంటే అక్క‌డ ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఆర్థిక రంగానికి వ్య‌వ‌సాయం ఎంత కీల‌క‌మో ఎమ్ఎస్ ఎమ్ఇ లుగా వ్య‌వ‌హ‌రించే చిన్న‌, మ‌ధ్య‌ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు కూడా అంతే కీల‌కం. ఈ రంగం ప్ర‌యోజ‌నాలను దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది.
ఈ నిర్ణ‌యాల‌తో ఉపాధికి కూడా ఊతం ల‌భిస్తుంది.

చిన్న వ్యాపార సంస్థ‌ల‌కు ఇచ్చే రుణాల‌కు ఒక ట్ర‌స్టు ద్వారా కేంద్ర‌ ప్ర‌భుత్వ‌మే హామీదారుగా నిలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కోటి రూపాయ‌ల రుణాల గ‌రిష్ఠ ప‌రిమితి రుణాల‌కు అలాంటి హామీ ఇవ్వ‌డం జ‌రిగింది. ఇప్పుడు ఆ ప‌రిమితిని 2 కోట్ల‌ రూపాయలకు పెంచ‌డం జ‌రిగింది. గ‌తంలో ఈ స్కీమ్ బ్యాంకు రుణాల‌కు మాత్ర‌మే వ‌ర్తించేది. ఇక నుంచి ఎన్ బి ఎఫ్ సిలు అందించే రుణాల‌కు కూడా దీనిని విస్త‌రిస్తున్నాం. ఈ నిర్ణయం వ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నం చిన్న దుకాణ‌దారుల‌కు, చిన్న సంస్థ‌ల‌కు కూడా వ‌ర్తిస్తుంది. వారికి హామీదారుగా ఉండే ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది గ‌నుక బ్యాంకులు, ఎన్ బి ఎఫ్ సిలు ఈ రుణాల‌పై అధిక వ‌డ్డీని వ‌సూలు చేయ‌వు.

చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌స్తుతం వాటి ట‌ర్నోవ‌ర్ పై 20 శాతం వ‌ర‌కు ఇస్తున్న రుణ‌ ప‌రిమితిని 25 శాతానికి పెంచాల‌ని ప్ర‌భుత్వం బ్యాంకుల‌ను కోరింది. డిజిట‌ల్ లావాదేవీలు నిర్వ‌హించే సంస్థల‌కు వ‌ర్కింగ్  కాపిట‌ల్ రుణ ప‌రిమితిని 20 శాతం నుంచి 30 శాతానికి పెంచాల‌ని కూడా బ్యాంకుల‌కు సూచించింది. ఈ రంగానికి చెందిన ప‌లువురు గ‌త కొద్ది వారాలుగా బ్యాంకులలో న‌గ‌దు జ‌మ చేశారు. వ‌ర్కింగ్ కాపిట‌ల్ రుణం నిర్ణ‌యించే స‌మ‌యంలో ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కూడా బ్యాంకుల‌కు సూచించాం.

కొద్ది రోజుల క్రితం చిన్న వ్యాపార‌వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం పెద్ద మొత్తంలో ప‌న్ను ప్ర‌యోజ‌నం ప్ర‌క‌టించింది. 2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ట‌ర్నోవ‌ర్ గ‌ల సంస్థ‌ల వ్యాపారాదాయంపై 8 శాతం ప‌న్ను మాత్ర‌మే వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించింది.  డిజిట‌ల్  లావాదేవీలు నిర్వ‌హించే వ్యాపార సంస్థ‌ల‌కు ఇప్పుడు ఆ ప‌న్ను ప‌రిమితిని 6 శాతానికి త‌గ్గిస్తున్నాం. దీని వ‌ల్ల వారిపై ప‌న్ను భారం 25 శాతం వ‌ర‌కు త‌గ్గుతుంది.

మిత్రులారా,

ముద్ర‌ యోజ‌న పురోగ‌తి అత్యంత ప్రోత్సాహ‌క‌రంగా ఉంది. గ‌త ఏడాది దీని ద్వారా దాదాపు మూడున్న‌ర కోట్ల మంది ల‌బ్ధి పొందారు. ద‌ళితులు, గిరిజ‌నులు, వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ ఈ సంఖ్య రెట్టింపు చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.
గ‌ర్భవతుల కోసం ఇప్పుడు కొత్త స్కీమ్ ఒక‌టి కూడా ప్ర‌వేశ‌పెడుతున్నాం. గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఆర్థిక స‌హాయం అందించేందుకు దేశ‌వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్ర‌వేశ‌పెడ‌తాం. దీని కింద ఆరోగ్య సంస్థ‌ల్లోనే పురుడు పోసుకుని, పిల్ల‌ల‌కు టీకామందులిప్పించే మ‌హిళ‌ల‌కు 6,000 రూపాయ‌లు నేరుగా వారి ఖాతాలోనే జ‌మ చేస్తాం. ప్ర‌స‌వ‌ స‌మ‌యంలో మ‌ర‌ణాల రేటును ఈ స్కీమ్ గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తుంది. పురిటికి ముందు, ప్రసవం అనంతరం చ‌క్క‌ని పౌష్టికాహారం అందుతుంది. మ‌హిళ‌లు, పిల్ల‌ల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ప్ర‌యోగాత్మ‌క ప‌థ‌కం కింద ఇంతవరకు 53 జిల్లాలలో  గ‌ర్భిణీలు ఒక్కొక్క‌రికి 4,000 రూపాయ‌ల వంతున స‌హాయం అందిస్తూవచ్చాం.

వ‌యో వృద్ధుల కోసం కూడా ఒక పథకాన్ని ప్ర‌వేశ‌పెడుతున్నాం. పెద్ద మొత్తంలో నిధులు అందుకున్న స‌మ‌యంలో బ్యాంకులు వారి డిపాజిట్ల‌పై వ‌డ్డీరేటును త‌గ్గించ‌డం ప‌రిపాటి. ఈ చ‌ర్య వ‌ల్ల సీనియ‌ర్ సిటిజన్ లకు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కూడ‌దు. కొత్త పథకంలో భాగంగా సీనియ‌ర్ సిటిజన్ డిపాజిట్ల‌పై 7.5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు 10 సంవ‌త్స‌రాల కాలం పాటు 8 శాతం స్థిర వ‌డ్డీ ఇవ్వ‌డం జ‌రుగుతుంది. వ‌డ్డీని నెల‌వారీగా చెల్లిస్తారు.

మిత్రులారా,

అవినీతిపై, న‌ల్ల‌ధ‌నంపై ఎలాంటి చ‌ర్చ జ‌రిగినా రాజ‌కీయ పార్టీలు, రాజ‌కీయ నాయ‌కులు, ఎన్నిక‌ల నిధులు ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయి. నిజాయితీప‌రులైన పౌరుల మ‌నో భావాల‌ను, వారిలో నెల‌కొన్న ఆగ్ర‌హాన్ని రాజ‌కీయ నాయ‌కులు, పార్టీలు గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. కాలానుగుణంగా రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచేందుకు నిర్మాణాత్మ‌క చ‌ర్య‌లు తీసుకున్నాయి.

‘మీక‌న్నా మేమే ప‌విత్రులం’ అన్న వైఖరిని అన్ని రాజ‌కీయ పార్టీలు విడ‌నాడి పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌ పీట వేయాల‌ని, రాజ‌కీయాల‌ను న‌ల్ల‌ధ‌నం, అవినీతిల బారి నుండి దూరం చేసేందుకు ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

మ‌న దేశంలో స‌గ‌టు మ‌నిషి నుండి రాష్ర్ట‌ప‌తి వ‌ర‌కు ప‌లువురు ఎన్నో సంద‌ర్భాలలో రాష్ర్ట‌, జాతీయ స్థాయిలలో ఎన్నిక‌లు ఒకేసారి స‌మాంత‌రంగా జ‌ర‌గాల‌న్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్నిక‌ల చ‌క్ర‌భ్ర‌మ‌ణం నిరంత‌ర ప్ర‌క్రియ‌గా సాగ‌డాన్ని నిరోధించ‌డం, ఎన్నిక‌ల వ్య‌యాల‌ను త‌గ్గించ‌డం, అధికార యంత్రాంగంపై ఒత్తిడిని త‌గ్గించ‌డం ఈ సూచ‌నల ల‌క్ష్యం. ఈ అంశంపై నిశితంగా ఆలోచించి, చ‌ర్చించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.

మ‌న దేశంలో స‌కారాత్మ‌క మార్పున‌కు ఎప్పుడూ అవ‌కాశం ఉంటుంది.

డిజిట‌ల్ లావాదేవీల ప‌ట్ల సానుకూల సరళిని మ‌నం ఇప్పుడు చూస్తున్నాం. అధిక శాతం మంది ప్ర‌జ‌లు ఇప్పుడు డిజిట‌ల్‌గా లావాదేవీలు నిర్వ‌హిస్తున్నారు.

డిజిట‌ల్ లావాదేవీల కోసం నిన్న‌నే ప్ర‌భుత్వం బాబాసాహెబ్ భీమ్ రావు అంబేడ్కర్ పేరిట  ఒక స్వ‌దేశీ వేదికను ఏర్పాటు చేసింది.  
‘భీమ్’ అనేది భార‌త్ ఇంట‌ర్ ఫేస్ ఫ‌ర్ మ‌నీకి కూడా ఒక ప్ర‌తీక‌గా నిలుస్తుంది. వీలైనంత ఎక్కువ‌గా ‘భీమ్’ తో అనుసంధానం కావాల‌ని యువ‌త‌కు, వ్యాపార వ‌ర్గాలకు, వ్యవసాయదారులకు నేను పిలుపు ఇస్తున్నాను.

మిత్రులారా,
 
దీపావ‌ళి అనంతరం చోటు చేసుకొన్న ప‌రిణామాలు, ప్ర‌క‌టించిన నిర్ణ‌యాలు, అనుస‌రించిన విధానాల‌పై ఆర్థిక‌వేత్త‌లు త‌ప్ప‌కుండా మ‌దింపు చేస్తారు.

సామాజిక శాస్త్రవేత్త‌లు కూడా ఈ త‌ర‌హా మ‌దింపు చేయడం మంచిది.

ఒక జాతిగా భార‌తదేశంలోని గ్రామాలు, పేద‌లు, రైతులు, యువ‌త‌, విద్యావంతులు, విద్యాగంధం లేని పురుషులు, మహిళలు ఒక అసాధార‌ణ‌మైన స‌హ‌నాన్ని పాటించారు; ప్ర‌జ‌ల శ‌క్తి ఏమిటో చాటి చెప్పారు.

మ‌రి కొద్దిగంటలలో కొత్త సంవ‌త్స‌రం 2017 ప్రారంభం అవుతుంది. స‌రిగ్గా 100 సంవ‌త్స‌రాల క్రితం 1917లో మ‌హాత్మా గాంధీ చంపార‌ణ్ స‌త్యాగ్ర‌హం ప్రారంభించారు. స‌రిగ్గా వంద సంవ‌త్స‌రాల త‌రువాత ఇప్పుడు ప్ర‌జ‌లు స‌త్యం, స‌ద్భావం ప‌ట్ల అదే త‌ర‌హా భావాన్ని పాలు పంచుకున్నారు.

ఈ రోజు మ‌హాత్మా గాంధీ మ‌న మ‌ధ్య లేరు. కానీ, ఆయ‌న చూపించిన స‌త్య‌మార్గం ఇప్ప‌టికీ ఎంతో అనుస‌ర‌ణీయం. స‌త్యాగ్ర‌హ శ‌తాబ్ది వేడుక‌ల‌కు స‌న్న‌ద్దం అవుతున్న ఈ త‌రుణంలో, ఆయ‌న‌ను ఒక సారి స్మ‌రించుకొని ఆయ‌న ఇచ్చిన స‌త్యం, స‌ద్భావాల సందేశాన్ని ఆచ‌రించేందుకు సంక‌ల్పించుకుందాం.

అవినీతిపైన, న‌ల్ల‌ధ‌నంపైన ఈ పోరాటం ఇక్క‌డ‌తో ఆగ‌డానికి గాని, లేదా నెమ్మ‌దించ‌డానికి గాని వీలు లేదు. స‌త్యం ప‌ట్ల అంకిత భావంతో ఉండ‌డం విజ‌యానికి మూలంగా నిలుస్తుంది. 125 కోట్ల జ‌నాభా ఉన్న భార‌త‌దేశంలో 35 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు వారే 65 శాతం మంది ఉంటారు. వ‌న‌రుల్లో గాని, సామ‌ర్థ్యాల్లో వారు వెనుక‌బ‌డి ఉండ‌డానికి అవకాశం లేదు.

స‌రికొత్త సంక‌ల్పంతో నూత‌న సంవ‌త్స‌రపు న‌వోద‌యం కానున్నది.

అన్ని ర‌కాల అవ‌రోధాల‌ను అధిగ‌మించి ముందుకు సాగేందుకు  మ‌న‌మంద‌రం ఏకం అవుదాం.

అందరికీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు.

జయ్ హింద్‌. 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi