ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కాఠ్‌మాండూ లోని పశుపతినాథ్ ధర్మశాల ను నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. ఓలీ తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, తాను ఇక్కడకు వచ్చినప్పుడల్లా కాఠ్‌మాండూ ప్రజల ప్రేమ ను, ఆప్యాయత ను అనుభూతిస్తున్నట్లు వెల్లడించారు. నేపాల్ లో భారతదేశం పట్ల ఈ విధమైనటువంటి అనురాగం సుస్పష్టంగా వెల్లడి అవుతోందని ఆయన అన్నారు. నేపాల్ లో ఇంతకు ముందు తాను పశుపతినాథ్ ఆలయాన్ని, ఇంకా ఇతర దేవాలయాలను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు.
భారతదేశానికి, నేపాల్ కు మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాలు కాలానికి మరియు దూరానికి అతీతమైనవని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈ ధర్మశాల ను ప్రారంభిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
పశుపతినాథ్, ముక్తినాథ్, జానకీధామ్ దేవాలయాలు నేపాల్ యొక్క భిన్నత్వం లోని ఏకత్వాన్ని చాటిచెప్తున్నాయని, అంతేకాకుండా భారతదేశం తో నేపాల్ కు ఉన్నటువంటి బంధాలను సైతం బలోపేతం చేస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. హిందూ మతం మరియు బౌద్ధం యొక్క సుసంపన్నమైన సంప్రదాయాలు కాఠ్‌మాండూ నగరం లో ప్రతిధ్వనిస్తున్నాయని ఆయన తెలిపారు. భారతదేశానికి, నేపాల్ కు నడుమ బౌద్ధం ఏ విధంగా ఒక ముఖ్యమైన లంకె గా వున్నదీ ఆయన వివరించారు. ఉభయ దేశాలు వాటి ఘన వారసత్వాన్ని చూసుకొని గర్వపడుతున్నాయని ఆయన అన్నారు.
సమాజం లోని బలహీనమైన వర్గాలు, ఇంకా అనాదరణకు గురైన వర్గాలు పురోగమించవలసిన అవసరంతో పాటు అభివృద్ధి చోటు చేసుకోవలసిన ఆవశ్యకత ను గురించి ప్రధాన మంత్రి నొక్కిపలికారు. భారతదేశం ఆర్థిక అభివృద్ధి లో నూతన శిఖరాలను అందుకొంటోందని, ‘‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’’ దార్శనికత లో నేపాల్ ప్రజలకు కూడా భాగం ఉందని ఆయన అన్నారు. నేపాల్ లో రాజకీయ స్థిరత్వం నెలకొనడం పట్ల భారతదేశం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నేపాల్ భారతదేశం నుండి సుహృద్భావాన్ని, సహకారాన్ని ఎల్లప్పటికీ ఆశించవచ్చని ఆయన తెలిపారు.