శ్రేష్ఠులైన జపాన్ ప్రధాని శ్రీ శింజో ఆబే;
జపాన్ ప్రతినిధి వర్గంలోని గౌరవనీయ మంత్రులు, సీనియర్ ప్రతినిధులు;
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీవిజయ్ రూపాణీ;
గుజరాత్ ఉపముఖ్యమంత్రి శ్రీ నితిన్ పటేల్
భారతదేశం, జపాన్ ల వ్యాపార వేత్తలు,
మహిళలు మరియు సజ్జనులారా,
భారతదేశం, జపాన్ లకు చెందిన వ్యాపార వర్గాలతో- అది కూడా ఒక గొప్ప స్నేహితుడి సమక్షంలో- వారితో ఉండడం నిజంగా ఎంతో ఆనందం కలిగించే విషయం. శ్రీ శింజో ఆబే భారతదేశానికి మిత్రుడు; గుజరాత్‌కు మిత్రుడే కాక స్వయానా నాకు కూడా మంచి మిత్రుడు, ఇంకా గొప్ప నాయకుడు. ఆయనకు మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకండి. జపాన్ నాయకత్వంతో, ప్రభుత్వంతో, అక్కడి పరిశ్రమ వర్గాలతో, ప్రజలతో నాకు వ్యక్తిగత పరిచయం ఏర్పడి పదేళ్లు గడచాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను జపాన్ ను తొలి సారి సందర్శించినపుడు ఒక విషయం చెప్పాను. నేను గుజరాత్ లో ఒక బుల్లి జపాన్‌ను చూడాలనుకొంటున్నాను అని. ఇప్పుడు ఇక్కడ గుజరాత్‌లో ఎంతో మంది జపాన్ మిత్రులు సుఖంగా జీవిస్తూ వ్యాపారాలు చేసుకొంటూ ఉండటం చూస్తే సంతోషంగా ఉంది. ఇందులో బాగా తెలిసిన వారూ ఉన్నారు. వారందరినీ ఇక్కడ చూడగలగడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. జపాన్ దేశ ప్రజల జీవనం, వారి పని పరిస్థితులు మరింత మెరుగ్గా ఉంచడానికి ప్రత్యేక చిన్న పట్టణాలు, క్లస్టర్లు, వ్యవస్థలు ఏర్పాటు కావడం చూసి ఆనందంగా ఉంది. ఈరోజు కూడా జపానీయుల కోసం ఒక టౌన్‌షిప్‌ను ప్రకటించారు. వైబ్రంట్ గుజరాత్ ఈవెంట్ లో జపాన్ తొలి భాగస్వామి అయిన వాస్తవాన్ని గుజరాత్ పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వం ఎంతో అభిమానంగా చెప్పుకొంటాయి. ఈ భాగస్వామ్యం కొనసాగడమే కాదు, అది ఇంకా పెరుగుతూ వస్తోంది. దీనితో భారతదేశ ఆర్థిక వ్యవస్థతో జపాన్ పరిశ్రమ మరింత పైస్థాయిలో కార్యకలాపాలు సాగించడానికి వీలు కలిగింది. ఈ ప్రక్రియలో సహాయపడిన కైడాన్‌రెన్, జెఇటిఆర్ ఒ, ఇతర సంస్థలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జపాన్ ప్లస్ విధానం కూడా ఈ బంధం కొనసాగడంలో దోహదపడింది.
మిత్రులారా,
జపాన్ ప్రభుత్వం, జపాన్ ప్రజలు నా పట్ల , నా దేశం పట్ల ఎప్పుడూ ప్రేమాభిమానాలను చూపిస్తూ వచ్చారు. అలాగే 1.25 బిలియన్ మంది భారతీయులు కూడా జపాన్ ప్రజల పట్ల ప్రేమాభిమానాలను కలిగివున్నారు. వ్యక్తిగత స్థాయిలో జపాన్ ప్రధాని అబే గారు ఇస్తున్న ప్రోత్సాహానికి, అందిస్తున్న మద్దతుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. వారిని కలుసుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ నేను వదులుకోను. ఈ సాన్నిహిత్యం, పరస్పర అవగాహనల కారణంగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో తలెత్తిన ఎన్నో అంతరాలను తొలగించడానికి వీలుపడింది. గత ఏడాది జపాన్ నుండి లభించిన ఆధికారిక అభివృద్ధి సాయం ఒక ఆర్థిక సంవత్సరంలో ముందెన్నడూ లేనంత గరిష్ఠస్థాయిలో లభించింది. అంతేకాదు, భారతదేశంలో పని చేసే జపాన్ సంస్థల సంఖ్య గత కొద్ది
సంవత్సరాలలో క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రారంభించిన కార్యక్రమాలతో మీరు ఉభయ దేశాల మధ్య బంధం ఎంత లోతైనటువంటిదో గమనించవచ్చు.
మొదటిది ముంబాయి- అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు:
ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు.
500 కి.మీ. పొడవు ఉన్న ఈ బులెట్ రైలు మార్గ నిర్మాణం త్వరలోనే ప్రారంభమై, 2022-23 నాటికి ఉపయోగంలోకి రానుంది.
హై స్పీడ్ రైలు ప్రాజెక్టుతోపాటు శిక్షణ సంస్థకూడా రూపుదిద్దుకుంటోంది.
ఇది నవభారత నిర్మాతలను తయారు చేస్తుంది. హై స్పీడ్ రైళ్ల నిర్మాణం,నిర్వహణ,వాటిని నడపడానికి సంబంధించిన అత్యంత నైపుణ్యం కల మానవ వనరులను ఈ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది.
ఇక రెండోది, జపనీస్ పారిశ్రామిక టౌన్‌షిప్‌ల అభివృద్ధి. ఇందుకు దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాలను ఖరారు చేశారు. గుజరాత్‌తో పాటు రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు లలో ఈ పారిశ్రామిక టౌన్‌షిప్‌లు రానున్నాయి.
ఇక మూడవది ఆటో మొబైల్స్ రంగంలో సహకారం.
మాండాల్ లోని సుజుకి కర్మాగారం నుండి ప్రపంచం అంతటికీ కార్లు ఎగుమతి అవుతున్నాయి. తదుపరి తరం హైబ్రిడ్ , ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ అందించే లిథియమ్-అయాన్ బ్యాటరీల ఉత్పత్తికి సంబంధించిన ప్లాంటుకు పునాదిరాయిని వేయడం జరిగింది.
నాలుగోది జపాన్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థల ద్వారా మానవ వనరుల అభివృద్ధి. వీటిని జపాన్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి. గుజరాత్‌తో పాటు వీటిని కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడులలో అభివృద్ధి చేస్తారు.
మీ అందరికీ తెలుసు, పవిత్ర వారాణసీ నగరం నా ద్వితీయ నివాసం వంటిదని.
వారాణసీ కన్ వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు జపాన్ లోని క్యోటో సిటీ, వారాణసీ ల మధ్య సాంస్కృతిక సహకారానికి ఒక గుర్తు వంటిది. దీనిని జపాన్ ప్రధాని శ్రీ ఆబే, నేనూ ఇద్దరం కలిసి 2015లో వారాణసీని సందర్శించినపుడు ఈ ఆలోచన రూపుదిద్దుకొంది. నేను దీనికి ‘రుద్రాక్ష్’ అని పేరుపెట్టాను. ఇది ప్రేమకు గుర్తు. రుద్రాక్ష మానవాళికి శివుడు ప్రసాదించిన ప్రసాదం. రుద్రాక్ష్ వారాణసీకి జపాన్ ప్రేమ మాల గా భాసిల్లుతుంది. ఇది ఉభయ దేశాల బౌద్ధ సంస్కృతీ వారసత్వానికి ప్రతీక అయిన సారనాథ్‌కు కూడా అంజలి అవుతుంది. ఈ ప్రాజెక్టుకు జపాన్ ఆర్థిక సహాయానికి నేను వ్యక్తిగతంగా ప్రధాని శ్రీ ఆబేకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జపాన్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన మరి కొన్ని ప్రకటనలను కూడా మీరు చూశారు. రాజకీయంగా, వ్యూహాత్మక రంగాల నుండి చూసినా జపాన్ ప్రధాని ఆబే గారి భారతదేశ పర్యటన ఎంతో ఫలప్రదమైందిగా చెప్పుకోవచ్చు. ఎన్నో కీలక అంశాలపై ఒప్పందాలను మేం ముగించాం. ఇవన్నీ ఇరు దేశాల మధ్య ఒకరికొకరికి గల అవగాహన, విశ్వాసం, సానుకూలతల స్థాయిని తెలియజేస్తోంది.
మిత్రులారా,
గత మూడు సంవత్సరాలలో సులభతర వ్యాపారం విషయంలో మేం ఎంతో కష్టపడి పనిచేశాం. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎన్నో పాలనాపరమైన సంస్కరణలు దేశంలో వ్యాపార అనుకూలతను గణనీయంగా పెంచింది. ఈ సంస్కరణలు, తీసుకున్న చొరవ అంతా భారతదేశాన్ని 21వ శతాబ్దానికి సన్నద్ధం చేసే లక్ష్యం తోనే. ఇవన్నీ దేశాన్ని పరివర్తింపచేసి నవ భారతాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టినవే.ఇందుకోసం మేం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని చేపట్టాం. భారత దేశాన్ని విజ్ఞాన ఆధారిత, నైపుణ్యతతో కూడిన సాంకేతిక పరిజ్ఞాన సమాజంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకు డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాల ద్వారా గొప్ప ప్రారంభం జరిగింది. ఇదే ప్రయోజనం కోసం మేం స్టార్ట్- అప్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించాం. అంతర్జాతీయ గ్లోబల్ స్టార్ట్- అప్ ఇకో సిస్టమ్‌లో ఇండియా మూడో ర్యాంకులో ఉంది. అంతే కాదు గత కొద్ది సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. స్టార్ట్- అప్ ఇండియా కార్యక్రమం కూడా భారతదేశంలో నవకల్పనలకు బలమైన వాతావరణం కల్పించాలని లక్షిస్తున్నది. ఇక మౌలిక సదుపాయాల విషయంలో కూడా నా ప్రభుత్వం ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పెట్టుబడిదారులకు జీవిత కాల అవకాశాలను కల్పిస్తాయి. ఇందులో 100 స్మార్ట్ సిటీస్ మిసన్, ఇళ్లు లేని వారికి 50 మిలియన్ ఇళ్ళ నిర్మాణం, రహదారులు, వంతెనలు, ఓడరేవులు, రైల్వే ట్రాక్‌లు, రైల్వే స్టేషన్ ల నిర్మాణాల వంటివి ఉన్నాయి.
మిత్రులారా,
భారతదేశం అందించే నైపుణ్యం గల కార్మికులు, ఈ విషయంలో మన సమర్థత వల్ల జపాన్ బాగా ప్రయోజనం పొందగలదు. భారతదేశ అభివృద్ధి అజెండా జపాన్ కంపెనీలకు కూడా పనికివచ్చేదే. పెట్టుబడిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించే విషయంలో మన ఆర్థిక వ్యవస్థకు తలుపులు తెరిచేందుకు మేం ఎంతో కష్టపడ్డాం. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని, వ్యాపారం చేయడాన్ని మేం ప్రతి రోజూ సులభతరం చేస్తున్నాం. వ్యాపార సంస్థలు, కంపెనీలు ఎదుర్కొంటున్న ఎన్నో రెగ్యులేటరీ అంశాలను, విధానపరమైన అంశాలను మేం ఇప్పటికే పరిష్కరించాం. ఈ కృషి ఫలితంగా మేం మంచి ఫలితాలు సాధించాం. ఇందుకు సంబంధించి మాకు లభించిన కొన్ని అంతర్జాతీయ గుర్తింపులను నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను. ప్రపంచ బ్యాంకుకు చెందిన సులభతర వ్యాపార సూచిక విషయంలో భారతదేశం ఎగబాకింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి చెందిన గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్‌లో మన దేశం గత రెండు సంవత్సరాలలో 32 స్థానాలు పైకి వెళ్లింది. ఏ ఇతర దేశం కన్నా ఇలా ఎగువ స్థానాలను సాధించడం ఇదే ఎక్కువ. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌కు చెందిన గ్లోబల్ ఇనవేశన్ ఇండెక్స్ విషయంలో గత రెండేళ్లలో మేం 21 స్థానాలు పైకి వెళ్లాం. ప్రపంచ బ్యాంకుకు చెందిన లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో మేం 19 స్థానాలు పైకి వెళ్లాం. యున్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డివెలప్‌మెంట్ (యుఎన్‌సిటిఎడి) రూపొందించిన 10 ఎఫ్‌డిఐ గమ్యాల జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో నిలచింది. భారతదేశంలో అతి పెద్ద పన్నుల సంస్కరణ జిఎస్ టిని ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో మేం ఆధునిక పన్నుల విధానంలోకి అడుగుపెడుతున్నాం. ఇది పారదర్శకమూ, స్థిరమైందే కాక అంచనా వేయగలిగినది కూడాను. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఎఫ్‌డిఐ ల విషయంలో అత్యంత సరళీకృతమైన విధానాలను అమలుపరుస్తున్నటువంటి దేశం. దాదాపు 90 శాతానికి పైగా ఎఫ్‌డిఐ అనుమతులను ఆటోమేటిక్ రూట్‌లో ఉంచడం జరిగింది. విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డును రద్దు చేయడం జరిగింది. ఈ సరళీకృత విధానం వల్ల గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎఫ్‌డిఐలు 60 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జపాన్ నుండి ఎఫ్‌డిఐలు గత మూడు సంవత్సరాలలో మూడు రెట్లు పెరిగాయి. కొత్త ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌రప్టసి కోడ్ ఇన్వెస్టర్లు బయటపడే మార్గాన్ని సులభం చేసింది. వాణిజ్య వ్యవహారాల విషయంలో సత్వర పరిష్కారానికి వీలుగా వాణిజ్య కోర్టులు, వాణిజ్య విభాగాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బిట్రేషన్ చట్టానికి సవరణలు తీసుకురావడంతో ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ సత్వరం పూర్తి అవుతాయి. మేం కొత్త మేధో హక్కుల విధానాన్ని ప్రకటించాం. మేం ఏ దిశగా పయనిస్తున్నామన్న దానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మేం ఇంకా ఎన్నెన్నో చేస్తాం. ఇంకా మెరుగైనవి, మరింత మెరుగైనవి చేస్తాం. అదీ త్వరగా, త్వరత్వరగా చేస్తాం.
మిత్రులారా,
భారతదేశం, జపాన్ లు గొప్ప ప్రజాస్వామిక దేశాలు, పురాతన నాగరికతకు నిలయాలు. అభివృద్ధి ఫలాలను, సంక్షేమ ఫలాలను సామాన్యుడికి ఎలా చేరువ చేయాలో మాకు తెలుసు. ప్రభుత్వ సేవలను తన పౌరులకు సులభంగా అందిచడానికి భారతదేశానికి సులభమైన పరిష్కారాలు, ప్రక్రియలు అవసరం. జపాన్‌కు తాను సంపాదించిన విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి సరైన అవకాశం కావాలి. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దమని నేను చెబుతూ వస్తున్నాను. ఆసియా ఎదుగుదలలో భారతదేశం, జపాన్ లు కీలక పాత్రను పోషించనున్నాయని నేను చెబుతూ వస్తున్నాను. వ్యూహాత్మక , ఆర్థిక వ్యవహారాలలో భారతదేశం, జపాన్ ల మధ్య పెరుగుతున్న బంధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చోదకం చేసే శక్తి ని కలిగివుంది. బలమైన భారతదేశం, బలమైన జపాన్ లు ఆసియా సుస్థిరతకు, ప్రపంచ సుస్థిరతకు ఎంతో ఉపకరించనున్నాయి. ఈ రకమైన పరస్పర, అంతర్జాతీయ కృషిలో ఖచ్చితమైన భాగస్వామి గా ఉన్నందుకు జపాన్ ప్రధాని శ్రీ ఆబేకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన స్నేహబలంతో, పరస్పర విశ్వాసంతో, జపాన్ కు చెందిన ఇంకా ఎంతో మంది ప్రజలను, కంపెనీలను తరలి రావలసిందిగా, ఇక్కడ నివసించాల్సిందిగా, భారతదేశంలో పనిచేయాల్సిందిగా పిలుపునిస్తున్నాను. మీ కృషిలో విజయం సాధించాలని కోరుకొంటున్నాను. అవసరమైన చోటల్లా మీకు నా మద్దతు ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను.
ధన్యవాదాలు.
When I first visited Japan as CM of Gujarat, I had said that I want to see a mini Japan in Gujarat. Today that dream has come true: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
Gujarat’s Industry and Government still cherish the fact that Japan became the first partner country in Vibrant Gujarat event: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
4 locations have been finalized for development of Japanese Industrial Townships in Gujarat, Rajasthan, Andhra Pradesh & Tamil Nadu: PM
— PMO India (@PMOIndia) September 14, 2017
As another novel initiative, the foundation has been laid for production of Lithium batteries for electric mobility: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
A series of administrative reforms have significantly improved the business sentiment in the country: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
Japan can benefit tremendously with the size and scale of our potential & skilled hands that India offers: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
Japan can benefit tremendously with the size and scale of our potential & skilled hands that India offers: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
The growing convergence between Japan and India on strategic and economic issues has capacity to stimulate the global economy: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
With the strength of our friendship & trust, I invite more and more Japanese people and companies to come, live and work in India: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017