అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భూమి పూజ ను నిర్వహించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నర్, కేంద్ర హోమ్ మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మెట్రో బహుమతికి గాను అహమదాబాద్ ను, సూరత్ ను అభినందించారు. ఈ విధమైన సేవ (మెట్రో) దేశం లో రెండు ప్రధాన వ్యాపార కేంద్రాల లో సంధానాన్ని మెరుగు పరచనుండటమే ఆయన అభినందనలకు కారణం. కొత్త రైళ్ళకు, అలాగే కేవడియా కు అహమదాబాద్ నుంచి ఆధునిక జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సహా కేవడియా కు ఉద్దేశించిన కొత్త రైలు మార్గాల విషయంలోనూ గుజరాత్ ప్రజలను ఆయన అభినందించారు. 17 వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల కల్పన పథకాల పనులు ఈ రోజు న మొదలయ్యాయని ప్రధాన మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల నిర్మాణం దిశ లో జరుగుతున్న ప్రయత్నాలు కరోనా కాలం లో సైతం జోరు అందుకొంటున్నాయని ఈ పరిణామం నిరూపిస్తోందన్నారు. వేల కోట్ల కొద్దీ విలువైన మౌలిక సదుపాయాల కల్పన పథకాలు ఇటీవల అయితే దేశానికి అంకితం కావడం గాని, లేదా కొత్త పథకాల తాలూకు పనులు ఆరంభం కావడం గాని జరిగిందన్నారు.
అహమదాబాద్, సూరత్ నగరాలు ‘ఆత్మనిర్భరత’ కు తోడ్పాటు ను అందిస్తున్నాయని ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, అహమదాబాద్ లో మెట్రో సేవలను ప్రవేశపెట్టిన సమయం లో రేకెత్తిన ఉత్సాహాన్ని గుర్తు కు తెచ్చారు. అహమదాబాద్ తన కలల ను, గుర్తింపు ను ఏ విధం గా మెట్రోతో జతపరచుకొన్నదీ ఆయన వివరించారు. నగరం లోని కొత్త కొత్త ప్రాంతాలను హాయి తో కూడిన రవాణా సాధనం గా కలుపుతుంది కాబట్టి ప్రజలకు మెట్రో ప్రాజెక్టు రెండో దశ మేలు ను చేస్తుందన్నారు. అదే విధం గా సూరత్ కూడా మెరుగైన సంధానాన్ని తన అనుభవం లోకి తెచ్చుకొంటుందన్నారు. ఈ పథకాలను భవిష్యత్తు అవసరాలను దృష్టి లో పెట్టుకొని రూపొందించడం జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు.
మెట్రో విస్తరణ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇదివరకటి ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య వైఖరి పరంగా ఉన్న వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. 2014వ సంవత్సరం కంటే ముందు 10-12 ఏళ్ళ కాలం లో 200 కిలో మీటర్ల మేర మెట్రో లైను ను వేయడమైందని, గత ఆరు సంవత్సరాల కాలం లో 400 కిలో మీటర్ల మేర మెట్రో మార్గం లో కార్యకలాపాలు మొదలయ్యాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం 27 నగరాల లో 1,000 కిలో మీటర్ల పొడవైన కొత్త మార్గాలపై కృషి చేస్తోందని చెప్పారు. ఒక ఏకీకృతమైనటువంటి ఆధునిక ఆలోచనలకు ఇంతకు ముందు తావు లేకపోవడం శోచనీయం అని ఆయన అన్నారు. మెట్రో కంటూ ఒక జాతీయ విధానం ఏదీ లేకపోయిందన్నారు. దీనికి ఫలితంగానే వేరు వేరు నగరాల లో మెట్రో సేవలపై టెక్నిక్ పరంగాను, వ్యవస్థల పరంగాను ఒక ఏకరూపత ఏర్పడలేదు అని ఆయన చెప్పారు. నగరం లోని మిగతా రవాణా వ్యవస్థతో ఒక బంధం ఏర్పడకపోవడమనేది రెండో లోపం గా ఉండిందన్నారు. ప్రస్తుతం రవాణా ను ఈ నగరాల లో ఒక ఏకీకృత వ్యవస్థ గా అభివృద్ధిపరచడం జరుగుతోందని, దీనిలో మెట్రో ఒంటరి గా పని చేయబోదని, అది సామూహిక వ్యవస్థ గా పని చేస్తుందని ఆయన వివరించారు. ఇటీవలే ప్రారంభించిన ‘నేశనల్ కామన్ మొబిలిటీ కార్డు’ తో ఈ ఏకీకరణ ను మరింత ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
గాంధీనగర్ ను , సూరత్ ను ఉదాహరణ గా ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పట్టణీకరణ పై ప్రభుత్వం ఆలోచన సరళి ని గురించి సుదీర్ఘంగా వివరించారు. ఇది ప్రతిక్రియాశీలమైంది కాదని, భవిష్యత్తు అవసరాలను దృష్టి లో పెట్టుకొని సక్రియాత్మకమైందిగా ఉన్న చర్య అని ఆయన అన్నారు. రెండు దశాబ్దాల కిందట, సూరత్ నగరాన్ని అభివృద్ధి కంటే ప్లేగు మహమ్మారి విజృంభించిన నగరం గా మాత్రమే చెప్పుకొన్నారు. ప్రభుత్వం, ఈ నగర నవ పారిశ్రామికవేత్తల సమ్మిళిత స్ఫూర్తి ని ప్రోత్సహించిందని, ప్రస్తుతం దేశం లో ఎనిమిదో అతి పెద్ద నగరంగానే కాకుండా ప్రపంచం లో అతి వేగం గా వృద్ధి చెందుతున్న నాలుగో నగరం గా కూడా సూరత్ ఉందన్నారు. కోత కోసి, నగిషీ పని జరిగే ప్రతి 10 వజ్రాల లోను 9 వజ్రాలు సూరత్ లో రూపుదిద్దుకొంటాయి అని ఆయన అన్నారు. అదే మాదిరి గా, దేశం లో రూపొందుతున్న మానవ నిర్మిత వస్త్రాలలో 40 శాతం వస్త్రాలు సూరత్ లోనే తయారు అవుతున్నాయని, అలాగే మానవ నిర్మిత ఫైబర్ లో 30 శాతం ఫైబర్ అక్కడే తయారు అవుతోందన్నారు. సూరత్ ప్రస్తుతం దేశంలో కెల్లా రెండో అత్యంత పరిశుద్ధమైనటువంటి నగరం గా ఉందన్నారు. పేదలకు ఇళ్ల ను నిర్మించడం లో, వాహనాల రాక పోక ల నిర్వహణ లో, రహదారులు, వంతెన ల పరంగా, మురుగునీటి శుద్ధి పరంగా, ఆసుపత్రుల పరంగా నగరం లో ‘జీవించడంలో సౌలభ్యాన్ని’ వృద్ధి చే
సే దిశ లో జరుగుతున్న ప్రయత్నాలను గురించి కూడా ప్రధాన మంత్రి విపులంగా వివరించారు. ఇది మెరుగైన ప్రణాళిక రచన వల్ల, సమగ్రమైన ఆలోచన విధానం వల్ల సాధ్యపడిందని, దేశం లో అన్ని ప్రాంతాలకు చెందిన నవ పారిశ్రామికవేత్తలకు, శ్రామికులకు నిలయం గా ఉన్న కారణం గా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ కు ఒక గొప్ప ఉదాహరణ గా సూరత్ మారింది అని ప్రధాన మంత్రి అన్నారు.
అదే విధంగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ చేసిన వ్యక్తుల నగరంగా ఉన్నది కాస్తా, ఒక యవ్వనభరితమైన, హుషారైన నగరంగా పరివర్తనకు లోనయిన గాంధీనగర్ ప్రస్థానాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఐఐటి, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ఎన్ఐఎఫ్ టి, నేశనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియమ్ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేశన్, ధీరుభాయ్ అంబాని ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎండ్ కమ్యూనికేశన్ టెక్నాలజీ, నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి), రక్షా శక్తి యూనివర్సిటీ మొదలైన ప్రఖ్యాత సంస్థల తో ప్రస్తుతం గాంధీనగర్ గుర్తింపు ను తెచ్చుకొందన్నారు. ఈ సంస్థ లు నగర విద్యా రంగ రూపురేఖలను మార్చివేయడం ఒక్కటే కాకుండా కంపెనీలను కేంపస్ కు తీసుకు వచ్చి నగరం లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయన్నారు. సమావేశ ప్రధాన పర్యటనలకు ఊతాన్ని అందించిన మహాత్మ మందిర్ ను గురించి కూడా శ్రీ మోదీ తన ప్రసంగం లో ప్రస్తావించారు. ఆధునిక రైల్వే స్టేశన్, గిఫ్ట్ సిటీ, సాబర్ మతీ రివర్ ఫ్రంట్, కాంకరీయా లేక్ ఫ్రంట్, వాటర్ ఏరోడ్రోమ్, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, మోతెరా లో అతి పెద్ద స్టేడియమ్, ఆరు దోవల తో కూడిన గాంధీనగర్ హైవే పథకాలు అహమదాబాద్ అస్తిత్వానికి మారు పేరులుగా నిలచాయన్నారు. ఈ నగరం తన పాత హోదా ను వదలిపెట్టకుండానే ఒక ఆధునికమైన రూపు ను సంతరించుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు.
అహమదాబాద్ ‘ప్రపంచ వారసత్వ నగరం’ గా పేరు తెచ్చుకొందని, అంతేకాకుండా ధోలేరా లో ఒక కొత్త విమానాశ్రయం రాబోతోందని శ్రీ మోదీ వెల్లడించారు. ఈ విమానాశ్రయం ఇప్పటికే ఆమోదం లభించిన మోనో-రైల్ తో అహమదాబాద్ కు జతపడనుంది. అహమదాబాద్ ను, సూరత్ ను దేశ ఆర్థిక రాజధాని ముంబయి తో జోడించే బులిట్ ట్రేన్ తాలూకు పనులు పురోగమిస్తున్నాయన్నారు.
గ్రామీణాభివృద్ధి రంగం లో చేపట్టిన చర్యలను కూడా ప్రధాన మంత్రి వివరించారు. గడచిన రెండు దశాబ్దాలకు పైబడిన కాలం లో గుజరాత్ లో రహదారులు, విద్యుత్తు, నీటి స్థితి లో చోటు చేసుకొన్న మెరుగుదల గుజరాత్ అభివృద్ధి యాత్ర లో ఒక ముఖ్య అధ్యాయం అని ఆయన అభివర్ణించారు. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకొని నిలచేటటువంటి రహదారి సౌకర్యాన్ని ప్రస్తుతం గుజరాత్ లో ప్రతి ఒక్క పల్లె కలిగివుందన్నారు. ఆదివాసీ లు నివసించే గ్రామాలు సైతం ఉత్తమ రహదారులను కలిగివున్నాయన్నారు. ప్రస్తుతం, గుజరాత్ లో 80 శాతం కుటుంబాలు గొట్టపుమార్గం ద్వారా నీటి ని అందుకొంటున్నాయని చెప్పారు. ‘జల్ జీవన్ మిశన్’ లో భాగం గా రాష్ట్రం లో 10 లక్షల వాటర్ కనెక్షన్ లను సమకూర్చడమైందన్నారు. త్వరలోనే ప్రతి కుటుంబం నల్లా నీటి ని అందుకొంటుందన్నారు.
అలాగే, ‘సర్ దార్ సరోవర్ సౌనీ యోజన’ లో భాగం గా నీటి పారుదల ఒక కొత్త వేగగతి ని అందుకొందని, వాటర్ గ్రిడ్ నెట్ వర్క్ సేద్యపు నీటి ని బంజరు ప్రాంతాలకు తీసుకుపోయిందన్నారు. నర్మద జలాలు కచ్ఛ్ కు చేరుకొన్నాయన్నారు. సూక్ష్మ సేద్యం రంగంలోనూ పనులు పూర్తి చేయడమైందని చెప్పారు. విద్యుత్తు మరో విజయ గాథ గా ఉందని, గుజరాత్ సౌర విద్యుత్తు లో ప్రముఖ రాష్ట్రం గా ఉందన్నారు. ఇటీవలే కచ్ఛ్ లో ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైన సొలర్ ప్లాంటు పనులు మొదలయ్యాయని చెప్పారు. ‘సర్వోదయ యోజన’ లో భాగం గా సాగునీటి కోసం విడి గా విద్యుత్తు ను అందించే దేశంలో కెల్లా ఒకటో రాష్ట్రం గా గుజరాత్ ఉందన్నారు.
ఆరోగ్య రంగం లో తీసుకొన్న చర్యలను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ ఈ రాష్ట్రం లో 21 లక్షల మందికి ప్రయోజనాన్ని చేకూర్చిందన్నారు. 500కు పైగా జన్ ఔషధీ కేంద్రాలు స్థానిక రోగుల కు దాదాపు గా 100 కోట్ల రూపాయలను ఆదా చేసినట్లు చెప్పారు. 2.5 లక్షలకు పైగా గృహాల ను ‘పిఎమ్ ఆవాస్ – గ్రామీణ్’ లో భాగంగా నిర్మించినట్లు తెలిపారు. 35 లక్షలకు పైగా టాయిలెట్ లను ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ లో భాగం గా ఈ రాష్ట్రం లో నిర్మించడమైందన్నారు.
భారతదేశం సాహసిక నిర్ణయాలను తీసుకొంటూ, వాటిని త్వరిత గతి న అమలు చేస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం కేవలం పెద్ద స్థాయిలోనే కాక మెరుగైన స్థాయి లో కూడా పని చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైన విగ్రహం, ప్రపంచం లోకెల్లా అత్యంత భారీ తక్కువ ఖర్చు తో కూడిన గృహ నిర్మాణ కార్యక్రమం, ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైనటువంటి ఆరోగ్య సంరక్షణ హామీ కార్యక్రమం, 6 లక్షల పల్లెల లో ఇంటర్ నెట్ సదుపాయం లతో పాటు ఇటీవలే మొదలుపెట్టిన ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన టీకాలను వేయించే కార్యక్రమం ఈ ఆలోచన విధానం తాలూకు ఉదాహరణలు గా ఉన్నాయని ఆయన చెప్పారు.
హజీరా కు, ఘోఘా కు మధ్య రో-పాక్స్ ఫెరీ సర్వీసు ను, గిర్‌నార్ రోప్- వే ను గురించి కూడా ఆయన తన ప్రసంగం లో ప్రస్తావించారు. ఈ రెండు పథకాలు శీఘ్ర గతి న అమలై స్థానికుల జీవనం లో పెను మార్పులను తీసుకు వచ్చాయని ఆయన చెప్పారు. ఈ పథకాలు హజీరా కు, ఘోఘా కు మధ్య దూరాన్ని బల్లకట్టు మార్గంలో ప్రయాణించినప్పుడు 375 కిలోమీటర్ ల నుంచి 90 కి.మీ. కి తగ్గిపోతున్నందు వల్ల కాలం తో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందన్నారు. ఈ ఫెరీ సర్వీసు కు రెండు నెలల్లో 50 వేల మంది ఆదరణ లభించిందని, అంతేకాకుండా 14 వేల వాహనాలను కూడా ఈ సర్వీసు చేరవేసిందన్నారు. ఇది ఈ ప్రాంతం లో రైతులకు, పశుపోషణ కు సాయపడిందన్నారు. అలాగే, గిర్‌నార్ రోప్-వే ను రెండున్నర నెలల కాలం లో 2 లక్షల మందికి పైగా వాడుకొన్నారన్నారు.
ప్రజల అవసరాల ను, ప్రజల ఆకాంక్షల ను గురించి అర్థం చేసుకొని, వాటిని తీర్చే దిశ లో సత్వర ప్రాతిపదిక న పాటుపడడం ద్వారా మాత్రమే ‘న్యూ ఇండియా’ లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రధాన మంత్రి అన్నారు. ఈ దిశ లో తాను చేపట్టిన ‘ప్రగతి’ (PRAGATI ) వ్యవస్థ ఒక సోపానం గా ఉందని శ్రీ మోదీ అన్నారు. దేశం లో అమలు విధానం లో ‘ప్రగతి’ ఒక కొత్త జోరు ను ప్రవేశపెట్టింది. ‘ప్రగతి’ సమావేశాలకు స్వయం గా ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తూ వస్తున్నారు. ప్రాజెక్టు భాగస్వాముల తో ముఖాముఖి మాట్లాడి, సమస్యలకు పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం ‘ప్రగతి మాధ్యమం’ ద్వారా జరుగుతోంది. గడచిన అయిదు సంవత్సరాలలో మేము 13 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను సమీక్షించాం అని ప్రధాన మంత్రి వివరించారు.
దీర్ఘకాలం గా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి పథకాలకు పరిష్కారాలను కనుగొంటే, సూరత్ వంటి నగరాలు కొత్త శక్తిని అందుకొంటాయని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మన పరిశ్రమ ప్రత్యేకించి చిన్నతరహా పరిశ్రమల రంగం అయినటువంటి ఎమ్ఎస్ఎమ్ఇ లు తాము ప్రపంచ స్థాయి లో పోటీ పడేటప్పుడు అందుకు కావలసిన చక్కని మౌలిక సదుపాయాల తాలూకు సమర్ధన తమకు ఉందనే విశ్వాసాన్ని సంపాదించుకొంటాయి. ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ లో భాగం గా ఈ చిన్న పరిశ్రమలకు కష్టమైన కాలాల నుండి గట్టెక్కేందుకు వేల కోట్ల రూపాయల విలువైన రుణాలను సులభమైన పద్ధతి లో అందించడం జరుగుతోంది. ఎమ్ఎస్ఎమ్ఇ పునర్ నిర్వచించడం వంటి చర్యల ద్వారా వాటికి ఘనమైన అవకాశాలను అందుబాటు లోకి తీసుకురావడం జరుగుతోంది. ఎమ్ఎస్ఎమ్ఇ లు గనుక వాటి నిర్వచన పరిధి కంటే పెద్ద గా ఎదిగిన పక్షం లో, వ్యాపారులు వారి ప్రయోజనాలను కోల్పోతామేమోనన్న భయానికి లోనవుతారన్న కారణంగా విస్తరణ ను గురించి ఆలోచించేవి కాదు. అలాగే, ఈ పునర్ నిర్వచనం తయారీ కి, సేవా సంబంధ వ్యాపార సంస్థ కు మధ్య ఉండే ప్రత్యేకత ను తొలగించి, సేవల రంగాని కి కొత్త అవకాశాలను కల్పించింది. వాటికి ప్రభుత్వం సేకరణ లో సైతం ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతున్నది. చిన్న పరిశ్రమ లు పుష్పించడానికి అవకాశాలను కల్పించడం కోసం ఆయా యూనిట్ లలో పని చేసే శ్రామికుల కు మెరుగైన సౌకర్యాలను, వారికి మెరుగైన జీవనాన్ని అందించడం కోసం ప్రభుత్వం కంకణం కట్టుకొందని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.