రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ అధ్యక్షతన ఈ రోజు న వర్చువల్ మాధ్యమం లో జరిగిన పన్నెండో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్న భారతదేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. ‘‘ప్రపంచ స్థిరత్వం, ఉమ్మడి భద్రత, నూతన ధోరణులతో కూడిన వృద్ధి’’ అంశం ఈ శిఖర సమ్మేళన ఇతివృత్తం గా ఉండింది. బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ జెయర్ బోల్సొనారో, చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సైరిల్ రామాఫోసా లు కూడా ఈ శిఖర సమ్మేళనం లో పాల్గొన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సవాళ్లను విసరినప్పటికీ కూడా, రష్యా అధ్యక్షతన బ్రిక్స్ కార్యకలాపాలలో పురోగతి చోటుచేసుకోవడం పట్ల అధ్యక్షుడు శ్రీ పుతిన్ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకం గా పోరాడటం లో బ్రిక్స్ ఒక ప్రముఖ పాత్ర ను పోషించిందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు ప్రోత్సాహాన్ని అందించడంలో కూడాను బ్రిక్స్ కృషి చేసిందని ఆయన అన్నారు. ఐక్య రాజ్య సమితి లో, ప్రత్యేకించి ఐ.రా.స. భద్రత మండలి లోను, అలాగే డబ్ల్యుటిఒ, ఐఎమ్ఎఫ్, డబ్ల్యు హెచ్ఒ వంటి అంతర్జాతీయ సంస్థల లో కూడా అవసరమైన సంస్కరణల ను చేపట్టవలసిన అవసరం ఉందని, ఆయా సంస్థలను సమకాలిక వాస్తవ స్థితిగతులకు తగినట్లుగా తీర్చిదిద్దాలంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
కొవిడ్-19 మహమ్మారి కి పరిష్కారాన్ని కనుగొనడం లో సహకరించుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఈ విషయం లో 150కి పైగా దేశాలకు అత్యవసర మందులను భారతదేశం సరఫరా చేసిన సంగతి ని ఆయన గుర్తు కు తెచ్చారు. 2021 వ సంవత్సరం లో ‘బ్రిక్స్’ కు భారతదేశం అధ్యక్షత వహించేటపుడు బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య సహకారాన్ని సమన్వయ పరచడం పై శ్రద్ధ వహిస్తుందని, అంతేకాకుండా సాంప్రదాయక చికిత్స, డిజిటల్ హెల్థ్ రంగాలలో, ఆయా దేశాల ప్రజలకు, ప్రజలకు మధ్య సంబంధాలు, సాంస్కృతిక బృందాల రాక పోక లలో సమన్వయం పైన కూడా భారతదేశం దృష్టిని కేంద్రీకరిస్తుందని ఆయన అన్నారు.
శిఖర సమ్మేళనం ముగింపు లో, ‘‘మాస్కో ప్రకటన’’ కు బ్రిక్స్ దేశాల నేత లు అంగీకారాన్ని తెలియజేశారు.