ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ రాజ్ కోట్ తాలూకు నిర్మాణ పనులకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు కూడా పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మానవాళి ని కాపాడటం కోసం ప్రాణాలను నిరంతరం పణం గా పెట్టిన లక్షల కొద్దీ వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను, పారిశుధ్య కార్మికులను, ఇతరత్రా ముందు వరుసలో నిలచిన కరోనా యోధుల ప్రయాసలను స్మరించుకొన్నారు. శాస్త్రవేత్త ల కృషి ని, అంతేకాక ఈ కష్టకాలం లో పేదలకు ఆహారాన్ని పూర్తి సమర్పణ భావంతో అందించిన వారందరి కృషి ని కూడా ఆయన ప్రశంసించారు.
భారతదేశం ఒక్కటిగా ఉన్నప్పుడు అది అత్యంత కష్టమైన సంక్షోభాన్ని సైతం దీటు గా ఎదుర్కోగలుగుతుందని ఈ సంవత్సరం చాటిచెప్పిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభావవంతమైన చర్యల ఫలితం గా భారతదేశం ఎంతో మెరుగైన స్థితి లో ఉందని, మరి కరోనా బాధితులను కాపాడడం లో భారతదేశం రికార్డు ఇతర దేశాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. భారతదేశం లో టీకామందు ను తయారు చేయడానికి సంబంధించిన సకల సన్నాహాలు జరుగుతున్నాయి అని ఆయన చెప్పారు. భారతదేశం లో తయారు చేసే టీకా ను దేశం లోని ప్రతి ప్రాంతానికి శరవేగంగా చేర్చేందుకుర ప్రయత్నాలు తుది దశ కు చేరుకొన్నాయని ఆయన అన్నారు. ప్రపంచం లోనే అతి పెద్దది అయినటువంటి టీకాలను వేయించే ఉద్యమాన్ని నిర్వహించడానికి భారతదేశం సన్నాహక చర్య లు పూర్తి స్థాయి లో సాగుతున్నట్లు ఆయన చెప్పారు. టీకాలను ఇప్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కిందటి ఏడాది లో సంక్రమణ ను నివారించడం కోసం మనం చేసిన విధంగానే కలసికట్టుగా ముందుకు పోదాం అంటూ ఆయన పిలుపునిచ్చారు.
ఎఐఐఎమ్ఎస్ రాజ్ కోట్ గుజరాత్ లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను, వైద్య విద్య ను అభివృద్ధి చేస్తుందని, ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని శ్రీ మోదీ అన్నారు. ప్రత్యక్షం గా దాదాపు 5 వేల కొలువులు, పరోక్షం గా అనేక నౌకరీలు ఏర్పడతాయి అని ఆయన అన్నారు. కోవిడ్ తో పోరాడడం లో గుజరాత్ ప్రయాసలను ప్రధాన మంత్రి మెచ్చుకొంటూ, గుజరాత్ కోవిడ్ పై యుద్ధం చేయడం లో మార్గాన్ని చూపించిందన్నారు. కరోనా సవాలు ను గుజరాత్ మెరుగ్గా ఎదుర్కొన్నందుకు ఖ్యాతి అంతా అక్కడి పటిష్టమైన వైద్య రంగ మౌలిక సదుపాయాలకే దక్కుతుంది అని ఆయన అన్నారు. వైద్య చికిత్స రంగం లో గుజరాత్ సాధించిన ఈ సాఫల్యానికి వెనుక రెండు దశాబ్దాల తరబడి పట్టు విడువక సాగిన ప్రయత్నాలు, సమర్పణ భావం, సంకల్పం ఉన్నాయి అని ఆయన చెప్పారు.
దేశం లో స్వాతంత్య్రం అనంతరం అనేక దశాబ్దాలు గడచిపోయినప్పటికీ 6 ఎఐఐఎమ్ఎస్ లు మాత్రమే ఏర్పాటు అయ్యాయి అని ప్రధాన మంత్రి అన్నారు. అటల్ జీ ప్రభుత్వం అధికారం లో ఉన్న 2003 వ సంవత్సరం లో, మరో 6 ఎఐఐఎమ్ఎస్ లను నెలకొల్పడం కోసం చర్యలను తీసుకోవడం జరిగింది. గత ఆరేళ్ళ లో 10 నూతన ఎఐఐఎమ్ఎస్ ల ఏర్పాటు తాలూకు పనులు మొదలయ్యాయి, అనేకం ప్రారంభం కూడా అయ్యాయి అని ప్రధాన మంత్రి వివరించారు. ఎఐఐఎమ్ఎస్ తో పాటే 20 సూపర్ స్పెశాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణం లో ఉన్నాయని ఆయన తెలిపారు.
2014 వ సంవత్సరాని కన్నా ముందు మన ఆరోగ్య రంగం విభిన్నమైన దిశల లో, మార్గాలలో కృషి చేస్తూ వచ్చిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 2014 వ సంవత్సరం తరువాత ఆరోగ్య రంగం సమగ్ర కృషి ని చేసిందని, ఆధునిక చికిత్స సౌకర్యాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూనే నివారక సేవలకు కూడా పెద్ద పీట వేసిందన్నారు. పేదల చికిత్స ఖర్చు ను ప్రభుత్వం తగ్గించిందని, అదే కాలం లో వైద్యుల సంఖ్య ను త్వరిత గతి న పెంచడం పై కూడా శ్రద్ధ తీసుకొందని ఆయన అన్నారు.
‘ఆయుష్మాన్ భారత్’ పథకం లో భాగంగా మారుమూల ప్రాంతాలలో ఇంచుమించు 1.5 మిలియన్ హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేసే పనులు జరిగాయని, వీటిలో దాదాపుగా 50000 సెంటర్ లు ఇప్పటికే పని చేయడం ప్రారంభించాయని ప్రధాన మంత్రి అన్నారు. వాటిలో సుమారు 5 వేల సెంటర్ లు ఒక్క గుజరాత్ లోనే ఉన్నాయని చెప్పారు. రమారమి 7000 జన్ ఔషధి సెంటర్ లు సుమారు మూడున్నర లక్షల పేద రోగులకు మందులను తక్కువ ఖర్చు లో అందిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను గురించి ఆయన ఒక్కటొక్కటి గా వివరించారు.
2020 వ సంవత్సరం ఆరోగ్యపరమైన సవాళ్ళ సంవత్సరం గా ఉండగా, 2021 వ సంవత్సరం ఆరోగ్య సంబంధిత పరిష్కార మార్గాల సంవత్సరం గా నిలవబోతోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం మరింత చైతన్యం తో ఆరోగ్య పరిష్కారాల దిశ లో పయనించగలదన్నారు. 2020 వ సంవత్సరం తాలూకు సవాళ్ళ కు ఎదురొడ్డి నిలవడం లో భారతదేశం తన పాత్ర ను పోషించినట్లుగానే ఆరోగ్య పరిష్కారాల విషయంలో కూడ ఒక ప్రధాన పాత్ర ను పోషిస్తుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 2021 వ సంవత్సరం లో ఆరోగ్య సంబంధ పరిష్కారాల విషయం లో భారతదేశం తోడ్పాటు ఆ పరిష్కారాల స్థాయి ని పెంచడం లో కూడా కీలకం కానుందని ఆయన చెప్పారు. భారతదేశ వైద్య రంగ వృత్తి నిపుణుల సత్తా తో పాటు సేవా భావాన్ని గమనిస్తే, దానికి భారతదేశం లో భారీఎత్తున చేపట్టబోయే టీకాలను వేయించే కార్యక్రమ అనుభవం తాలూకు నైపుణ్యం ప్రపంచానికి ఆకర్షణీయమైనటువంటి, అందుబాటు లో ఉండేటటువంటి పరిష్కారాలను అందించగలదని ప్రధాన మంత్రి అన్నారు. ఆరోగ్య రంగం లోని అంకుర సంస్థ లు స్వాస్థ్య సంబంధిత పరిష్కరాలను, సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం చేసి, ఆరోగ్య సంరక్షణ ను అందరికీ అందుబాటు లోకి తెస్తున్నాయన్నారు. ‘‘ఆరోగ్య పరమైన భవిష్యత్తు తో పాటు భవిష్యత్తు కాలం లోని ఆరోగ్యం రెంటిలో భారతదేశం ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ను నిర్వహించబోతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
వ్యాధులు ప్రపంచవ్యాప్తం అవుతున్న కారణం గా ప్రపంచ వ్యాప్త ఆరోగ్య పరిష్కారాల పట్ల సమన్వయం తో కూడిన ప్రపంచ ప్రతిస్పందన కు సైతం సమయం ఆసన్నం అయిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పని ని భారతదేశం ఒక ప్రపంచ శ్రేణి పాత్రధారి గా నిర్వర్తించినట్లు ఆయన చెప్పారు. అవసరానికి తగ్గట్టు సర్దుబాటు చేసుకోవడం, ఎదగడం, కార్యకలాపాలను విస్తరించడం ద్వారా భారతదేశం తన ప్రావీణ్యాన్ని నిరూపించుకొందని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచం తో పాటు అడుగులు వేసి సామూహిక ప్రయాసలకు విలువ ను జోడించిందని ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య రంగానికి భారతదేశం ఒక కీలక కేంద్రం గా ఆవిర్భవిస్తోందని, భారతదేశం యొక్క ఈ భూమిక ను 2021 వ సంవత్సరం లో మనం మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు.