ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు వారాణసీ లో 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పథకాల కు నాంది పలికారు. ఈ పథకాలు ఆరోగ్యం, పారిశుధ్యం, స్మార్ట్ సిటీ, సంధానం, విద్యుత్తు, గృహ నిర్మాణం, ఇంకా ఇతర రంగాల కు సంబంధించిన పథకాలు. ఈ కార్యక్రమాని కిలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ముందుగా దివంగత శ్రీ రమేశ్ యాదవ్ కు ప్రధాన మంత్రి నివాళులు అర్పించారు. పుల్‌వామా లో జరిగిన ఉగ్రవాదుల దాడి లో దేశం కోసం శ్రీ రమేశ్ యాదవ్ ప్రాణ త్యాగం చేశారు.
వారాణసీ శివార్ల లోని ఔఢే గ్రామం లో ఒక జన సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, తన ప్రభుత్వం అభివృద్ధి కి ఊతం ఇవ్వడం కోసం రెండు అంశాల లో కృషి చేస్తోందన్నారు. వాటి లో హైవేస్, రైల్వేస్ తదితర మౌలిక సదుపాయాల కల్పన కు సంబంధించింది ఒకటో అంశమని, అభివృద్ధి ఫలాల ను ప్రజల చెంతకు చేర్చడం రెండో అంశం అని ఆయన వివరించారు. ఈ మేరకు బడ్జెటు లో అనేక ప్రకటన లు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ రోజు న ఆరంభించిన పథకాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం లో వారాణసీ ని ఒక ముఖ్య కేంద్రం గా తీర్చిదిద్దడం కోసమే ఈ ప్రయత్నం అని వెల్లడించారు. వారాణసీ లోని డిఎల్‌డబ్ల్యు లో లోకోమోటివ్ ట్రైన్ కు పచ్చ జెండా ను చూపిన విషయాన్ని ఆయన ప్రస్తావించి, ‘మేక్ ఇన్ ఇండియా’ లో భాగం గా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం భారతీయ రైల్వేల సామర్ధ్యాన్ని మరియు వేగాన్ని బలోపేతం చేయడం లో సహాయకారి కాగలదన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల కు పైగా కాలం లో రైల్వేల పరివర్తన కై వివిధ చర్యల ను చేపట్టినట్లు, మరి వాటి లో వారాణసీ – ఢిల్లీ మార్గం లో రాక పోక లను జరపనున్న భారతదేశం లోని తొలి సెమీ హై-స్పీడ్ ట్రైన్ ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ పథకాలు రవాణా ను సులభతరం చేయడం మాత్రమే కాకుండా వారాణసీ, పూర్వాంచల్, ఇంకా సమీప ప్రాంతాలలో కొత్త సంస్థల స్థాపన కు కూడా దారి తీస్తాయన్నారు.
వివిధ పథకాల లబ్దిదారుల కు ధ్రువపత్రాల ను ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. ఐఐటి బిహెచ్‌యు కు 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక స్మారక తపాలా బిళ్ళ ను కూడా ఆయన విడుదల చేశారు.
బిహెచ్‌యు కేన్సర్ కేంద్రం మరియు భాభా కేన్సర్ ఆసుపత్రి, లెహర్‌తారా లు బిహార్, ఝార్ ఖండ్, ఛత్తీస్ గఢ్, ఇంకా సమీప రాష్ట్రాల రోగుల కు ఆధునిక చికిత్స ను అందిస్తాయని ప్రధాన మంత్రి తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, సుమారు 38,000 మంది ప్రజలు ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో ఈ పథకం నుండి లబ్ది ని పొందారన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో దాదాపు ఒక కోటీ ఇరవై లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందనున్నాయని ఆయన చెప్పారు.
‘పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ లో ఇంచుమించు 2.25 కోట్ల మంది పేద రైతుల కు లబ్ది ని చేకూరుస్తుందని ఆయన అన్నారు.
గోవుల యొక్క, గో సంతతి యొక్క సంరక్షణ, పరిరక్షణ, ఇంకా అభివృద్ధి ల కోసం ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ ను తీసుకు వచ్చినట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
వారాణసీ లో శంకుస్థాపన లు జరిగినటువంటి పథకాలు సకాలం లో పూర్తి అయ్యాయని ఆయన గుర్తు చేశారు.
అనంతరం దివ్యాంగ జనుల కు సహాయక ఉపకరణాల ను ఆయన ప్రదానం చేశారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.