ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు జమ్ము & కశ్మీర్ లో తన రెండో దశ పర్యటన లో జమ్ము ను సందర్శించారు. రాష్ట్రం లో మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చే అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించారు. ప్రధాన మంత్రి నేటి రోజంతా లేహ్, జమ్ము మరియు శ్రీనగర్ లలో పర్యటించారు.
జమ్ము సందర్శన లో భాగం గా ఆయన విజయ్‌పుర్ లోని సాంబా లో ఎఐఐఎమ్ఎస్ కు పునాదిరాయి ని వేశారు. ఎఐఐఎమ్ఎస్ ను ఏర్పాటు చేయడం ప్రజల కు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ను అందించడం తో పాటు ఈ ప్రాంతం లో ఆరోగ్య సంరక్షణ సంబంధిత వృత్తి నిపుణుల కొరత ను కూడా తీర్చగలదని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లోని వైద్య కళాశాలల్లో మరో 500 సీట్లు త్వర లో జోడించబడతాయని ప్రధాన మంత్రి ప్రకటించారు.
కఠువా లో నేడు యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తూ, జమ్ము యువత 10 శాతం ఇడబ్ల్యుఎస్ కోటా తాలూకు లబ్ధి ని పొందగలదంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జమ్ము లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేశన్ యొక్క ఉత్తర ప్రాంతీయ కేంద్రం ప్రాంగణ నిర్మాణాని కి ఆయన శంకుస్థాపన చేశారు. కేంపస్ టిఎంఎటి జమ్ము 2012-13 విద్యా సంవత్సరం లో ఏర్పాటైంది. అప్పటి నుండి ఒక తాత్కాలిక భవనం లో ఇది కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది.
ప్రధాన మంత్రి జమ్ము లోని కిశ్త్ వాడ్ లో 624 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన కిరూ జలవిద్యుత్తు పథకం, ఇంకా 850 మెగావాట్ సామర్ధ్యం కలిగిన రాటల్ జల విద్యుత్తు పథకానికి శంకు స్థాపన చేశారు. ఈ ప్రాంతం లో కొత్త గా వచ్చే విద్యుత్తు పథకాలు యువత కు ఉద్యోగాల ను కల్పిస్తాయని ఆయన అన్నారు. సౌభాగ్య (SAUBHAGYA) పథకం లో భాగంగా జమ్ము & కశ్మీర్ లోని కుటుంబాలకు 100 శాతం విద్యుదీకరణ అందుబాటులోకి వచ్చినట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కశ్మీర్ లోయ లో కశ్మీరీ ప్రవాసీ ఉద్యోగుల కు యాత్రా వసతి నిర్మాణానికి గాను శంకుస్థాపన చేశారు. నిర్వాసితులైన కశ్మీరీ లను 3 వేల ఉద్యోగాల లో నియమించే
పనులు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. ‘‘ఏ పరిస్థితుల లో పండిత్ లు వారి ఇళ్ళ ను వదలి వెళ్లిందీ భారతదేశం మరచిపోదని’’ ఆయన చెప్పారు. ఇరుగు పొరుగు దేశాల లో వేధింపుల కు లోనవుతున్న వారి దేశీయుల వెన్నంటి నిలవాల్సివుందని ఆయన అన్నారు.
జాతీయ నదీ సంరక్షణ ప్రణాళిక (ఎన్ఆర్‌సిపి) లో భాగంగా దేవిక & తవీ నదుల లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినటువంటి ఒక ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పథకం 2021వ సంవత్సరం మార్చి నెలకల్లా పూర్తి కావాలనేది లక్ష్యం గా ఉంది.
మన జవానుల భద్రత కోసం సరిహద్దు వెంబడి 14 వేల బంకర్ లను నిర్మించడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. ఇదివరకటి ప్రభుత్వం 500 కోట్ల రూపాయల గ్రాంటు తో ఒఆర్ఒపి విషయం లో వంచన చేసే ప్రయత్నం చేయగా, మేం దీనికి 35,000 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన అన్నారు. మునుపటి పాలకులు సచేతనం గా ఉండి ఉన్న పక్షం లో కర్తార్‌పుర్ సాహిబ్ భారతదేశం లో ఒక భాగం అయ్యేదని ఆయన చెప్పారు.
ప్రధాన మంత్రి సజ్ వాల్ లో చీనాబ్ నది మీద 1640 మీటర్ల వెడల్పు కలిగిన రెండు దోవల వంతెన నిర్మాణాని కి శంకు స్థాపన చేయడం నేటి జమ్ము యాత్ర లో మరొక ఆకర్షణ గా ఉంది. ఇది సజ్ వాల్ మరియు ఇంద్రి పట్టియన్ ల ప్రజల కు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటు లోకి తీసుకు రాగలుగుతుంది. దీని ద్వారా ఈ రెండు స్థలాల మధ్య ప్రయాణ దూరం 47 కిలో మీటర్ల నుండి 5 కిలో మీటర్ల కు తగ్గిపోతుంది. ఈ కార్యక్రమం సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ జమ్ము & కశ్మీర్ లో సంధానాన్ని మెరుగు పరచడం కోసం 40 వేల కోట్ల రూపాయల ను మంజూరు చేయడం జరిగిందన్నారు.