ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తమిళనాడులోని తిరుప్పూరును సందర్శించి రాష్ట్రంలోపలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు.
ప్రధానమంత్రి తిరుప్పూరు లోని పెరుమన్నలూరు గ్రామంనుంచి పలు అభివృద్ధి పథకాలను ఆవిష్కరించారు.
తిరుప్పూరులో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి )మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగిన వంద పడకల ఈ ఆస్పత్రి తిరుప్పూరు, దాని పరిసర ప్రాంతాలలోని ఇఎస్ఐ చట్టం పరిధి కిందికి వచ్చే సుమారు లక్షమంది కార్మికులు వారి కుటుంబాల వారికి వైద్య అవసరాలను తీరుస్తుంది.ఇంతకు ముందు వీరు నగరంలోని రెండు ఇఎస్ఐ డిస్పెన్సరీలనుంచి సేవలు పొందేవారు. ఏదైనా మెరుగైన వైద్య సేవలు అవసరమైన సందర్భంలో వారు 50 కిలోమీటర్ల దూరంలోని కోయంబత్తూరు ఇఎస్ఐసి మెడికల్‌కాలేజీకి వెళ్లవలసి వచ్చేది.
ప్రధానమంత్రి చెన్నైలోని ఇఎస్ఐసి ఆస్పత్రిని కూడా జాతికి అంకితం చేశారు.470 పడకల ఈ అధునాతన ఆస్పత్రి అన్ని విభాగాలకు చెందిన నాణ్యమైన వైద్యసేవలను ,చికిత్సను అందిస్తుంది.
తిరుచ్చి విమానాశ్రయంలో నూతన సమీకృత భవనానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.అలాగే చెన్నై విమానాశ్రయ ఆధునీకరణకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. తిరుచ్చిలో నూతన సమీకృత టెర్మినల్ భవనం వల్ల విమానాశ్రయం ఏటా 3.63 మిలియన్న ప్రయాణికుల రాకపోకలకు పూర్తి సామర్ధ్యంతో సేవలు అందించ గలుగుతుంది. రద్దీ గంటలలో 2900 మంది ప్రయాణికులకు వీలుకలిగిస్తుంది. ఈ విమానాశ్రయ మరింత విస్తరణకూ అవకాశం ఉంది. చెన్నైవిమానాశ్రయం ఆధునీకరణలో భాగంగా ఈ గేట్లు, బయోమెట్రిక్ ఆధారిత పాసింజర్ తనిఖీ వ్యవస్థ, ఇతర ఆధునిక సదుపాయాలు కల్పిస్తారు. అలాగే ప్రస్తుత అంతర్జాతీయ డిపార్చర్ టెర్మినల్‌లో రద్దీగా ఇరుకుగా ఉండకుండా చూస్తారు.
ఈ పర్యటనలో ప్రధానమంత్రి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) వారి ఎన్నోర్ కోస్టల్ టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు.తొండియార్‌పేట్ ఫెసిలిటీ కంటే ఇది పెద్దది, అనువైన ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే, కోచి నుంచి తీరం వెంట ఉత్పత్తులు తీసుకురావచ్చు. దీనితోరోడ్డు ద్వారా తీసుకురావడం వల్లే అయ్యే ఖర్చు తగ్గుతుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చెన్నై పోర్టునుంచి చెన్నై పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (సిపిసిఎల్) మనాలి రిఫైనరీ వరకు కొత్త ముడిచమురు పైప్‌లైన్‌ను కూడా ప్రారంభించారు. ఈ పైప్‌లైన్‌పే మరింత మెరుగైన భద్రతా ప్రమాణాలతో నిర్మించారు.ఇది ముడి చమురును సురక్షితంగా నమ్మకంగా సరఫరాచేస్తుంది. తమిళనాడు, పొరుగు రాష్ట్రాల అవసరాలను తీరుస్తుంది.
చెన్నై మెట్రోలో ఎజి-డిఎంఎస్ మెట్రో స్టేషన్ నుంచి వాషర్‌మెన్ మెట్రో స్టేషన్ వరకు పాసింజర్ సర్వీస్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు. 10 కిలోమీటర్లపొడవుగల ఈ సెక్షన్ చెన్నై మెట్రో తొలి దశలో భాగం. దీనితో చెన్నై మెట్రో తొలి దశలోని మొత్తం 45 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చినట్టయింది.
అనంతరం ప్రధానమంత్రి ఈరోజు తన పర్యటనలో చివరిగా హుబ్లీకి బయలుదేరి వెళ్లారు.