ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అస్సాంలో రెండు ఆస్పత్రులకు పునాదిరాళ్ళు వేసి, అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకిజులి ప్రాంతం వద్ద రాష్ట్రరహదారులు, ప్రధాన జిల్లా రహదారుల కోసం అసోమ్ మాలా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ శరబానంద సోనోవాల్, కేంద్ర మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, అస్సాం ప్రభుత్వ మంత్రులు, బోడోలాండ్ టెరిటోరియల్ రీజన్ చీఫ్ శ్రీ ప్రమోద్‌బోరో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ అస్సాం ప్రజలు తన పట్ల చూపిస్తున్న ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. అస్సాం రాష్ట్రానికి తమ సేవలు అందించి, రాష్ట్రం వేగవంతమైన పురోగతి సాధించడంలో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ శరబానంద సోనోవాల్, మంత్రి శ్రీ హేమంత బిస్వాస్, బోడోలాండ్ టెరిటోరియల్ రీజన్ చీఫ్ శ్రీ ప్రమోద్ బోరోల పాత్ర ఎంతో ఉందని ఆయన ప్రశంసించారు. ఈ ప్రాంతంలో 1942లో ఆక్రమణదారుల చొరబాటును సమర్థవంతంగా ప్రతిఘటించి దేశంకోసం పోరాటం చేసిన అమరవీరుల త్యాగాల అద్భుత చరిత్రను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
హింస, ఉద్రిక్తత, వివక్ష, పోరాటాల వారసత్వాన్ని విడిచిపెట్టి, నేడు ఈశాన్యరాష్ట్రాలన్నీ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని, ఇందులో అస్సాం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని అన్నారు. చారిత్రక బోడో ఒప్పందం తర్వాత, ఇటీవల జరిగిన బోడోలాండ్ ప్రాదేశిక మండలి ఎన్నికలు ఈ ప్రాంతంపై అభివృద్ధి, నమ్మకానికి కొత్త అధ్యాయాన్ని లిఖించాయని శ్రీ మోదీ చెప్పారు. బిస్వానాథ్, చరైడియోలోని రెండు కొత్త వైద్య కళాశాలలతో పాటు, అసోమ్ మాలా ద్వారా ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాల పునాదిని అస్సాం రాష్ట్రం బహుమతిగా పొందుతోందని అన్నారు. ఇది అస్సాం రాష్ట్ర అదృష్టం, భవిషత్తుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునేందుకు ఈరోజు సాక్షిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు.
గతంలో అస్సాం రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల స్థితి పేలవంగా ఉన్న విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 2016 వరకు అస్సాంలో కేవలం 6 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని. మరో 6 కొత్త మెడికల్ కాలేజీల పనులు గత 5 సంవత్సరాల్లో మాత్రమే పారంభమయ్యాయని ఆయన అన్నారు. బిస్వానాథ్, చరైడియో కళాశాలలు ఉత్తర, ఎగువ అస్సాం ప్రజల అవసరాలు తీర్చనున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఇంతవరకు కేవలం 725 వైద్య సీట్లు ఉంటే, ఈ కొత్త వైద్యకళాశాలలు పనిచేయగానే ప్రతి సంవత్సరం 1600 మంది కొత్త వైద్యులు బయటకు వస్తారు. ఇది రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. గౌహతి ఎయిమ్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి బ్యాచ్ ప్రారంభమైందని ప్రధాని తెలియజేశారు. వచ్చే ఒకటిన్నర - రెండు సంవత్సరాల్లో ఎయిమ్స్ పనులు ముగియనున్నాయి. అస్సాం సమస్య పట్ల చారిత్రకంగా గతంలో ప్రదర్శించిన ఉదాసీనతను ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం అస్సాం ప్రజల కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తోందని ప్రధాని నొక్కిచెప్పారు.
అస్సాం ప్రజల వైద్య అవసరాలను తీర్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని వివరించారు. అస్సాంలో 350కి పైగా ఆస్పత్రులను ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేర్చడం వల్ల రాష్ట్రంలో సుమారు 1.25 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది పేద ప్రజలు ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో ఉచిత చికిత్స పొందారు. రాష్ట్రంలో స్థాపించిన ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలలో సుమారు 55 లక్షల మంది ప్రాథమిక ఆరోగ్య చికిత్స పొందారు. జనఔషాధి కేంద్రాలు, అటాట్ అమృత యోజన, ప్రధానమంత్రి డయాలసిస్ కార్యక్రమాలు సామాన్యుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువస్తున్నాయని ప్రధాని అన్నారు.
అస్సాం వృద్ధిలో టీ తోటల ప్రాధాన్యతను శ్రీ మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ధన్ పురుషస్కర్ మేళా పథకం కింద తేయాకు తోటల్లో పనిచేసే 7.5 లక్షల కార్మికుల ఖాతాలలో కోటి రూపాయలు బదిలీ చేసినట్టు ఆయన తెలిపారు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక పథకం ద్వారా సహాయంపొందుతారు. కార్మికులను జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేక వైద్య విభాగాలను తోటలకు పంపుతారు. ఉచిత మందులు కూడా అందిస్తున్నారు. టీ కార్మికుల సంక్షేమం కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో 1000 కోట్ల రూపాయల పథకాన్ని ప్రకటించారు.
భారతీయ తేయాకు ప్రతిష్టను అపకీర్తి పాలుచేసే కుట్ర గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. భారతీయ టీ గుర్తింపుపై దాడి చేయడానికి కొన్ని విదేశీ సంబంధిత దళాలు యోచిస్తున్నట్లు తెలిపే పత్రాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. అస్సాం నేల మీద ఇలాంటి కుట్రలు కొనసాగనివ్వమని, భగ్నం చేస్తామని ఈ దాడి చేసిన వారి నుండి, వారికి మద్దతు పలికే వారినుండి ప్రజలు సమాధానాలు కోరుతున్నారని ప్రధాని ప్రకటించారు. భారతీయ తేయాకు కార్మికుల కృషి, సామర్థ్యాన్నీ ఎదుర్కొనే శక్తిలేక ఇలా దాడులు చేస్తున్నారని, మా తేయాకు కార్మికులు ఈ పోరాటంలో విజయం సాధిస్తారని ప్రధాని అన్నారు.
అస్సాం రాష్ట్ర సామర్థ్యాలను పెంచడంలో ఆధునిక రోడ్లు ఇంకా మౌలిక సదుపాయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రధాని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ మాలా ప్రాజెక్ట్ కి అనుగుణంగా అసోమ్ మాలా ప్రారంభించడం జరిగింది. గత కొన్నేళ్ళుగా రాష్ట్రంలో వేలాది కిలోమిటర్ల పొడవైన రోడ్లు, అనేక వంతెనలు నిర్మించామని మోడీ అన్నారు. అన్ని గ్రామాలు, ఆధునిక నగరాలకు విశాలమైన రోడ్లు ఇంకా వాటికి కనెక్టివిటీల నెట్‌వర్క్ ఉండాలన్న రాష్ట్ర ప్రజల కలలను అసోమ్ మాలా ప్రాజెక్ట్ నెరవేరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వేగవంతమైన వృద్ధి, పురోగతి సాధించడం కోసం ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు అపూర్వమైన ప్రాధాన్యత ఇవ్వడంతో రాబోయే రోజుల్లో మరింత ఊపందుకునేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని ప్రధాని స్పష్టం చేశారు..