ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌరాష్ట్ర పటేల్ కల్చరల్ సమాజ్ యొక్క 8వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. ఈ సంవత్సరం సౌరాష్ట్ర పటేల్ కల్చరల్ సమాజ్ యొక్క అంతర్జాతీయ సమ్మేళనం అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా లో జరుగుతోంది.
ప్రవాస భారతీయుల, మరీ ముఖ్యంగా సౌరాష్ట్ర పటేల్ సముదాయం యొక్క కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఎన్ఆర్ఐ లు భారతదేశానికి ఎల్లప్పటికీ గర్వకారణంగా నిలచారని పేర్కొన్నారు. భారతీయ పాస్‌పోర్ట్ కు సర్వత్రా ఆదరణ లభించే విధంగా వారి యొక్క ప్రయత్నాలు ఉన్నాయని ఆయన అన్నారు.
‘స్వచ్ఛ్ భారత్’ వంటి ప్రభుత్వ వివిధ పథకాలు దేశంలో పర్యటక రంగానికి దన్ను గా నిలచాయని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి సంవత్సరం కనీసం అయిదు విదేశీ కుటుంబాలు ‘భారత్ దర్శన్’ కై భారతదేశం లో పర్యటించే విధంగా వారిలో ప్రేరణ ను కలిగించాలని కూడా ఎన్ఆర్ఐ సముదాయానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ అభియాన్’ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం లో, అంతిమంగా భారతదేశ పర్యటక అభివృద్ధి కి ఒక గొప్ప ఉత్తేజాన్ని అందించడంలో ఓ కొత్త దారి ఏర్పడగలదన్నారు. మహాత్మ గాంధీ గారు కలలుగన్న ‘స్వచ్ఛ్ భారత్’ యొక్క సాఫల్యానికి ఎన్ఆర్ఐ లు ఏ విధంగా తోడ్పాటును అందించవచ్చో కూడా ఆయన చెప్పుకొచ్చారు.
అక్టోబరు 2వ తేదీ మొదలుకొని మహాత్మ గాంధీ 150వ జయంతి ని భారతదేశం జరుపుకోనుందని ప్రధాన మంత్రి వెల్లడించారు. భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి పేరు తో నర్మద నది మీద ఒక బ్రహ్మాండమైన ఏకతా విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు, మరి అది 2018 అక్టోబరు 31 వ తేదీ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసుకోనున్నట్లు ఆయన వివరించారు. ఒకసారి ఈ ఏకతా విగ్రహం యొక్క నిర్మాణం పూర్తి అయ్యిందంటే గనుక అది ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన విగ్రహం అవుతుంది.
జన సమూహాన్ని ఉద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశాన్ని ప్రస్తుతం ప్రపంచంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం గా పరిగణిస్తున్నారన్నారు. ఇవాళ భారతదేశం పేరు సత్వర ఆర్థిక వృద్ధితోను, నిజాయతీ తో కూడిన మరియు పారదర్శకమైన పాలన తోను ముడిపడిందని ఆయన అన్నారు. జిఎస్‌టి, ఇంకా అవినీతి పై కఠిన చర్యల వంటి కార్యక్రమాలు ప్రజలు నిజాయతీ తో వ్యాపారం చేయడానికి సహకరించాయి. ఈ కార్యక్రమాలు గడచిన నాలుగు సంవత్సరాలలో వ్యాపార నిర్వహణ ను సరళతరం చేయడానికి సంబంధించినటువంటి స్థానాల జాబితా లో భారతదేశం 42 అంచెలు ఎగబాకేందుకు దోహదం చేశాయని కూడా ఆయన తెలిపారు.
ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్కరించే స్వప్నాన్ని సాకారం చేసుకొనే దిశగా కూడా కృషి చేయవలసిందిగా ఎన్ఆర్ఐ సముదాయానికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.