పోర్చుగల్ లో చరిత్రాత్మక పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లిస్ బన్ లో భారతీయ సముదాయంతో భేటీ అయ్యి, వారితో ముచ్చటించారు. తన ప్రసంగంలో శ్రీ మోదీ భారతదేశం- పోర్చుగల్ భాగస్వామ్యం తాలూకు అనేక అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పోర్చుగల్ పూర్వ ప్రధాని శ్రీ అంటోనియో గుటెరస్ తో తన సమావేశాన్ని గురించి శ్రీ మోదీ వివరించారు. యోగా గురించి, సమగ్రమైనటువంటి ఆరోగ్య రక్షణను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, యోగా యొక్క సందేశాన్ని మరింత మంది వద్దకు చేరవేయడంలో పోర్చుగల్ పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు. ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్తల పాత్రను కొనియాడుతూ, ‘‘అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు గొప్ప పనిని సాధించారు. 30 నానో శాటిలైట్ లను ఇటీవల ప్రయోగించారు’’ అని శ్రీ మోదీ చెప్పారు.
అంతక్రితం, పోర్చుగల్ లో దావాగ్ని కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ఆయన వ్యాకులతను వ్యక్తం చేశారు.
పోర్చుగీస్ ప్రధాని శ్రీ అంటోనియో కోస్టా కు ఓవర్ సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును కూడా ప్రధాన మంత్రి అందజేశారు.