గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గారు,
నా సహోద్యోగి కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ గారు,
స్వీడన్ మంత్రి శ్రేష్ఠురాలు అన్నా ఎక్ స్ట్రామ్ గారు,
ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ గారు,
ప్రముఖ నోబెల్ అలంకృతులు,
నోబెల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ గోరన్ హన్సన్,
ప్రియమైన శాస్త్రవేత్తలారా,
సోదర, సోదరీమణులారా,
మీకందరికీ ఇదే శుభ సాయంత్రం.
5 వారాల పాటు ఈ ప్రదర్శనను సైన్స్ సిటీ లో ఏర్పాటు చేసిన భారతదేశ ప్రభుత్వ బయో టెక్నాలజీ శాఖకు, గుజరాత్ ప్రభుత్వానికీ, నోబెల్ ప్రసార మాధ్యమాలకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ ప్రదర్శనను ప్రారంభిస్తున్నట్లు నేను ప్రకటిస్తున్నాను. మీరు దీనిని ఆస్వాదించడానికి ఇదొక అవకాశంగా నేను భావిస్తున్నాను.
ప్రాథమిక శాస్త్ర విజ్ఞానంపై సృజనాత్మక ఆలోచనలకు, పనికి – నోబెల్ పురస్కారం – ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి గుర్తింపు.
గతంలో ఒకరు లేదా ఇద్దరు నోబెల్ పురస్కార గ్రహీతలు భారతదేశాన్ని సందర్శించే వారు. విద్యార్థులు, శాస్త్రవేత్తలతో సంక్షిప్తంగా సంప్రదింపులు జరిపే వారు.
అయితే, ఇవాళ మనం గుజరాత్ లో అనేక మంది నోబెల్ పురస్కార గ్రహీతలను కలిగిన చరిత్రను సృష్టిస్తున్నాము.
ఇక్కడ హాజరైన నోబెల్ పురస్కార గ్రహీతలందరికీ నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మీరు భారతదేశానికి ఎంతో విలువైన స్నేహితులు. మీలో కొంతమంది గతంలో అనేక సార్లు ఇక్కడకు వచ్చారు. మీలో ఒకరు ఇక్కడే పుట్టి, వడోదరా లో పెరిగారు.
మన యువ విద్యార్థులను అనేక మందిని ఈ రోజు ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ వచ్చే వారాలలో సైన్స్ సిటీ ని సందర్శించే విధంగా మీరు కోరవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మీతో సంప్రదింపులు జరిపే ఈ అపూర్వమైన అనుభవాన్ని మన విద్యార్థులు వారి మనసులో పదిలంగా ఉంచుకుంటారు. సుస్థిరమైన భవిష్యుత్తును పంచుకోవడానికి, కీలకమైన కొత్త సవాళ్ళను చేపట్టడానికి ఇది వారికి స్ఫూర్తి నిస్తుంది.
ఈ ప్రదర్శన, ఈ పరంపర, మీకు, మా విద్యార్థులకు, సైన్స్ ఉపాధ్యాయులకు, మా శాస్త్రవేత్తలకు మధ్య ఒక పటిష్టమైన బంధంగా రూపుదిద్దుకొంటుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.
వచ్చే 15 సంవత్సరాలలో భారతదేశం ఎలా ఉండాలి ? అనే విషయమై స్పష్టమైన అవగాహన ఉంది. ఈ అవగాహన ఒక వ్యూహంగా, ఒక ప్రణాళికగా, ఒక కార్యాచరణగా రూపాంతరం చెందడానికి శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానమే కేంద్రంగా ఉంది.
శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంలో మా దృష్టి అంతా మా యువతకు అవకాశాలు తప్పక అందుబాటులో ఉండాలన్నదే. శిక్షణ, భవిష్యత్ సంసిద్ధత మా యువతకు ఉత్తమమైన ప్రదేశాలలో ఉపాధి కల్పించాలి. ఆ విధంగా భారతదేశం ఒక గొప్ప శాస్త్ర విజ్ఞాన గమ్యం గా రూపొందాలి. లోతైన సముద్ర గర్భ అన్వేషణ, సైబర్ విధానాల వంటి ఉత్తేజపూరిత సవాళ్ళను మనం చేపట్టాలి.
ఒక కార్యాచరణ ద్వారా ఈ కల్పన ను ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు ఒక ప్రణాళిక ఉంది.
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో సైన్స్ బోధన కోసం కార్యక్రమాలను రూపొందించవలసిందిగా మేము మా శాస్తవేత్తలను కోరాము.
అదే విధంగా తదుపరి స్థాయి లో – నైపుణ్యంలోనూ, ఉన్నత శిక్షణ లోనూ – కొత్త కార్యక్రమాలు రూపొందించవలసిందిగా కూడా కోరాము. కొత్త విజ్ఞాన ఆర్ధిక విధానంలో ఈ కార్యక్రమాలు మీకు ఉపాధి కల్పిస్తాయి. సమర్ధవంతమైన పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా తయారుచేస్తాయి. మన దేశంలోనూ, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నత పదవులు, ఉద్యోగాల కోసం పోటీ పడగలుగుతారు.
ఆ తరువాత, మన శాస్త్రవేత్తలు మన నగరాలలోని పరిశోధనశాలలతో అనుసంధానమవుతారు. సదస్సులు, వనరులు, పరికరాల ద్వారా మీరు ఆలోచనలను పంచుకోవచ్చు. ఈ విధంగా మనం శాస్త్ర పరిజ్ఞానాన్ని మరింతగా కలిసి పంచుకోడానికి అవకాశం ఏర్పడుతుంది.
స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలో భారీగా శాస్త్ర సంబంధమైన పరిశ్రమలను స్థాపించడం ద్వారా మన శాస్త్ర పరిజ్ఞాన సంస్థలు వాణిజ్యపరంగా విస్తరిస్తాయి. అప్పుడు మీరు ప్రారంభించే స్టార్ట్- అప్ సంస్థలు, పరిశ్రమలు అంతర్జాతీయంగా పోటీపడే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది మీరు ఈ విత్తనాలు నాటితే అనంతరం మీరు స్థిరమైన ఫలాలు పొందుతారు.
నా యువ మిత్రులారా, మీరే ఈ దేశానికి, ప్రపంచానికి భవిష్యత్తు. భారీ జనాభాతో కూడిన మానవ వనరులు, ఉత్తమమైన అధ్యాపకులతో కూడిన ఒక అపూర్వమైన అవకాశాన్ని భారతదేశం మీకు అందిస్తోంది.
యువ విద్యార్థులారా, విజ్ఞానంతో, నైపుణ్యంతో కూడిన బావులను నింపే ఏరులు మీరే. ఇదంతా మీ శిక్షణ, మీ భవిష్యత్తు మీదే ఆధారపడి ఉంది.
మానవ జాతి వికసించడానికి సహాయపడుతున్న శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక విజ్ఞాన రంగానికి కృతజ్ఞతలు. పెద్ద సంఖ్యలో ప్రజలు మానవ చరిత్రలో అసమానమైన నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
అయినప్పటికీ, ఇంకా ఎంతో మందిని పేదరికం నుండి బయటకు తీసుకురావలసిన అత్యంత పెద్ద సవాలు భారతదేశం ముందు ఉంది. మీరు త్వరలో శాస్త్రవేత్తలై ఈ సవాలును అసలు అశ్రద్ధ చేయవద్దు.
శాస్త్ర విజ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని తెలివిగా వినియోగించుకోవడం ద్వారా మన భూగోళాన్ని ఎంత బాధ్యతగా మెరుగుపరచుకుంటామో అనే దానిపై మన శాస్త్ర విజ్ఞానం, పరిణతి నిర్ణయించబడుతుంది.
మీరు త్వరలో శాస్త్రవేత్తలై, భూగ్రహ సంరక్షకులు అవుతారు.
ఈ నోబెల్ ప్రదర్శన నుండి, సైన్స్ సిటీ నుండి మనం స్పష్టమైన ఫలితాన్ని పొందాలి.
అంతర్జాతీయంగా సాంఘిక, ఆర్థికాభివృద్ధికి – శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఒక ముఖ్యమైన మార్గదర్శిగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్ధిక వ్యవస్థలో శాస్త్ర ఆవిష్కరణల నుండి ఆశలు ఎక్కువ అవుతున్నాయి.
నోబెల్ బహుమతుల పరంపర నుండి నేను మూడు ఫలితాలను ఆశిస్తున్నాను.
ముందుగా, విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో కలిసి పనిచేయాలి. ఇక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ స్థాయి ఆలోచనల పరుగు పందెం నుండి వచ్చారు. వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. వారిని పరిశీలించడం మానుకోవద్దు.
ఈ ప్రదర్శన జరుగుతున్న సమయంలో గుజరాత్ లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పాఠశాల ఉపాధ్యాయులతో మీరు సదస్సులు నిర్వహించే అవకాశం ఉంది.
రెండవది, స్థానికంగా పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సహించాలి. మన యువతలో పరిశ్రమలు స్థాపించాలని ఉత్సాహం చాలా ఉంది.
గుజరాత్ లో మన శాస్త్ర మంత్రిత్వ శాఖలో ఇంక్యుబేటర్ లు ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే స్టార్ట్- అప్ సంస్థలను ఏ విధంగా పెంపొందించాలనే అంశంపై వచ్చే ఐదు వారాలలో మీకు సదస్సులు నిర్వహిస్తారు.
నోబెల్ బహుమతి పొందిన దాదాపు పది ఆవిష్కరణలు స్మార్ట్ ఫోన్ లను తయారుచేయడంలో ఉపయోగపడ్డాయని నాకు చెప్పారు. బహుమతి పొందిన భౌతిక శాస్త్రం ద్వారా విద్యుత్తు బిల్లులను ఆదా చేయవచ్చు. భూగోళాన్ని సంరక్షించవచ్చు. 2014 లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ” బ్లూ లెడ్ ” కు వచ్చింది. జపాన్ కు చెందిన అకాసాకి, అమనో, నకాముర అనే ముగ్గురు శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశోధన నుండి ఇది ఆవిష్కరించబడింది. గతంలో మనకు తెలిసిన ” రెడ్, గ్రీన్ లెడ్” మిశ్రమంగా వైట్ లైట్ పరికరాలను తయారుచేసినట్లయితే ఇవి వందల వేల గంటలు పనిచేస్తాయి.
ఇలా మనకు అందుబాటులో ఉన్న ఎన్నో ఆవిష్కరణలను పరిశ్రమల ద్వారా ఉపయోగించుకోవచ్చు.
మూడవది, సమాజంపై ప్రభావం.
చాలా నోబెల్ బహుమతి ఆవిష్కరణలు ఆరోగ్యం, వ్యవసాయం ద్వారా మన సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఉదాహరణకు జన్యు సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఖచ్చితమైన మందుల వాడకం ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది.
కేన్సర్, మధుమేహం, అంటు వ్యాధుల గురించి అధ్యయనం చేయడానికి ఈ విధానాన్ని తప్పక ఉపయోగించాలి.
గుజరాత్ లో ఒక పెద్ద కేంద్రాన్ని స్థాపించడం ద్వారా భారతదేశం ఇప్పటికే జెనరిక్స్ మరియు బయో- సిమిలర్ విషయాలలో అగ్రస్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు మనం కొత్త బయో- టెక్ ఆవిష్కరణలలో కూడా ముందంజలో ఉండాలి.
సమాజాన్ని శాస్త్ర విజ్ఞానంతో అనుసంధానం చేస్తున్న సైన్స్ సిటీ లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
మనం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనే దిశగా పౌరులను నిమగ్నం చేయడానికి ఇది ఒక ఆదర్శవంతమైన వేదిక.
నా యువ మిత్రులారా,
ఈ బహుమతి గ్రహీతలు శాస్త్ర పరిజ్ఞానంలో శిఖరం వంటి వారు. వారి నుండి మీరు తప్పక నేర్చుకోవాలి. అయితే, ఈ శిఖరం పర్వత శ్రేణుల నుండి మాత్రమే ఉద్భవిస్తుంది కానీ అది ఒంటరిగా నిలవదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరే భారతదేశానికి పునాదులు. మీరే భారతదేశపు భవిష్యత్తు. శిఖరాలు ఉద్భవించే కొత్త శ్రేణులను మీరు నిర్మించాలి. ఉపాధ్యాయుల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ఈ విషయమై పునాది పడితే, ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. భారతదేశంలో వందల కొద్దీ శిఖరాలు ఉన్నాయి. అయితే, వారి కృషిని ప్రాథమికంగా మనం నిర్లక్ష్యం చేసిన పక్షంలో శిఖరాలు దానంతట అవే మనకు కనబడవు.
ప్రేరణను పొందండి. ధైర్యంగా ముందుకు సాగండి. అనుకరించ వద్దు. స్వంతంగా ఆలోచించండి. మన గౌరవనీయ అతిథులు ఆ విధంగానే విజయం సాధించారు. అదే మీరు వారి నుండి నేర్చుకోవాలి.
ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నోబెల్ మీడియా ఫౌండేషన్ కు, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి, గుజరాత్ ప్రభుత్వానికి.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని.. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రదర్శన ద్వారా మీరంతా తప్పక ప్రయోజనం పొందుతారన్న నమ్మకం నాకుంది.
Opportunities in science for the youth, India as a hub for research and innovation. pic.twitter.com/nT9bB6aXVj
— PMO India (@PMOIndia) January 9, 2017
The Prime Minister speaks at Science City in Ahmedabad. pic.twitter.com/qjGrhSdZqU
— PMO India (@PMOIndia) January 9, 2017
Science driven enterprise and catering to local needs and aspirations through science. pic.twitter.com/HULKnJ5eRn
— PMO India (@PMOIndia) January 9, 2017
Science for the betterment of humanity. pic.twitter.com/beOVOLPSca
— PMO India (@PMOIndia) January 9, 2017