ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) నూతన ప్రధాన కేంద్ర భవనం- ధరోహర్ భవన్- ను న్యూ ఢిల్లీ లోని తిలక్ మార్గ్ లో ఈ రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గడచిన 150 సంవత్సరాలుగా అనుకుంటాను– ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గణనీయమైన కృషిని చేసింది– అన్నారు.
మన చరిత్ర ను మరియు మన సుసంపన్నమైన పురావస్తు సంబంధ వారసత్వాన్ని చూసుకొని గర్వించడానికి ప్రాముఖ్యమివ్వాలని ప్రధాన మంత్రి సుస్పష్టం చేశారు. ప్రజలు స్థానిక చరిత్రను గురించి, మరి అలాగే వారి పట్టణాలు, నగరాలు, ఇంకా ప్రాంతాలకు సంబంధించినటువంటి పురాతత్వ అధ్యయనాలను గురించి తెలుసుకోవడం లో అగ్రగామిగా నిలవాలని ఆయన అన్నారు. స్థానిక పురావస్తు విశేషాలు పాఠశాల పాఠ్య క్రమంలో ఒక భాగం కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సుశిక్షితులైన స్థానిక పర్యటక స్థలాల మార్గదర్శులు- ఎవరికైతే వారి ప్రాంతం యొక్క చరిత్ర తోను, వారసత్వం తోను పరిచయం ఉంటుందో- వారికి లభించే ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
సుదీర్ఘ కాలం పాటు పురావస్తు నిపుణులు ఎంతో శ్రమకు ఓర్చి వెలికి తీసినటువంటి ప్రతి ఒక్క పురావస్తు సంబంధ నిక్షేపానికి కూడా తనదంటూ ఒక స్వీయ గాథ ఉంటుందని ఆయన చెప్పారు. భారతదేశం మరియు ఫ్రాన్స్ ల సంయుక్త బృందం ఒకటి వెలికితీసిన పురావస్తు సంబంధ నిక్షేపాలను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షులు మరియు తాను కొన్ని సంవత్సరాల కిందట చండీగఢ్ కు ప్రయాణించినప్పటి సంగతులను ఆయన ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకొన్నారు.
భారతదేశం తన ఘన వారసత్వాన్ని ప్రపంచానికి గర్వం తోను, విశ్వాసం తోను కళ్లకు కట్టాలని ప్రధాన మంత్రి అన్నారు.
ఎఎస్ఐ యొక్క నూతన ప్రధాన కేంద్ర భవనం లో శక్తిని సమర్ధంగా వినియోగించుకోగల దీపాలు, ఇంకా వాన నీటి సంరక్షణ ఏర్పాట్లు సహా అత్యధునాతన సదుపాయాలను అమర్చడం జరిగింది. ఈ భవనంలో దాదాపు 1.5 లక్షల పుస్తకాలు, ఇంకా పత్రికల సంచయంతో కూడిన ఒక కేంద్రీయ పురావస్తు గ్రంథాలయం కూడా ఓ భాగంగా ఉంది.