భారతదేశం కదులుతోంది (మూవ్): ప్రధాని నరేంద్ర మోదీ
మన ఆర్థిక వ్యవస్థ మూవ్ లో ఉంది. మనము ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ: ప్రధానమంత్రి
మన నగరాలు మరియు పట్టణాలు మూవ్ లో ఉన్నాయి. మనము 100 స్మార్ట్ నగరాలు నిర్మిస్తున్నాము: ప్రధాని
మన అవస్థాపన మూవ్ లో ఉంది. మేము వేగంగా రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే లైన్లు, పోర్టులను నిర్మించాము: ప్రధాని మోదీ
మన వస్తువులు మూవ్ లో ఉన్నాయి. సరఫరా గొలుసులు & గిడ్డంగి నెట్వర్క్లను హేతుబద్ధం చేయటానికి జిఎస్టి మాకు సహాయం చేసింది: ప్రధాన మంత్రి
మన సంస్కరణలు మూవ్ లో ఉన్నాయి. భారతదేశంలో మనం వ్యాపారసౌలభ్యతను పెంచాము: ప్రధాని మోదీ
మన జీవితాలు మూవ్ లో ఉన్నాయి. కుటుంబాలు గృహాలు, మరుగుదొడ్లు, ఎల్పిజి సిలిండర్లు, బ్యాంకు ఖాతాలు, రుణాలు పొందుతున్నాయి: ప్రధాని
మన యువత మూవ్ లో ఉంది. ప్రపంచంలోని స్టార్ట్ అప్ హబ్గా మనము వేగంగా అభివృద్ధి చెందుతున్నాం: ప్రధాని మోదీ
మొబిలిటీ అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క కీలకమైన డ్రైవర్. మెరుగైన మొబిలిటీ ప్రయాణ మరియు రవాణాభారం తగ్గిస్తుంది మరియు ఆర్థిక వృద్ధిని పెంచుతుంది: ప్రధాని మోదీ
మొబిలిటీ యొక్క భవిష్యత్తు కామన్, కనెక్ట్, కన్వీనియంట్ , కాంజేషన్ ఫ్రీ ఛార్జ్డ్, క్లీన్ & కట్టింగ్ ఎడ్జ్ -అనే 7Cపై ఆధారపడివుంది: ప్రధాని

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్లోబల్ మొబిలిటీ సమిట్ ను ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రారంభించారు. 

శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ ఆర్ధిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, యువత వంటి అనేక ఇతర అంశాల లో భారతదేశం ముందు వరుస లో ఉందన్నారు.  ఆర్థిక వ్యవస్థ కు రవాణా అనేది ఒక కీలకమైన చోదక శక్తి అని ఆయన పేర్కొన్నారు.  ఆర్థికాభివృద్ధి ని ఇది పెంపొందిస్తుంది, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. 

భారతదేశ భవిష్యత్తు రవాణా ఏడు ‘‘సి’’ల పై ఆధారపడి వుందని ప్రధాన మంత్రి చెప్పారు.  ఆంగ్ల అక్షరం ‘‘సి’’తో మొదలయ్యే ఏడు పదాలను ఆయన పేర్కొన్నారు.  ఆ ఏడు పదాలు కామన్ (సాధారణ); కనెక్టెడ్ (సంధానించిన), కన్వీనియంట్ (అనుకూలం), కంజెశన్- ఫ్రీ (రద్దీ లేని), చార్జ్ డ్ (భారమైన),  క్లీన్ (శుభ్రమైన),  కటింగ్-ఎడ్జ్ (అధునాతనమైన). 

ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది:

‘‘శ్రేష్ఠులారా,  

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన విశిష్ట ప్రతినిధులు,  

మహిళలు మరియు సజ్జనులారా, 

గ్లోబల్ మొబిలిటీ సమిట్ కు మీకు అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. 

ఈ శిఖర సమ్మేళనానికి పెట్టిన పేరు ‘‘మూవ్’’ నేడు భారతదేశ పరిస్థితికి తగ్గట్టుగా ఉంది.  నిజమే, భారతదేశం పయనిస్తోంది:

మన ఆర్ధిక వ్యవస్థ పయనిస్తోంది.  ప్రపంచం లోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ మన ఆర్ధిక వ్యవస్థ.  

మన నగరాలు, పట్టణాలు శరవేగం తో ముందుకు కదులుతున్నాయి.  మనం వంద స్మార్ట్ సిటీ లను నిర్మించుకుంటున్నాము.  

మన మౌలిక సదుపాయాలు సైతం పురోగమనం లో ఉన్నాయి.  రహదారులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు, నౌకాశ్రయాల ను ఎంతో వేగంగా మనం నిర్మించుకుంటున్నాము. 

మన ఉత్పత్తులు ముందుకు సాగుతున్నాయి. వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) మనకు సరకుల సరఫరా ను, గిడ్డంగి వ్యవస్థ ను హేతుబద్ధం చేయడంలో తోడ్పడింది. 

మన సంస్కరణలు ముందుకు సాగుతున్నాయి.  భారతదేశాన్ని వ్యాపారానికి అనువైన ప్రదేశంగా మనం రూపొందించాం. 

మన జీవితాలు పురోగమనం లో ఉన్నాయి.  గృహాలు, శౌచాలయాలు, పొగ లేని ఉచిత గ్యాస్ సిలిండర్ లు, బ్యాంకు ఖాతాలు, రుణాలు వంటివి మన కుటుంబాలకు లభిస్తున్నాయి. 

మన యువత ముందడుగు వేస్తోంది.  ప్రపంచం లో స్టార్ట్- అప్ ల కేంద్రం గా మనం వేగం గా అభివృద్ధి చెందుతున్నాం.  కొత్త శక్తి తో, ఆవశ్యకత తో, ప్రయోజనం తో భారతదేశం పురోగమిస్తోంది. 

మిత్రులారా, 

మానవత్వం పురోగతి కి రవాణా కీలకమన్న విషయం మనందరికీ తెలుసు. 

ప్రపంచం ఇప్పుడు కొత్త రవాణా విప్లవం మధ్య లో ఉంది.  అందువల్ల ఇప్పుడు మనం రవాణా ను విస్తృత స్థాయిలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 

ఆర్థిక వ్యవస్థ కు రవాణా ఒక కీలకమైన చోదక శక్తి గా ఉంది. ఉత్తమమైన రవాణా వ్యవస్థ ప్రయాణంపై, రవాణాపై భారాన్ని తగ్గిస్తుంది.  తద్వారా ఆర్థికాభివృద్ధి ని మెరుగుపరచే అవకాశం ఉంది.  ఇది ఇప్పటికే ఒక ప్రధాన ఉపాధి కల్పన కేంద్రం గా ఉంది.  వచ్చే తరానికి కూడా ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంది.  

పట్టణీకరణ కు రవాణా నే కేంద్ర బిందువు.  యంత్రాల తో నడిచే వ్యక్తిగత వాహనాలకు నిత్యం పెరిగే రహదారులు, పార్కింగ్, ట్రాఫిక్ మౌలిక సదుపాయాల అవసరం ఎంతైనా ఉంది. 

‘జీవన సౌలభ్యాని’కి కూడా రవాణా ఒక ముఖ్యమైన అంశం గా ఉంది.  ఇది వాస్తవానికి ప్రతి మనిషి మనస్సు లోనూ ఎల్లప్పుడూ నిలచే అంశం. పాఠశాలలకు, పనికి సమయానికి వెళ్లడానికి, ట్రాఫిక్ లో ఒత్తిడి కి, ఎవరినైనా చూడడానికి వెళ్ళినప్పుడు లేదా వస్తువులను తరలించడానికి, ప్రజా రవాణా అందుబాటులోకి రావడానికి, మన పిల్లలు నాణ్యమైన గాలి పీల్చడానికి, ప్రయాణం లో భద్రత కు ఇలా ప్రతి ఒక్క విషయం లోనూ ఇది ఇమిడి వుంది. 

మన భూగ్రహాన్ని కాపాడుకోడానికి రవాణా ఒక కీలకమైన అంశం.  అంతర్జాతీయ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల లో ఐదో వంతు రోడ్డు రవాణా ద్వారానే వెలువడుతున్నాయి.  దీనివల్ల నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.  భూగోళంపై  ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 

ప్రకృతికి అనుగుణంగా పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థ ను రూపొందించడం మన తక్షణ కర్తవ్యం.  

వాతావరణ మార్పు కు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటానికి తదుపరి హద్దు రవాణా.  ఉత్తమమైన రవాణా మంచి ఉద్యోగాలను, చురుకైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది; జీవితం లో నాణ్యత ను పెంపొందిస్తుంది. ఖర్చు ను తగ్గిస్తుంది, ఆర్ధిక కార్యకలాపాలను విస్తరిస్తుంది, భూగోళాన్ని పరిరక్షిస్తుంది.  ఈ విధంగా రవాణా రంగం ప్రజల అవసరాల పై భారీగా ప్రభావం చూపుతుంది. 

రవాణా, ముఖ్యం గా రవాణాతో డిజిటైజేషన్ ను వేరు చేయలేం.  ఇందులో ఆవిష్కరణలకు చాలా ఆస్కారం ఉంది.  ఇది ఒక ముందడుగు. 

ఇప్పటికే, ప్రజలు టాక్సీ లను ఫోన్ చేసి పిలుచుకొంటున్నారు; నగరాల్లో సైకిళ్ల ను తీసుకుంటున్నారు; బస్సులు స్వచ్ఛమైన ఇంధనం తో  నడుస్తున్నాయి, కార్లు విద్యుత్తు తో నడవనున్నాయి. 

భారతదేశం లో, మనం రవాణా కు పూర్తి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాం.  జాతీయ రహదారుల నిర్మాణాన్ని ద్విగుణీకృతం చేశాం. 

మన గ్రామీణ రహదారుల నిర్మాణ కార్యక్రమాన్ని తిరిగి ఉత్తేజపరిచాం.  ఇంధనాన్ని సమర్ధవంతంగా, ఇంధనాన్ని పరిశుభ్రంగా వినియోగించే వాహనాలను మనం ప్రోత్సహిస్తున్నాం.  దూర ప్రాంతాల కు తక్కువ ఖర్చు తో గగన యాన మార్గాలను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం.  ఆ విధంగా కొత్త గగన మార్గాలలో వందలాది విమాన యాన సేవలను కూడా ప్రారంభిస్తున్నాం.  

రైలు, రోడ్డు వంటి సంప్రదాయ మార్గాలకు అదనంగా  మేము జల మార్గాలను అభివృద్ధి పరుస్తున్నాం. 

గృహాలు, పాఠశాలలు, కార్యాలయాలను మరింత అనువైన ప్రదేశాల్లో నెలకొల్పడం ద్వారా మన నగరాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నాం.  

మేధోపరమైన రాకపోకల యాజమాన్య విధానాల వంటి సమాచార పరిజ్ఞాన మాధ్యమం ఆధారంగా పలు కార్యక్రమాలను కూడా ప్రారంభించాం. 

అదేవిధంగా  కాలినడక న వెళ్లే వారు, సైకిళ్ల పై వెళ్లే వారి భద్రతను, ప్రాధాన్యాలను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం కూడా ఉంది. 

మిత్రులారా,  

అత్యంత వేగంగా పరివర్తన చెందుతున్న రవాణా వ్యవస్థ లో, భారతదేశానికి కొన్ని స్వాభావిక బలాలు,  తులనాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.  మన ప్రారంభం ఎంతో తాజాగా ఉంది.  మనకు వనరులతో కూడిన రవాణా వారసత్వం కొంత ఉంది. 

ఇతర ప్రధాన ఆర్ధిక వ్యవస్థల కంటే మన తలసరి వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉంది.  అంటే మనకు వ్యక్తిగత వాహనాల సంఖ్య చాలా తక్కువ.  అందువల్ల, ఇతర ఆర్ధిక వ్యవస్థల కంటే సులువుగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.  ఈ నేపథ్యం లో ఒక నిత్య నూతన పర్యావరణ రవాణా వ్యవస్థ ను నిర్మించుకునేందుకు అవకాశం కలుగుతుంది.  

ఇక సాంకేతిక విజ్ఞ‌ానం విషయానికి వస్తే, మన బలమంతా ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ తో, సమాచారం తో, డిజిటల్ పేమెంట్స్ తో, ఇంటర్ నెట్ తో కూడిన ఆర్ధిక వ్యవస్థ తో ముడిపడి ఉంది.  ఈ అంశాలే ప్రపంచ రవాణా భవిష్యత్తు కు మార్గనిర్దేశకాలుగా మారుతున్నాయి. 

మన ప్రత్యేక గుర్తింపు కార్యక్రమం, ఆధార్, ఒక పర్యావరణ హితమైన సమగ్ర ప్రజా డిజిటల్ మౌలిక సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.  ఇది మన 850 మిలియన్ పౌరులను డిజిటల్ గా సాధికారులను చేసింది.  కొత్త రవాణా వ్యాపార నమూనాలతో అటువంటి డిజిటల్ మౌలిక సదుపాయాన్ని ఏ విధంగా అనుసంధానం చేయవచ్చో భారతదేశం చేసి చూపించింది. 

విద్యుత్తు రవాణా వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలను ఏ విధంగా పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చో మన నవీకరణయోగ్య శక్తి రుజువు చేసింది. నవీకరణయోగ్య శక్తి వనరుల ద్వారా 2022 నాటికి 175 గీగా వాట్ల విద్యుత్తు ను ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించాం.  ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతి పెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి దేశం గా మనం ఉన్నాం.  నవీకరణయోగ్య శక్తి ఉత్పత్తి లోనూ మనం ఆరో స్థానం లో ఉన్నాం.  అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా సౌర శక్తి ని ప్రోత్సహించడంలో కూడా మనం ముందంజ లో ఉన్నాం. 

వస్తు తయారీ లో, ముఖ్యంగా రవాణా వాహనాల తయారీ రంగం లో, మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. 

మన దేశం లో డిజిటల్ అక్షరాస్యత కలిగిన యువ జనాబా ఎక్కువగా ఉన్నారు.  ఇది శక్తివంతమైన భవిష్యత్తు కు అవసరమైన మిలియన్ల కొద్దీ విద్యావంతమైన మస్తిష్కాలు, నైపుణ్యం కలిగిన చేతులు, ఆశావహమైన స్వప్నాలను రూపొందిస్తుంది. 

అందువల్ల,  రవాణా ఆర్ధిక వ్యవస్థ లో అంతర్జాతీయంగా మరింత సులువుగా ముందుకు సాగేందుకు  భారతదేశం అత్యుత్తమ స్థానాన్ని ఆక్రమించగలదని నేను విశ్వసిస్తున్నాను. 

భారతదేశ భవిష్యత్తు రవాణా,  ఆంగ్ల అక్షరం ‘సి’తో మొదలయ్యే ఏడు పదాల  – కామన్ (సాధారణ); కనెక్టెడ్ (అనుసంధానం), కన్వీనియంట్ (అనుకూలం), కంజెషన్-ఫ్రీ (రద్దీ లేని), ఛార్జ్ డ్ (బరువుతో కూడిన),  క్లీన్ (శుభ్రమైన),  కటింగ్-ఎడ్జ్ (అధునాతనమైన)- పైన ఆధారపడి వుందని నేను అభిప్రాయపడుతున్నాను. 

1.       కామన్ :  రవాణా చర్యల్లో ప్రజా రవాణా చాలా ముఖ్యమైనది.  ప్రస్తుత వ్యవస్థల్లో డిజిటైజేశన్ ద్వారా కొత్త వ్యాపార నమూనాలు ముందడుగు వేస్తున్నాయి. పెరిగిన సమాచారం మన అవసరాలకు అనుగుణంగా మరింత చురుకైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తోంది.    

మన దృష్టి కార్ల కంటే ఎక్కువగా స్కూటర్లు, రిక్షాల వంటి ఇతర వాహనాల పై ఉండాలి.  అభివృద్ధి చెందుతున్న ప్రపంచం లో చాలా ప్రదేశాలు రవాణా అవసరాలకు ఈ వాహనాల పైనే ఆధారపడుతున్నాయి. 

2.       రవాణా అనుసంధానం అంటే రవాణా సాధనాల తో పాటు భౌగోళికంగా ఏకీకరణ అని అర్ధం చేసుకోవచ్చు.  ఇంటర్ నెట్ తో అనుసంధానమైన ఆర్ధిక వ్యవస్థ రవాణా కు మూలాధారంగా భావించవచ్చు. 

ప్రైవేట్ వాహనాలను వినియోగాన్ని మెరుగుపరచడానికి- వాహనాల్లో నలుగురు కలిసి వెళ్లే పూలింగ్ విధానం వంటి ఇతర వినూత్న సాంకేతిక పరిష్కారాలను అన్వేషించి అమలు చేయాలి.  గ్రామాల నుండి ప్రజలు తమ ఉత్పత్తులను నగరాలకు తీసుకు వచ్చేటప్పుడు మరింత సులువైన సమర్ధవంతమైన విధానాలను అవలంబించాలి. 

3.       అనుకూలమైన రవాణా అంటే, సురక్షితంగా, సమాజం లోని అన్ని వర్గాలకు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండాలి.  అంటే  వృద్ధులకు, మహిళలకు, ముఖ్యంగా ప్రత్యేకమైన అవసరాలు కలిగిన వారికి అందుబాటులో ఉండాలి.  ఇందుకోసం ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం కంటే, ప్రజా రవాణా వ్యవస్థే అనుకూలంగా ఉంటుంది. 

4.       రద్దీ వల్ల కలిగే ఆర్ధిక, పర్యావరణ వ్యయాన్ని తనిఖీ చేయడం చాలా క్లిష్టమైనది.  అందువల్ల, ఈ వ్యవస్ధలో ఉండే అంతరాయాలను అంతమొందించడం పై దృష్టి పెట్టాలి.  దీని ఫలితంగా- వాహనాల రాకపోక లలో అంతరాయాలను తగ్గించవచ్చు.  ప్రజలకు ప్రయాణ సమయంలో కలిగే ఆందోళన ను తగ్గించవచ్చు.  ఇది వస్తు రవాణా చార్జీలలో గొప్ప సమర్ధతకు దారితీస్తుంది. 

5.       రవాణాలో చార్జ్ డ్ మొబిలిటీ అనేది ఒక ముందడుగు.  విద్యుత్తు వాహనాల తయారీ కి వినియోగించే బ్యాటరీల నుండి స్మార్ట్ చార్జింగ్ వైపు పెట్టుబడులను మళ్లించాలి.  ప్రస్తుతం భారతీయ వ్యాపార రంగ నాయకులు, తయారీదారులు నిరంతరాయంగా పనిచేసే బ్యాటరీ సాంకేతికత ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నారు. 

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ- ‘ఇస్రో’) అంతరిక్షం లో ఉపగ్రహాలను నడపడానికి ఉత్తమమైన బ్యాటరీ విధానాన్ని ఉపయోగిస్తోంది.  ఇతర సంస్థలు ఏమైనా ఇస్రో తో భాగస్వామ్యమై తక్కువ వ్యయం తో సమర్ధంగా ఎలక్ట్రిక్ కార్ల కు పనిచేసే బ్యాటరీ లను అభివృద్ధి చేయవచ్చు.  ఎలక్ట్రిక్ వాహనాలకు అగ్రగామిగా ఉండే విధంగా  మనం భారదేశాన్ని రూపొందించాలి. 

విద్యుత్తు ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల కోసం మనం ఒక స్థిరమైన విధానాన్ని త్వరలో రూపొందించుకుందాం.  ఆటోమోటివ్ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను  వినియోగించుకుంటూ  అందరికీ ప్రయోజనకరంగా ఉండే విధంగా  ప్రణాళిక లను రూపొందించుకోవాలి. 

6.       వాతావరణ మార్పు కు వ్యతిరేకంగా మనం చేసే పోరాటం లో- శుభ్రమైన ఇంధనంతో, పరిశుభ్రమైన రవాణా వ్యవస్థ ను అభివృద్ధిచేసుకోవడం ఒక్కటే అత్యంత శక్తివంతమైన ఆయోధంగా మనం భావించాలి.  అంటే- కాలుష్య రహిత శుభ్రమైన ప్రయాణం- పరిశుభ్రమైన గాలి కి, మన ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు దారి తీస్తుంది. 

‘‘పరిశుభ్రమైన కిలోమీటర్లు’’ అనే ఆలోచన ను మనం విజేత గా నిలపాలి.  దీనిని జీవ ఇంధనం, ఎలక్ట్రిక్ చార్జింగ్ లేదా సోలర్ చార్జింగ్ ద్వారా సాధించాలి.  మన నవీకరణ యోగ్య శక్తి పెట్టుబడులను ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలతో  ముందుకు తీసుకుపోవచ్చు. 

అది ఏ విధంగా వీలైతే ఆవిధంగా మనం ముందుకు తీసుకుపోవచ్చు, ఎందుకంటే, ఇది మన వారసత్వానికి మన మిచ్చే నిబద్ధత, ఇది భవిష్యత్ తరాలకు మన మిచ్చే వాగ్ధానం.   

7.       కటింగ్-ఎడ్జ్ :  ప్రారంభంలో ఇంటర్ నెట్ ఎలా ఉందో మొబిలిటీ ఇప్పుడు అలా ఉంది.  అదే కటింగ్-ఎడ్జ్.  ఇది మరొక పెద్ద అన్వేషణ రంగం. గత వారంలో నిర్వహించిన ‘‘మూవ్ హాక్’’ అలాగే ‘‘పిచ్ టు మూవ్’’ కార్యక్రమాల ద్వారా ఎన్నోయువ మేధస్సు లు సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు వచ్చాయి. 

పారిశ్రామికవేత్త లు ఈ రవాణా రంగాన్ని అన్వేషణ కు, అభివృద్ధి కి అంతులేని అవకాశాలు గల రంగం గా గుర్తించాలి.  ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమస్యల పరిష్కారానికి సహాయపడే ఒక అన్వేషణ రంగం గా దీనిని గుర్తించాలి. 

మిత్రులారా,  

మన వృద్ధి కి, అభివృద్ధి కి రవాణా విప్లవం ఒక సులువైన మార్గం గా నేను భావిస్తున్నాను.  భారతదేశం రవాణా లో పరివర్తన చెందితే, తద్వారా ఐదో వంతు మానవాళి కి ప్రయోజనం చేకూరుతుంది.  అప్పుడు ఇది ఇతరులు అనుసరించదగ్గ విజయగాథ గా చరిత్రకెక్కుతుంది. 

ప్రపంచం అంతా అనుసరించే విధంగా ఒక నమూనా ను మనం రూపొందిద్దాం. 

ముగింపు సందర్భంగా, భారతీయ యువత కు నేను ఒక విజ్ఞప్తి ని చేస్తున్నాను. 

నా యువ, క్రియాశీల మిత్రులారా, ఒక కొత్త అన్వేషణ కు ఇది ఒక అద్భుత అవకాశం.  ఇదే మీ భవిష్యత్తు.  ఈ రంగం వైద్యుల నుండి ఇంజినీర్ల వరకు అలాగే డ్రైవర్ల నుండి మెకానిక్ ల వరకు అందరినీ స్వీకరిస్తుంది.  ఈ విప్లవాన్ని మనం అత్యంత వేగంగా వినియోగించుకోవాలి; మన కోసం, ఇతరుల కోసం మనం ఈ రవాణా అన్వేషణ పర్యావరణ విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన పరపతి ని, మన శక్తి యుక్తులను ఉపయోగించాలి. 

భారతదేశాన్ని, ప్రపంచాన్ని రవాణా పరివర్తన వైపు తీసుకుపోగల సామర్ధ్యం ఈ రోజు ఇక్కడ సమావేశమైన ప్రతిభ కు, సాంకేతికత కు ఉంది. 

మన ప్రపంచం కోసం మనం తీసుకొనే శ్రద్ధ, ఇతరులతో పంచుకోవడం వంటి అంశాలపై ఈ పరివర్తన ఆధారపడి ఉంటుంది. 

మన పురాతన గ్రంథాలలో నుండి ఒక విషయాన్ని ఉదాహరిస్తాను: 

ఓం సహ నావవతు 

సహ నౌ భునక్తు 

సహ వీర్యం కరవావహై 

తేజస్వి నా వధీతమస్తు మా విద్విషావహై  

దీనికి అర్థం:  

మనందరం రక్షింపబడు గాక. 

మనందరం పోషింపబడుదుము గాక. 

మనమంతా గొప్ప శక్తితో కలిసి పని చేయుదుము గాక. 

మన తెలివితేటలు వృద్ధి చెందు గాక అని. 

మిత్రులారా,

మనం అందరం కలసి ఏమి చేయగలమా అని నేను ఆలోచిస్తున్నాను.  

ఈ సమ్మేళనం ఒక ఆరంభం మాత్రమే.  మనం అంతా కలసి మరింత ముందుకు సాగుదాం. 

ధన్యవాదాలు.  

మీకు అనేకానేక ధన్యవాదాలు. 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government