సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి.. భారత పెట్రోలియం-సహజవాయువు శాఖ మంత్రి, అంతర్జాతీయ ఇంధన వేదిక సెక్రటరీ జనరల్, విశిష్ట అతిథులు, మహిళలు సజ్జనులారా,
భారతదేశంలోకి… 16వ ఇంటర్ నేశనల్ ఎనర్జీ ఫోరమ్ మంత్రుల స్థాయి సమావేశానికి మీకు ఇదే స్వాగతం..
ఇంధన ఉత్పత్తి, వినియోగ దేశాల ఇంధన శాఖల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి ఇంతపెద్ద సంఖ్యలో హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అంతర్జాతీయ ఇంధన భవిష్యత్తు గురించి చర్చించడానికి మీరంతా ఇవాళ ఇక్కడ ఏకమైన వేళ ఇంధన సరఫరా, వినియోగంలో వినూత్న పరివర్తనను ప్రపంచ దేశాలు చవిచూస్తున్నాయి.
• వినియోగంలో వృద్ధి ఒఇసిడియేతర దేశాల వైపు మారింది: మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, వర్ధమాన ఆసియా దేశాల వైపు మళ్లింది;
• అన్ని ఇతర ఇంధన వనరులతో పోలిస్తే సౌర ఫలకాల ఆధారిత ఇంధనం చౌకగా లభిస్తోంది. సరఫరాలో వినూత్న మార్పులకు ఇది దారితీస్తోంది;
• అంతర్జాతీయంగా ఇనుమడించిన ద్రవీకృత సహజవాయు శాతంతో సహజవాయువు అపార లభ్యత ఫలితంగా ప్రాథమిక ఇంధన అవసరాలలో సహజవాయువు వాటా పెరిగింది;
• అమెరికా త్వరలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తిదారుగా అవతరించే అవకాశం ఉంది. తద్వారా రానున్న దశాబ్దాల్లో ఎదురయ్యే అదనపు చమురు డిమాండును అది తీర్చగలదని అంచనా;
• ప్రస్తుతం ప్రధాన ఇంధన వనరుగా ఉన్న బొగ్గు కాలక్రమంలో తొలుత ఓఈసీడీ ప్రపంచంలో… ఆ తరువాత వర్ధమాన దేశాలలో అభిలషణీయ స్థానాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి;
• విద్యుత్ చోదక వాహనాల వినియోగం ద్వారా రవాణా రంగం రానున్న దశాబ్దాలలో భారీ మార్పులను చవి చూడబోతోంది;
• సిఒపి- 21 ఒప్పందం నిర్దేశాలకు అనుగుణంగా వాతావరణ మార్పు కార్యక్రమానికి ప్రపంచం కట్టుబడి వుంది. ముమ్మర ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థలు హరిత ఇంధనం, ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించి మార్పు చెందగలవు;
భావి ఇంధన అంచనాలపై ఒక సంస్థ రూపొందించిన నివేదికను గత నెలలో నేను పరిశీలించాను. రాబోయే 25 సంవత్సరాలలో అంతర్జాతీయ ఇంధన డిమాండు రీత్యా భారతదేశం కీలక చోదకం కాగలదని సదరు సంస్థ అంచనా వేసింది. ఆ మేరకు రానున్న 25 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం ఏటా 4.2 శాతం వంతున పెరుగుతుందని పేర్కొంది. ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థల స్థాయిలో ఇది అత్యంత వేగవంతమైన మార్పుగా పేర్కొనవచ్చు. అంతేకాకుడా 2040 నాటికి దేశంలో గ్యాస్ డిమాండ్ మూడింతలు కాగలదని సదరు నివేదిక వివరించింది. విద్యుత్ చోదిత వాహనాల సంఖ్య నేడు ఉన్నటువంటి 3 మిలియన్ స్థాయి నుండి 2030 నాటికి 320 మిలియన్ స్థాయికి చేరగలదని కూడా అంచనా వేసింది. మనమిప్పుడు అపార ఇంధన సమృద్ధి శకంలో అడుగుపెడుతున్నాం. అయితే, నేటికీ 1.2 బిలియన్ల ప్రజలకు విద్యుత్ అందుబాటులో లేదు. అనేకమంది ప్రజలకు పరిశుభ్ర వంట ఇంధన లభ్యత లేదు. అవకాశాలు అందని దుర్బలుల దుస్థితి ఆసరాగా దోపిడీకి వీల్లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజలందరికీ పరిశుభ్ర, అందుబాటు, సుస్థిర, సమాన ఇంధన సరఫరాకు మనం పూచీ పడాల్సి వుంది.
ఈ సందర్భంగా హైడ్రోకార్బన్ రంగంతో పాటు ఇంధన భద్రతపై నా ఆలోచనలలో కొన్ని ఆలోచనలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. చమురు, వాయువులు వాణిజ్య వస్తువులు మాత్రమే కావు… అవి నిత్యావసరాలు కూడా. సామాన్యుల వంట ఇంటికి కావచ్చు… విమానాల కోసం కావచ్చు.. దేనికైనా ఇంధనం ఒక నిత్యావసరమే. మరోవైపు ఇంధన ధరలలో విపరీత చక్రభ్రమణాన్ని మనం సుదీర్ఘ కాలం నుంచీ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అటు ఉత్పత్తిదారులకు, ఇటు వినియోగదారుల ప్రయోజనాలను సమతూకం చేసే రీతిలో బాధ్యతాయుతంగా ధర నిర్ణయించేలా మనమంతా కదలాల్సి ఉంది. ఇందులో భాగంగా చమురు, వాయువులకు సరళ, పారదర్శక విపణి దిశగానూ నడవడం అవసరం. ఇలా చేయగలిగినప్పుడు మాత్రమే మానవాళి ఇంధన అవసరాలను మనం అభిలషణీయ రీతిలో తీర్చగలం. ప్రపంచం మొత్తం సర్వతోముఖంగా పురోగమించాలంటే ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య పరస్పర సహాయక సంబంధాలుండాలి. ఇతర ఆర్థిక వ్యవస్థలు నిలకడగా, వేగంగా ఎదగటమన్నది ఉత్పత్తిదారుల ప్రయోజనాలకూ ముఖ్యమే. దీనివల్ల వారికి అవసరమైన ఇంధన విపణులు విస్తరించే అవకాశాలుంటాయి. ధరలను కృత్రిమంగా ప్రభావితం చేయడమన్నది స్వీయ నష్టానికే దారితీస్తుందన్నది చరిత్ర మనకు నేర్పిన పాఠం. అవి ఎనలేని కష్టనష్టాలకు కారణమవుతాయి… ప్రత్యేకించి వర్ధమాన, స్వల్ప అభివృద్ధిగల దేశాల జాబితాలో అట్టడుగున్న ఉన్నవాటికి చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
అందువల్ల ‘బాధ్యతాయుత ధర’ నిర్ణయంపై ఏకాభిప్రాయ సాధనకు ఈ వేదికను ఉపయోగించుకుందాం. ఇది అటు ఉత్పత్తిదారుల, ఇటు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు తోడ్పడుతుంది. ప్రస్తుత అనిశ్చిత ప్రపంచ పరిస్థితులలో భారతదేశానికీ ఇంధన భద్రత అవసరం. దేశ ఇంధన భధ్రతపై నా దార్శనికతకు నాలుగు మూల స్తంభాలున్నాయి. అవి- ఇంధన అందుబాటు, ఇంధన సామర్థ్యం, ఇంధన సుస్థిరత, ఇంధన భద్రతలే. భారతదేశం ఇంధన భవిష్యత్తుపై నా దార్శనికతలో సాధారణంగా ఇంధనం, ప్రత్యేకించి హైడ్రో కార్బన్లు ముఖ్యమైన భాగం. పేదలకు ఇంధన అందుబాటు ధర, లభ్యత కూడా భారతదేశం ఇంధన భద్రతకు ప్రధానమైనవే. ఇందుకోసం సమర్థ ఇంధన వినియోగం కూడా అవసరం. అంతర్జాతీయ దేశాల సమూహంలో ఓ బాధ్యతాయుత సభ్య దేశంగా వాతావరణ మార్పును ఎదుర్కొనడం, ఉద్గారాల నియంత్రణ, సుస్థిర అభివృద్ధికి హామీ తదితరాలకు భారతదేశం కట్టుబడి వుంది. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ఏర్పాటు ఈ లక్ష్య సాధన దిశగా ఒక ముందడుగు.
మిత్రులారా,
ప్రస్తుతం ప్రపంచంలో అతివేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఆ మేరకు సమీప భవిష్యత్తులోనే భారతదేశం 7 నుండి 8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ల వంటి అగ్ర ఆర్థిక, ద్రవ్య విధాన సంస్థలన్నీ అంచనా వేస్తున్నాయి. స్వల్ప ద్రవ్యోల్బణంతో అధిక స్థూల జాతీయోత్పత్తిని మా ప్రభుత్వం సాధించగలిగింది. ద్రవ్య లోటును సమర్థంగా నియంత్రించడమేగాక ద్రవ్య మారకం ధరను నిలకడగా కొనసాగించింది. ఈ స్థూల-ఆర్థిక సుస్థిరతతో ఆర్థిక వ్యవస్థలో అటు వినియోగం, ఇటు పెట్టుబడులకు ఉత్తేజం లభించింది. జనశక్తిపరంగానూ భారతదేశానికి జనాభా ఒక పెద్ద వరం. మొత్తం జనాభాలో కష్టించి పనిచేయగల జనాభా నిష్పత్తి ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా అత్యధిక స్థాయిలో ఉండడం ఇందుకు నిదర్శనం.
దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మేక్ ఇన్ ఇండియా తో పాటు జౌళి, పెట్రో-రసాయనాలు, రక్షణ, ఇంజినీయరింగ్ తదితర రంగాలలో యువతరానికి నైపుణ్యాభివృద్ధి ద్వారా మా ప్రభుత్వం స్థానిక తయారీ రంగానికి ఉత్సాహప్రోత్సాహాలు అందిస్తోంది. మా ఇంధన వినియోగంలో పెరుగదలకూ ఇది దోహదపడుతోంది. హైడ్రోకార్బన్ అన్వేషణ మరియు లైసెన్సింగ్ విధానంలో కాఠిన్యాన్ని సరళీకరించి నియమ నిబంధనలలో పారదర్శకత ప్రవేశపెట్టడంతోపాటు ఈ రంగంలో పోటీతత్వాన్ని తీసుకొచ్చాం. బిడ్ ల దాఖలు ప్రక్రియ ను ఆదాయ పంపిణీకి అనువుగా మార్చడంతోపాటు ప్రభుత్వ జోక్యాన్ని కనీస స్థాయి కి తగ్గించాం. ప్రస్తుతం రెండో దశ బిడ్డింగుకు మే నెల 2వ తేదీ దాకా గడువు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెంపుదిశగా మేం చేస్తున్న కృషికి తోడ్పాటును ఇచ్చేలా ఈ ప్రక్రియ లో పాల్గొనాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తమకు ఆసక్తి గల రంగాలలో కంపెనీల భాగస్వామ్యానికి, భారతీయ ఇంధన క్షేత్రాలలో అన్వేషణ మెరుగుదలకు సార్వత్రిక భూ విస్తీర్ణం, జాతీయ గణాంక భాండాగారం తోడ్పడతాయి. అభివృద్ధిపరచిన చముదు వెలికితీత విధానం భూ, జలగర్భాల్లో ఇంధన అన్వేషణ, ఉత్పాదకతలను మెరుగుపరుస్తూ ఆధునిక సాంకేతిక వినియోగానికి వీలు కల్పిస్తుంది. ఇక చమురుశుద్ధి వంటి ఉత్పాదకరంగ అనుబంధ శుద్ధిరంగ విధానాలు పూర్తిగా సరళీకరించబడ్డాయి. ముడిచమురు ధరలో మార్పులనుబట్టి మార్కెట్ చోదిత పద్ధతిలో పెట్రోలు, డీజిల్ ధరల నిర్ణయం ఇందులో ఒకటి. ఇక ఇంధనం చిల్లర వ్యాపారంలో చెల్లింపులకు డిజిటల్ వేదికల ఏర్పాటుతో మరింత ముందడుగు వేశాం. ఉత్పత్తి నుండి చిల్లర వ్యాపారందాకా చమురు, సహజవాయువు శృంఖలం మొత్తానికీ సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇంధన ప్రణాళిక విషయంలో సమగ్ర విధానాన్ని మా ప్రభుత్వం విశ్వసిస్తుంది. దేశంలో మా ఇంధన విధానం… సమ్మిళితం, మార్కెట్ ఆధారితం, వాతావరణానుకూలం. ఇంధనానికి సంబంధించి ఐక్య రాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి కార్యక్రమావళిలోని మూడు ప్రధాన లక్ష్యాలు- 2030 నాటికి అందరికీ అందుబాటులోకి ఆధునిక ఇంధనం; పారిస్ ఒప్పందం పరిధిలో వాతావరణ మార్పులపై అత్యవసర కార్యాచరణ, ప్రాణవాయు నాణ్యత మెరుగుకు చర్యలు వంటివాటి సాధనకు ఇది దోహదపడుతుందని మా ప్రభుత్వ నమ్మకం.
మిత్రులారా,
జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటే పరిశుభ్ర వంట ఇంధనం ప్రజలకు అందుబాటులోకి రావాలన్నది మా విశ్వాసం. ముఖ్యంగా దీనివల్ల మహిళలకు ప్రయోజనం కలుగుతుది. ఇంట్లో కాలుష్యం తగ్గడమేగాక వంటచెరకు, ఇతర జీవ ఇంధనాల కోసం తంటాలు తప్పుతాయి. అదనపు ఆదాయ కార్యకలాపాలు చేపట్టడంద్వారా స్వీయాభివృద్ధికిగల అవకాశాలను ఇది మెరుగుపరుస్తుంది. భారతదేశంలో ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాల్లోని మహిళల పేరిట ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. ఇందులో భాగంగా మొత్తం 80 మిలియన్ల పేద కుటుంబాలకు వంటగ్యాస్ మంజూరు ద్వారా పరిశుభ్ర ఇంధనాన్ని అందుబాటులోకి తేవాలన్నది మా లక్ష్యం. తదనుగుణంగా గడచిన రెండేళ్ల వ్యవధిలోనే 35 మిలియన్ల కనెక్షన్లు మంజూరు చేశాం. ఇక ఏప్రిల్ 2020 నాటికి బిఎస్- 6 ప్రమాణం గల ఇంధనాలకు మారాలని మేం ప్రతిపాదిస్తున్నాం. ఇది యూరో- 6 ప్రమాణాలకు సమానం. ఆ మేరకు మా చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నతీకరించబడుతున్నాయి. పరిశుభ్ర ఇంధన సరఫరాకు నిర్దేశించిన గడువు మేరకు లక్ష్య సాధన దిశగా అవి కృషి చేస్తున్నాయి. వాస్తవానికి న్యూఢిల్లీలో మేం ఇప్పటికే బిఎస్- 6 ప్రమాణ ఇంధన సరఫరాను ఈ నెలనుంచే ప్రారంభించాం. అంతేకాకుండా పాత వాహనాలను మూలపడేయడంద్వారా వాటికి స్వస్తిచెప్పి, పరిశుభ్రతతోపాటు ఇంధన సామర్థ్యానికి పెద్దపీట వేసే వాహనాల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈ ఇంధన వైవిధ్యీకరణ వ్యూహాలకు అనుగుణంగా మా చమురు కంపెనీలు కూడా తమ పెట్టుబడులపై అంచనాలు వేసుకుంటున్నాయి.
ఇవాళ చమురు కంపెనీలు కూడా పవన, సౌర విద్యుత్ సామర్థ్యాల మెరుగుతోపాటు సహజవాయు మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో పాటు విద్యుత్ వాహనాల రూపకల్పన, నిల్వ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నాయి.
మిత్రులారా,
నాలుగో తరం (4.0) పారిశ్రామిక ప్రగతివైపు మన దృష్టి మరలిందన్న సంగతి మీకందరికీ తెలిసిందే. ఇంటర్ నెట్ కార్యకలాపాలు, కృత్రిమ మేధస్సు, రోబోటిక్ ప్రక్రియలో యంత్రీకరణ, యంత్ర అభ్యాసం, ఊహాత్మక విశ్లేషణాత్మకత, త్రికోణ ముద్రణ వంటి అత్యాధునిక సాంకేతిక ప్ర్రక్రియలతో పరిశ్రమలు నడిచేలా మార్పులు తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మన కంపెనీలు కూడా అత్యాధునిక పరిజ్ఞానం అమలుకు కృషి చేస్తున్నాయి. ఇది సామర్థ్యాన్ని, భద్రతను మెరుగుపరచడమేగాక చమురు అన్వేషణసహా శుద్ధి, చిల్లర వ్యాపారం, ఆస్తుల నిర్వహణ, సుదూర పర్యవేక్షణ రంగాల్లో వ్యయాల తగ్గింపునకు తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇంధన రంగ భవిష్యత్తుకు సంబంధించి సదరు కార్యకలాపాల నిర్వహణకు భారతదేశం కచ్చితమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ రంగంలో భవిష్యత్ పెట్టుబడులతోపాటు విపణి నిలకడను ప్రభావితం చేయగల విశ్వవ్యాప్త మార్పులు, విధానాల పరివర్తన, కొత్త సాంకేతికతల ఆవిష్కరణలను ఇది ప్రతిబింబిస్తుంది.
మిత్రులారా,
అంతర్జాతీయ ఇంధన వేదిక-16వ సమావేశం ‘‘ప్రపంచ ఇంధన భద్రత భవిష్యత్తు’’ ఇతివృత్తంగా నిర్వహించబడింది. ఉత్పత్తిదారు-వినియోగదారు సంబంధాలలో ప్రపంచవ్యాప్త మార్పులు, సార్వత్రిక ఇంధన అందుబాటు, భవిష్యత్తు అవసరాలకు తగిన మేర చమురు-గ్యాస్ నిక్షేపాల అన్వేషణకు పెట్టుబడులు తదితర సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశ కార్యాచరణను రూపొందించినట్లు నాకు తెలిపారు. ఇంధన భద్రత నిర్వహణ, పాత-కొత్త సాంకేతికతల సహజీవనం కూడా ఈ సందర్భంగా చర్చకు రావలసి వుంది. ఇవన్నీ మన సామూహిక ఇంధన భద్రత భవిష్యత్తుకు సంబంధించినవే. విశ్వజనులందరికీ పరిశుభ్ర, అందుబాటు, సుస్థిర ఇంధన లభ్యత లబ్ధి కలిగే దిశగా ఈ వేదికపై చర్చలు మరింత లోతుగా జరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ మంత్రుల స్థాయి సమావేశం పూర్తి స్థాయిలో విజయవంతమై చర్చలు సఫలం కావాలని అభిలషిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీకందరికీ ధన్యవాదాలు.