ఉషా అథ్లెటిక్స్ స్కూల్ లో సిన్ థెటిక్ ట్రాక్ ప్రారంభోత్సవం సందర్భంగా క్రీడా ప్రియులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఉషా స్కూల్ అభివృద్ధిలో ఈ ట్రాక్ ఒక ప్రధానమైన మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది శిక్షకులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తుంది. మన ‘పయోలీ ఎక్స్‌ప్రెస్’, ‘ఉడాన్ పరీ’, ‘గోల్డన్ గర్ల్’ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన పి.టి. ఉష గారు ఈ స్కూలును తీర్చిదిద్దడం కోసం చేసిన కృషిని గుర్తించేందుకు ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొంటున్నాను.
భారతదేశంలో క్రీడారంగానికి ఒక ప్రకాశవంతమైన కాంతిలా పి.టి. ఉష నిలిచారు.
ఆమె తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒలంపిక్స్ ఫైనల్ లో స్థానం సంపాదించుకొన్నారు. పతకాన్ని కేవలం ఓ తృటిలో కోల్పోయారు.
ఆమె సాధించినటువంటి ట్రాక్ రికార్డును భారతీయ అథ్లెటిక్స్ చరిత్రలో చాలా తక్కువ మంది క్రీడాకారులు సాధించారు.
ఉష గారు, మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. క్రీడలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఉష గారు కొనసాగించడమనేది మరింత ఉత్తమమైనటువంటి విషయం. ఆమె వ్యక్తిగతంగా చూపుతున్న శ్రద్ధ, ఏకాగ్రతతో చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇవ్వడం మొదలైంది. ఆమె శిక్షణార్థులైన కుమారి టింటు ల్యూకా, కుమారి జిస్నా మాథ్యూ లు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటిచెప్పారు.
ఉష గారి మాదిరిగానే, ఉషా స్కూల్ కూడా చాలా సాధారణమైన, పరిమితమైన వనరులను ఉపయోగించుకుంటూనే ప్రతి అవకాశాన్నిసమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది.
ఈ సందర్భంగా నేను కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను, భారతీయ క్రీడా ప్రాధికార సంస్థను మరియు సిబిడబ్ల్యుడిని అభినందిస్తున్నాను. అనేక అవాంతరాలు ఎదుర్కొంటూ వాయిదాపడుతూ వచ్చిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో వారి కృషి అభినందనీయం.
అయితే అసలు పూర్తి చేయకుండా ఉండటం కన్నా ఆలస్యంగానైనా పూర్తి చేయడం మంచిదే. ఎంత సమయంలో పూర్తి చేయాలని అనుకుంటామో అంతే సమయంలో వేగంగా ప్రాజెక్టులను అమలు చేయడమనేది మా ప్రభుత్వ అగ్ర ప్రాథమ్యాలలో ఒకటి.
నిజానికి ఈ ప్రాజెక్టు కు 2011లో అనుమతి లభించింది. అయితే సిన్ థెటిక్ ట్రాక్ నిర్మాణ పని కేటాయింపు మాత్రం 2015లో జరిగింది. ట్రాక్ మొత్తం పియుఆర్ ట్రాక్ అని నాకు అధికారులు తెలిపారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా నిర్మితమైంది. క్రీడాకారులకు గాయాలవ్వడమనేది దాదాపుగా ఉండదు.
సమాజంలో మానవ వనరుల అభివృద్ధికి క్రీడలకు దగ్గర సంబంధం ఉంది.
క్రీడల వల్ల శారీరక ఆరోగ్యమే కాదు ఇవి మన వ్యక్తిత్వాన్నే మార్చేస్తాయి. మనలో సమగ్రమైన ఉన్నతమైన మార్పును తీసుకొస్తాయి. క్రీడల వల్ల క్రమశిక్షణతో పాటు కష్టపడి పని చేసే ధోరణి అలవడుతుంది.
క్రీడలు జీవితానికి కావలసిన గుణపాఠాలు నేర్పుతాయి. మన ఆలోచనా విధానాన్ని సమున్నతం చేస్తాయి. క్రీడారంగమనేది ఉన్నతమైన గురువు. ఈ రంగంలో ప్రతి ఒక్కరూ నేర్చుకునే ముఖ్యమైన అంశం అది విజయం కావచ్చు, అపజయం కావచ్చు.. రెండు సందర్భాల్లోనూ స్థితప్రజ్ఞత అనేది మన జీవితంలో భాగమవుతుంది.
విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థిరంగా ఉండటం, అదే సమయంలో అపజయంలో కుంగిపోకుండా ఉండగలడం క్రీడారంగంలో నేర్చుకుంటాం. అపజయం వస్తే అంతా అయిపోయినట్టు భావించకూడదు. మరలా పైకి లేచి మన లక్ష్యాన్ని అందుకోవడానికి అపజయమనేది తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది.
క్రీడలవల్ల అందరూ కలిసి పని చేసే సమైక్య తత్వం పెరుగుతుంది. క్రీడలు మనిషిలో నిజాయితీని పెంచుతాయి. ఇతరుల అభిప్రాయాలను అంగీకరించగలిగే సామర్థ్యాన్ని ఇస్తాయి. మన దేశంలోని యువత క్రీడల్ని తమ జీవితంలో భాగంగా చూడడం చాలా ముఖ్యమైన అంశం.
నా దృష్టిలో స్పోర్ట్స్ అంటే ఈ కింది విధమైన గుణాలను కలిగి ఉంటుంది.
ఆయా గుణాలను మీకు విపులీకరించడం కోసం నేను స్పోర్ట్స్ అనే పదాన్ని విస్తరిస్తాను:
ఇందులోని ‘ఎస్’ అనే అక్షరం ‘స్కిల్’ను అంటే నైపుణ్యాన్ని;
‘పి’ అనే అక్షరం పర్ సివియరెన్స్ ను, అంటే ఎటువంటి అవాంతరాలు వచ్చినప్పటికీ పట్టుదలగా పని చేయడాన్ని;
‘ఒ’ ఆప్టిమిజమ్ ను, అంటే ఆశాభావాన్ని;
‘ఆర్’ రిజిలియన్స్ ను అంటే, అపజయం వచ్చినప్పుడు తట్టుకొని తిరిగి పుంజుకోవడాన్ని;
‘టి’ టినేసిటీ ని అంటే, మనోధైర్యంతో స్థిరంగా నిలిచే తత్వాన్ని;
‘ఎస్’ స్టామినాను అంటే దృఢత్వాన్ని.. సూచిస్తాయి.
క్రీడల వల్ల మనలో ఏర్పడే క్రీడాతత్వమనేది ఆటల్లోనే కాదు, జీవితంలోనూ బాగా ఉపయోగపడుతుంది.
అందుకే నేను తరచుగా ‘జో ఖేలే, వో ఖిలే’ అని చెబుతుంటాను. దీనికి అర్థం.. ఆడే వాళ్లే వికసిస్తారు అని.
ప్రస్తుతం ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు అంతర్గత అనుసంధానం పెరిగింది. పరస్పరం ఆధారపడడం జరుగుతోంది. ఇలాంటప్పుడు జాతికి గల అంతర్జాతీయ బంధాలు జీవ నాడి వంటివి. దేశానికి గల ఆర్ధిక, సైన్య సమర్థతతో పాటు అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకనే సమర్థత కూడా జాతి అస్తిత్వానికి ముఖ్యం. మన అంతర్జాతీయ బంధాల పెంపుదలలో క్రీడలు కూడా ప్రధానమైనవి.
పలు క్రీడలకు, క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. క్రీడల ద్వారా ప్రతి దేశం తనకంటూ ఒక స్థానాన్ని రూపొందించుకోగలుగుతుంది.
ఏ క్రీడలోనైనా విజయం సాధించిన వారు ప్రపంచవ్యాప్తంగా అందరిలో స్ఫూర్తిని నింపుతుంటారు. వారి విజయాల నుండి, పోరాటాల నుండి యువత స్ఫూర్తిని పొందుతుంది. ప్రతి అంతర్జాతీయ క్రీడా పోటీ సందర్భంగా అవి ఒలంపిక్స్ కావచ్చు; లేదా వరల్డ్ కప్ పోటీలు కావచ్చు; లేదా అలాంటి మరో పోటీ కావచ్చు.. ఆయా దేశాల విజయాలను చూసి యావత్తు ప్రపంచం సంతోషిస్తుంది.. విజయం సాధించిన దేశాలు చిన్నవైనా, పెద్దవైనా అది సమస్యే కాదు.. వాటి విజయాన్ని అంతా ఆస్వాదిస్తారు.
అందరినీ ఐకమత్యంగా ఉంచగలిగే క్రీడా సామర్థ్యమిది. ప్రజల మధన లోతైన, బలమైన సంబంధాలను పెంచగలిగే సామర్థ్యం మార్పు తేగలిగే సత్తా క్రీడలకు, సంస్కృతికి ఉంది. మన దేశాన్నే తీసుకుంటే, ఒక క్రీడాకారుడు ప్రతిభను చాటినప్పుడు మొత్తం దేశమంతా ఆనందంలో మునుగుతుంది. వారు పురుషుడయినా సరే, మహిళ అయినా సరే- వారు తమ క్రీడలో రాణించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు. వారి ప్రతిభ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది.
క్రీడాకారుల ప్రతిభ అనేది వారు జీవించినంతకాలమే కాదు.. వారి మరణం తరువాతా అందరికీ జ్ఞాపకముంటుంది. విజ్ఞాన సముపార్జన మాదిరిగానే క్రీడలూ తరతరాలుగా దేశ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉన్నాయి.
విలువిద్య, కత్తియుద్ధ పోరాటాలు, మల్లయుద్ధం, మాల్ కాంబ్, పడవ పోటీలు వంటివి మన దేశంలో శతాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి. కేరళలో కుట్టియమ్ కోలం, కాలరి జనాదరణ పొందిన క్రీడలు.
బురదలో పుట్ బాల్ క్రీడ కు ఎంతటి ఆదరణ ఉందో నాకు తెలుసు. మీలో చాలా మందికి సాగల్ కాన్గ్ జెయ్ గురించి తెలిసి ఉంటుంది. ఇది మొదటగా మణిపూర్ కు చెందిన క్రీడ. ఇది పోలో కంటే పురాతనమైందని.. సమాజంలో పలు వర్గాల ప్రజలు ఆడేవారని అంటారు.
మన సంప్రదాయ క్రీడలు ప్రజాదరణ కోల్పోకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. మన జీవితాల్లో నుండి పుట్టుకు వచ్చిన స్థానిక క్రీడలను తప్పకుండా ప్రోత్సహించాలి.
ప్రజలు చాలా సహజంగా గ్రామీణ ఆటల్ని ఆడుతుంటారు. ఇవి వారి వ్యక్తిత్వంపైన అపారమైన ప్రభావం చూపుతాయి. వికసిస్తున్న హృదయాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహిస్తే వాటి మూలాలు బలపడతాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచమంతా యోగా పట్ల ఉత్సాహం చూపుతోంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగా చేస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగాను ఆశ్రయిస్తున్నారు. మన క్రీడాకారులు కూడా వారి శిక్షణలో భాగంగా క్రమం తప్పకుండా యోగా అభ్యసించాలి. తద్వారా వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తారు.
యోగాకు పుట్టినిల్లయిన భారతదేశంపైన ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణున పెంపొందించవలసిన తరుణమిది. యోగాకు ఆదరణ పెరుగుతున్నట్టే మన సంప్రదాయ క్రీడలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణను పెంచడానికి మార్గాలను మనం అన్వేషించాలి.
ఈ మధ్య మీరు గమనించే ఉంటారు.. కబడ్డి లాంటి ఆటలు మొదటగా అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ఎలా భాగమవుతున్నాయో. ఆ తరువాత మన దేశంలో సైతం భారీ స్థాయిలో కబడ్డి టూర్నమెంట్ లను నిర్వహిస్తున్నారు. ఈ టూర్నమెంట్ లకు కార్పొరేట్ ప్రోత్సాహం లభిస్తోంది. వీటికి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందనే విషయం నాకు తెలిసింది.
కబడ్డి లాగానే ఇతర స్థానిక గ్రామీణ క్రీడలను జాతీయ స్థాయికి తీసుకు రావాలి. ఈ ప్రయత్నంలో ప్రభుత్వాలతో పాటు క్రీడలకు సంబంధించిన సంస్థలు, ప్రజలు కూడా భాగస్వాములై పని చేయాలి.
మన దేశం వంద భాషలతో, 16 వందల మాండలికాలతో సాంస్కృతిక భిన్నత్వాన్ని కలిగివుంది. ఆహారపు అలవాట్లు, వేషధారణ, పండగలు వైవిధ్యాన్ని కలిగివున్నాయి. ఈ భిన్నత్వాన్ని ఏకం చేయడంలో క్రీడలు ప్రధాన పాత్రను పోషిస్తాయి.
నిత్యం ఇతర ప్రాంతాలవారితో సంభాషించడం, పోటీల కోసం ప్రయాణాలు చేయడం, ఆటలు ఆడడం, శిక్షణ పొందడం తదితర అంశాలు దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి సంప్రదాయలను అవగాహన చేసుకునే అవకాశాన్నిస్తాయి.
దీని వల్ల ‘ఏక్ భారత్ , శ్రేష్ట భారత్’ అనే భావన బలోపేతమవుతుంది. జాతీయ ఐక్యతకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది.
దేశంలో ప్రతిభకు కొదువ లేదు. అయితే ఈ ప్రతిభను ముందుకు తీసుకుపోవడానికి సరైన అవకాశాలను ఇవ్వగలిగే వాతావరణాన్ని మనం తయారు చేసుకవాలి. మేం ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం లో భాగంగా పలు క్రీడల్లో పోటీలను నిర్వహిస్తారు. పాఠశాల, కళాశాల స్థాయిల నుండి జాతీయ స్థాయి దాకా ఈ పోటీలు ఉంటాయి. ప్రతిభను గుర్తించి సాయం చేయడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రాధాన్యమిస్తున్నాం.
క్రీడారంగంలోని మౌలిక సదుపాయాల కల్పనకు ‘ఖేలో ఇండియా’ సాయం చేస్తుంది. అన్ని రంగాలలో మన దేశ మహిళలు విజయాలు సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచారు. క్రీడల్లో వారు మరింతగా రాణిస్తున్నారు.
చిన్నప్పటి నుండే మహిళా క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సాహించాలి. వారు క్రీడలనే తమ జీవన మార్గంగా ఎంచుకోవడానికి వీలుగా అవకాశాలను కలిగించాలి. మొన్నటి పారా లంపిక్స్‌లో మన క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడం సంతోషించదగ్గ పరిణామం.
పారాలంపిక్స్ లో మన క్రీడాకారులు చూపిన ప్రతిభ వారు సాధించిన విజయాల కంటే గొప్పది. దివ్యాంగులైన మన సోదర సోదరీమణుల పట్ల మనం వ్యవహరించే దృక్పథంలో మార్పు వచ్చింది. దీపా మాలిక్ పేరు ప్రతి ఇంటా వినిపిస్తోంది. ఆమె పతకాన్ని అందుకుంటున్నప్పుడు చెప్పిన మాటలను నేను ఎప్పుడూ మరిచిపోలేను.
‘‘ఈ పతకం ద్వారా నేను నిజానికి నా వైకల్యాన్ని జయించాను’’ అని ఆమె అన్నారు.
ఆమె ప్రకటించిన ఈ అభిప్రాయంలో చాలా శక్తి ఉంది. క్రీడలకు ప్రజాదరణను పెంచటం కోసం మనం నిరంతరం కృషి చేయాలి.
గతంలో క్రీడలను జీవన మార్గంగా ఎంచుకొనే వాతావరణం ఉండేది కాదు. ఈ ఆలోచనలో ఇప్పుడు మార్పు వచ్చింది. దాంతో దేశ క్రీడారంగంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. బలమైన క్రీడా సంస్కృతి ఉంటే, క్రీడలకు సంబంధించిన ఆర్ధిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది.
దేశంలో క్రీడారంగంలో సమగ్రమైన ప్రోత్సాహక వాతావరణం ఏర్పడితే, అది దేశ ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలకు గణనీయంగా సహకరిస్తుంది. ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలను ఇస్తుంది. ప్రొఫెషనల్ లీగ్స్, పరికరాలు క్రయ విక్రయాలు, క్రీడాశాస్త్రం, క్రీడావైద్యం, సహాయక సిబ్బంది, బట్టలు, పోషణ, నైపుణ్య అభివృద్ధి, క్రీడా నిర్వహణ మొదలైన విభాగాల్లో అనేక అవకాశాలు ఏర్పడుతాయి.
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల డిమాండ్ పెరుగుతుండడంతో క్రీడారంగం బిలియన్ లకొద్దీ డాలర్ల అంతర్జాతీయ పరిశ్రమగా అవతరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగ పరిశ్రమ విలువను 600 బిలియన్ అమెరికా డాలర్లుగా అంచనా వేశారు. భారతదేశంలో మొత్తం క్రీడా పరిశ్రమ విలువ 2 బిలియన్ అమెరికా డాలర్లు మాత్రమేనని అంచనా వేయడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ క్రీడారంగంలో భారతదేశానికి అనేక అవకాశాలు ఉన్నాయి. భారతదేశం క్రీడలను ప్రేమించే దేశం. ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీని దేశంలోని నా యువ స్నేహితులుఎంతో ఉత్సాహంగా తిలకిస్తున్నారు. వారు అంతే ఉత్సాహంగా ఇపిఎల్ ఫుట్ బాల్ లేదా ఎన్ బిఎ బాస్కెట్ బాల్ పోటీలను, ఎఫ్ 1 పందేలను ఆస్వాదించగలరు. నేను ముందే చెప్పినట్టుగా వారు కబడ్డి లాంటి క్రీడల పట్ల కూడా అంతే ఉత్సాహాన్ని చూపుతున్నారు. మన దేశంలోని ఆట స్థలాలను, స్టేడియాలను పూర్తిగా వినియోగించుకోవాలి. సెలవులు వస్తే బయటకు వెళ్లి మైదానాల్లో ఆటలు ఆడుకోవాలి. పాఠశాలల, కళాశాలల మైదానాల్ని లేదా జిల్లాలో ఆధునిక సౌకర్యాలున్న స్టేడియాలను ఉపయోగించుకోవాలి.
నా ప్రసంగాన్ని ముగించే ముందు, క్రీడారంగంలో కేరళ సాధించిన ప్రగతిని నేను ప్రశంసించి తీరాలి. భారతదేశం కోసం ఆడిన ప్రతి కేరళ క్రీడాకారునికి నా అభినందనలు. ఆటలో శ్రేష్ఠత కోసం నిత్యం శ్రమించే క్రీడాకారులకు నేను వందనమాచరిస్తున్నాను.
ఉషా స్కూల్ కు కూడా బంగారు భవిష్యత్తు లభించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. నూతనమైన సిన్ థెటిక్ ట్రాక్ క్రీడాకారులు, క్రీడాకారిణులు నూతన శిఖరాలు చేరడానికి తోడ్పడాలి. అలాగే, 2020లో జరిగే టోక్యో ఒలంపిక్స్ సహా ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీల కోసం మన సన్నాహాలకు తన వంతు సహాయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను.
భారతీయ క్రీడాకారులు కొన్ని లక్ష్యాలను విధించుకొని శ్రమించాలని 2022 కల్లా అంటే దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి వీలుగా ఆ లక్ష్యాలను అందుకోవడానికి కృషి చేయాలని నేను కోరుతున్నాను.
ఒలంపిక్స్ లోను, ప్రపంచ స్థాయి పోటీల్లోను ఉండే ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాల్లో అనేక మంది చాంపియన్ లను ఉషా స్కూల్ అందిస్తుందనే నమ్మకం నాకుంది. అథ్లెటిక్స్ లో మీరు ఉన్నతిని సాధించడానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని మీకు అందిస్తుంది. శాయశక్తుల మీకు సాయపడుతుంది.
మీకు ఇవే నాధన్యవాదాలు.
బహుధా ధన్యవాదాలు.
I heartily congratulate all sports enthusiasts on the inauguration of the synthetic track in ''Usha School of Athletics': PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) June 15, 2017
P.T. Usha has been a shining light of sports in India: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) June 15, 2017
Sports is an important investment for the human resource development of a society: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) June 15, 2017
Sports can be expanded to mean S for Skill; P for Perseverance; O for Optimism; R for Resilience; T for Tenacity; S for Stamina: PM
— narendramodi_in (@narendramodi_in) June 15, 2017
We have no dearth of talent. But we need to provide right kind of opportunity & create an ecosystem to nurture the talent: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) June 15, 2017
Women in our country have made us proud by their achievements in all fields- more so in sports: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) June 15, 2017
During earlier decades there was an environment in which sports was not pursued as a career. Now this thinking has begun to change: PM
— narendramodi_in (@narendramodi_in) June 15, 2017
A strong sporting culture can help the growth of a sporting economy: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) June 15, 2017