నా సహచరుడు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు,
విదేశాల నుండి విచ్చేసిన చమురు, గ్యాస్ శాఖల మంత్రులు
హైడ్రోకార్బన్ రంగానికి చెందిన నిపుణులు మరియు సిఇఒలు
ప్రముఖ అతిథులు, లేడీస్ అండ్ జెంటిల్ మెన్.
ఆర్థిక ప్రగతికి కీలకమైన చోదక శక్తి ఇంధనం. ఆర్థికాభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టుడుగు స్థాయి ప్రజావళికి అందాలంటే సుస్థిరమైన, సరసమైన, ఆధారపడదగిన ఇంధనం చాలా అవసరం. రానున్న పలు సంవత్సరాల ఇంధన అవసరాలకు హైడ్రోకార్బన్ లే కీలకంగా నిలుస్తాయి. “భవిష్యత్తుకు ఇంధనం హైడ్రో కార్బన్ లు- ఎంపికలు మరియు సవాళ్ళు” అన్న విషయాన్ని ఈ సమావేశం కోసం ఎంచుకోవడం సమయానుకూలమైంది, అర్ధవంతమైందీనూ.
భారతదేశం ప్రపంచంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతోంది. పలు విధానపరమైన చర్యలు వృద్ధికి ఊతం ఇస్తున్నాయి. స్వల్పకాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక వృద్ధి, సామాజిక సుసంపన్నతకు ఆధారనీయంగా నిలిచే విధానాలకే మేం ప్రాధాన్యం ఇస్తున్నాము. మా ప్రయత్నాల ఫలితాలు దేశాభివృద్ధిలో ప్రతిఫలిస్తున్నాయి. <.p>
త్వరితగతిన అభివృద్ధి చెందడమే కాదు.. ఎన్నో ఇతర ఆర్థిక వ్యవస్థల కన్నా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత సుస్థిరంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తి అస్థిరతలో అల్లాడిపోతున్న వాతావరణంలో భారతదేశం అన్ని ప్రతికూలతలను తట్టుకొని నిలబడి అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తోంది. మా కరెంట్ ఖాతా లోటు క్రమక్రమంగా మెరుగుపడుతూ జూన్ త్రైమాసికం నాటికి దశాబ్ది కనిష్ఠ స్థాయికి దిగివచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డి ఐ) ప్రపంచవ్యాప్తంగా క్షీణించిన వాతావరణంలో కూడా భారతదేశంలో మాత్రం 2015-16 సంవత్సరంలో చారిత్రక గరిష్ఠ స్థాయిలకు చేరాయి. భారతీయ బ్యాకింగ్ రంగం ప్రపంచంలోని ప్రధాన దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలన్నింటితో పోల్చితే తక్కువ ఆటుపోట్లు ఎదుర్కొంటోందని బ్యాంక్ ఆఫ్ ఇంటర్ నేషనల్ సెటిల్మెంట్స్ తేల్చి చెప్పింది.
2040 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరుగుతుందని అంచనా. 2013 నుండి 2040 మధ్య కాలంలో అంతర్జాతీయంగా పెరగనున్న ఇంధన గిరాకీలో నాలుగో వంతు భారతదేశానిదేనని కూడా అంచనాలు వెలువడ్డాయి. 2040 సంవత్సరంలోమొత్తం యూరప్ వినియోగించే మొత్తం చమురు కన్నా భారతదేశమే అధికంగా చమురును వినియోగిస్తుందని అంచనా. 2022 నాటికి జి డి పి లో తయారీ రంగం వాటా ఇప్పుడు ఉన్న 16 శాతం నుండి 25 శాతానికి చేరుతుందని అంచనా.
రవాణా మౌలిక వసతులు కూడా రానున్న కాలంలో ఎన్నో రెట్లు పెరుగుతాయంటున్నారు. ప్రస్తుతం దేశంలో వాణిజ్య వాహనాల సంఖ్య 13 మిలియన్ ఉండగా 2040 నాటికి 56 మిలియన్ కు చేరుతుందని భావిస్తున్నారు. పౌర విమానయాన రంగంలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఎనిమిదో పెద్ద విపణిగా నిలవగా 2034 నాటికి మూడో పెద్ద విపణిగా మారుతుందని అంచనా. విమానయాన రంగంలో ఈ వృద్ధితో 2040 నాటికి విమాన ఇంధనం గిరాకీ కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇవన్నీ దేశంలో ఇంధనానికి గిరాకీ గణనీయంగా పెరిగేందుకు దోహదకారి అయ్యే అంశాలే.
మిత్రులారా,
భారతదేశ వృద్ధి క్రమంలో హైడ్రోకార్బన్ లు రానున్న కాలంలో కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. త్వరిత గతిన సాగుతున్న వృద్ధి భారత ఇంధన రంగంపై అధిక బాధ్యతను మోపింది. ఈ అంశంపై చర్చించేందుకు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి భారతదేశానికి, విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఇక్కడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారి అనుభవాలు, నైపుణ్యాలు మనకు ఎంతో ప్రయోజనకరమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని హైడ్రోకార్బన్ ల రంగం నుండి ఆశిస్తున్నదేమిటి, ఇంధన భద్రత సాధించే దిశగా చేస్తున్న ప్రయత్నాలేమిటి అన్న అంశాల్లో నా భావాలు మీతో పంచుకోవాలనుకొంటున్నాను.
భారతదేశపు భవిష్యత్తుపై నా విజన్ లో సార్వత్రికంగా ఇంధన రంగానికి, ప్రత్యేకంగా హైడ్రోకార్బన్ ల రంగానికి కీలక పాత్ర ఉంది. ఇంధన ప్రణాళికలలో సాధారణ అవసరాలే కాకుండా పేదలకు కూడా అది అందుబాటులో ఉండడం ప్రధానమని నేను భావిస్తున్నాను. ఇంధన వినియోగం మరింత సమర్థవంతంగా ఉండాలన్నది నా భావన. ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరునిగా వాతావరణ మార్పులు, ఉద్గారాల తగ్గింపు, సుస్థిరమైన అభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ అస్థిరతలు తీవ్ర స్థాయిలో ఉన్న ప్రస్తుత వాతావరణంలో ఇంధన భద్రత భారతదేశానికి అత్యంత కీలకం.
భారతదేశ భవిష్యత్ ఇంధన ప్రణాళిక పై నా విజన్ లోని నాలుగు ప్రధానాంశాలు ఏవంటే:
– ఇంధనం అందుబాటు
– ఇంధనం సమర్థత
– ఇంధన స్థిరత్వం
– ఇంధన భద్రత
ఇంధనం అందుబాటులో ఉండే అంశం గురించి పరిశీలిద్దాము. భారతదేశం లోని నిరుపేదలు ఆహారం తయారుచేసుకొనేందుకు ఒక పక్క పొయ్యిలకు కట్టెలు కొనుగోలు చేస్తుంటే, సంపన్నులు హైబ్రిడ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. వంట అవసరాల కోసం కట్టెలు, ఇతర బయోమాస్ ను వినియోగం గ్రామీణ మహిళల ఆరోగ్యానికి అపాయకారి. ఇది వారిలోని ఉత్పాదక శక్తిని కూడా తగ్గిస్తుంది. అందుకే 50 మిలియన్ కుటుంబాలకు వంట గ్యాస్ ను అందుబాటులోకి తెచ్చేందుకు మేం ఉజ్జ్వల పథకాన్ని అమలుచేస్తున్నాము. ఈ ఒకే కార్యక్రమం మూడు రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది, హానికరమైన వ్యర్థాలను నిర్మూలించడం కూడా సాధ్యమవుతుంది. ఒక్కో కనెక్షన్ జారీకి అయ్యే సొమ్మును ప్రభుత్వం భరిస్తుంది, వంట గ్యాస్ కొనుగోలు పూర్తి వ్యయాలను వినియోగదారులు భరిస్తారు. కేవలం ఏడు నెలల కాలంలో ఈ పథకం కింద ఇప్పటికే 10 మిలియన్ కొత్త కనెక్షన్ లను మంజూరు చేశాము.
వచ్చే ఐదేళ్ళ కాలంలో 10 మిలియన్ ఇళ్ళకు గొట్టాల ద్వారా సహజవాయువును అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వం లక్ష్యం. జాతీయ గ్యాస్ గ్రిడ్ నెట్ వర్క్ ను ప్రస్తుత 15,000 కిలోమీటర్ల నుండి 30,000 కిలోమీటర్లకు పెంచేందుకు మేము కట్టుబాటు ప్రకటించాము. మిలియన్ ల కొద్దీ కొత్త ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యం ఉన్న, తక్కువ అభివృద్ధికి మాత్రమే నోచుకున్న ఈశాన్య ప్రాంతానికి కొత్త గ్యాస్ పైప్ లైన్ ను నిర్మిస్తున్నాము. 2018 మార్చి నాటికి దేశంలోని ప్రతి ఒక్క గ్రామానికి విద్యుత్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
ఇప్పుడు ఇంధన సామర్థ్యం విషయాన్ని పరిశీలిద్దాము. భారతదేశ వాణిజ్య రవాణా రంగం దశదిశలుగా విస్తరిస్తోంది. అధిక పరిమాణంలో వస్తువులు రహదారి మార్గంలోనే రవాణా అవుతున్నాయి. ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు నా ప్రభుత్వం రైల్వేల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2014-15 నుండి 2016-17 మధ్య కాలంలో రైల్వే పెట్టుబడులు వంద శాతం పైబడి పెంచాము. కేవలం సరకు రవాణాకే ఉపయోగించే కారిడర్ ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాము. ముంబై-అహమ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడర్ ను నిర్మిస్తున్నాము. ఇది విమానయానం కన్నా మెరుగైన ఇంధన సామర్థ్యం గల ప్రాజెక్టు. దేశాంతర్గత, కోస్తా మార్గాలు రెండింటిలోనూ జల రవాణాను మెరుగుపరిచేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మేము చేపట్టిన సాగర్ మాల ప్రాజెక్టు యావత్తు కోస్తా ప్రాంతాన్ని అనుసంధానం చేస్తుంది. పెద్ద నదులలో కొత్త దేశాంతర్గత షిప్పింగ్ రూట్ లను మేము ప్రారంభించాము. ఈ చర్యలన్నీ ఇంధన సామర్థ్యాన్ని పెంచేవే. ఎంతో కాలంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వస్తు రవాణా పన్ను (జిఎస్ టి) బిల్లుకు ఆమోదం పొందాము. ఇది రాష్ట్రాల మధ్య భౌతిక సరిహద్దులను చెరిపివేయడమే కాకుండా సుదూర ప్రాంతాలకు రవాణా వసతులను ఏర్పరచి సామర్థ్యాలను మరింతగా పెంచుతుంది.
ఇంధన ధరల నిర్ణయం ఎంత సునిశితమైందో వర్థమాన దేశాల ఆయిల్ శాఖ మంత్రులందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మేం పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణ నుండి తొలగించాము. వంట గ్యాస్ ధరలను కూడా మార్కెట్ నిర్ణయించగలుగుతోంది. మార్కెట్ ధరల నుండి పేద, అల్పాదాయ వర్గాలకు రక్షణ కల్పించేందుకు వంట గ్యాస్ 169 మిలియన్ ఖాతాదారులకు సబ్సిడీని వారి ఖాతాలలోనే జమ చేస్తున్నాము. దీని వల్ల వంట గ్యాస్ సబ్సిడీలో లీకేజిలను అరికట్టి దుర్వినియోగం నివారించగలిగాము. తద్వారా భారీ పరిమాణంలో ధనం ఆదా అవుతోంది. ఈ చర్యలు కూడా ఇంధన వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి.
ఇంధన సుస్థిరత నాకు సంబంధించినంత వరకు అత్యంత పవిత్రమైన బాధ్యత. దీనిని భారతదేశం ఒక నిర్బంధంగా కాకుండా ఒక కట్టుబాటుగా చేపట్టింది. జి డి పి లో కర్బన వ్యర్థాల సాంద్రతను వచ్చే ఐదేళ్ళ కాలంలో 2005 నాటి స్థాయి నుండి 30 శాతం మేరకు తగ్గించేందుకు వచనబద్ధతను ప్రకటించింది. తలసరి ఇంధన వినియోగం చాలా తక్కువగా ఉన్నప్పటికీ మేము ఈ చర్యను చేపట్టాము. 2030 నాటికి 40 శాతం ఇంధనాన్ని శిలాజేతర ఇంధనాల నుండి ఉత్పత్తి చేయాలని మేము నిర్ణయించాము. 2022 నాటికి 175 గీగా వాట్ ల నవీకరణయోగ్య ఇంధన ఉత్పత్తిని సాధించాలన్న భారీ లక్ష్యాన్ని నేను నిర్దేశించాను. మా ప్రయత్నాలు ఫలించి నవీకరణయోగ్య ఇంధన సామర్థ్యాలు పెరగడంతో పాటు ఇంధన ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. ఎల్ ఇ డి లైటింగ్ కు కూడా మేము అత్యధిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నాము.
సి ఎన్ జి, ఎల్ పి జి, బయో ఇంధనాలు రవాణా రంగానికి స్వచ్ఛమైన ఇంధనాలుగా నిలుస్తాయి. బీడు భూములలో బయో డీజిల్ ను ఉత్పత్తి చేసేందుకు, అందుకు వ్యవసాయదారులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు గల అవకాశాలు మనం అన్వేషించాల్సి ఉంది. దేశ భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చేందుకు రెండో తరం, మూడో తరానికి చెందిన బయోఇంధనాలపై పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.
ఇంక ఇంధన భద్రతపై మనము దృష్టి సారిద్దాము. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకొని దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పాదకతను పెంచేందుకు మనం ప్రయత్నించాల్సి ఉంది. 2022 నాటికి దిగుమతులపై ఆధారపడడాన్ని 10 శాతం మేరకు తగ్గించాలన్న లక్ష్యాన్ని నేను నిర్దేశించాను. నానాటికీ పెరిగిపోతున్న ఇంధన వినియోగం నేపథ్యంలో మనం దీనిని సాధించాల్సి ఉంది.
దేశీయంగా హైడ్రోకార్బన్ ఉత్పత్తిని పెంచేందుకు మేము శక్తివంతమైన, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకమైన విధానం అనుసరిస్తున్నాము. సుమారు రెండు దశాబ్దాల క్రితం భారతదేశం కొత్త అన్వేషణ లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ఈ రంగంలో వంద శాతం ఎఫ్ డి ఐ ని అనుమతించింది. భారతదేశ చమురు రంగంలో ప్రైవేటు రంగం పెట్టుబడులు పెట్టేందుకు, కార్యకలాపాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయింది. అయినప్పటికీ ఇంకా ఎన్నో అవరోధాలకు భారతదేశ ఆయిల్, గ్యాస్ రంగం ఎదురీదుతోంది.
ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి భారతదేశాన్ని ఆకర్షణీయ గమ్యంగా మార్చేందుకు మేం కొత్తగా హైడ్రోకార్బన్ ల అన్వేషణ, ఉత్పత్తి విధానం తీసుకువచ్చాము. షేల్ ఆయిల్, కోల్ బెడ్ మీథేన్ లతో సహా అన్ని రకాల హైడ్రో కార్బన్ ల అన్వేషణకు, ఉత్పత్తికి ఒకే లైసెన్సును ఈ విధానం అమలులోకి తెచ్చింది.
– ఓపెన్ యాకరేజ్ విధానం వల్ల ఎంత విస్తీర్ణంలో కార్యకలాపాలు చేపట్టేది ఎంచుకునే అవకాశం బిడ్డర్లకు ఏర్పడింది.
– వివాదాలకు అతీతంగా ఉంచేందుకు లాభాల భాగస్వామ్యం స్థానంలో రెవిన్యూ భాగస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టాము.
– ఈ క్షేత్రాల నుండి ఉత్పత్తి చేసే ముడి చమురు, సహజ వాయువు రెండింటిపైన మార్కెటింగ్, ధరల నిర్ణయంలో స్వేచ్ఛ ఇచ్చాము.
గత ఏడాది మేము మార్జినల్ ఫీల్డ్స్ పాలిసిని ప్రకటించాము. ఈ విధానం కింద 67 క్షేత్రాలను బిడ్డింగ్ కు పెట్టాము. ఈ క్షేత్రాలన్నింటిలోనూ కలుపుకొని 90 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, సహజవాయు నిల్వలు ఉన్నాయని అంచనా. వాటిలో కనీసం 30 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలను రికవరీ చేయగలమని అంచనా. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ప్రోత్సాహకరమైన స్పందన వచ్చింది. అంతర్జాతీయ కంపెనీలు కూడా బిడ్డింగ్ లో పాల్గొన్నాయి.
డౌన్ స్ట్రీమ్ విభాగం కూడా ఇప్పుడు ఎంతో ఓపెన్ గా మార్కెట్ శక్తులు స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగించుకొనేందుకు అనుకూలంగా ఉంది. ఈ విధంగా ఏర్పడే పోటీ మార్కెటింగ్ కంపెనీల సామర్థ్యాన్ని, సమర్థతను పెంచుతుంది.
మా క్రియాశీలమైన విదేశాంగ విధానం, ఇంధన దౌత్యం ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలను కూడా పటిష్ఠం చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. మరింతగా చమురును అన్వేషించేందుకు మన చమురు, గ్యాస్ రంగంలోని కంపెనీలు విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకొనేందుకు ఇది అనుకూలమైనది. ఇటీవలే 5.6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రష్యాలోని హైడ్రోకార్బన్ ఆస్తుల కొనుగోలు ఇందుకు ఒక మంచి ఉదాహరణ. భారత ఇంధన కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా మారాలి. భారతదేశం-మధ్య ప్రాచ్యం, భారతదేశం-మధ్య ఆసియా, భారతదేశం-దక్షిణ ఆసియా భాగస్వామ్యాల ఏర్పాటు దిశగా కృషి చేయాలి.
తదుపరి తరం శిలాజ ఇంధనాల్లో సహజవాయువు ఒకటి. అది చౌకైనది, తక్కువ కాలుష్య కారకం. మేము గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాము. దేశీయ గిరాకీని తట్టుకోగల విధంగా సహజవాయువు ఉత్పత్తిని పెంచడంతో పాటు దిగుమతి మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశ నవీకరణయోగ్య ఇంధన ఉత్పత్తి పెరుగుతున్న కొద్ది సహజ వాయువు అత్యంత కీలకమైన సమతూక పాత్ర పోషిస్తుంది. సమతూకమైన, విద్యుత్తు గిరాకీ అధికంగా ఉండే సమయంలో అవసరమైన విద్యుత్తును అందుబాటులో ఉంచేందుకు గ్యాస్ ఆధారిత విద్యుత్తు అత్యంత కీలకం.
మిత్రులారా, ఈ విజన్ సాకారం కావాలంటే మనం ప్రాజెక్టు నిర్వహణలో, వనరుల నిర్వహణలో మరింత సమర్థవంతంగా మారాలి. పోటీలో నిలబడడానికి సామర్థ్యాల నిర్మాణం అత్యంత కీలకమైంది. దీని వల్ల మన రిఫైనింగ్, ప్రాసెసింగ్ సామర్థ్యాలు పెరగడంతో పాటు ప్రాజెక్టులను సరైన సమయానికి, సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతాము.
మేధోసంపత్తి సామర్ధ్యాలు, పారిశ్రామిక ధోరణులలో భారతదేశం ఎప్పుడూ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. “మేక్ ఇన్ ఇండియా”, “స్టార్టప్ ఇండియా”, “స్టాండప్ ఇండియా” వంటి కార్యక్రమాల ద్వారా ఆయిల్ గ్యాస్ రంగానికి చెందిన సరికొత్త ఆలోచనా ధోరణులు, అన్వేషణలతో ముందుకు వచ్చే అవకాశం యువతకు ఏర్పడింది. రిఫైనింగ్, నానో టెక్నాలజీ, కాటలిస్ట్ డెవలప్ మెంట్, బయో ఇంధనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాల విభాగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను రూపొందించే అంశంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఆయిల్ రూపొందించిన ఇండ్ మాక్స్ టెక్నాలజీ ఇందుకు చక్కని ఉదాహరణ, ఇది ప్రస్తుతం వాణిజ్యపరంగా ఆచరణీయం చేసే కృషి జరుగుతోంది.
మిమ్మల్ని అందరినీ భారతదేశానికి రమ్మంటూ, మేక్ ఇన్ ఇండియా లో పాలు పంచుకొమ్మంటూ ఆహ్వానిస్తున్నాము. అంతర్జాతీయంగా హైడ్రోకార్బన్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు నా సందేశం ఇదే. మేము నిరంతరం చేస్తున్న ప్రయత్నాల కారణంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో భారతదేశం ర్యాంకింగ్ ఎంతో మెరుగుపడింది. మా వచనబద్ధత బలీయమైనటువంటిది. కాలయాపన స్థానంలో సుస్వాగతం పలికే విధానాన్ని తీసుకురావడమే మా లక్ష్యం.
మిత్రులారా,
నానాటికీ పెరుగుతున్న ఇంధన గిరాకీని తట్టుకొనేందుకు ఆధారపడదగిన, సరసమైన ఇంధన వనరులు అవసరం. ఈ మిశ్రమంలో హైడ్రో కార్బన్ లదే కీలక పాత్ర. అదే సమయంలో పర్యావరణపరంగా కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హైడ్రోకార్బన్ లు మరింత సమర్థవంతంగాను, సుస్థిరంగాను భవిష్యత్తు ఇంధన అవసరాలను తీర్చడంలో కీలక భూమికను కొనసాగించేందుకు అవసరమైన అన్వేషణాత్మకమైన ఆలోచనలను ఈ సమావేశం చర్చకు తెస్తుందని నేను నమ్ముతున్నాను.
ప్రభుత్వం నుండి సాధ్యమైనంత మద్దతును అందిస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడకు వచ్చి భారతదేశ ఇంధన రంగ పరివర్తనలో భాగం పంచుకొంటున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.
While global economy goes through uncertainty, India has shown tremendous resilience. FDI is at the highest level: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
India's economy is expected to grow five fold by 2040: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
We expect growth in manufacturing, transport, civil aviation among other sectors: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
Hydrocarbons will continue to play an important part in India's growth: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
Energy in general and hydrocarbons in particular are an important part of my vision for India’s future: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
India needs energy which is accessible to the poor. It needs efficiency in energy use: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
Energy sustainability, for me, is a sacred duty. It is something India does out of commitment, not out of compulsion: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
We need to increase our domestic oil and gas production and reduce import dependence: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
My message to global hydrocarbon companies is: we invite you to come and Make in India: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
Our commitment is strong and our motto is to replace Red Tape with Red Carpet: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
To meet the increasing demand, we need affordable and reliable sources of energy: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016
We must also be sensitive towards the environment: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 5, 2016