ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లఖ్‌నవూ లో ఈ రోజు జరిగిన కృషి కుంభ్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
రైతులు పాలుపంచుకొంటున్న ఈ కార్యక్రమం వ్యవసాయ రంగం లో మెరుగైన అవకాశాల ను ఏర్పరచగలదన్న, వ్యవసాయ రంగం లో అనుసరించవలసిన నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఒక కొత్త బాట ను పరచగలదన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
ఆహార ధాన్యాల సేకరణ ను గణనీయంగా పెంచడం లో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. దేశాన్ని ముందుకు తీసుకుపోయేది రైతులే అని ఆయన స్పష్టం చేశారు. 2022వ సంవత్సరం కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ వచన బద్ధత ను ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఉత్పత్తి ఖర్చు లను తగ్గించడానికి మరియు లాభాలను పెంచడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలను ఒకదాని తరువాత మరొకటిగా ఆయన ప్రస్తావించారు. సౌర శక్తి ఆధారంగా పని చేసే పంపుల ను సమీప భవిష్యత్తు లో దేశమంతటా పొలాల్లో పెద్ద సంఖ్య లో అమర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. విజ్ఞాన శాస్త్రం యొక్క లాభాల ను వ్యవసాయ రంగానికి అందించడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు. వారాణసీ లో ఏర్పాటు చేస్తున్న వరి పరిశోధన కేంద్రం ఈ దిశగానే వేస్తున్నటువంటి ఒక అడుగు అని ఆయన వెల్లడించారు.
వ్యవసాయం లో విలువ జోడింపునకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. ఫూడ్ ప్రాసెసింగ్ రంగం లో తీసుకొంటున్న చర్యల ను ఆయన వివరించారు. హరిత విప్లవం అనంతరం ప్రస్తుతం పాల ఉత్పత్తి, తేనె ఉత్పత్తి లతో పాటు కోళ్ళ పెంపకం, ఇంకా చేపల పెంపకం పైన కూడా శ్రద్ధ తీసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
జల వనరుల ను అవసరాలకు తగినంత మేరకు ఉపయోగించుకోవడం, నిలవకై ఉత్తమ సాంకేతికతను వినియోగించుకోవడం, వ్యవసాయం లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం వంటి అంశాల పైన ఈ కృషి కుంభ్ లో చర్చలు జరపాలంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. కొత్త సాంకేతికత లను రూపొందించవలసిన అవసరాన్ని గురించి, అలాగే పంట కోతల అనంతర అవశేషాలను మండించడాన్ని నివారించేందుకు తోడ్పడే పద్ధతుల ను కనుగొనవలసిన ఆవశ్యకత ను గురించి ఆయన నొక్కి పలికారు.