“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భారత గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్న ఆది మహోత్సవ్”
“21 వ శతాబ్దపు భారతదేశం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రం వైపు సాగుతోంది”
“గిరిజన సమాజపు సంక్షేమం నా వ్యక్తిగత సంబంధానికి, ఉద్వేగానికి సంబంధించిన అంశం”
“గిరిజన సంప్రదాయాలను దగ్గరగా చూశా, వాటితో మమేకమై ఎంతో నేర్చుకున్నా”
“గిరిజన కీర్తితో కనీవినీ ఎరుగనంత గర్వంతో దేశం ముందుకెళుతోంది”
“దేశంలో ఏ మూలన ఉన్నా, గిరిజన పిల్లల విద్య నాకు ప్రధానాంశం”
“ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయటం వల్లనే దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది”

జాతీయ గిరిజన మహోత్సవమైన ఆది మహోత్సవ్ ను ఢిల్లీలోని మేజర్ ధ్యాన చంద్ నేషనల్ స్టేడియంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజన సంస్కృతిని జాతీయ వేదికమీద ప్రదర్శించే ప్రయత్నమే ఆది మహోత్సవ్. ఆ విధంగా గిరిజనుల సంస్కృతి, హస్త కళలు, ఆహార సంప్రదాయాన్ని, వాణిజ్యాన్ని, సంప్రదాయ కళలను ప్రదర్శించే వార్షిక కార్యక్రమమిది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ (ట్రైఫెడ్) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని ముందుగా భగవాన్  బిర్సా ముండాకు పుష్పాంజలి ఘటించి ఎగ్జిబిషన్ లోని స్టాల్స్ అన్నీ కలియదిరిగారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభనుద్దేశించి ప్రసంగిస్తూ, “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భారత గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్న కార్యక్రమం ఆది మహోత్సవ్” అని అభివర్ణించారు.  గిరిజన సమాజాల ప్రతిష్ఠాత్మక శకటాలను ప్రస్తావిస్తూ, ఇలా విభిన్నమైన వర్ణమయమైన అలంకరణలు, సాంప్రదాయాలు, కళారూపాలు, సంగీత రూపకాలు చూడటం చాలా ఆనందదాయకమన్నారు.  భారతదేశంలో అంతా భుజం భుజం కలిపి నడుస్తారనటానికి, వైవిధ్యానికి ఈ ఆది మహోత్సవ్ నిదర్శనంగా నిలుస్తోందని ప్రధాని అభివర్ణించారు.“ఆది మహోత్సవ్ ఆనంతాకాశం లాంటిది. భారతదేశపు వైవిధ్యం రంగురంగుల ఇంద్రధనుస్సును పోలి ఉంటుంది” అన్నారు.  ఇంద్రధనుస్సు రంగులన్నీ ఏకం కావటాన్ని పోల్చి చెబుతూ దేశంలో వైవిధ్యం మొత్తం ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ ను చాటుటూ సూదిలో దారంలా అంతర్లీనంగా ఉన్నప్పుడే  ఏకత్వం చాటుకున్నట్టవుతుందన్నారు.  ఈ విధంగా భారతదేశం యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు.  ‘ఆది మహోత్సవ్’ భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ సాంస్కృతిక వారసత్వంతోబాటే అభివృద్ధి అనే మాటకు మరింత బలం చేకూరుస్తోందన్నారు.

21 వ శతాబ్దపు భారతదేశం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రం వైపు సాగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మారుమూల అని పేరుబడ్డ చోట్లకే ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం వెళుతోందని, అలా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను, ప్రజలను ప్రధాన స్రవంతిలో కలుపుతోందని ప్రధాని చెప్పారు. ఆది మహోత్సవ్ లాంటి కార్యక్రమాలు ఇప్పుడొక ఉద్యమంలా తయారయ్యాయని, ఎన్నో కార్యక్రమాలలో తాnu స్వయంగా పాల్గొంటున్నానని ప్రధాని చెప్పారు.  గిరిజన సమాజపు సంక్షేమం తన  వ్యక్తిగత సంబంధానికి, ఉద్వేగానికి సంబంధించిన అంశమన్నారు.  సామాజిక కార్యకర్తగా తాను గిరిజనులతో  కలసి పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. “గిరిజన సంప్రదాయాలను దగ్గరగా చూశా, వాటితో మమేకమై ఎంతో నేర్చుకున్నా” అన్నారు. తన జీవితంలో ముఖ్యమైన కాలం గిరిజన ప్రాంతమైన ఉమర్ గాం నుంచి అంబాజీ దాకా గడిపానన్నారు. దేశం గురించి, సంప్రదాయాల గురించి గిరిజన జీవితం తనకు చాలా నేర్పిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. 

గిరిజన కీర్తితో కనీవినీ ఎరుగనంత గర్వంతో దేశం ముందుకెళుతోందని ప్రధాని అన్నారు. విదేశీ ప్రముఖులకు తానిచ్చే బహుమతులలో గిరిజన ఉత్పత్తులకు ప్రముఖ స్థానం ఉంటున్నదన్నారు. అంతర్జాతీయ వేదికలమీద భారతీయలకు గర్వకారణంగా గిరిజన సంస్కృతిని చాటుతున్నామన్నారు. అది భారత సంస్కృతిలో విడదీయలేని అంశమనే కోణంలో చాటిచెబుతున్నామన్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు లాంటి అంతర్జాతీయ సమస్యలకు గిరిజనుల జీవన విధానంలో పరిష్కారమార్గాలు ఉన్నాయనే సంగతి అడుగడుగునా చెబుతున్నామన్నారు. సుస్థిరాభివృద్ధి విషయంలో స్ఫూర్తినిచ్చి  గిరిజనులు బోధించాల్సింది ఎంతో ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని ప్రస్తావించారు. ఈ ఉత్పత్తులు మార్కెట్ లో బాగా విస్తరించాలని, వాటికి డిమాండ్ పెరగాలని ఆకాంక్షించారు.  వెదురును ఉదహరిస్తూ, గత ప్రభుత్వం వెదురు పంట కోయటాన్ని నిషేధించిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని గడ్డి జాతిలో చేర్చటం ద్వారా నిషేధాన్నుంచి తప్పించిందని ప్రధాని గుర్తు చేశారు. వన్ ధన్ మిషన్ గురించి వివరిస్తూ, వివిధ రాష్ట్రాలలో 3000 కు పైగా వన్ ధన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. 90 అటవీ ఉత్పత్తులు ఎం ఎస్ పి పరిధిలోకి చేర్చామని చెప్పారు. 2014 తరువాత ఈ సంఖ్య 7 రెట్లు పెరిగిందని గుర్తు చేశారు. అదే విధంగా, స్వయం సహాయక బృందాల నెట్ వర్క్ పెరగటం వలన గిరిజన సమాజం ఎంతగానో లబ్ధి పొందగలుగుతోందన్నారు. ప్రస్తుతం దేశంలో 80 లక్షల స్వయం సహాయక బృందాలలో కోటీ 25 లక్షలమంది గిరిజన సభ్యులున్నారన్నారు.

గిరిజన కళలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం గిరిజన యువత కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్న విషయం ప్రధాని గుర్తు చేశారు. ఈ సంవత్సరం బడ్జెట్ గురించి చెబుతూ, సంప్రదాయ హస్త కళాకారుల కోసం పిఎం విశ్వకర్మ యోజన ప్రారంభించామన్నారు.  దీనివలన ఆర్థిక సహాయం అందించటంతోబాటు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్ సహాయం అందుతాయన్నారు.

“గిరిజన విద్యార్థులు దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, వారి చదువు, వారి భవిష్యత్తు నా తొలి ప్రాధాన్యం” అన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 2004-2014 మధ్య 80 ఉండగా ఐదు రెట్లు పెరిగి 2014-22 మధ్య 500 కు చేరిందన్నారు. ఇప్పటికే 400 కు పైగా స్కూళ్ళు పనిచేస్తూ లక్షమంది పిల్లలకు బోధిస్తున్నాయన్నారు.  ఈ సంవత్సరం బడ్జెట్లో ఈ స్కూళ్లకు 38 వేలమంది బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు ప్రకటించామన్నారు. గిరిజన విద్యార్థుల స్కాలర్ షిప్పులు రెట్టింపయ్యాయన్నారు.

భాష అవరోధంగా మారటం వల్ల గిరిజన యువత  ఎదుర్కుంటున్న కష్టాల గురించి ప్రస్తావిస్తూ,  ప్రధాని నూతన విద్యా విధానాన్ని గుర్తు చేశారు. యువత తమ మాతృభాషలో నేర్చుకునే వెసులుబాటు కల్పించామన్నారు.  “మన గిరిజన పిల్లలు, యువత తమ స్వంత భాషలో చదువుకొని పురోగతి చెందటమన్నది  ఇప్పుడు వాస్తవ రూపం ధరించింది.” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే దేశం ఎదుగుతోందన్నారు. చిట్టచివర ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే పురోగతి మార్గం దానంతట అదే విస్తరిస్తుందన్నారు.  గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఆకాంక్షాపూరిత జిల్లాలుగా గుర్తించి అభివృద్ధి చేయటాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు.  2014 తో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సరం గిరిజనులకు ఇచ్చిన బడ్జెట్ 5 రెట్లు పెరిగిందన్నారు. నిర్లక్ష్యానికి గురైన యువత ఇప్పుడు ఇంటర్నెట్, మౌలిక సదుపాయాల కారణంగా ప్రధాన స్రవంతిలో కలుస్తున్నారన్నారు.   దేశంలోని మారుమూల ప్రాంతాల వారికి సైతం సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ నినాదం చేరిందని, ఇదే ‘ఆది, ఆధునికత’ల మేళవింపు అని ప్రధాని అభివర్ణించారు.

“మనం మన గతాన్ని కాపాడుకోవాలి. మన ప్రస్తుత విధి నిర్వహణను శిఖరాగరాలకు తీసుకు వెళ్ళాలి. భవిష్యత్తులో మన కలలు సాకారమయ్యేట్టు చూసుకోవాలి” అన్నారు. ఈ విధమైన మన ఆలోచనను, పట్టుదలను ముందుకు తీసుకు పోవటానికి ‘ఆది మహోత్సవ్’ లాంటి కార్యక్రమాలు ఒక మాధ్యమంగా ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ రాష్ట్రాలలో నిర్వహిస్తూ, దీన్నో ఉద్యమంలా ముందుకు తీసుకుపోవాలని ప్రధాని పిలుపునిచ్చారు

శతాబ్దాల తరబడి గిరిజనుల ఆహారంలో భాగమైన ముతక ధాన్యాలు ఇప్పుడు చిరుధాన్యాలుగా అంతర్జాతీయ ఖ్యాతి పొందాయని, అందుకే ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రదర్శించిన ‘శ్రీ అన్న’ ఆహార పదార్థాల రుచి, గుబాళింపు  తనను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు.  గిరిజన ప్రాంతాలలోని ఆహారం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, దీనివలన ప్రజల ఆరోగ్యం మెరుగు పడటంతోబాటు గిరిజన రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, అందరూ కలసికట్టుగా కృషి చేస్తే అభివృద్ధి చెందిన భారత్ కళను సాకారం చేసుకోగలుగుతామన్నారు.    

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి శ్రీ అర్జున్ ముండా, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  శ్రీమతి రేణుకా సింగ్ సురుతా, శ్రీ బిశ్వేశ్వర్ తుడు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ట్రైఫెడ్ ఛైర్మన్ శ్రీ శ్రీరామ సిన్హ్ రాత్వా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

గిరిజనుల సంస్కృతి, హస్త కళలు, ఆహార సంప్రదాయాన్ని, వాణిజ్యాన్ని, సంప్రదాయ కళలను ప్రదర్శించే వార్షిక కార్యక్రమమే ఆది మహోత్సవ్.  గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ (ట్రైఫెడ్) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.  ఢిల్లీలోని మేజర్ ధ్యాన చంద్ స్టేడియంలో ఫిబ్రవరి 16 నుంచి 27 దాకా ఈ ఉత్సవం జరుగుతోంది.   

నేపథ్యం

దేశంలోని గిరిజనుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవటం ప్రధాని ప్రాధాన్యాలలో కీలకమైనది. అదే సమయంలో దేశాభివృద్ధికి గిరిజనులు చేస్తున్న కృషిని గుర్తించి గౌరవించటంలోనూ ప్రధాని ముందున్నారు. గిరిజనుల సంస్కృతిని జాతీయ స్థాయిలో ప్రదర్శించే కృషిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని మేజర్  ధ్యాన చంద్ నేషనల్ స్టేడియంలో మెగా జాతీయ గిరిజన ఉత్సవమైన ‘ఆది మహోత్సవ్’ ను ప్రారంభించారు.

దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు తమ సుసంపన్నమైన, వైవిధ్య భరితమైన సాంస్కృతిక సంపదను ప్రదర్శించటానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఇందులో 200 కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. 1000 కి పైగా గిరిజన హస్త కళాకారులు ఈ మహోత్సవ్ లో పాల్గొంటున్నారు. 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటిస్తున్నందున  ఇతర హస్త కళారూపాలు, చేనేత, కూడయకళారూపాలు, ఆభరణాలతోబాటు గిరిజనులు సాగు చేసే శ్రీ అన్న ధాన్యాలను కూడా ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi