దేశంలోని విభిన్న ప్రాంతాలను గుజరాత్ లోని కెవాడియాతో అనుసంధానం చేసే ఎనిమిది రైళ్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో పచ్చజెండా ఊపారు. ఈ రైళ్లు గుజరాత్ లోని ఐక్యతా విగ్రహానికి నిరంతర అనుసంధానత కల్పిస్తాయి. అలాగే ధబోల్-చందోడ్ మధ్య రైల్వేలైను బ్రాడ్ గేజ్ గా మార్పిడి, ప్రతాప్ నగర్-కెవాడియా మధ్య రైల్వే విద్యుదీకరణ, ధబోల్, చందోడ్, కెవాడియా స్టేషన్ల కొత్త భవనాల నిర్మాణం ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, రైల్వే మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశచరిత్రలోనే తొలిసారిగా ఒకే గమ్యానికి విభిన్న ప్రాంతాల నుంచి పలు రైళ్లు ప్రారంభించడం జరిగి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఐక్యతా విగ్రహం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టులున్న నగరం కావడమే కెవాడియా ప్రాధాన్యం పెరగడానికి కారణమని ఆయన వివరించారు. రైల్వేల ముందు చూపు, సర్దార్ పటేల్ ఉద్యమ స్ఫూర్తికి నేటి సంఘటన సజీవ నిదర్శనమని ఆయన అన్నారు.
పురుచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కెవాడియాకు రైలు సర్వీసు ప్రారంభం కావడాన్ని ప్రస్తావిస్తూ భారతరత్న ఎంజిఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నివాళి అర్పించారు. అటు చలనచిత్రాల్లోను, ఇటు రాజకీయ వేదిక పైన ఆయన వేసిన ముద్రను శ్రీ మోదీ ప్రశంసించారు. ఎంజిఆర్ రాజకీయ జీవితం అంతా పేదలకే అంకితం చేశారని, అణచివేతకు గురవుతున్న వర్గాలకు గౌరవనీయమైన జీవితం అందించేందుకు ఆయన నిరంతరాయంగా శ్రమించారని ప్రధానమంత్రి అన్నారు. ఆయన కలలు సాకారం చేసేందుకు తాము కృషి చేస్తున్నామంటూ ఆయనకు జాతి అందించిన గౌరవం చెన్నై రైల్వే స్టేషన్ కు ఎంజిర్ పేరు పెట్టడమని శ్రీ మోదీ చెప్పారు.
చెన్నై, వారణాసి, రేవా, దాదర్, ఢిల్లీ నగరాలను కెవాడియాతో అనుసంధానం చేస్తూ కొత్త రైలు సర్వీసులు ప్రారంభించడంతో పాటు కెవాడియా-ప్రతాప్ నగర్ మధ్య మెము సర్వీసు ప్రారంభించడం, ధబోల్-చందోడ్ మధ్య బ్రాడ్ గేజి నిర్మాణం, చందోడ్-కెవాడియా రైలుమార్గం విద్యుదీకరణ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తాయని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులు పర్యాటకులకే కాకుండా ఆదివాసీలకు కూడా ప్రయోజనం కల్పిస్తాయని, కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఆయన అన్నారు. ఈ రైల్వే లైను కర్నాలి, పోయిచా, నర్మదపై ఉన్న గరుడేశ్వర్ కు అనుసంధానత కల్పిస్తుందని ఆయన చెప్పారు.
కెవాడియా అభివృద్ధి యానం గురించి ప్రస్తావిస్తూ కెవాడియా ఇక ఏ మాత్రం మారుమూల ప్రాంతం కాదని, ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎక్కువ మంది పర్యాటకులను ఐక్యతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) ఆకర్షిస్తున్నదని ఆయన అన్నారు. ఆ విగ్రహాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా పర్యాటకులు సందర్శించారని ఆయన చెప్పారు. కరోనా నెలల కాలంలో దాన్ని మూసివేసినా ఇప్పుడు తిరిగి పర్యాటకులను ఆకర్షిస్తున్నదని ఆయన తెలిపారు. కనెక్టివిటీ మెరుగుపడితే రోజుకి లక్ష మంది పర్యాటకులు వస్తారని అంచనా అన్నారు. ఆర్థిక రంగం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి, పర్యావరణను కాపాడుతూనే పరిసర ప్రాంతాల అభివృద్ధికి కెవాడియా చక్కని ఉదాహరణ అని ప్రధానమంత్రి తెలిపారు.
కెవాడియాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ఒక కలగానే కనిపించిందని, సరైన రోడ్లు, వీధి దీపాలు, రైల్వే సర్వీసులు, పర్యాటకుల విడిది కేంద్రాలు లేకపోవడం వల్ల ఆ నిరాశ అధికంగా ఉండేదని ప్రధానమంత్రి అన్నారు. ఇప్పుడు కెవాడియా అన్ని రకాల వసతులతో సంపూర్ణ ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని ఆయన తెలిపారు. ఐక్యతా విగ్రహం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, విశాలమైన సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్, ఆరోగ్య వ్యాన్, జంగిల్ సఫారీ, పోషన్ పార్క్ వంటి ఆకర్షణలు ఇప్పుడు కెవాడియాలో ఉన్నట్టు ఆయన చెప్పారు. అలాగే గ్లో గార్డెన్, ఎకతా క్రూయిజ్, వాటర్ స్పోర్ట్స్ వంటి వసతులు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. టూరిజం పెరగడంతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రజలకు ఆధునిక వసతులు కూడా అందుబాటులోకి వచ్చినట్టు ఆయన చెప్పారు. ఏక్ తా మాల్ లో స్థానిక హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి మంచి అవకాశాలున్నట్టు ఆయన తెలిపారు. ఆదివాసీ గ్రామాల్లో ఇంటి వద్ద వసతులతో కూడిన 200 గదులు కూడా అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
నానాటికీ పెరుగుతున్న టూరిజంను దృష్టిలో ఉంచుకుని కెవాడియా స్టేషన్ అభివృద్ధి చేయడంపై కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. అలాగే ఐక్యతా విగ్రహం కనిపించేలా గిరిజన ఆర్ట్ గ్యాలరీ కూడా ఏర్పాటయిందన్నారు.
లక్ష్య ఆధారిత ప్రయత్నంతో భారతీయ రైల్వే పరివర్తన చెందుతున్న తీరును కూడా ప్రధానమంత్రి సవివరంగా ప్రస్తావించారు. సాంప్రదాయికంగా ప్రయాణికులు, వస్తు రవాణా పాత్రనే కాకుండా రైల్వేలు విభిన్న పర్యాటక, మత ప్రాధాన్యం గల కేంద్రాలను కూడా అనుసంధానం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అహ్మదాబాద్-కెవాడియా జనశతాబ్దితో పాటు పలు రూట్లలో “విస్టా డోమ్ కోచ్” లు ప్రత్యేక ఆకర్షణ అని ఆయన అన్నారు.
రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిలో మారిన వైఖరిని ప్రధానమంత్రి వివరించారు. గతంలో అందుబాటులో ఉన్నమౌలికవసతులతోనే సరిపెట్టుకునే వారని, కొత్త ఆలోచనలు చేయలేదని, కొత్త టెక్నాలజీలు ప్రవేశపెట్టడానికి ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించలేదని ప్రధానమంత్రి అన్నారు. ఈ వైఖరి మార్చడం తప్పనిసరి అయిందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో మొత్తం రైల్వే వ్యవస్థను సమగ్ర స్థాయిలో పరివర్తన చేసేందుకు కృషి జరిగిందంటూ రైల్వే బడ్జెట్ లో మార్పులు చేయడంతో పాటు కొత్త రైళ్ల ప్రకటనలు కూడా వెలువడడం గురించి ప్రస్తావించారు. ఇంకా ఎన్నో విభాగాల్లో పరివర్తన చోటు చేసుకుందని చెప్పారు. కెవాడియాను అనుసంధానం చేసేందుకు ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టు బహుముఖీన వైఖరికి దర్పణమని చెబుతూ రికార్డు సమయంలో పలు ప్రాజెక్టులు పూర్తవుతున్నట్టు ఆయన చెప్పారు.
పాతకాలం నాటి ధోరణి మారిందనేందుకు ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఉదాహరణ అని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఇటీవలే ఈస్టర్న్, వెస్టర్న్ సరకు రవాణా కారిడార్లను జాతికి అంకితం చేశారు. 2006-2014 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రాజెక్టు పురోగతి కేవలం కాగితాలకే పరిమితమని, ఒక్క కిలోమీటర్ ట్రాక్ నిర్మాణం కూడా జరగలేదని ప్రధానమంత్రి తెలిపారు. త్వరలోనే 1100 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణం పూర్తవుతున్నదని ఆయన తెలిపారు.
ఇప్పటివరకు అనుసంధానత లేని ప్రాంతాలకు కొత్తగా కనెక్టివిటీ కల్పిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. బ్రాడ్ గేజ్, విద్యుదీకరణ ప్రాజెక్టుల వేగం పెంచడంతో పాటు మరింత వేగాన్ని తట్టుకునేలా ట్రాక్ లు సిద్ధం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. దీని వల్ల సెమీ హై స్పీడ్ రైళ్ల ప్రయాణానికి మార్గం సుగమం కావడమే కాకుండా హై స్పీడ్ సామర్థ్యాల కల్పన దిశగా కదులుతున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచినట్టు ప్రధానమంత్రి చెప్పారు.
రైల్వేలను పర్యావరణ మిత్రంగా తీర్చిదిద్దుతున్నట్టు ప్రధానమంత్రి ప్రత్యేకించి చెప్పారు. కెవాడియా రైల్వే స్టేషన్ దేశంలో గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఉన్న తొలి రైల్వే స్టేషన్ కానున్నదని ఆయన అన్నారు.
రైల్వే తయారీ, టెక్నాలజీలో ఆత్మనిర్భరత ప్రాధాన్యం, అది ఇప్పుడు అందిస్తున్న సత్ ఫలితాల గురించి ఆయన నొక్కి చెప్పారు. అధిక హార్స్ పవర్ గల విద్యుత్ లోకోమోటివ్ భారత్ లోనే తయారుచేయడం వల్ల ప్రపంచంలోనే సుదీర్ఘ దూరం ప్రయాణించగల రెండింతలు పొడవుండే కంటైనర్ రైలును భారతదేశం ప్రపంచంలోనే తొలిసారిగా ప్రారంభించగలిగిందని ఆయన అన్నారు. ఈ రోజున దేశంలోనే తయారైన ఆధునిక రైళ్లు భారత రైల్వేలో చేరాయని ప్రధానమంత్రి చెప్పారు.
రైల్వే పరివర్తనకు అవసరం అయిన ప్రత్యేక నైపుణ్యాలు గల మానవ సిబ్బంది అవసరం ఉన్నదన్న విషయం కూడా ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ లక్ష్యంతోనే వడోదరాలో డీమ్డ్ రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ఈ తరహా సంస్థ ఉన్న దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటేనని ఆయన అన్నారు. రైల్ రవాణా, బహుళ రంగాలకు ప్రాతినిథ్యం గల పరిశోధన, శిక్షణ విభాగాల్లో ఆధునిక వసతుల అవసరం ఉన్నట్టు ఆయన చెప్పారు. వర్తమాన, భవిష్యత్ రైల్వేను నడిపే సామర్థ్యం గల 20 రాష్ర్టాలకు చెందిన ప్రతిభావంతులైన యువకులకు శిక్షణ ఇస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పరిశోధన, నవకల్పనల మద్దతుతో రైల్వే ఆధునీకరించేందుకు ఇది సహాయకారిగా ఉంటుందని చెబుతూ ప్రధానమంత్రి ముగించారు.