ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మరియు త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ బిప్లబ్ కుమార్ దేబ్ లు కలసి బాంగ్లాదేశ్ లో మూడు ప్రాజెక్టు లను ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ ఢిల్లీ నుండి, అలాగే బాంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఢాకా నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు.
ఈ ప్రాజెక్టులలో.. (ఎ) ఇప్పటికే అమలులో ఉన్న బాంగ్లాదేశ్ లోని భీరామరా, భారతదేశం లోని బహరమ్‌పుర్ ఇంటర్ కనెక్షన్ ద్వారా భారత్ నుండి బాంగ్లాదేశ్ కు 500 మెగా వాట్ల అదనపు విద్యుత్తు సరఫరా, (బి) అఖౌఢా- అగర్తల రైలు లింకు మరియు (సి) బాంగ్లాదేశ్ రైల్వేస్ కు చెందిన కులావుర- శాబాజ్‌పుర్ సెక్షన్ పునరావాసం.. భాగంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మొదట తాను బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారితో ఇటీవల కొంత కాలంగా కాఠ్‌మాండూ లో జరిగిన బిఐఎమ్ఎస్‌టిఇసి సమావేశం, శాంతినికేతన్ లో జరిగిన సమావేశం, ఇంకా లండన్ లో జరిగిన కామన్‌వెల్త్ శిఖర సమ్మేళనం సహా అనేక పర్యాయాలు భేటీ అయిన సంగతి ని గుర్తుకు తెచ్చుకొన్నారు.
ఇరుగు పొరుగు దేశాల నేతల మధ్య సంబంధాలు కూడా ఇరుగుపొరుగు వారి వలెనే ఉండాలని, ప్రోటోకాల్ వంటివి చూసుకోకుండా తరచుగా మాట్లాడుకొంటూ, సందర్శనలకు చొరవ తీసుకొంటూ బంధాన్ని కొనసాగించాలనేది తన అభిప్రాయమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విధమైన సాన్నిహిత్యాన్నే బాంగ్లాదేశ్ ప్రధాని కి మరియు తనకు మధ్య తరచుగా జరిగిన ముఖాముఖి సంభాషణలు స్పష్టం చేస్తున్నాయని ఆయన చెప్పారు.
సంధాన సదుపాయాన్ని 1965వ సంవత్సరం కన్నా పూర్వం స్థాయి కి పునరుద్ధరించిన బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారి యొక్క దార్శనికత ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఈ లక్ష్యాన్ని చేరే దిశ గా నిలకడతనం తో కూడిన పురోగతి నమోదు అయినందుకు తాను సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రోజు మనం విద్యుత్తు సంబంధ సంధానాన్ని పెంపొందించుకొన్నామని, అలాగే మన రైల్వే సంధానాన్ని వృద్ధి చేసుకొనేందుకు రెండు ప్రాజెక్టులను ఆరంభించుకొన్నామని ఆయన అన్నారు. 2015వ సంవత్సరం లో బాంగ్లాదేశ్ లో తాను పర్యటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో బాంగ్లాదేశ్ కు 500 మెగా వాట్ల విద్యుత్తు ను అదనంగా సరఫరా చేయాలని నిర్ణయించడమైందన్నారు. పశ్చిమ బెంగాల్ కు, బాంగ్లాదేశ్ కు మధ్య ఉన్నటువంటి ట్రాన్స్ మిశన్ లింకు ను ఉపయోగించుకొంటూ, ఈ పని ని పూర్తి చేస్తున్నట్లు ఆయన చెబుతూ, ఈ పని పూర్తి కావడం లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అందించిన సహకారానికి గాను ఆమె కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పథకం పూర్తి అయినందున 1.16 గీగా వాట్ల విద్యుత్తు ను ప్రస్తుతం భారతదేశం నుండి బాంగ్లాదేశ్ కు సరఫరా చేయడం జరుగుతోందన్నారు. మెగా వాట్ల నుండి గీగా వాట్ల దిశగా సాగిన ఈ యాత్ర భారతదేశానికి, బాంగ్లాదేశ్ కు మధ్య నెలకొన్న సంబంధాలలో ఓ స్వర్ణ యుగానికి ప్రతీక గా నిలుస్తోందని ఆయన అన్నారు.
అఖౌడా-అగర్తలా రైల్వే సంధానం ప్రాజెక్టు రెండు దేశాలకు మధ్య సీమాంతర సంధానం లో మరొక లంకె ను సమకూర్చుతోందని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ పని పూర్తి కావడం లో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ బిప్లబ్ కుమార్ దేబ్ తోడ్పాటు ను అందించినందుకుగాను ఆయనకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు.
బాంగ్లాదేశ్ ను 2021 వ సంవత్సరాని కల్లా ఒక మధ్యాదాయ దేశం గా, 2041వ సంవత్సరాని కల్లా ఒక అభివృద్ధి చెందిన దేశం గా మార్పు చేసేందుకు ప్రధాని శేఖ్ హసీనా గారు నిర్దేశించుకొన్న అభివృద్ధి లక్ష్యాలను ప్రధాన మంత్రి ప్రశంసించారు. రెండు దేశాల మధ్య, రెండు దేశాల ప్రజల మధ్య నెలకొన్నటువంటి సన్నిహిత సంబంధాలు మన అభివృద్ధి ని, సమృద్ధి ని నూతన శిఖరాలకు తీసుకుపోతాయని ఆయన అన్నారు.