సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం ఉన్నతమైన సేవలను ప్రశంసించడం, పని ని మదింపు చేసుకొని ఆత్మపరిశీలన చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయన అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ అవార్డులు ప్రభుత్వ ప్రాధాన్యాలను సూచించేవి కూడా అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఇంకా డిజిటల్ పేమెంట్స్ తదితర ప్రాధాన్య కార్యక్రమాలకు అవార్డులను ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమాలు న్యూ ఇండియా నిర్మాణంలో ముఖ్యమైన కార్యక్రమాలు అని ఆయన వివరించారు. ప్రైం మినిస్టర్స్ అవార్డుల పైన, ఇంకా మహత్త్వాకాంక్ష కలిగిన జిల్లాలలో కొనసాగుతున్న కార్యక్రమాల పైన ఈ రోజు విడుదలైన రెండు పుస్తకాలను గురించి కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.
మహత్త్వాకాంక్ష కలిగిన జిల్లాల విషయమై ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈ 115 జిల్లాలు తమ తమ రాష్ట్రాల వృద్ధికి చోదక శక్తులు కాగలుగుతాయన్నారు. అభివృద్ధిలో జన్ భాగీదారీ కి.. అంటే ప్రజల యొక్క భాగస్వామ్యానికి.. ప్రాముఖ్యం ఉందని ఆయన నొక్కిపలికారు. మన స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న భారతదేశాన్నిఆవిష్కరించే దిశగా కృషి చేసేందుకు- మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యే 2022వ సంవత్సరం- ఒక స్ఫూర్తి కాగలుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.
పరిపాలన ను మెరుగుపరచేందుకు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం సహా అందుబాటు లో ఉన్న అన్ని విధాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వెలుగు లోకి వస్తున్న నూతన సాంకేతికతలపై అవగాహన ను ఏర్పరచుకోవడం సివిల్ సర్వెంట్ లకు ముఖ్యం అని ఆయన అన్నారు.
దేశంలోని సివిల్ సర్వెంట్స్ గొప్ప సామర్ధ్యం కలిగిన వారు అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఈ సామర్థ్యాలు దేశ ప్రజల ప్రయోజనం కోసం భారీ స్థాయి లో తోడ్పాటు ను అందించగలవని ఆయన అన్నారు.