ఢిల్లీ లోని ప్రధాన మంత్రి నివాసంలో ఈ రోజు సోమనాథ్ ట్రస్ట్ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ శ్రీ కేశుభాయ్ పటేల్ అస్వస్థత కారణంగా సమావేశానికి హాజరు కాకపోవడంతో శ్రీ ఎల్.కె. అద్వానీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ హర్షవర్ధన్ నియోతియా, శ్రీ పి. కె. లహిరి మరియు శ్రీ జె.డి. పరమార్ లు కూడా ధర్మకర్తలుగా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ధర్మకర్త గా కొత్తగా నియమితుడైన శ్రీ అమిత్ భాయ్ షా కు మండలి ఆహ్వానం పలికింది.
సోమనాథ్ ను ప్రాచీన వారసత్వ తీర్థయాత్ర స్థలంగాను, పర్యటన స్థలంగాను అభివృద్ధిపరచవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. సోమనాథ్ లోని వేరు వేరు పథకాల పురోగతి తో పాటు సోమనాథ్ ను సందర్శిస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడాన్ని ట్రస్టు సమీక్షించింది. సోమనాథ్ కు ఒక కోటి మంది యాత్రికులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, సర్వతోముఖ అభివృద్ధి కోసం అధునాతనమైన మౌలిక సదుపాయాలను సమకూర్చే దిశగా చొరవ తీసుకోవలసి ఉందని కూడా ధర్మకర్తలు అన్నారు. సామాజిక మాధ్యమాలలో సోమనాథ్ ను అనుసరిస్తున్న వారు ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారు.
చరిత్రతో ముడి పడి ఉన్న విభిన్న లంకెలను నిరూపించడానికి వేరు వేరు ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టాలని ప్రధాన మంత్రి సూచన చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర సంబంధి ఆకర్షణ కార్యక్రమాలను వర్చువల్ రియాలిటీ షో లను భవిష్యత్తు ప్రణాళికలో భాగం చేసి అమలులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. అలాగే, వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలను సిసిటివి పహరా నెట్ వర్క్ లోకి చేర్చాలని కూడా ఆయన సలహా ఇచ్చారు.
ఆరు కిలోగ్రాముల బంగారాన్ని భారతదేశ ప్రభుత్వ గోల్డ్ మానిటైజేశన్ స్కీమ్ లో జమ చేయాలని కూడా సోమనాథ్ ట్రస్ట్ నిర్ణయించింది.