ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లోని శివసాగర్ లో భూమి లేని స్థానికుల కు భూమి కేటాయింపు ధ్రువ పత్రాల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో అసమ్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి శ్రీ రామేశ్వర్ తేలీ కూడా పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అసమ్ లో ఒక లక్ష కు పైగా స్థానిక కుటుంబాలు భూమి హక్కు ను అందుకొంటుండడంతో, శివసాగర్ లో ప్రజా జీవితం లో ఓ పెద్ద ఆందోళన దూరమైందన్నారు. ఈ నాటి కార్యక్రమం అసమ్ లోని స్థానిక ప్రజల ఆత్మ గౌరవంతోను, స్వాతంత్య్రంతోను, భద్రత తోను జత పడిందని ఆయన అన్నారు. దేశం కోసం చేసిన త్యాగాలకు ప్రసిద్ధి చెందిన శివసాగర్ ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. అసమ్ చరిత్ర లో శివసాగర్ కు ఉన్న ప్రాముఖ్యాన్ని ఆయన లెక్క లోకి తీసుకొంటూ, దేశం లో 5 అత్యంత పురావస్తు సంబంధ ప్రదేశాల లో శివసాగర్ ను చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందన్నారు.
దేశం నేతాజీ ని ఆయన 125వ జయంతి నాడు గుర్తుకు తెచ్చుకొంటూ ఉన్న వేళ, ఈ నెల 23వ తేదీ ని ‘పరాక్రమ్ దివస్’ గా జరుపుకొంటున్నామన్నారు. ఈ రోజు న ‘న్యూ ఇండియా’ ను నిర్మించడం కోసం ఒక స్ఫూర్తి గా ‘పరాక్రమ్ దివస్’ నాడు దేశమంతటా అనేక కార్యక్రమాలు కూడా ఆరంభం అవుతున్నాయని ఆయన చెప్పారు. నేతాజీ పరాక్రమం, నేతాజీ త్యాగం మనకు ఇప్పటికీ ప్రేరణ ను అందిస్తున్నాయన్నారు. భారత రత్న భూపేన్ హజారికా రాసిన ద్విపదలను ఉదాహరిస్తూ భూమి తాలూకు ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేశారు.
‘‘ఓ ముర్ ధరిత్రి ఆయీ,
చోరోనోటే డిబా థాయీ,
ఖేతియోకోర్ నిస్తార్ నాయీ,
మాటీ బినే ఓహోహాయీ.’’
ఈ మాటలకు - ధరిత్రి మాతా, మీ పాదాల వద్ద నాకు కొంత చోటు ను ఇవ్వండి. మీరు లేకుండా ఒక రైతు ఏమి చేయగలుగుతాడు? భూమి లేనిదే అతడు నిస్సహాయుని గా మిగిలిపోతాడు - అని అర్థం.
స్వాతంత్య్రం తరువాత అనేక సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ, అసమ్ లో అంతకు ముందు భూమి పరంగా వంచనకు లోనైన కుటుంబాలు లక్షల సంఖ్య లో ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. సోనోవాల్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చేటప్పటికి, 6 లక్షల మందికి పైగా ఆదివాసీలకు వారి భూమి అని చెప్పుకొనేందుకు ఎలాంటి పత్రాలూ లేవు అని కూడా ఆయన అన్నారు. సోనోవాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త భూ విధానాన్ని, అసమ్ ప్రజల పట్ల ఆ ప్రభుత్వ నిబద్ధత ను ఆయన కొనియాడారు. అసమ్ లో సిసలైన నివాసితుల దీర్ఘకాలిక డిమాండు భూమి లీజు కారణం గా నెరవేరిందన్నారు. ఇది లక్షల కొద్దీ ప్రజల కు మెరుగైన జీవన ప్రమాణానికి బాటను పరచిందని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం భూమి హక్కు ను దఖలు పరచుకొన్న ఈ లబ్ధిదారుల కు వారు ఇదివరకు వంచనకు గురైన పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, పంట బీమా పాలిసీ వంటి అనేక ఇతర పథకాల ప్రయోజనం విషయం లో సైతం హామీ లభిస్తుందని ఆయన అన్నారు. ఇది మాత్రమే కాకుండా, వారు బ్యాంకుల నుంచి రుణాలను కూడా పొందగలుగుతారని ఆయన చెప్పారు.
అసమ్ లో ఆదివాసీల కు సామాజిక పరిరక్షణ కోసం, సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వం కంకణం కట్టుకొందని ప్రధాన మంత్రి అన్నారు. అస్సామీ భాష ను, సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యల ను తీసుకోవడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. అదే మాదిరి గా, ప్రతి సముదాయం లో మహనీయ వ్యక్తుల ను సమ్మానించడం జరిగిందన్నారు. ధార్మిక ప్రాముఖ్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యం గల చరిత్రాత్మకమైన వస్తువుల ను పరిరక్షించడానికి అనేక ప్రయత్నాలు గడచిన నాలుగున్నర సంవత్సారాల కాలం లో జరిగాయని ఆయన అన్నారు. కాజీరంగ జాతీయ ఉద్యానాన్ని ఆక్రమణల బారి నుంచి విముక్తం చేయడానికి, ఆ పార్కు ను మెరుగుపరచడానికి వేగవంతమైన చర్యల ను కూడా తీసుకోవడం జరుగుతోందని ఆయన చెప్పారు.
ఒక స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం అసమ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని శీఘ్రం గా అభివృద్ధి చేయడం అవసరం అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అసమ్ స్వయంసమృద్ధం కావాలి అంటే దానికి అసమ్ ప్రజల విశ్వాసం కీలకం అని ఆయన అన్నారు. ప్రాథమిక సౌకర్యాలు అందుబాటు లో ఉన్నప్పుడు, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పుడు విశ్వాసం వృద్ధి చెందుతుందన్నారు. కొన్ని సంవత్సరాలు గా ఈ రెండు అంశాల లో అసమ్ లో ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత కృషి జరిగింది అని ఆయన అన్నారు. అసమ్ లో దాదాపు 1.75 కోట్ల మంది పేదలకు జన్ ధన్ బ్యాంకు ఖాతాల ను తెరవడమైందన్నారు. ఈ ఖాతా ల వల్ల కరోనా కాలం లో వేల కొద్దీ కుటుంబాల బ్యాంకు ఖాతాల లోకి డబ్బు నేరు గా బదిలీ అయిందన్నారు. అసమ్ లో సుమారు 40 శాతం జనాభా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధి లోకి వచ్చారని చెప్పారు. వీరిలో దాదాపు 1.5 లక్షల మంది ఉచిత చికిత్స ను అందుకొన్నారన్నారు. అసమ్ లో టాయిలెట్ సదుపాయం కవరేజి గత ఆరేళ్ళ లో 38 శాతం నుంచి 100 శాతాని కి పెరింగిందన్నారు. అయిదు సంవత్సరాల క్రితం 50 శాతం కంటే తక్కువ కుటుంబాలు విద్యుత్తు సౌకర్యాన్ని కలిగివుండగా, ప్రస్తుతం దాదాపు గా 100 శాతం కుటుంబాలకు ఈ సౌకర్యం ఉందని చెప్పారు. అసమ్ లో , జల్ జీవన్ మిశన్ లో భాగం గా, గడచిన ఒకటిన్నర ఏళ్ళ కాలం లో 2.5 లక్షల కు పైగా ఇళ్ళ కు నల్లా నీటి కనెక్షన్ లను సమకూర్చడమైందన్నారు.
ఈ సౌకర్యాలు ఎక్కువగా మహిళల కు ప్రయోజనకరంగా ఉంటాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘ఉజ్జ్వల యోజన’ 35 లక్షల కుటుంబాల తాలూకు వంట ఇళ్ల లో గ్యాస్ కనెక్షన్ లను తీసుకు వచ్చింది, ఆ కుటుంబాల లో 4 లక్షల కుటుంబాలు ఎస్ సి/ఎస్ టి కేటగిరీ కి చెందినవి అని ప్రధాన మంత్రి అన్నారు. ఎల్‌పిజి గ్యాస్ కవరేజి 2014 లో 40 శాతం ఉన్నది కాస్తా ఇప్పుడు 99 శాతానికి చేరిందన్నారు. ఎల్‌పిజి పంపిణీదారుల సంఖ్య 2014 లో 330గా ఉండగా, 576 కు చేరుకొందన్నారు. కరోనా కాలం లో 50 లక్షల కు పైగా ఉచిత సిలిండర్ లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ‘ఉజ్జ్వల’ ఈ ప్రాంత మహిళల కు జీవించడం లో సౌలభ్యాన్ని అందించిందని, కొత్త పంపిణీ కేంద్రాలు నూతన ఉద్యోగాల ను తీసుకు వచ్చాయని చెప్పారు.
తన ప్రభుత్వం అనుసరిస్తున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ సూత్రాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ప్రభుత్వం అన్ని వర్గాల కు అభివృద్ధి తాలూకు ప్రయోజనాలను అందిస్తోందన్నారు. చాలా కాలం గా నిర్లక్ష్యం బారిన పడ్డ చయ్ తెగ హోదా ను పెంచడానికి అనేక చర్యల ను తీసుకొన్న సంగతి ని ఆయన ప్రస్తావించారు. ఈ తెగ కు చెందిన వారి ఇళ్ళ లో టాయిలెట్ సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని, ఈ తెగ బాలలు విద్య ను అభ్యసిస్తున్నారని, ఈ తెగకు చెందిన వారికి ఆరోగ్య సదుపాయాలను, ఉపాధి ని అందించడం జరుగుతోందన్నారు. చయ్ తెగ సభ్యుల కు బ్యాంకింగ్ సౌకర్యాల ను అందించడం జరుగుతోందని, మరి వారు వివిధ పథకాల ప్రయోజనాల ను వారి ఖాతాల లో అందుకొంటున్నారన్నారు. శ్రామికుల నాయకుడు సంతోష్ తోప్నో వంటి వారి నేత ల విగ్రహాల ను స్థాపించడం ద్వారా ఈ తెగ తాలూకు తోడ్పాటు ను గుర్తించడం జరుగుతోందని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
ప్రతి ఒక్క తెగ ను కలుపుకు పోవడం అనే సిద్ధాంతం కారణంగా అసమ్ లోని ప్రతి ప్రాంతం శాంతి పథం లో, పురోగతి పథం లో సాగిపోతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. చరిత్రాత్మకమైన బోడో ఒప్పందం తో అసమ్ లో ఒక పెద్ద భాగం ప్రస్తుతం శాంతిపథం లోకి, అభివృద్ధి పథం లోకి తిరిగి వచ్చిందన్నారు. ఒప్పందం కుదిరిన తరువాత బోడోలాండ్ ప్రాదేశిక మండలి కి ఇటీవల ప్రతినిధులను ఎన్నుకోవడం తో, అభివృద్ధి కి సరికొత్త స్వరూపం ఆవిష్కారం కాగలదన్న ఆశ ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
సంధానం, ఇతర మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం గత ఆరేళ్ళ లో తీసుకొన్న చర్యలను గురించి ప్రధాన మంత్రి వివరించారు. తూర్పు ఆసియా దేశాల తో భారతదేశం సంధానాన్ని వృద్ధి చేయడంలో అసమ్, ఈశాన్య ప్రాంతం ముఖ్య పాత్ర ను పోషిస్తాయన్నారు. అసమ్ లో మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపడ్డ కారణం గా, ఆత్మనిర్భర్ భారత్ తాలూకు ప్రధాన కేంద్రం గా అసమ్ రూపుదిద్దుకొంటోందన్నారు. అసమ్ గ్రామాల లో 11 వేల కిలో మీటర్ల మేర రహదారులు, డాక్టర్ భూపేన్ హజారికా సేతు, బోగిబీల్ వంతెన, సరయ్ ఘాట్ వంతెన లతో పాటు, మరెన్నో వంతెనల ను నిర్మించడమో లేదా నిర్మిస్తూ ఉండటమో జరుగుతోందని, వీటి ద్వారా అసమ్ సంధాన వ్యవస్థ పటిష్టం అయిందని ప్రధాన మంత్రి వివరించారు. దీనికి అదనం గా, బాంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మ్యాంమార్ లతో జల మార్గాల సంధానం పైన కూడా శ్రద్ధ వహించడం జరుగుతోందన్నారు. రైలుమార్గ సంధానం, వాయు మార్గ సంధానం పెరుగుతూ ఉన్నందువల్ల అసమ్ లో పారిశ్రామిక ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. లోకప్రియ గోపీనాథ్ బర్‌దలోయీ అంతర్జాతీయ విమానాశ్రయం లో సరికొత్త ఆధునిక టర్మినల్, కస్టమ్ క్లియరెన్స్ సెంటర్, కోక్ రాఝార్ లో రూప్‌సీ విమానాశ్రయం ఆధునీకరణ, బంగాయీగావ్ మల్టి మోడల్ లాజిస్టిక్స్ హబ్ పథకాలు అసమ్ లో పారిశ్రామిక అభివృద్ధి కి ఒక సరికొత్త ఊతాన్ని అందిస్తాయన్నారు.
దేశాన్ని గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశ లో ముందుకు తీసుకు పోవడంలో అసమ్ ఒక ప్రధానమైన భాగస్వామి గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. అసమ్ లో చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పన పై 40 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టడం జరిగిందన్నారు. గువాహాటీ- బరౌనీ గ్యాస్ గొట్టపు మార్గం ఈశాన్య ప్రాంతానికి, భారతదేశ తూర్పు ప్రాంతానికి మధ్య సంధానాన్ని బలోపేతం చేస్తుందన్నారు. నుమాలీగఢ్ రిఫైనరీ ని ఒక బయో-రిఫైనరీ సదుపాయం తో అభివృద్ధి పరచడం జరిగిందని, దీనితో అసమ్ ఇథెనాల్ వంటి బయోఫ్యూయల్ తాలూకు ఒక ప్రధాన ఉత్పత్తిదారు కాగలుగుతుందన్నారు. త్వరలో ఏర్పాటు కాబోయే ఎఐఐఎమ్ఎస్, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ లు ఈ ప్రాంతం లో యువత కు నూతన అవకాశాలను అందిస్తాయని, దీనిని ఆరోగ్యానికి, విద్య కు ఒక కేంద్రం గా తీర్చిదిద్దుతాయని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.