This nation will always be grateful to the scientists who have worked tirelessly to empower our society: PM
Tomorrow’s experts will come from investments we make today in our people and infrastructure: PM Modi
Science must meet the rising aspirations of our people: Prime Minister
By 2030 India will be among the top three countries in science and technology: PM
The brightest and best in every corner of India should have the opportunity to excel in science: PM Narendra Modi
Seeding the power of ideas and innovation in schoolchildren will broaden the base of our innovation pyramid: PM
For sustainable development, we must take strong measures to focus on Waste to Wealth Management: Shri Modi
Indian space programme has put India among the top space faring nations: PM Modi

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. న‌ర‌సింహ‌న్

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ ఎన్. చంద్ర‌బాబు నాయుడు

శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం, భూ శాస్త్రాల శాఖ కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష్ వ‌ర్ధ‌న్

శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం, భూ శాస్త్రాల శాఖ స‌హాయ‌ మంత్రి శ్రీ వై.ఎస్. చౌద‌రి

జ‌న‌ర‌ల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేష‌న్ ప్రొఫెస‌ర్ డి. నారాయ‌ణ‌రావు

శ్రీ వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం ఉప కులపతి ప్రొఫెస‌ర్ ఎ. దామోద‌రం

విశిష్ట  ప్ర‌తినిధులు

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,

ప‌విత్ర న‌గ‌రం తిరుప‌తిలో సుప్ర‌సిద్ధులైన దేశ‌ విదేశాల‌కు చెందిన శాస్త్రవేత్త‌ల‌తో కొత్త సంవ‌త్స‌రం ప్రారంభించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది.

సువిశాల‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం కేంప‌స్ లో 104వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం (ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్) ను ప్రారంభిస్తున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను.

ఈ సంవత్సర సమావేశాలకు “దేశాభివృద్ధి కోసం శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం” అనే అంశాన్ని థీమ్ గా తీసుకున్నందుకు ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేష‌న్‌ను నేను అభినందిస్తున్నాను.

విశిష్ట ప్ర‌తినిధులారా,

ముందుచూపుతోను, శ్ర‌మ‌శ‌క్తితోను, నాయ‌క‌త్వంతోను మన స‌మాజానికి సాధికారితను కట్టబెట్టేందుకు అహ‌ర‌హం శ్ర‌మించిన శాస్త్రవేత్త‌ల‌కు దేశం ఎల్లప్పటికీ రుణ‌ప‌డి ఉంటుంది.

2016 న‌వంబ‌రులో ప్ర‌ముఖ శాస్త్రవేత్త‌, వ్య‌వ‌స్థ‌ల నిర్మాత డాక్ట‌ర్ ఎం.జి.కె. మేనోన్ ను మ‌నం కోల్పోయాం. ఆయ‌నకు నివాళులు అర్పించడం కోసం మీ అంద‌రితో నేనూ ఒకరుగా చేరుతున్నాను.

విశిష్ట ప్ర‌తినిధులారా,

మ‌నం ఈ రోజు ఎదుర్కొంటున్న వేగం, మార్పుల శ్రేణి ఇదివరకు క‌ని విని ఎరుగ‌నటువంటివి.

ఎలా వ‌స్తున్నాయో కూడా తెలియ‌ని ఈ స‌వాళ్ళ‌ను మ‌నం ఏ విధంగా ఎదుర్కొనాలి ? అమిత ఆస‌క్తితో కూడిన లోతైన శాస్త్రీయ సంప్ర‌దాయం మాత్ర‌మే  స‌రికొత్త వాస్త‌వాల‌ను త్వ‌రితంగా ఆక‌ళింపు చేసుకునేందుకు ఊతంగా నిలుస్తుంది.

మ‌నం ఈ రోజు ప్ర‌జ‌ల పైన‌, మౌలిక వ‌స‌తుల పైన చేసే పెట్టుబ‌డుల నుండే రేప‌టి నిపుణులు ఆవిర్భ‌విస్తారు. న‌వ్య‌తకు ప్రాధాన్యం ఇస్తూ ఫండ‌మెంట‌ల్ సైన్స్ నుంచి అప్లైడ్ సైన్స్ వ‌ర‌కు  భిన్న విభాగాల‌కు చెందిన శాస్త్రీయ ప‌రిజ్ఞానానికి అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తును అందించ‌డానికి నా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.

విశిష్ట ప్ర‌తినిధులారా,

ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ గ‌త రెండు స‌మావేశాలలో జాతి ముందున్న స‌వాళ్ళు, అవ‌కాశాలు రెండింటినీ నేను మీ ముందు ఆవిష్క‌రించాను.
 
మ‌న ముందున్న‌ కీల‌క‌మైన స‌వాళ్ళ‌లో స్వ‌చ్ఛ‌మైన నీరు, ఇంధ‌నం, ఆహారం, ప‌ర్యావ‌ర‌ణం, వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌త‌, ఆరోగ్య‌ సంర‌క్ష‌ణ.. ఇవి కొన్ని.

నానాటికీ పెరుగుతున్న న‌వ్య‌ పంథాతో కూడిన సాంకేతిక ప‌రిజ్ఞానాల‌పై కూడా మ‌నం దృష్టి సారించి, అభివృద్ధి ప‌థంలో ప‌య‌నించేందుకు వాటిని ఉప‌యోగించుకోవాలి. మ‌న సాంకేతిక స‌న్న‌ద్ధ‌త‌ను, పోటీ సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ స‌వాళ్ళు, అవ‌కాశాల‌ను మ‌నం స్ప‌ష్టంగా అంచ‌నా వేయాల్సి ఉంటుంది.  

గ‌త ఏడాది సైన్స్ కాంగ్రెస్ లో విడుద‌ల చేసిన టెక్నాల‌జీ విజ‌న్ 2035 ప‌త్రం ఇప్పుడు 12 కీల‌క‌మైన టెక్నాల‌జీ రంగాల‌కు స‌వివ‌ర‌మైన ప్ర‌ణాళిక‌గా మారుతున్న‌ద‌న్న విష‌యం నా దృష్టికి తెచ్చారు. నీతి ఆయోగ్ కూడా దేశానికి అవ‌స‌ర‌మైన ఒక ప‌రిపూర్ణ‌మైన సైన్స్ అండ్ టెక్నాల‌జీ విజ‌న్ ను రూపొందిస్తోంది.
 
మ‌నంద‌రం ప్ర‌ధానంగా దృష్టి పెట్టాల్సింది అంత‌ర్జాతీయంగా త్వ‌రిత‌గ‌తిన విస్త‌రిస్తున్న సైబ‌ర్- ఫిజిక‌ల్ వ్య‌వ‌స్థ‌. మ‌న‌కు జ‌నాభాప‌రంగా ఉన్న శ‌క్తికి  ఎన‌లేని స‌వాలు విస‌ర‌గ‌ల, ఒత్తిడిని పెంచ‌గ‌ల సామ‌ర్థ్యం దీనికి ఉంది. రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, డిజిట‌ల్ త‌యారీ, బిగ్ డాటా విశ్లేష‌ణ‌, లోతైన అధ్య‌య‌నం, క‌మ్యూనికేష‌న్ ల ప‌రిధి, ఇంట‌ర్ నెట్- ఆఫ్- థింగ్స్ విభాగాల‌పై ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ‌, నైపుణ్యాల వృద్ధి ద్వారా దీన్ని ఒక పెద్ద అవ‌కాశంగా మ‌నం మ‌లుచుకోగ‌లుగుతాం.

సేవ‌లు, త‌యారీ రంగాలలోను, వ్య‌వ‌సాయం, నీరు, ఇంధ‌నం, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ రంగాలలోను, ఆరోగ్యం, ప‌ర్యావ‌ర‌ణం, మౌలిక వ‌స‌తులు, జియో  స‌మాచార వ్య‌వ‌స్థలు, భ‌ద్ర‌త‌, ఆర్థిక వ్య‌వ‌స్థ రంగాలలోను, నేరాల‌పై పోరాటంలోను ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను ఉప‌యోగించుకుని అభివృద్ధి చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.

సైబ‌ర్- ఫిజిక‌ల్ సిస్ట‌మ్స్ కు సంబంధించినంతవరకు మౌలికమైన పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) వ‌స‌తులు, మాన‌వ వ‌న‌రులు, నైపుణ్యాల అండతో భ‌విష్య‌త్తును పరిరక్షించుకోగ‌లిగిన ఒక ఇంట‌ర్ మినిస్టీరియ‌ల్  నేషనల్ మిషన్ ను మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

విశిష్ట ప్ర‌తినిధులారా,

భార‌త ద్వీప‌క‌ల్పాన్ని చుట్టుముట్టి ఉన్న స‌ముద్రాలలో 1300కు పైగా దీవులు ఉన్నాయి. అవి మ‌న‌కు ఏడున్న‌ర వేల కిలోమీట‌ర్ల కోస్తాను, 2.4 మిలియ‌న్ చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప్ర‌త్యేక ఆర్థిక మండ‌లిని కూడా అందిస్తున్నాయి.

వాటిలో ఇంధ‌నం, ఆహారం, వైద్యం, ఇంకా ఎన్నో స‌హ‌జ వ‌న‌రులలో అపార‌ అవ‌కాశాలను అవి మ‌న‌కు అందిస్తున్నాయి. మ‌న‌కు సుస్థిర‌మైన భ‌విష్య‌త్తును అందించ‌డంలో స‌ముద్ర ఆర్థిక వ్య‌వ‌స్థ అత్యంత కీల‌క‌మైన‌ది.

బాధ్య‌తాయుత‌మైన విధానంలో ఈ వ‌న‌రుల‌ను అన్వేషించేందుకు, అవ‌గాహ‌న చేసుకునేందుకు,  ఉప‌యోగించుకునేందుకు ఎర్త్ సైన్సుల శాఖ  డీప్ ఓష‌న్ మిష‌న్ రూప‌క‌ల్ప‌నకు కృషి చేస్తున్న‌ట్టు నాకు తెలిసింది. జాతి సుసంప‌న్న‌త‌, భ‌ద్ర‌త దిశ‌గా ఇది ప‌రివ‌ర్తిత అడుగు అవుతుంది.

విశిష్ట ప్ర‌తినిధులారా,

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా మౌలిక ప‌రిశోధ‌న‌ను అత్యుత్త‌మ‌మైన మ‌న శాస్త్ర, సాంకేతిక సంస్థ‌లు మ‌రింత బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. న‌వ‌క‌ల్ప‌న‌ల‌కు, స్టార్ట్- అప్ ల ఏర్పాటుకు, ప‌రిశ్ర‌మ‌కు ఈ మౌలిక ప‌రిజ్ఞానాన్ని ప‌రివ‌ర్తిత శ‌క్తిగా ఉప‌యోగించుకోవ‌డం వ‌ల్ల మ‌నం స‌మ్మిళిత‌, సుస్థిర వృద్ధిని సాధించ‌గ‌లుగుతాం.

శాస్త్రీయ ప్ర‌చుర‌ణ‌లో భార‌తదేశం ప్ర‌పంచంలో ఆరో స్థానంలో ఉన్న‌ట్టు స్కోప‌స్ డాటాబేస్ సూచిస్తోంది. ఈ విభాగంలో ప్ర‌పంచ స‌గ‌టు వృద్ధిరేటు నాలుగు శాతం ఉండ‌గా మ‌నం 14 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. మౌలిక ప‌రిశోధ‌న‌లలో నాణ్య‌త‌ను పెంచ‌డం, టెక్నాల‌జీగా దానికి రూపం క‌ల్పించ‌డం, సామాజిక అనుసంధానం క‌ల్పించ‌డంలో ఎదుర‌వుతున్న స‌వాళ్ళ‌ను మ‌న శాస్త్రవేత్త‌లు దీటుగా ఎదుర్కొంటార‌న్న న‌మ్మ‌కం నాకుంది.

2030 నాటికి శాస్త్ర విజ్ఞాన మరియు సాంకేతిక విజ్ఞాన విభాగంలో ప్ర‌పంచంలోని మూడు అగ్ర‌గామి దేశాలలో భార‌తదేశం ఒక‌టిగా నిలుస్తుంది. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ప్ర‌తిభావంతుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన కేంద్రంగా మారుతుంది. ఈ రోజు మ‌నం వేసిన చ‌క్రాలు ఆ ల‌క్ష్య‌సాధ‌న దిశ‌గా మ‌న‌ని న‌డిపిస్తాయి.

విశిష్ట ప్ర‌తినిధులారా,

నానాటికీ పెరుగుతున్న మ‌న ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను సాధించ‌గ‌ల శ‌క్తిగా సైన్స్ నిల‌వాలి. సామాజిక అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో శాస్త్ర సాంకేతిక‌ విభాగాల శ‌క్తివంత‌మైన పాత్ర‌ను భార‌తదేశం బ‌హుధా ప్ర‌శంసిస్తుంది. ప‌ట్ట‌ణ‌-గ్రామీణ ప్రాంతాల మ‌ధ్య అంత‌రాన్ని పెంచుతున్న స‌మ‌స్య‌ల‌పై మ‌నం దృష్టి సారించాలి. స‌మ్మిళిత అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు మ‌నం కృషి చేయాలి. ఇది సాధ్యం కావాలంటే ఇందులో భాగ‌స్వాములంద‌రినీ ఒక తాటి పైకి తీసుకురాగ‌ల స‌రికొత్త‌ స‌మ‌న్వ‌య వ్య‌వ‌స్థ ఏర్పాటు కావ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.
భారీ, ప‌రివ‌ర్తిత జాతీయ ప్రాజెక్టుల‌ను చేప‌ట్టి అమ‌లు చేసే మ‌న సామ‌ర్థ్యానికి మ‌రింత వ‌న్నె తేవాలంటే అంద‌రినీ ఏకతాటి పైకి తీసుకురాగ‌ల స‌మ‌ర్థ‌ భాగ‌స్వామ్యాలు చాలా అవ‌స‌రం. మ‌న‌లో లోతుగా పాతుకుపోయిన అగాధాల నుండి బ‌య‌ట‌ప‌డి స‌హ‌కార ధోర‌ణిని అనుస‌రించ‌డం ద్వారా మాత్ర‌మే ఈ జాతీయ కార్య‌క్ర‌మాలు ప్ర‌భావ‌వంతం అవుతాయి. అభివృద్ధిలో మ‌న‌కి ఎదుర‌వుతున్న బ‌హుముఖీన‌మైన స‌వాళ్ళ‌ను త్వ‌రిత‌గ‌తిన‌, స‌మ‌ర్థ‌వంతంగా ప‌రిష్క‌రించుకోగ‌లుగుతాం.

మ‌న మంత్రిత్వ శాఖ‌లు, శాస్త్రవేత్త‌లు, పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి)  సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌లు, స్టార్ట్- అప్ లు, విశ్వ‌విద్యాల‌యాలు, ఐఐటిలు ఒక్క‌టిగా నిరంత‌రం కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

ప్ర‌త్యేకించి మ‌న మౌలిక వ‌స‌తులు, సామాజిక‌- ఆర్థిక‌ మంత్రిత్వ శాఖ‌లు శాస్త్ర సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని స‌రైన విధానంలో వినియోగించుకోవాలి.
దీర్ఘ‌కాలిక ప‌రిశోధ‌న‌ల్లో భాగ‌స్వాములుగా  ఉండేందుకు ఎన్ ఆర్ ఐల‌తో స‌హా అసాధార‌ణ ప‌రిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్త‌ల‌ను విదేశాల నుండి ఆహ్వానించే విష‌యం మ‌న సంస్థ‌లు ఆలోచించాలి. మ‌న ప్రాజెక్టుల‌పై డాక్ట‌రేట్ అనంత‌ర (పోస్ట్ డాక్టోర‌ల్) ప‌రిశోధ‌న‌ల నిర్వ‌హ‌ణ‌లో విదేశీ, ఎన్ ఆర్ ఐ పిహెచ్ డి విద్యార్థుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాలి.

వైజ్ఞానిక ఫ‌లితాల‌కు సాధికార‌త‌నిచ్చే మ‌రో అంశం శాస్త్ర ప‌రిశోధ‌న సౌల‌భ్యం. విజ్ఞానం స‌త్ఫ‌లితాలివ్వాలంటే మ‌నం దాన్ని నిరోధించ‌కూడ‌దు.    
 
విద్యారంగం, స్టార్ట్- అప్ లు, ప‌రిశ్ర‌మ‌లు, ప‌రిశోధ‌న‌- అభివృద్ధి (ఆర్ & డి) ప్ర‌యోగ‌శాల‌లు త‌దిత‌రాల‌కు అందుబాటులో ఉండేలా శాస్త్ర, సాంకేతిక మౌలిక స‌దుపాయాలను క‌ల్పించ‌డం ప్ర‌భుత్వ ప్రాథ‌మ్యాల‌లో ఒక‌టి. అందుబాటు సౌల‌భ్యం, నిర్వ‌హ‌ణ‌కు సంబంధిత‌మైన‌వి స‌హా మ‌న శాస్త్ర ప‌రిశోధ‌న సంస్థ‌ల‌లో ఒకే ర‌కం ఖ‌రీదైన ప‌రిక‌రాలు పేరుకుపోవ‌డం, ఉన్న‌వే మ‌ళ్లీ స‌మ‌కూర్చుకోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. వృత్తిప‌ర‌మైన నిపుణులు నిర్వ‌హించే అత్యాధునిక శాస్త్రీయ ప‌రిక‌రాలతో కూడిన భారీ ప్రాంతీయ కేంద్రాల‌ను ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్య (పిపిపి) ప‌ద్ధ‌తిలో నెల‌కొల్పాల‌న్న ఆకాంక్షను ప‌రిశీలించాల్సి ఉంది.

క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల‌తో పాటు భాగ‌స్వాములంద‌రితోనూ అనుసంధానం కోసం కార్పొరేట్ సామాజిక బాధ్య‌త త‌ర‌హాలో శాస్త్రీయ సామాజిక బాధ్య‌త‌ను మ‌న అగ్ర‌శ్రేణి సంస్థ‌ల‌న్నీ అల‌వ‌ర‌చుకోవాల్సిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంది. వ‌న‌రులను, ఆలోచ‌న‌ల‌ను పంచుకోగ‌ల అనువైన వాతావ‌ర‌ణాన్ని మ‌నం సృష్టించ‌డం అవ‌శ్యం. భార‌త‌దేశంలోని మూల‌మూల‌లా గ‌ల ప్ర‌తిభావంతులు, అత్యుత్త‌ములు అంద‌రికీ శాస్త్ర విజ్ఞానంలో రాణించే అవ‌కాశాలు అందాలి. అది సాధ్య‌మైతేనే అధునాత‌న శాస్త్రీయ‌, సాంకేతిక‌ శిక్ష‌ణ పొంది ఈ పోటీ ప్ర‌పంచంలో ఉద్యోగ సిద్ధం కాగ‌లమ‌న్న‌ భ‌రోసా మ‌న యువ‌త‌కు ల‌భిస్తుంది.

ఈ దిశ‌గా మ‌న జాతీయ ప్ర‌యోగ‌శాల‌లు క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల‌తో మ‌మేక‌మై త‌గిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని ప్ర‌గాఢంగా కోరుతున్నాను. మ‌న‌కు గ‌ల విస్తృత శాస్త్ర, సాంకేతిక స‌దుపాయాల‌న్నీ స‌మ‌ర్థంగా ఉప‌యోగ‌ప‌డ‌ట‌మే గాక వాటిని ప్ర‌భావ‌వంతంగా నిర్వ‌హించ‌డానికి ఇది తోడ్ప‌డుతుంది. ప్ర‌తి ప్ర‌ధాన న‌గ‌ర ప్రాంతీయ ప్ర‌యోగ‌శాల‌లు, ప‌రిశోధ‌న సంస్థ‌లు, విశ్వ‌విద్యాల‌యాలు బండి చ‌క్ర‌పు ఇరుసు (కేంద్రం), ఆకు (శాఖ‌లు)లా ప‌నిచేసేలా ప‌ర‌స్ప‌ర సంధానం కావాలి. కేంద్రాల‌కు ప్ర‌ధాన మౌలిక స‌దుపాయాల‌లో అధిక‌ శాతం అందుబాటులో ఉండి జాతీయ వైజ్ఞానిక కార్య‌క్ర‌మాల‌ను న‌డిపిస్తూ ఆవిష్క‌ర‌ణ‌కు ఆచ‌ర‌ణ‌కు జోడించ‌గ‌ల చోద‌కాలు కాగ‌ల‌వు.

ప‌రిశోధ‌న నేప‌థ్యం గ‌ల క‌ళాశాల‌ల బోధ‌కుల‌ను ప‌రిస‌ర విశ్వ‌విద్యాల‌యాలు, ప‌రిశోధ‌న‌- అభివృద్ధి (ఆర్ & డి) సంస్థ‌ల‌కు సంధానించవ‌చ్చు. ప్ర‌ముఖ సంస్థ‌లు వివిధ కార్య‌క్ర‌మాల‌తో పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, సాంకేతిక విద్యాసంస్థ‌ల‌కు చేరువ కావ‌చ్చు. త‌ద్వారా మీ ప‌రిస‌రాల్లోని విద్యాసంస్థ‌ల నుంచి నిగూఢ శాస్త్ర, సాంకేతిక మాన‌వ‌శ‌క్తి జోరందుకొంటుంది. 

విశిష్ట ప్ర‌తినిధులారా,

పాఠ‌శాల విద్యార్థుల‌లో న‌వ్య ఆలోచ‌న‌ల‌, ఆవిష్క‌రణ‌ల‌ శ‌క్తిని నాటితే మ‌న న‌వ క‌ల్ప‌న‌ల పిర‌మిడ్ పునాది మ‌రింత విస్త‌రించి జాతి భ‌విత‌ను ఉజ్వ‌లం చేయ‌గ‌ల‌దు. ఈ దిశ‌గా శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ 6 వ తరగతి నుండి 10వ‌ త‌ర‌గ‌తి విద్యార్థులు ల‌క్ష్యంగా ఒక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతోంది. దేశంలోని 5 ల‌క్ష‌ల పాఠ‌శాల‌ల విద్యార్థులు భాగ‌స్వాముల‌య్యే ఈ కార్య‌క్ర‌మం వారిని వెన్నంటి న‌డిపిస్తూ, మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూ, ప్ర‌తిభ‌ను గుర్తిస్తూ 10 ల‌క్ష‌ల ఉత్త‌మ‌ న‌వ్యా విష్క‌ర‌ణ‌ల‌కు ఊపిరి పోస్తుంది.  మ‌హిళా ప్రాతినిధ్యం త‌క్కువ‌గా ఉన్న‌ వైజ్ఞానిక‌, ఇంజినీరింగ్ రంగాల‌లో రాణించే విధంగా బాలిక‌ల‌కు స‌మాన అవ‌కాశాలను అందించడం మ‌న విధి. ఆ విధంగా జాతి నిర్మాణంలో సుశిక్షిత మ‌హిళా శాస్త్రవేత్త‌ల నిరంత‌ర భాగ‌స్వామ్యానికి భ‌రోసా ల‌భిస్తుంది.

విశిష్ట ప్ర‌తినిధులారా,

అతి పెద్ద‌, వైవిధ్య‌భ‌రిత‌మైన  భార‌తదేశం వంటి దేశం కోసం సాంకేతిక ప‌రిజ్ఞానం బ‌హుళ శ్రేణికి విస్త‌రించాల్సి ఉంది. అత్యాధునిక అంత‌రిక్ష‌, అణు, ర‌క్ష‌ణ ప‌రిజ్ఞానాల నుండి గ్రామీణాభివృద్ధి అవ‌స‌రాలైన ప‌రిశుభ్ర‌మైన నీరు, పారిశుధ్యం, పున‌రుప‌యోగ ఇంధ‌నం, సామాజిక ఆరోగ్యంవంటి వాటి దాకా ఈ విస్త‌ర‌ణ కొన‌సాగాలి. ప్ర‌పంచంలో మ‌నం ముంద‌డుగు వేసే కొద్దీ మ‌న‌దైన వాతావార‌ణానికి త‌గిన స్థానిక ప‌రిష్కారాల‌ను రూపొందించుకోవ‌డం అత్య‌వ‌స‌రం. స్థానిక అవ‌స‌రాలు తీర్చుకునేందుకు, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవ‌స‌రాలు తీరేందుకు స్థానిక వ‌న‌రులు, నైపుణ్యాల‌ను వినియోగించుకునే గ్రామీణ ప్రాంతాలకు త‌గిన‌ సూక్ష్మ పారిశ్రామిక న‌మూనాల‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంత‌యినా ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు గ్రామ స‌మూహాల‌కు, పాక్షిక న‌గ‌ర ప్రాంతాల‌కు త‌గిన స‌మ‌ర్థ స‌హోత్ప‌త్తి ఆధారిత విభిన్న సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను మ‌నం అభివృద్ధి చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. విద్యుత్తు, ర‌క్షిత నీరు, పంట‌ల శుద్ధి, శీత‌ల నిల్వ వంటి బ‌హుళ అవ‌స‌రాలను తీర్చ‌గ‌లిగేలా వ్య‌వ‌సాయ‌, జీవ‌ సంబంధ వ్య‌ర్థాల‌ను శ‌క్తిజ‌న‌కాలుగా మలిచే సాంకేతిక‌త‌ల సృష్టిపై దృష్టి పెట్టాలి.

విశిష్ట ప్ర‌తినిధులారా,

ప్ర‌ణాళిక‌లు, నిర్ణ‌యాత్మ‌క‌త‌, ప‌రిపాల‌న‌లో విజ్ఞాన శాస్త్రానికి ఎన్న‌డూ ప్రాముఖ్యం లేదు. మ‌న పౌరులు, పంచాయ‌తీలు, జిల్లాలు, రాష్ట్రాల‌ అభివృద్ధి ల‌క్ష్యాల‌ను అందుకోగ‌ల భౌగోళిక స‌మాచార వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసి, ఆచ‌ర‌ణ‌లో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.  భార‌తీయ సర్వేక్షణ విభాగం (స‌ర్వే ఆఫ్ ఇండియా), భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ఆర్ఒ), స‌మాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ‌ల స‌మ‌న్వ‌య కృషి మ‌రింత ప‌రివ‌ర్త‌నాత్మ‌కం కావ‌చ్చు. సుస్థిర అభివృద్ధి కోసం మ‌నం గట్టి చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది. ఆ మేర‌కు సంక్లిష్ట‌మైన‌ ఎలక్ట్రానిక్‌, జీవ‌ వైద్య‌, ప్లాస్టిక్‌, ఘ‌న‌-జ‌ల వ్య‌ర్థాల‌ నుండి సంప‌ద నిర్వ‌హ‌ణ‌ దాకా దృష్టి సారించాలి.

ప‌రిశుభ్ర క‌ర్బన సాంకేతిక‌త‌పై ప‌రిశోధ‌న‌-అభివృద్ధి స‌హా విద్యుత్ సామ‌ర్థ్యం పెంపు ప‌రిజ్ఞానంలోనూ, స‌మ‌ర్థ పున‌రుప‌యోగ ఇంధ‌న వాడ‌కం పెంపు ద్వారానూ మ‌నం కొత్త ఎత్తులకు చేరుతున్నాం.  సుస్థిర అభివృద్ధి కోసం ప‌ర్యావ‌ర‌ణ, వాతావ‌ర‌ణాల‌పై దృష్టి మ‌న ప్రాథ‌మ్యంగా ఉంది. మ‌న‌వైన స‌వాళ్ల‌ను మ‌న బ‌ల‌మైన శాస్త్ర విజ్ఞాన స‌మాజం ప్ర‌భావ‌వంతంగా ప‌రిష్క‌రించ‌గ‌ల‌దు. ఉదాహ‌ర‌ణ‌కు.. పంట‌లు త‌గుల‌బెట్టుకునే స‌మ‌స్య‌కు రైతు కేంద్రంగా మ‌నం ప‌రిష్కారం క‌నుగొన‌గ‌ల‌మా ? మ‌రింత ఇంధ‌న సామ‌ర్థ్యం, ఉద్గారాల త‌గ్గింపు దిశ‌గా ఇటుక‌ బ‌ట్టీల‌కు పునఃరూప‌క‌ల్ప‌న చేయ‌గ‌ల‌మా ?

నిరుడు జ‌న‌వ‌రిలో ప్రారంభించిన స్టార్ట్- అప్ ఇండియా కార్య‌క్ర‌మంలో  శాస్త్ర, సాంకేతిక‌త కీల‌కాంశం. అలాగే అట‌ల్‌ న‌వ‌క‌ల్ప‌న కార్య‌క్ర‌మం,  జాతీయ ఆవిష్క‌ర‌ణ‌ల అభివృద్ధి-ప్రోత్సాహం కార్య‌క్ర‌మం (నిధి-NIDHI) కూడా మ‌రో రెండు బ‌ల‌మైన ప‌థ‌కాలు. ఈ కార్య‌క్ర‌మాలు న‌వ‌క‌ల్ప‌నల‌ చోదిత వ్యాపార ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ నిర్మాణంపై దృష్టి సారిస్తాయి. అంతేగాక ఆవిష్య‌ర‌ణ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డం కోసం సిఐఐ, ఎఫ్ ఐ సిసిఐ, ఇత‌ర అధునాత‌న సాంకేతిక‌త‌గ‌ల కంపెనీల‌తో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యాలను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది.

విశిష్ట ప్ర‌తినిధులారా,

జాతి వ్యూహాత్మ‌క దార్శ‌నిక‌త‌కు శాస్త్రవేత్త‌లు వారి వంతు కృషిని ఇతోధికంగా జోడించారు. భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న కార్య‌క్ర‌మాలు మ‌న‌ను ఈ రంగంలో ముందుకెళ్తున్న అగ్ర‌దేశాల జాబితాలో చేర్చాయి. అంత‌రిక్ష సాంకేతిక విజ్ఞానంలో మ‌నం అత్యున్న‌త స్థాయి స్వావ‌లంబ‌నను సాధించాం. ఉప‌గ్ర‌హ ప్ర‌యోగ వాహ‌నాలు, ఉపగ్ర‌హాల- ప‌రిక‌రాల‌ నిర్మాణం, కీల‌క సామ‌ర్థ్యం, పోటీత‌త్వానికి స‌రిప‌డే అనువ‌ర్త‌నాల అభివృద్ధి కూడా ఇందులో భాగమే. ఇక ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ) త‌న సాంకేతిక ఆవిష్క‌ర‌ణ‌లు, వ్య‌వ‌స్థ‌ల‌తో మ‌న సాయుధ ద‌ళాల శ‌క్తిని ద్విగుణీకృతం చేయ‌డంలో కీల‌క‌ పాత్రను పోషించింది.

భార‌త శాస్త్ర ప‌రిజ్ఞానం ప్ర‌పంచంలో స్ప‌ర్ధాత్మ‌కంగా రూపొందే విధంగా ప‌ర‌స్ప‌ర‌త్వం, స‌మాన‌త్వం, ప్ర‌తిస్పంద‌నాత్మ‌క‌త సూత్రాల ఆధారంగా వ్యూహాత్మ‌క‌ అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యాలు, స‌హ‌కారాన్ని మ‌నం అందిపుచ్చుకుంటున్నాం. ఇరుగుపొరుగు దేశాల‌తో బ‌ల‌మైన సంబంధాలు నెల‌కొల్పుకోవ‌డానికేగాక బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్‌) వంటి బ‌హుళ‌ప‌క్ష వేదిక‌ల నిర్మాణంలోనూ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకొంటున్నాం. విశ్వ ర‌హ‌స్యాల ఛేద‌న‌కు, అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాల రూప‌క‌ల్ప‌న‌కు ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ శాస్త్ర విజ్ఞానం మ‌న‌కు తోడ్ప‌డుతోంది. భార‌త‌దేశం- బెల్జియం సంయుక్త స‌హ‌కారంతో రూపొందించిన 3.6 మీట‌ర్ల దృగ్విజ్ఞాన దూర‌ద‌ర్శిని (టెలిస్కోప్‌)ని ఉత్త‌రాఖండ్‌లో నిరుడు మ‌నం ప్రారంభించాం. అమెరికాతో క‌ల‌సి ‘‘లేజ‌ర్ ఇంట‌ర్‌ఫెరో మీట‌ర్ గ్రావిటేష‌న‌ల్ వేవ్ అబ్జ‌ర్వేట‌రీ’’-ఎల్ఐజిఒ పేరిట భార‌తదేశంలో అత్యంత అధునాత‌న ఖ‌గోళ అన్వేష‌క వ్య‌వ‌స్థ ఏర్పాటుకు ఇటీవ‌లే ఆమోదం తెలిపాం.
     
విశిష్ట ప్ర‌తినిధులారా,

చివ‌ర‌గా.. మ‌న శాస్త్రవేత్త‌ల‌కు, శాస్త్ర విజ్ఞాన సంస్థ‌ల‌కు అత్యుత్త‌మ తోడ్పాటునివ్వాల‌న్న సంక‌ల్పానికి ప్ర‌భుత్వం స‌దా క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని నేను పునరుద్ఘాటించ‌ద‌ల‌చాను. ప్రాథ‌మిక శాస్త్ర విజ్ఞాన నాణ్య‌త‌ను పెంచ‌డం నుండి ఆవిష్క‌ర‌ణ‌ల దిశ‌గా సాంకేతిక‌త‌ను బ‌లోపేతం చేయ‌డం దాకా శాస్త్రవేత్త‌ల‌ను త‌మ‌ వంతు కృషిని మ‌రింత పెంచుతార‌న్న దృఢ విశ్వాసం నాకుంది. స‌మ్మిళిత అభివృద్ధికి, స‌మాజంలోని అత్యంత బ‌ల‌హీన‌-పేద‌ వ‌ర్గాల స్థితిగ‌తుల మెరుగుకు శాస్త్ర, సాంకేతిక‌త‌లు బ‌లమైన ఉప‌క‌ర‌ణాలు కావాల‌న్న‌ది నా ఆకాంక్ష‌. మ‌న‌మంతా ఒక్క‌టై న్యాయ‌బ‌ద్ధ‌, స‌మాన‌, సౌభాగ్య జాతి నిర్మాణానికి కృషి చేద్దాం.

జయ్ హింద్‌.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi