PM Narendra Modi addresses the National Youth Day in Greater Noida via video conferencing
Our ISRO scientists have made us proud yet again, ISRO today created a century in satellite launching: PM
Our strides in space will help our citizens & enhance our development journey, says PM Modi
People say today's youth don't have patience, in a way this factor becomes a reason behind their innovation: PM
I had called for organising mock parliaments in our districts, such mock parliaments will further the spirit of discussion among our youth, says the PM

ముందుగా నేను మ‌న శాస్త్రవేత్త‌లు సాధించిన మ‌రో ప్ర‌ధాన విజ‌యం ప‌ట్ల అభినంద‌న‌లు తెలియ‌జేయాల‌నుకుంటున్నాను. ఇస్రో కొద్ది సేపటి క్రితం పిఎస్ఎల్‌వి-సి40ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది.

కార్టోశాట్‌-2 సిరీజ్ లోని ఉప‌గ్ర‌హంతో పాటు మొత్తం 31 ఉప‌గ్ర‌హాల‌ను పిఎస్ఎల్‌వి అంత‌రిక్ష క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. మొత్తం ఉప‌గ్ర‌హాల్లో 28 విదేశీ ఉప‌గ్ర‌హాలే. ఈ రోజు ఇస్రో మ‌రొక రికార్డును కూడా నెల‌కొల్పింది. ఉప‌గ్ర‌హ ప్ర‌యోగంలో సెంచ‌రి ని న‌మోదు చేసింది.

ఇస్రో సాధించిన ఈ విజ‌యం దేశంలో వ్య‌వ‌సాయ‌దారులు, మ‌త్స్య‌కారులు, శాస్త్రవేత్త‌లు క్షేత్ర‌ స్థాయి స‌మాచారాన్ని అందుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. ఈ విజ‌యం న్యూ ఇండియా ఆవిష్కారానికి మార్గాన్ని మ‌రింత సుగ‌మం చేయగలదు.

ఇస్రోకు, శాస్త్రవేత్త‌ల‌కు నేను మ‌రొక్క మారు అభినంద‌న‌లను తెలియ‌జేస్తున్నాను. దేశాన్ని గ‌ర్వంగా త‌లెత్తుకునేటట్టు చేయ‌డమే కాకుండా వారు భార‌త ఆర్థికాభివృద్ధికి కూడా దోహ‌ద‌ ప‌డ్డారు.

కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌త్యేకించి వివేకానందుని జ‌యంతి మ‌రియు జాతీయ యువ‌జ‌న దినం నాడు మ‌న శాస్త్రవేత్త‌లు దేశానికి అమూల్య‌మైన బ‌హుమ‌తిని అందించారు.

మిత్రులారా, గ్రేట‌ర్ నోయెడా లో బుల్లి భార‌తదేశం స‌మావేశ‌మై- ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ (ఒక భార‌తదేశం, మహా భార‌తదేశం) యొక్క గొప్ప స్ఫూర్తిని వ్యాపింప‌చేస్తూంది- ఈ వేళ, నేను ఈ బుల్లి భారతదేశంతో నేరుగా మాట్లాడాల‌నుకొన్నాను.

అయితే, కొన్ని కార్య‌క్ర‌మాల కార‌ణంగా, ఈ బుల్లి భారతదేశంతో సాంకేతిక విజ్ఞ‌ానం స‌హాయంతో అనుసంధానం కావలసి వ‌చ్చింది.

వాస్త‌వానికి ఇటువంటి కార్య‌క్ర‌మాల విష‌యంలో సంపూర్ణ‌మైన స‌మాచారం తెలుసుకునేందుకే నేనెప్పుడూ కృషి చేస్తాను. ఇటువంటి కార్య‌క్ర‌మాల‌కు నేను వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కాలేక‌పోయినా ఆ కార్య‌క్ర‌మంలో ఏం జ‌రిగింది, ఏయే అంశాలు చ‌ర్చించారు, వాటి ఫ‌లితం ఏమిటి వంటి అంశాలు తెలుసుకోవాల‌నుకుంటాను. మీరంతా అక్క‌డ చ‌ర్చించిన అంశాల‌కు సంబంధించిన స‌మాచారం స‌యితం నేను సేక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తాను.

మిత్రులారా, ఈ రోజు జాతీయ యువ‌జ‌నోత్స‌వం మొదలవుతోంది. జాతీయ యువ‌జ‌న పురస్కారాలను గెలుచుకున్న యువ‌తీ యువ‌కుల‌కు, సంస్థ‌ల‌కు నా ప్ర‌శంస‌లను అంద‌జేస్తున్నాను.

వ‌చ్చే నాలుగు రోజుల్లో అక్క‌డ చాలా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌న్న విష‌యం నా దృష్టికి వ‌చ్చింది. జాతీయ యువ‌జ‌న పార్ల‌మెంటును కూడా నిర్వ‌హిస్తున్నారు. ఈ సారి నేను ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) కార్య‌క్ర‌మంలో దేశంలోని ప్ర‌తి ఒక్క జిల్లా లోనూ మాక్ పార్ల‌మెంటు ను నిర్వ‌హించాల‌ని ప్ర‌తిపాదించాను. ఒక ర‌కంగా ఆ ఆలోచ‌న ప‌రంప‌ర‌లో ఈ కార్య‌క్ర‌మం కూడా ఒక‌టిగా నేను భావిస్తున్నాను.

న్యూ ఇండియా పై చ‌ర్చించి తీర్మానాలు చేయ‌డానికి ఇది చ‌క్క‌ని అవ‌కాశం. ఇది 22వ యువ‌జ‌నోత్స‌వం. 25వ యువ‌జ‌నోత్స‌వానికి ఏయే అంశాలు చేప‌ట్టాలి, ఎటువంటి తీర్మానాలు చేయాలి తదితర అంశాల‌న్నీ ఇందులో చ‌ర్చించాలి. ఒక ప్ర‌ణాళికను రూపొందించుకున్న‌ప్పుడే మ‌నం దానిని సాధించ‌గ‌లుగుతాం.

అదేవిధంగా, 2022లో- దేశం 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించుకునే సంవత్సరం లో- యువ‌జ‌నోత్స‌వాన్ని ఎలా నిర్వ హించుకోవ‌చ్చు అనే అంశం మీద కూడా మీరు చ‌ర్చించాలి. ఈ నాలుగు రోజుల్లో మీరు సాధించే అనుభ‌వం జీవిత ప‌ర్యంతం మీకు మార్గ‌ద‌ర్శిగా ఉంటుంద‌ని, మీ భావి జీవితానికి దిశానిర్దేశం చేస్తుంద‌ని నేను ఆశిస్తున్నాను.

నా యువ‌ మిత్రులారా, ప్ర‌మాణాలు చేయ‌డం ద్వారా విజ‌య సాధ‌న అనేది ఈ ఏడాది యువ‌జ‌నోత్స‌వ ఇతివృత్తం. గ‌త ఆరేడు నెల‌లుగా ఈ మాట‌లను మీరు ప‌లు మార్లు వినే ఉంటారు. సంక‌ల్ప్ సే సిద్ధి (ప్ర‌మాణాలు చేయ‌డం ద్వారా విజ‌యం) అంటే ఏమిటి ?

డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసి ప‌ని చేయించే ఒక మొబైల్ యాప్ కాద‌ది. అందుకే ఈ రోజు మీతో ప్ర‌మాణాలు చేయ‌డం, దాన్ని పూర్తి స్థాయిలో సాకారం చేసుకోవ‌డం అనే అంశంపై మాట్లాడ‌తాను.

అస‌లు ప్ర‌మాణం అంటే ఏమిటి? దాని ద్వారా ఏం సాధించ‌వ‌చ్చు?

మిత్రులారా, 2022 నాటికి మ‌న దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవ‌త్స‌రాలు పూర్తి అవుతాయి. స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి మీరు పుస్త‌కాల్లో చ‌దివివుంటారు. నేను కూడా స్వాతంత్ర్య పోరాటం గురించి విన్నాను, చ‌దివాను. మ‌న వ‌య‌స్సులలో వ్య‌త్యాసం ఉండ‌వ‌చ్చు, కానీ ఈ విష‌యంలో నేను మీ క‌న్నా భిన్నం ఏమీ కాదు.

నా యువ మిత్రులారా, మ‌నం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన‌లేదు. అందుకే మ‌న స్వ‌ాతంత్ర‌్య సమర యోధుల క‌ల‌లను పండించవలసిన బాధ్యత మ‌నంద‌రి మీద ఉంది. బ్రిటిష్ పోలీసుల ద‌మ‌న‌కాండ‌ను, జైలు గ‌దుల్లో వారు పెట్టిన చిత్ర‌హింస‌ల‌ను భ‌రిస్తూ సాహ‌స‌వంతులైన మ‌న స్వాతంత్ర్య యోధులు ఏ తరహా భార‌తావ‌ని అవ‌త‌రించాల‌ని క‌ల‌లు గ‌న్నారో దానిని సాధించవలసిన బాధ్య‌త మ‌నంద‌రి పైన ఉంది. వారు క‌న్న క‌ల‌లను, వారి భావనలను గురించి తెలుసుకున్న‌ప్పుడు వారి క‌ల‌ల‌తో దీటైన భార‌తదేశాన్ని ఆవిష్క‌రించ‌డానికి మ‌నం ప్ర‌తిన చేసుకోగ‌లుగుతాం. అది ఏ ర‌క‌మైన భార‌త‌దేశం ?, స‌రికొత్త భార‌త‌దేశం ఎలా ఉండాలి ? మీరు ఈ రోజు కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసుకుని నిద్ర‌కు ఉప‌క్ర‌మించే స‌మ‌యంలో కొంత స‌మ‌యం పాటు దీని గురించి ఆలోచించండి. మీ చుట్టూ ఏం జ‌రుగుతోంది, దానిని మార్చ‌డం ఎలా అనేది కూడా ఆలోచించండి.

మీరు దేనిని గురించి అయితే ఆలోచిస్తున్నారో, అది ఎప్పుడూ స‌రైంది కావాల‌ని లేదు; దానిని మార్చాల్సి ఉండ‌వ‌చ్చును. మీరు రైలులో ప్ర‌యాణం చేస్తున్నారు.. లేదా బడిలోనో, కళాశాలలోనో, ఇంటి వద్దో ఉన్నారు, లేదా మీరు నివ‌సిస్తున్న ప్రాంతంలో తిరుగుతున్నారు.. అటువంటి స‌మ‌యంలో ఏదైనా ఒక‌టి మీ దృష్టికి వ‌చ్చి అది స‌రిగ్గా లేద‌ని భావించిన‌ట్ట‌యితే దాన్ని మార్చవలసి ఉంటుంది. అటువంటి స‌మ‌స్య‌లను గురించి మీరు ఈ రాత్రి ఆలోచించండి. మీ దృష్టికి ఏదైనా స‌మ‌స్య వ‌చ్చి ఉండ‌వ‌చ్చు, కానీ అది చెరిగిపోయి ఉండ‌వ‌చ్చు.. ఒక్క‌సారి వివేకానందుడిని గుర్తు చేసుకోండి. నేను న‌మ్మ‌కంగా చెబుతున్నాను, మీ అనుభ‌వంలోకి వ‌చ్చిన అంశం లేదా మిమ్మ‌ల్ని బాధించిన అంశం లేదా మార్చాల్సి ఉంటుంద‌ని మీరు భావించిన అంశంతో ఈ రాత్రి మీరు అనుసంధానం అయితే, అదే మీ ప్ర‌తిజ్ఞ అవుతుంది. రేపు ఉద‌యం నుండే మీరు దానిని ప‌రిష్క‌రించే కృషి ప్రారంభిస్తారు.

మిత్రులారా, మీరు ప్ర‌స్తుతం బ‌స చేసిన విశ్వ‌విద్యాల‌య ప్రాంగణం గౌత‌మ బుద్ధుని పేరుతో ఉంది. మీరు ఉన్నటువంటి ప్రాంతం- గ్రేట‌ర్ నోయెడా- కూడా గౌత‌మ బుద్ధ న‌గ‌ర్‌. అందుకే నేను గౌత‌మ బుద్ధునికి సంబంధించిన ఒక క‌థను మీకు చెప్పాల‌నుకుంటున్నాను. అది చిన్న సంఘ‌ట‌నే, పెద్ద‌దేమీ కాదు.

ఒక‌సారి గౌత‌మ బుద్ధుని శిష్యుడొక‌రు మీరు బోధిస్తున్న శిష్యులంద‌రూ ముక్తిని పొంద‌గ‌ల‌రా అంటూ ప్ర‌శ్నించాడు. కానే కాదు, కొద్ది మంది మాత్ర‌మే అది సాధించ‌గ‌లుగుతార‌ని బుద్ధుడు జ‌వాబిచ్చాడు. అలా ఎందుకు జ‌రుగుతుంద‌ని ఆ శిష్యుడు వేసిన మ‌రో ప్ర‌శ్న‌కు, త‌న బోధ‌న‌లను స‌రిగ్గా అర్ధం చేసుకున్న వారికి మాత్ర‌మే ముక్తి సాధ్య‌మ‌ని, మిగ‌తా వారంద‌రూ అలా తిరుగుతూనే ఉంటార‌ని గౌత‌ముడు బదులిచ్చాడు.

మిత్రులారా, మీరు ఒకే ఉపాధ్యాయుడి వద్ద నుండి ఒకే త‌ర‌హా జ్ఞానాన్ని పొంద‌చ్చు. కానీ ఆ బోధ‌న‌లను మీరు ఎలా అందుకున్నారు ?, దాని ఆధారంగా మీరు ఎలాంటి ప్ర‌తిన చేసుకున్నార‌నే దానిని బ‌ట్టి మీ విజ‌యం, లేదా వైఫ‌ల్యం ఆధార‌ప‌డి ఉంటుంది.

చూడండి పాండ‌వుల‌కు, కౌర‌వుల‌కు గురువు ఒక్క‌రే.

ఉభ‌యులూ ఒకే ర‌క‌మైన విద్య పొందారు. కానీ వారి వ్య‌క్తిత్వంలో, ప‌నుల్లో ఎంత తేడా ఉంది ? కౌర‌వ‌, పాండ‌వులు పాటించే విలువ‌ల్లో తేడాలే అందుకు కార‌ణం. మీకు జీవితంలో ఎంద‌రో వ్య‌క్తులు తార‌స‌ప‌డి మార్గ‌ద‌ర్శ‌కం చేసి ఉంటారు, కానీ వారు అందించిన జ్ఞానాన్ని పొందిన త‌రువాత ఏ మార్గంలో ప‌య‌నించాలి ?, ఎటువంటి ప్ర‌తిజ్ఞను చేయాలి ? అన్న‌వి నిర్ణ‌యించుకోవాల్సింది మాత్రం మీరొక్క‌రే. గౌత‌మ బుద్ధుని సిద్ధాంతం అప్ప దీపో భ‌వ సారాంశం ఇదే. మీకు మీరే దీపం కండి. మీకు ప్ర‌తిజ్ఞ చేయించే వారంటూ ఎవ‌రూ ఉండ‌రు. మీకు గుర్తు చేసే వారు కూడా ఎవ‌రూ ఉండ‌రు. మీరు ఏం చేయవలసివుంటుందో దానిని మీరు మాత్ర‌మే చేయాలి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, “గ‌తం గురించి ఆందోళ‌న చెంద‌కుండానే భ‌విష్య‌త్ ల‌క్ష్యాల దిశ‌గా అడుగేసే వారే యువ‌త” అని స్వామి వివేకానందుడు చెబుతూ ఉండే వారు. అందుకే మీరు ఈ రోజు తీసుకునే ప్ర‌తిజ్ఞ‌లు సాకారం అయితే దేశం విజ‌యం సాధిస్తుంది.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ కు చెందిన ప్ర‌ముఖ గీత‌ ర‌చ‌యిత శ్రీ‌మాన్ మ‌జ్రూహ్ సుల్తాన్ పురి “నేను ఒక్క‌డిగానే గ‌మ్యం దిశ‌గా ప్ర‌యాణం ప్రారంభించాను, త‌దుప‌రి ఒక్కొక్క‌రుగా నాతో చేర‌డంతో, అది ఒక బిడారులా మారింది” అని రాశారు.

మిత్రులారా, ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఒక్క‌రు గానే ప్ర‌యాణాన్ని మొదలుపెట్టాలి. మీకు స‌రైన అవ‌గాహ‌న‌, స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యం, బ‌ల‌మైన క‌ట్టుబాటులు ఉంటే, అడ‌గకుండానే ప్ర‌జ‌లు మీ వద్దకు వ‌చ్చి చేరుతారు. ఈ రోజు నేను మీ నుండి కోరుకుంటున్న‌ది అదే. తొలి అడుగును వేయ‌డానికి వెర‌వ‌వ‌ద్దు. గ‌ట్టి తీర్మానం చేసుకున్న త‌రువాత ఒక కొత్త ప్రారంభం విష‌యంలో వెనుకకు చూడ‌వ‌ద్దు. మొత్తం ప్ర‌భుత్వం, యావ‌త్ దేశం మీ వెంట నిలుస్తాయి. త‌మంత తాముగా ఏదో ఒక‌టి చేయాల‌ని ఆకాంక్షించే యువకులకు, క‌ల‌లు సాకారం చేసుకునేందుకు శ్ర‌మించే యువ‌కుల‌కు అన్ని ర‌కాల స‌హాయం అందాల‌ని నేను భావిస్తాను.

ఏదైనా ప‌నిని ప్రారంభించే ముందు బ్యాంకు పూచీత్తు గురించి, లేదా ప‌న్ను భారం గురించి, లేదా పేప‌ర్ వ‌ర్క్ ను గురించి వారు విచారించ‌కూడ‌దు. నా దేశ యువ‌త ఉద్యోగాలు క‌ల్పించే వారుగా ఉండాల‌ని నేను ఆశిస్తున్నాను. న‌వ్య‌త‌ తో వారు ముందుకు రావాలి, ఆ దిశ‌గా వారు నిరంత‌రం కృషి చేయాలి.

మిత్రులారా, ప్ర‌ధాన‌ మంత్రి ముద్రా పథకంలో భాగంగా మా ప్ర‌భుత్వం 10 కోట్ల మందికి రుణస్వీకర్తలకు రుణాలను ఆమోదించింది. 10 కోట్ల రూపాయ‌లంటే చాలా పెద్ద మొత్తం. వారంద‌రికీ ఎలాంటి బ్యాంకు పూచీకత్తులు లేకుండానే 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు రుణంగా ఇచ్చాం. ఈ రుణాలు ఎలా చెల్లిస్తారు ? అని అడ‌గ‌కుండా బ్యాంకు గ్యారంటీలు లేకుండా 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఇవ్వడం అంటే ఒక సారి ఊహించుకోండి.

అలా రుణాలు పొందిన‌వారంతా గ్రామాలలో, ప‌ట్ట‌ణాలలో, న‌గ‌రాలలో చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించారు. త‌మ క‌ల‌లు సాకారం చేసుకుంటున్నారు. ఈ చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా నవ పారిశ్రామికవేత్తలంద‌రూ ఈ రోజు ఉపాధి క‌ల్ప‌న శ‌క్తులుగా మారారు. 

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, యువ‌తపై ఉన్న న‌మ్మ‌కం, వారిపై ఉన్న విశ్వాస‌మే ఇంతటి భారీ పథకాన్ని మొదలుపెట్టడానికి మూలాధారం. ఈ దేశంలో యువ‌త ఏదైనా సాధించాల‌ని నిర్ణ‌యించుకుంటే, అద్భుతాలు సృష్టించ‌గ‌ల‌ర‌ని మాకు ఎంతో న‌మ్మ‌కం ఉంది. అపార‌మైన శ‌క్తి గ‌ల ఇటువంటి యువ‌త దేశంలో ప్ర‌తి మూల‌నా ఉన్నారు. కొంద‌రు కొండ‌చ‌రియ‌ల్లోని చిన్న చిన్న జ‌ల‌పాతాల నుండి విద్యుత్తును ఉత్ప‌త్తి చేస్తున్నారు. మ‌రి కొంద‌రు వ్య‌ర్థాల నుండి విద్యుత్తును, ఇంకా కొంద‌రు వ్య‌ర్థాల నుండి నిర్మాణ సామ‌గ్రిని త‌యారుచేస్తున్నారు. కొంద‌రైతే గ్రామాల్లో సాంకేతికతను ఉప‌యోగించి, ఆరోగ్య సేవ‌లను అందిస్తున్నారు. కొంద‌రు వారి వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే ఫూడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇలా ల‌క్ష‌లాది మంది యువ‌త జాతి నిర్మాణంలో నిర్మాణంలో రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నారు.

మీ అంద‌రిలో సాహ‌సం, స‌రైన దిశ‌గా ముందుకు సాగే జ్ఞానం ఉన్నాయి. అందుకే మీ చేయిని ప‌ట్టుకుని ముందుకు న‌డిపించే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వం చేస్తోంది. ఆ మాత్రం మ‌ద్ద‌తు అందిస్తే చాలు, మీ అంత మీరుగా ఎదిగే సామ‌ర్థ్యాలు మీకు ఉన్నాయి.

మిత్రులారా, ఆధునిక కాలపు అవ‌స‌రాల‌కు దీటుగా నైపుణ్యాలలో శిక్ష‌ణను అందించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తోంది.

నైపుణ్యాల అభివృద్ధిపై ప్ర‌భుత్వం ఇంత చిత్త‌శుద్ధిని ప్ర‌ద‌ర్శించ‌డం ఇదే ప్ర‌థ‌మం. గ‌తంలో విద్య‌కు, నైపుణ్యాల‌కు మ‌ధ్య తేడా గురించి అడిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు మౌనంగా ఉండిపోయే వారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఒక విమానం గాలిలోకి ఎలా ఎగురుతుందో పుస్త‌కాల్లో చ‌ద‌వ‌డం, దాని గురించిన వివ‌రాలు తెలుసుకోవ‌డం విద్య‌. వాస్త‌విక జీవితంలో విమానాన్ని న‌డ‌ప‌డం నైపుణ్యం. ఒక‌రికి ఇలాంటి విద్య ఉన్నా, నైపుణ్యాలు లేక‌పోతే ఉద్యోగం పొంద‌డం అసాధ్యం. అందుకే మేం నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నాం. విద్య‌తో పాటు యువ‌త‌కు నైపుణ్యాలు కూడా అల‌వ‌రుస్తున్నాం.

స్కిల్ ఇండియా కార్య‌క్ర‌మం లో భాగంగా ల‌క్ష‌లాది మంది యువ‌త‌కు శిక్ష‌ణ ఇస్తున్నాం. ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన‌ మంత్రి నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇండియా ఇంట‌ర్ నేశన‌ల్ స్కిల్ సెంటర్ లు కూడా ఏర్పాట‌వుతున్నాయి. బ‌హుముఖీన నైపుణ్య శిక్ష‌ణ కేంద్రాల ఏర్పాటు కోసం కృషి జ‌రుగుతోంది. యువ‌త‌కు అప్రెంటిస్ షిప్ ను అందించే కంపెనీల‌కు ఆర్థిక స‌హ‌కారం అందించ‌డం కూడా దేశ‌ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. కంపెనీలు విద్యార్థుల‌కు అందించే అప్రెంటిస్ షిప్ సొమ్ము లో కొంత మొత్తాన్ని ప్ర‌భుత్వం వారికి తిరిగి చెల్లిస్తోంది.

జాతీయ అప్రెంటిస్ షిప్ ప‌థ‌కం లో ఇప్ప‌టి వ‌ర‌కు 7 ల‌క్ష‌ల మందికి పైగా యువ‌తీయువకులు న‌మోద‌య్యారు. వ‌చ్చే రెండు మూడు సంవ‌త్స‌రాల కాలంలో 50 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు అప్రెంటిస్ షిప్ శిక్ష‌ణ ఇవ్వాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ప్ర‌ధాన‌ మంత్రి యువ‌జ‌న ప‌థ‌కం కింద యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చే కృషి మూడు వేల‌కు పైగా సంస్థ‌ల్లో జ‌రుగుతోంది.

దేశీయ అవ‌స‌రాలు, ప‌రిశ్ర‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా యువ‌త‌ను సుశిక్షితుల‌ను చేయ‌డం ప్ర‌భుత్వ కృషి లోని అంత‌రార్ధం. విదేశాల అవ‌స‌రాల‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ శిక్ష‌ణ ఇస్తున్నాం.

మిత్రులారా, ఈ దేశంలోని యువ‌త పైన, వారిలోని శ‌క్తి పైన నాకెంతో న‌మ్మ‌కం ఉంది. దేశ‌ం క‌ల‌లు ఎక్క‌డైనా ఉన్నాయీ అంటే, అవి ఈ యువ‌త హృద‌యాలలోనే ఉన్నాయి.

అందుకే మేం దాని మీద అధికంగా దృష్టిని కేంద్రీక‌రిస్తున్నాం.

మిత్రులారా, నేటి యువ‌త‌లో అస‌హ‌నం ఎక్కువ అని కొంద‌రంటూ ఉంటారు. యువ‌త‌రంలో న‌వ్య‌తకు ఇది బీజం వేస్తుంద‌ని నేను చెబుతాను. జీవితంలో ఎవ‌రైనా స‌హ‌నం పాటించాల్సిందే, అస‌హ‌నం ప‌నికిరాదు. కానీ ఈ త‌ర‌హా అస‌హ‌నం లేక‌పోతే మాత్రం మ‌నిషి ఆలోచించ‌లేడు, జీవితం స్తంభించిపోతుంది. నేటి యువ‌త‌లో స‌హ‌నం లోపించ‌డం వ‌ల్ల‌నే వారు త్వ‌రితంగా క‌దిలి న‌వ్య‌త‌కు పాటు ప‌డుతూ మంచి ఫ‌లితాలను సాధిస్తున్నారు.

మీ నూతన ఆవిష్కారాల‌న్నీ సామాజికమైన‌వి. స్వ‌చ్ఛ భార‌త్ కావ‌చ్చు లేదా బేటీ బ‌చావో-బేటీ ప‌ఢావో కావ‌చ్చు, లేదా వ్య‌ర్థాల నుండి సంప‌ద సృష్టించేవి కావ‌చ్చు.. చుట్టూ ఉన్న స‌మ‌స్య‌లపై, స‌వాళ్ల‌పై మీకు మించిన అవ‌గాహ‌న ఎవ‌రికీ ఉండ‌దు. నూతన ఆవిష్కారాలపై మీలోని సామ‌ర్థ్యాల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకే ప్ర‌భుత్వం అట‌ల్ ఇనవేశన్ మిశన్ ను ప్రారంభించింది. దేశంలోని పాఠ‌శాల‌ల్లో, క‌ళాశాల‌ల్లో న‌వ్య‌త‌ను ప్రోత్స‌హించే వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు ప్ర‌త్యేకంగా కృషి జ‌రుగుతోంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్ప‌థాన్ని ప్ర‌జ్వ‌లింప‌చేసి, నూతన ఆవిష్కారాల‌పై వారిని స‌రైన దిశ‌గా న‌డిపేందుకు దేశ‌ వ్యాప్తంగా 2500 అట‌ల్ టింక‌రింగ్ లాబ్ ల ఏర్పాటుకు అనుమ‌తి మంజూరు చేసింది.

త‌యారీ, ర‌వాణా, ఇంధ‌నం, వ్య‌వ‌సాయం, నీరు, పారిశుధ్య రంగాల్లో న‌వ్య‌త‌తో కూడిన పారిశ్రామిక ధోర‌ణులు ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం దేశంలో అట‌ల్ ఇంకుబేష‌న్ సెంట‌ర్ లను ఏర్పాటు చేసింది. స్టార్ట్- అప్ ల‌కు ఈ కేంద్రాలు ఆర్థిక స‌హాయం అందించ‌డంతో పాటు వారిని స‌రైన బాట‌లో న‌డిపిస్తాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, దేశంలో స్టార్ట్- అప్ విప్ల‌వానికి స్టార్ట్- అప్ ఇండియా కార్య‌క్ర‌మం పునాదిగా మారుతోంది. 10 వేల కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌భుత్వం స్టార్ట్- అప్ నిధిని కూడా ఏర్పాటు చేసింది.

కొత్త స్టార్ట్- అప్ ల‌కు క్రెడిట్ గ్యారంటీలు, ప‌న్ను మిన‌హాయింపులు కూడా ఇస్తున్నాం. నూతన ఆవిష్కారాల‌కు పేటెంట్లు పొంద‌డానికి వీలుగా ప్ర‌భుత్వం వారికి న్యాయ స‌హాయాన్ని కూడా అందిస్తోంది. మీరు క‌ళాశాల‌ల నుండి ప‌ట్టాలు పొందిన త‌రువాత ముంద‌డుగు వేయ‌డానికి వీలుగా నేను ఈ స‌మాచారాన్ని అందిస్తున్నాను. ఈ రోజు మీరు ఎటువంటి తీర్మానాలు చేసుకున్నప్పటికీ వాటిని సాధించ‌డానికి ఈ స‌మాచారం మీకు ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న త‌రువాత మీ సొంత కంపెనీని ప్రారంభించ‌డానికి లేదా స్టార్ట్- అప్ ను ప్రారంభించ‌డంలోనూ మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరు. అటువంటి స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మాల‌న్నింటి ద్వారా ప్ర‌భుత్వ స‌హాయాన్ని మీరు పొంద‌గ‌లుగుతారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, స‌దుపాయాల‌న్నీ స‌మ‌కూరిన‌ప్పుడే ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రూ పురోగ‌మిస్తార‌ని ఎక్క‌డా లేదు. ఈ రోజు ఎన్నో విదేశీ కంపెనీల‌కు భార‌తదేశం నుండి వెళ్లిన యువ‌తే సార‌థ్యం వ‌హిస్తోంది. వారు ఆ కంపెనీల‌కు ప్రెసిడెంట్‌, చైర్మ‌న్‌, సిఇఒ లుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. వారు ఆ కంపెనీల‌పై త‌మ‌దైన చెర‌గ‌ని ముద్ర వేస్తున్నారు. వారు నేరుగానే ఆ హోదాల‌కు చేరారా ? లేదు. రాజ‌కీయాల్లో వ‌లె వార‌స‌త్వంగా వారు ఆ హోదాల‌కు వెళ్లారా ? లేదు. వారందరూ ఎంతో శ్ర‌మించి, నిరంత‌ర పోరాటం సాగించి ఆ హోదాలు పొందారు. వారికి సొంత క‌ల‌లు ఉన్నాయి. రిస్క్ తీసుకున్నారు. ప‌గ‌లు, రాత్రి స్వేదం చిందించారు.

ఎక్క‌డ‌కు వెళ్లినా దేశానికి, త‌మ‌కు కూడా కీర్తిని తెచ్చుకోగ‌ల స‌మ‌ర్థ‌త‌లు భార‌తీయ యువ‌కుల‌కు ఉన్నాయి. స్కైయింగ్‌లో తొలిసారిగా దేశానికి అంత‌ర్జాతీయ పతకాన్ని సాధించిన ఆంచ‌ల్ ఠాకుర్ ను గురించి రెండు రోజుల క్రిత‌మే మ‌నం విన్నాం. అలాగే కొద్ది రోజుల క్రితం మానుషి ఛిల్లర్ కూడా దేశానికి కీర్తిప్ర‌తిష్ఠ‌లు తీసుకువ‌చ్చారు.

సామాజిక మాధ్య‌మాల్లో చురుగ్గా ఉండే వారు చూసే ఉంటారు.. ఆరుగురు కుమార్తెలు ప్ర‌పంచాన్ని చుట్టి రావ‌డానికి బయలుదేరారన్న విష‌యం. ఒక దృఢ‌మైన సంక‌ల్పం చేసుకుని విజ‌యం సాధించ‌డంలో వారు ఎంచుకున్న భిన్న మార్గాలివి. ఈ రోజు వారు ప్ర‌తి ఒక్క‌రికీ స్ఫూర్తిగా నిలిచారు.

మిత్రులారా, ఈ రోజు నేను క్రీడలను మీ జీవనంలో ఒక భాగంగా చేసుకొమ్మని కూడా మీ అంద‌రినీ కోరుతున్నాను. రాజ్య‌వ‌ర్థ‌న్ గారు ఇప్పుడు వేదిక‌పై ఉన్నారు. ఆయ‌న ఇప్పుడు మంత్రి కావ‌చ్చు, కానీ మొదట్లో ఒలంపిక్ క్రీడాకారుడు. అద్భుత‌మైన షూట‌ర్.

కార్యసాధకుడు, మ‌న యువ ముఖ్య‌మంత్రి శ్రీ‌మాన్ యోగి గారు క్రీడాకారుని క‌న్నా త‌క్కువేమీ కాదు. ఆయ‌న ప‌ని చేస్తున్న తీరు కార‌ణంగా చాలా రాష్ట్రాలలో గ‌ట్టి స‌వాలు ఎదుర‌వుతోంది. యోగి గారు ఈ రోజు ఎంద‌రో విస్తృతంగా ఉప‌యోగిస్తున్న ట్విటర్ మీద ఉండ‌డం నేను చూశాను. ట్విటర్ లో నిపుణుల‌నుకున్న ఎంద‌రినో ఆయ‌న చిత్తు చేశారు. క్రీడ‌లు శ‌రీరాన్ని మాత్ర‌మే కాదు, మ‌న‌స్సును కూడా శ‌క్తివంతంగా నిలిపే సాధ‌నం. క్రీడ‌ల నుండి మ‌న‌కు క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌డుతుంది.

క్రీడా మైదాన‌ం మ‌న‌కు ప‌రాజ‌యం యొక్క అర్థాన్ని చెప్తుంది. ల‌క్ష్యం చేర‌డానికి ఎంత శ్ర‌మించాలో బోధిస్తుంది. జట్టు స్ఫూర్తి అనే దానికి అర్ధం ఏమిటి ? దానిని కూడా మ‌నం క్రీడా మైదానంలోనే తొలిసారిగా నేర్చుకుంటాం. గెలిచామా లేదా అన్న విష‌యంతో సంబంధం లేకుండా, క్రీడా మైదానంలో మ‌నం పొందే అనుభ‌వం జీవిత ప‌ర్యంతం మ‌న‌లో ఉంటుంది. అందుకే ఆడిన వారు వెలుగొందుతార‌ని నేను చెబుతాను. మీరు కూడా చ‌క్క‌గా ఆడి వెలుగొందాల‌న్న‌ది నా ఆకాంక్ష‌.

మీరంద‌రూ క్రీడ‌ల‌తో పాటు యోగాను కూడా జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. యువ‌జ‌నోత్స‌వంలో రోజూ మీరు యోగా చేస్తున్నార‌న్న విష‌యం నేను విన్నాను. యోగాతో అంద‌రూ శారీర‌కంగాను, మాన‌సికంగాను శ‌క్తివంతుల‌వుతారు.

ప్రియ‌ మిత్రులారా, మిమ్మ‌ల్ని మీరు అభివృద్ధి చేసుకుని మీ వ్య‌క్తిత్వాల‌ను విస్త‌రించుకునేందుకు ముందుకు రండి.

ఈ యువ‌జ‌నోత్స‌వంలో వివిధ రాష్ట్రాల నుండి వ‌చ్చిన మిత్రులంద‌రూ ఒక‌రితో ఒక‌రు క‌లిసిపోండి. మీరంతా ఒక‌రితో ఒక‌రు ఎంతో మాట్లాడుకోవాలి. వారిని, వారి భాష‌ను, ఆహార‌పు అల‌వాట్ల‌ను, జీవ‌న‌శైలిని గురించిన అవ‌గాహ‌నను పెంచుకోవాలి. ఈ యువ‌జ‌నోత్స‌వంలో మీరు నేర్చుకునే అంశాలు, అభివృద్ధి చేసుకునే బంధాలు, మీ జీవితాంతం ఉంటాయ‌ని నేను అనుభ‌వంతో చెబుతున్నాను.

మిత్రులారా, ఏక్ భార‌త్ శ్రేష్ఠ భార‌త్ (ఒక భార‌తదేశం, మహా భార‌తదేశం) సంక‌ల్పం కూడా ఇదే.

మిత్రులారా, మన మాననీయ శ్రీ‌మాన్ అట‌ల్ బిహారీ వాజ్ పేయి గారు “మ‌నంద‌రం భుజం భుజం క‌లిపి ప‌ని చేస్తూ ప్ర‌జా జీవ‌నంలో విజ‌యం అనే శిఖ‌రాన్ని చేర‌డానికి ప్ర‌యాణం ప్రారంభించాలి. మ‌నం చేసే కృషి, మ‌న క‌ఠోర శ్ర‌మ పైనే భార‌త‌దేశం భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది” అని చెబుతూ ఉండే వారు.

జాతి నిర్మాణం కోసం మ‌నంద‌రం ఒక్క‌టిగా శ్ర‌మించాలి, 125 కోట్ల మంది భార‌తీయులు అలుపు అనేది లేకుండా శ్ర‌మించాలి. మ‌నం న్యూ ఇండియా ను ఆవిష్క‌రిద్దాం, అంద‌రూ క‌లిసి అడుగేయండి.

యువ‌ దినోత్స‌వం, యువ‌జ‌నోత్స‌వం సంద‌ర్భంగా వివేకానందుని, సామాజిక సామ‌ర‌స్యం, గొప్ప‌, త‌క్కువ భేదాలు విడ‌నాడ‌డం, దేశం కోసం ప్రాణాల‌నే ఫ‌ణంగా పెట్ట‌డం వంటి ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న చూపిన మార్గాన్నిఆ మ‌హోన్న‌తుని జ‌యంతి సంద‌ర్భంగా మ‌రోసారి గుర్తు చేస్తూ మీ అంద‌రికీ మ‌రోసారి శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను. మీరంతా యువ స్ఫూర్తి, సామ‌ర్థ్యం, సంక‌ల్ప‌ బ‌లంతో ముందుకు సాగాల‌ని కోరుతూ ఈ నాలుగు మాట‌ల‌తో నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను.

మీకు అనేకానేక ధ‌న్య‌వాదాలు.

జయ్ హింద్‌.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi