నమస్తే-సింగపూర్.
శుభ సాయంత్రం.
నీ హావో
సలామత్ దతాంగ్
వణక్కమ్
మంత్రి ఈశ్వరన్,
వ్యాపార నేతలు,
సింగపూర్ లోని ప్రియమైన నా మిత్రులు,
సింగపూర్ లోని భారతదేశ ప్రవాసులారా,
మీకు అందరికీ ఇదే నా వందనం.
భారతదేశం మరియు సింగపూర్ ల మధ్య గల సంబంధాల అద్భుత శక్తి ని ఈ రోజున ఈ మహాద్భుతమైనటువంటి ప్రాంగణంలో దర్శిస్తున్నాము. ఇది మన సంస్కృతి, మన ప్రజలు, మన కాలపు మహోన్నత భాగస్వామ్యం. ఇది రెండు సింహాల గర్జన, ఖ్యాతి మరియు గొప్పదనం. సింగపూర్‌కు రావడం ఎప్పటికీ సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. గొప్ప ప్రేరణను ఇవ్వడంలో ఎన్నటికీ విఫలం కాని నగరం ఇది. సింగపూర్ ఒక చిన్న ద్వీపం. కానీ దాని విస్తృతి అంతర్జాతీయం. ఒక దేశం విస్తీర్ణం ఎంత అన్నది అది సాధించే విజయానికి, లేదా ప్రపంచంలో ఒక దేశపు బలమైన వాణికి ఏమాత్రం సంబంధం లేదని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ ఘనమైనటువంటి దేశం.
అయితే, సింగపూర్ యొక్క విజయం దాని బహుళ సాంస్కృతిక సమాజ సామరస్యభరిత జీవనంలో, దాని భిన్నత్వంలో ఉంది. ఇది విభిన్నమైన, ప్రత్యేకమైన సింగపూర్ ప్రజల యొక్క గుర్తింపు ను చాటుతోంది. ఈ అద్భుతమైన అల్లికలో, అద్భుతమైన రంగు
రంగుల పురాతనమైన దారమొకటి ఉంది. అది భారతదేశానికి, సింగపూర్ కు మధ్య బంధాన్ని ఏర్పరుస్తోంది.
మిత్రులారా,
ఆగ్నేయాసియాకు శతాబ్దాల కాలంగా భారతదేశం నుండి సింగపూర్ మీదుగా పురాతన మార్గం ఉంటూ వచ్చింది. మానవ సంబంధాలు ఎంతో లోతైనవి,కలకాలం వర్ధిల్లేవి. ఇది సింగపూర్ భారతీయులలో తొణికసలాడుతోంది. మీ
రాకతో, మీ ఉత్సాహంతో, మీ ప్రతిభతో, మీరు సాధించిన విజయాలతో ఈ సాయంత్రం జాజ్వల్యమానం అయింది.
చరిత్ర ఇచ్చిన అవకాశం వల్ల గాని, లేదా గ్లోబలైజేషన్ కల్పించిన అవకాశం వల్ల గాని మీరు ఇక్కడ ఉండి ఉండవచ్చు. మీ పూర్వీకులు కొన్ని తరాల క్రితమే ఇక్కడికి వచ్చి ఉండవచ్చు; లేదా ఈ శతాబ్దంలోనే మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు.
మీరు ప్రతి ఒక్కరు సింగపూర్ ప్రత్యేక సమాజం లో, దాని పురోగతి లో భాగస్వాములుగా ఉన్నారు.
అందుకు సింగపూర్ మీ ప్రతిభ ను, మీ కష్టపడే తత్వాన్ని గుర్తించి మిమ్ములను అక్కున చేర్చుకుంది. ఇక్కడ మీరు సింగపూర్ లో భారతదేశపు భిన్నత్వానికి ప్రతినిధులుగా ఉన్నారు. భారతదేశపు పండుగలన్నీ ఒక్క నగరంలో మీరు చూడాలనుకున్నా, కొన్ని వారాల పాటు వాటిని జరుపుకోవాలన్నా అందుకు దర్శించాల్సిన ప్రదేశం సింగపూర్.
భారతీయ ఆహారానికి సంబంధించి కూడా అది వాస్తవం. లిటిల్ ఇండియా గా భావించే సింగపూర్ లో ప్రధాని శ్రీ లీ నా కోసం ఇచ్చిన ఆతిథ్యం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
ఇక్కడ తమిళం ఒక ఆధికారిక భాష. సింగపూర్ లో బడి పిల్లలు భారతదేశానికి చెందిన మరో ఐదు భాషలను నేర్చుకోవచ్చు. ఇది సింగపూర్ స్ఫూర్తికి నిదర్శనం. సింగపూర్ నగరం అద్భుత భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ప్రతిభావంతులైన భారతీయులకు సింగపూర్ ప్రభుత్వం నుండి మంచి మద్దతు లభిస్తోంది.
ఇక్కడ సింగపూర్ లో మీరు సంప్రదాయ భారతీయ క్రీడల పోటీలను పూర్తి స్థాయిలో ప్రారంభించారు. ఇది మీరు యువతరంలో ఉన్నప్పటి రోజులను గుర్తుకు తేవడంతో పాటు పిల్లలను ఖోఖో, కబడ్డీ వంటి ఆటలతో అనుసంధానం చేస్తుంది.
2017లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నగరంలో 70 కేంద్రాలలో జరుపుకొన్నారు. అంటే ప్రతి పది చదరపు కిలోమీటర్లకు ఒక కేంద్రం వంతున యోగాదినోత్సవం జరిగింది.
ప్రపంచం లోని ఏ ఇతర నగరంలో కూడా ఇంత విస్తృత స్థాయిలో యోగా లేదు. రామకృష్ణ మిషన్, శ్రీ నారాయణ మిషన్ వంటివి ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. ప్రజల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా సమాజానికి సేవలను అందించడంలో భారతదేశం, సింగపూర్‌ల మధ్య బాంధవ్యాన్నినిలిపే విలువలను ఈ సంస్థలు ప్రతిబింబిస్తున్నాయి.
సింగపూర్, ఈ ప్రాంతం మీదుగా సాగిన ప్రయాణంలో, గొప్ప ఆలోచనాపరులైన స్వామి వివేకానందుల వారు, గురుదేవులు రవీంద్ర నాథ్ ఠాగూర్ వంటి వారు భారతదేశాన్ని తూర్పు ప్రాంతంతో అనుసంధానం చేస్తున్న ఉమ్మడి బంధాన్ని గుర్తించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ గడ్డ మీది నుండే భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఢిల్లీ చలో అంటూ పిలుపునిచ్చారు. అది ప్రతి భారతీయుడి గుండెలో రగిలిన స్వాతంత్ర్య సమర జ్వాల.
మరి 1948 లో మహాత్మ గాంధీ అస్థికలలో కొంత భాగం క్లిఫోర్డ్ పియర్ వద్ద నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వేలాదిమంది తిలకించారు. మహాత్ముడి అస్థికల నిమజ్జనం సమయంలో విమానం నుండి గులాబీ పూలు చల్లి, ఆ మహనీయుడికి నివాళి అర్పించడం జరిగింది. అక్కడి పవిత్ర సముద్ర జలాలను ప్రజలు తీర్థంలా స్వీకరించారు.
మన చరిత్రకు సాక్షిగా క్లిఫోర్డ్ పియర్ ఫలకాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కింది. దానిని నేను ఎల్లుండి ఆవిష్కరించనున్నాను. మహాత్ముడి విశ్వజనీన విలువలు నేటికీ ఎంత గొప్పవో ఇది తెలియజేస్తుంది.
మిత్రులారా,
మహోన్నత సంస్కృతి పునాదుల మీద, సుసంపన్నమైన మానవ సంబంధాలు, మన ఉమ్మడి విలువల బలం, వీటన్నింటి సమాహారంగా భారతదేశం, సింగపూర్ లు ఈ కాలపు భాగస్వామ్య బంధాన్ని నిర్మించుకుంటున్నాయి. ఈ బంధం నిజంగా వ్యూహాత్మక
భాగస్వామ్య పరీక్షకు తప్పకుండా నిలుస్తుంది. భారతదేశం ప్రపంచానికి ద్వారాలు తెరచి, తూర్పు వైపు చూసినపుడు సింగపూర్ భాగస్వామి అయింది. భారతదేశానికి, ఏశియాన్ కు మధ్య సేతువు అయింది. భారతదేశం, సింగపూర్‌ల మధ్య రాజకీయ సంబంధాలు
హృదయపూర్వకమైనవి, అత్యంత సన్నిహితమైనవీనూ. ఇరు దేశాల మధ్య ఎలాంటి అనుమానాలు గాని, క్లెయిములు గాని, లేదా పోటీ గాని లేదు.
ఇది పరస్పర దార్శనికతతో కూడినటువంటి సహజ భాగస్వామ్యం. మన రక్షణ సంబంధాలు ఇరు పక్షాలకూ అత్యంత బలమైనవి. మా సాయుధ దళాలు సింగపూర్ సాయుధ దళాల పట్ల ఎంతో గౌరవంగా, ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతాయి. భారతదేశపు నౌకా
విన్యాసాలు సింగపూర్‌తో ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి.
వారు ఇప్పుడు రజతోత్సవాలను జరుపుకొంటున్నారు. సింగపూర్ సైనిక దళాలకు, వైమానిక దళాలకు భారతదేశం లో శిక్షణ సందర్బంగా ఆతిథ్యాన్ని ఇవ్వడం మాకు ఎంతో గర్వకారణం. మా నౌకలు పరస్పరం ఇరు దేశాలను సందర్శిస్తుంటాయి.
మీలో చాలామంది మా నౌకాదళ నౌకలలో ప్రయాణించి ఉంటారు. సింగపూర్ నావికాదళ నౌక, భారత నావికాదళ నౌక ఎల్లుండి చాంగీ నౌకా స్థావరాన్ని సందర్శించనుండడం కోసం నేను ఎదురు చూస్తున్నాను.
ఇక అంతర్జాతీయ వేదికల మీద, నిబంధనల ఆధారిత వ్యవస్థ కోసం, అన్ని దేశాల సార్వభౌమత్వ సమానత్వం కోసం, స్వేచ్ఛగా, ఎలాంటి అడ్డంకులు లేని వాణిజ్య మార్గాల కోసం మేము ఏక స్వరంతో మాట్లాడుతాము. ఇరు దేశాల మధ్య సంబంధాలలో
కీలకమైనవి ఆర్థిక అంశాలు. అంతర్జాతీయంగా భారతదేశం నిర్వహించే భాగస్వామ్య కార్యకలాపాలలో సింగపూర్ అగ్రభాగాన ఉంటుంది. సింగపూర్ భారతదేశానికి కీలక పెట్టుబడి మార్గం; అలాగే భారతదేశానికి పెట్టుబడుల గమ్యం కూడాను. మేం మొట్టమొదటి సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సింగపూర్‌తోనే కుదుర్చుకున్నాం.
ప్రతి వారం సింగపూర్ నుండి భారతదేశం లోని 16 నగరాలకు 250 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది మరింత విస్తరించనుంది. అంతే కాక సింగపూర్ కు మూడో అతి పెద్ద పర్యాటక వనరు భారతదేశం. ఇది అత్యంత వేగంగా పెరుగుతున్నది. సింగపూర్
స్మార్ట్‌గా నిలబడడానికి పోటీ ని ఎదుర్కోవడానికి మా ఐటీ కంపెనీలు సహాయ పడుతున్నాయి.
భారతదేశపు ఎన్నో అభివృద్ధి ప్రాధాన్యాలలో సింగపూర్ ఒక ప్రధాన భాగస్వామి. స్మార్ట్ సిటీస్, నగర పరిష్కారాలు, ఆర్థిక రంగం, నైపుణ్యాభివృద్ధి, నౌకాశ్రయాలు, మౌలిక సదుపాయాలు, విమానయాన రంగం, పారివ్రామిక పార్కుల వంటి వాటిలో సింగపూర్
ఒక కీలకమైన భాగస్వామి.
అందువల్ల భారతదేశం, సింగపూర్ లు ఒక దాని సుసంపన్నతకు మరొకటి దోహదపడుతున్నది. ఇప్పుడు మనం డిజిటల్ ప్రపంచం కోసం నూతన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్నాము. నేను, ప్రధాన మంత్రి శ్రీ లీ ఇప్పుడే ఒక అద్భుతమైన సాంకేతిక,
నూతన ఆవిష్కరణల, వాణిజ్య ప్రదర్శన ను తిలకించాము. వీరంతా భారతదేశం, సింగపూర్ లకు చెందిన ప్రతిభావంతులైన యువకులు.
వీరిలో చాలా మంది భారతదేశానికి చెందిన ప్రతిభావంతులు ఉన్నారు. వీరు సింగపూర్ ను వారి స్వస్థలంగా చేసుకొన్నారు. వీరు భారతదేశం, సింగపూర్, ఏశియాన్ ల మధ్య నూతన ఆవిష్కరణలకు, వాణిజ్యానికి వారధులుగా ఉంటారు. కొద్దిసేపటి క్రితం మేం
అంతర్జాతీయంగా రూపే, భీమ్, యుపిఐల ఆవిష్కరణను తిలకించాం.
సింగపూర్‌లో వీటిని ఆవిష్కరించడం చాలా సహజమైన విషయం. ఉభయ దేశాలూ కలిసి, మొబైల్, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో, అన్ని వర్గాలకు సేవలు అందించడానికి
ఉపయోగిస్తాం. ఉభయ దేశాలూ కలిసి నవ శకంలో గొప్ప ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మించగలం.
సింగపూర్ నూతన భవిష్యత్తుకు తనను తాను మలచుకుంటుంటే, భారతదేశం అంతర్జాతీయ అవకాశాల కేంద్రంగా రూపుదిద్దుకొంటోంది. వస్తువులు మరియు సేవల పన్ను- జిఎస్‌టి- వంటి లోతైన వ్యవస్థాగత మార్పులను తీసుకువచ్చినప్పటికీ, ప్రపంచంలో అత్యంత
వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కొనసాగుతున్నది. మేం అలా ముందుకు సాగనున్నాం. మా ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా ఉంది. ద్రవ్య లోటు తగ్గింది. ద్రవ్యోల్బణంతగ్గింది. కరెంటు ఖాతా లోటు అదుపులో ఉంది. కరెన్సీ స్థిరంగా ఉంది.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో గరిష్ఠంగా ఉన్నాయి.
భారతదేశం లో ప్రస్తుత పరిస్థితులు గణనీయంగా మారుతున్నాయి. న్యూ ఇండియా రూపుదిద్దుకొంటోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత వేగంగా సంస్కరణలు చోటుచేసుకొంటున్నాయి. గత రెండు సంవత్సరాలలో
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న 10,000కు పైగా చర్యలు సులభతర వాణిజ్యం లో మా ర్యాంకులను 42 స్థానాల పైకి తీసుకువచ్చింది.
కాలం చెల్లిన 1400 చట్టాలను తొలగించడం జరిగింది. భారతదేశం ప్రపంచం లోనే అత్యంత బాహాట ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా రూపుదిద్దుకొంది. విదేశీ పెట్టుబడిదారులు దాదాపు అన్నిరంగాలలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. కొన్ని రంగాలలో 100
శాతం ఈక్విటీని కలిగివుండవచ్చు. నిజానికి, 90 శాతం పైగా భారతదేశంలోని పెట్టుబడులు ఈ మార్గం లోనివే.
ఇక రెండోది, పన్నుల విధానంలో మార్పులను ప్రవేశపెట్టడం జరిగింది: తక్కువ పన్ను రేటు, పెరిగిన స్థిరత్వం మరియు పన్ను వివాదాలకు సత్వర పరిష్కారం, ఎలక్ట్రానికి ఫైలింగ్ వ్యవస్థల పరిచయం. స్వాతంత్ర్యం అనంతరం తీసుకువచ్చినటువంటి అతి పెద్ద పన్నుల సంబంధిత సంస్కరణ వస్తువులు మరియు సేవల పన్ను- జిఎస్‌టి. ఇది దేశాన్ని ఏకీకృత విపణిగా మార్చడంతో పాటు టాక్స్ బేస్ ను పెంచింది.
ఇది చిన్న విషయం ఏమీ కాదు. అయితే దీనిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇది నూతన ఆర్థిక అవకాశాలను కల్పించింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను బేస్ సుమారు 20 మిలియన్ స్థాయికి విస్తరించింది.
ఇక మూడోది, మా మౌలిక సదుపాయాల రంగం రికార్డు వేగంతో ముందుకు పోతోంది. గత ఏడాది మేము 10 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించాం. అంటే రోజుకు 27 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించాం. ఇది కొద్ది సంవత్సరాల క్రితం
నాటితో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగినట్టు.
అదనపు రైలు మార్గాల నిర్మాణ వేగం రెట్టింపు అయింది. పలు నగరాలలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏడు హై స్పీడ్ రైలు ప్రాజెక్టు లు, సరకు రవాణా కోసమే ప్రత్యేకించినటువంటి కారిడోర్ లు, ఇంకా 400 రైల్వే స్టేషన్ ల ఆధునికీకరణ వంటివి రైల్వే రంగం రూపు రేఖలను మార్చనున్నాయి.
ఇతర ప్రాజెక్టులలో 10 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు; ఐదు కొత్త ప్రధాన నౌకాశ్రయాలు, 111 నదులను జాతీయ జల మార్గాలుగా గుర్తించడం, 30 కి పైగా లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు వంటివి ఉన్నాయి. మేం 80 వేల మెగావాట్ల విద్యుత్తును కేవలం మూడు సంవత్సరాలలో మేం అదనంగా సమకూర్చగలిగాం.
ఇక నవీకరణయోగ్య శక్తి రంగంలో ప్రపంచం లోనే ఆరో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగాము. సుస్థిర, హరిత భవిష్యత్తు కు మన కట్టుబాటుకు ఇది నిదర్శనం. ఇంకా సులభంగా చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద మౌలిక రంగ అభివృద్ధి భారతదేశంలో
చోటు చేసుకొంటోంది.
నాలుగోది, మా తయారీ రంగం తిరిగి విజృంభిస్తున్నది. గత మూడు సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఇవి 2013-14 లో 36 బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయి నుండి 2016-17 నాటికి 60 బిలియన్ అమెరికన్
డాలర్ల కు అమాంతం పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య రంగం కూడా గణనీయంగా పుంజుకుంది.
మేం వివిధ రంగాలకు ప్రత్యేకంగా ఆధునీకరణ కార్యక్రమాన్ని, ఉత్పాదక కార్యక్రమాన్ని ప్రారంభించాము. కార్పొరేట్ టాక్స్ ను తగ్గించాం. పన్ను ప్రయోజనాలను సులభతరంగాను, మరింత ఆకర్షణీయంగాను మలచాము. భారతదేశ స్టార్ట్ అప్ రంగం వికసిస్తోంది. మరి ఇది ఇప్పుడు ప్రపంచంలో మూడో
అతి పెద్ద రంగం గా ఉంది.
నా అభిమాన పథకం విషయానికి వస్తే, అది ముద్రా పథకం అని అంటాను. పేదలకు, అణగారిన వర్గాలకు సూక్ష్మ రుణాలను అందజేసే పథకం ఇది. ఈ పథకంలో భాగంగా గత మూడు సంవత్సరాలలో 90 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ గల 128 మిలియన్ రుణాలను అందించడమైంది. ఇందులో 74 శాతం రుణాలు మహిళలకు ఉద్దేశించబడినవి; అవును, 74 శాతం రుణాలను అందుకున్నది మహిళలు.
అయిదోది, మేం అందరికీ ఆర్థిక సేవల అందజేత పై ప్రధానంగా దృష్టిపెట్టాం. ఈ క్రమంలో ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు లేని వారికి సంబంధించి 316 మిలియన్ బ్యాంకు ఖాతాలను గత మూడు సంవత్సరాలలో మేము ప్రారంభించాము. ఇప్పుడు 99 శాతం మంది
భారతీయ కుటుంబాలు బ్యాంకు ఖాతాను కలిగివున్నాయి.
ఇది ప్రతి పౌరుడికి ఒక కొత్త గౌరవాన్ని, గుర్తింపును తీసుకువచ్చింది. నిజంగా ఇది ఒక అసాధారణమైనటువంటి సమ్మిళిత గాథ. అంతేకాక, సాధికారిత కు గొప్ప ఉదాహరణ. ఈ ఖాతాలలో సుమారు 12 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ గల డబ్బు జమ కాబడింది.
50 బిలియన్ అమెరికన్ డాలర్ల కు పైగా విలువ కలిగిన ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయడం జరిగింది. వారికి అందుబాటు ధరలో పెన్షన్, ఇన్సూరెన్స్ పథకం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ వర్గాలకు ఇది ఒక కలగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు శరవేగంతో, పెద్ద ఎత్తున విస్తరరణకు నోచుకున్నాయి.
ఆరోది, డిజిటల్ విప్లవం దేశమంతా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ గుర్తింపు , ప్రతి జేబులో మొబైల్ ఫోన్, ప్రతి ఒక్కరికి అందుబాటులో బ్యాంకు ఖాతా.. ఇలా ప్రతి భారతీయుడి జీవితం పరివర్తన చెందుతోంది.
అంతేకాదు, భారతదేశంలో ప్రతి ఒక్కటీ పరివర్తన చెందుతోంది. అది పాలన, ప్రజాసేవలు, పేదలకు అందే ప్రయోజనాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు, పెన్షన్ సదుపాయాలు.. ఇవి అన్నీ పేదలకు అందుబాటు లోకి వచ్చాయి. ఉదాహరణకు డిజిటల్ లావాదేవీలు
గణనీయంగా హెచ్చుతున్నాయి.
2017వ సంవత్సరంలో యుపిఐ ఆధారిత లావాదేవీలు 7 వేల శాతం మేర వృద్ధి చెందాయి. జనవరి లో జరిగిన అన్ని డిజిటల్ లావాదేవీల విలువను 2 అమెరికన్ ట్రిలియన్ డాలర్లుగా లెక్కకట్టడమైంది. మేం 250000 గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బాండ్ సంధానాన్ని కల్పించనున్నాం. ప్రతి గ్రామ పంచాయితీలోనూ ఉమ్మడి సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.
ఇవి ఎన్నో డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాలలో వేలాది ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అటల్ ఇనవేశన్ మిశన్ లో భాగంగా, మేము 100 ఇంక్యుబేషన్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నాము. భారతదేశం అంతటా మేం
2400 టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. మా పిల్లలు నూతన ఆవిష్కర్తలుగా, ఉపాధిని కల్పించే వారిగా ఎదిగేందుకు వీటిని ఏర్పాటు చేశాము. ఈ రోజు ఎగ్జిబిటర్ లలోని ఒకరు ఈ ల్యాబ్‌ల నుండి వచ్చిన వారే.
ఏడోది, రాగల రెండు దశాబ్దాలలో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భారతదేశంలో నగరీకరణ జరగనుంది.. ఇది ఒక పెద్ద సవాలు. పెద్ద బాధ్యత, అలాగే ఒక అవకాశం కూడా.
మేము 100 నగరాలను స్మార్ట్ సిటీస్ గా, 115 ఆకాంక్షభరిత జిల్లాలను ప్రగతికి నూతన కేంద్రాలుగా మార్చే పనిని చేపట్టాము.
సామూహిక ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, సుస్థిర జనావాసాలు, తక్కువ ఖర్చులో గృహ నిర్మాణం వంటి కార్యక్రమాలు మాకు ప్రాధాన్య కార్యక్రమాలుగా ఉన్నాయి.
ఎనిమిదోది, మేము నైపుణ్యాలపైన పెట్టుబడి పెడుతున్నాము. అలా మా 800 మిలియన్ యువతీయువకులకు అవకాశాలను, గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించేందుకు ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచుతున్నాము. సింగపూర్ నుండి నేర్చుకుని మేం అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డివెలప్‌మెంట్ ను ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఉన్నతవిద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము.
తొమ్మిదోది, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం. దశాబ్దాల క్రితం హరిత విప్లవం అనంతరం మున్నెన్నడూ లేని రీతిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వడం జరుగుతోంది. 2022 నాటికి వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. స్వతంత్ర భారతదేశానికి 75 సంవత్సరాలు వచ్చే సరికి ఒక ‘న్యూ ఇండియా’ ఆవిర్భవించనుంది.
ఇందుకోసం మేము సాంకేతిక విజ్ఞానాన్ని, రిమోట్ సెన్సింగ్ ను, ఇంటర్ నెట్ ను, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను, సాఫ్ట్ క్రెడిట్ ను, బీమా ను, భూసారాన్ని మెరుగుపరచడాన్ని, సేద్యపు నీటి పారుదల ను, గిట్టుబాటు ధరలను, ఇంకా అనుసంధానాన్ని ఉపయోగించుకొంటున్నాము.
పదోది, ప్రతి పౌరుడు 2022 కల్లా సులభతర జీవనాన్ని అనుభవించాలని మేం కోరుకుంటున్నాము. దీనికి అర్థం, ఉదాహరణ గా చెప్పాలంటే 50 మిలియన్ కొత్త ఇళ్ల నిర్మాణం. దీనివల్ల 2022 నాటికి ప్రతి ఒక్కరి కీ ఇంటి వసతి అమరుతుంది.
గత నెలలో, మేం ఒక మైలురాయిని చేరుకున్నాం. 600000 గ్రామాల లోని ప్రతి గ్రామం పవర్ గ్రిడ్ తో అనుసంధానమైంది. ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం.
ఈ ఏడాది మేం ‘ఆయుష్మాన్ భారత్’ పేరు తో జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించాం. ఇది దేశం లోని 100 మిలియన్ కుటుంబాలకు లేదా 500 మిలియన్ భారతీయులకు ఏడాదికి 8000 అమెరికన్ డాలర్ల కవరేజ్ కలిగి వుంటుంది.
ప్రపంచం లోనే అతిపెద్ద ఆరోగ్య రక్షణ పథకం ఇది. జీవన నాణ్యత పరిశుభ్రమైన , సుస్థిర అభివృద్ధితో ముడిపడి వుంటుంది. ఇది మా ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇది మా సంస్కృతిలో అంతర్భాగం. ఇది ఈ విశాల విశ్వం రక్షణకు మా చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఇది భారతదేశంలో పబ్లిక్ పాలసీ ప్రతి పార్శ్వాన్ని, ఆర్థిక ఎంపికలను
వెల్లడిస్తుంది.
పరిశుభ్ర భారతదేశం నిర్మాణానికి మా చిత్తశుద్ధి కూడా ఇందులో ఇమిడివుంది. పరిశుభ్రమైన నదులు, పరిశుభ్రమైన గాలి, పరిశుభ్రమైన నగరాలు.. ఈ మార్పులన్నీ ఒకే ఒక కారణం తో జరుగుతున్నాయి. అదే మా ప్రజలు. 1.25 బిలియన్ మంది ప్రజలతో కూడినటువంటి, ఇందులో 35 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న యువత 65 శాతం మందిని కలిగిన భారతదేశం మార్పు వైపు ఆత్రుత తో ముందుకు కదులుతూ ఒక న్యూ ఇండియా ను ఆవిష్కరించగలమన్న గట్టి విశ్వాసంతో ఉంది. ఇది కూడా పాలనలోను, రాజకీయాలలోను మార్పునకు చోదకంగా ఉంటోంది.
మిత్రులారా,
భారతదేశంలో ఆర్థిక సంస్కరణల వేగానికి, దిశకు సంబంధించిన పరిపూర్ణ స్పష్టత, విశ్వాసం ఉన్నాయి. భారతదేశంలో వ్యాపారం చేయడాన్ని మేం సులభతరం చేస్తున్నాం. బాహాటత్వంతో, సమానత్వంతో కూడిన , స్థిరమైన, అంతర్జాతీయ వాణిజ్య పాలన
విధానాన్ని తీసుకు వచ్చేందుకు కృషి జరుగుతోంది. తూర్పు దేశాలతో మా బంధం బలమైన బంధం. యాక్ట్ ఈస్ట్ పాలిసీ లో ఆర్ధిక అంశాలు అంతర్భాగంగా ఉండనున్నాయి.
వాణిజ్యం, పెట్టుబడుల తరంగాలపై అన్ని దేశాలనూ పైకి తీసుకువచ్చే సమతూకంతో, సమానత్వంతో కూడిన సమగ్ర విధానాన్ని మేం చూడాలని అనుకుంటున్నాం. మేము ఇండియా- సింగపూర్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేశన్ అగ్రిమెంటును కొద్ది సేపటి క్రితమే సమీక్షించాము. దీని స్థాయిని పెంచి, మరింత ముందుకు తీసుకుపోయేందుకు మేం కృషి చేస్తాము.
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించి త్వరలో ఖరారుచేసేందుకు మేం అందరితో కలిసి పనిచేస్తాం, దాదాపుగా ఏశియాన్ దేశాలన్నింటితో కలిసిపనిచేస్తాం. భారతదేశం ఈ ప్రాంతంతో కలిసి పనిచేయడం వృద్ధి చెందినట్టయితే, సింగపూర్
ఏశియాన్ కు ముఖద్వారం గా మారుతుంది. తూర్పు దేశాలతో సంబంధాలు విస్తృతం అవుతాయి. ఈ సంవత్సరం ఏశియాన్ కు సింగపూర్ ఛైర్మన్ కావడంతో ఏశియాన్ తో భారతదేశ సంబంధాలు మరింత ముందుకు సాగనున్నాయి.
మిత్రులారా,
చివరగా చెప్పాలంటే సింగపూర్ కు భారతదేశాన్ని మించిన మెరుగైన అవకాశం మరొకటి లేదు. భారతదేశం, సింగపూర్‌ల వలె కొన్ని దేశాలు మాత్రమే చాలా వరకు సామ్యాన్ని, సామర్ద్యాల్ని కలిగి ఉన్నాయి. మన సమాజాలు ఒకదానికి మరొకటి ప్రతిబింబంగా ఉంటాయి. ఈ ప్రాంత భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలని మేము వాంఛిస్తాము.
మేము చట్టబద్ధ పాలన ఆధారంగా సాగే ప్రపంచాన్ని, అడ్డంకులు లేని సముద్ర అనుసంధానాన్ని, సుస్థిర వాణిజ్యపాలన వ్యవస్థ కోసం యత్నిస్తున్నాము. అన్నింటికీ మించి మాకు ప్రపంచం లోనే అత్యంత ప్రతిభావంతులైన , చైతన్యవంతులైన, వివిధ రంగాల
నిపుణులు, చిత్తశుద్ధి కలిగిన భారత సంతతి ప్రజలు ఉన్నారు. సింగపూర్ ప్రజలుగా ఉండడాన్ని మీరంతా గర్వంగా భావించండి. భారతీయ వారసత్వానికి వారసులుగా గర్వించండి. భారతదేశం, సింగపూర్ ల మధ్య వారధులుగా ఉండడానికి సిద్ధం కండి.
భవిష్యత్తు అనంత అవకాశాలతో కూడినటువంటి ప్రపంచం. అటువంటి భవిష్యత్తు మనదే. గొప్ప ఆశయాలను కలిగి వుండడం మరియు వాటిని నెరవేర్చుకొనేందుకు ధైర్యం చేయాలి. ఆ దిశగా మనం సరైనే మార్గంలో ఉన్నామని ఈ సాయంత్రం తెలియజేస్తోంది. రెండు సింహాలూ కలసి భవిష్యత్తు వైపు అడుగులు ముందుకు వేయాలి.
మీకు ఇవే ధన్యవాదాలు.
అనేకానేక ధన్యవాదాలు.