జాతీయ యువజన దినం మరియు వివేకానందుల వారి జయంతి ల సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ ఆవిష్కారమైనటువంటి ఒక నమ్మశక్యం కాని గొప్ప దృశ్యాన్ని చూస్తుంటే ఇక్కడ గుమికూడిన ప్రతి ఒక్కరిలో వివేకానందుల వారి స్ఫూర్తిని నిండివున్నట్లుగా తోస్తోంది. ఈ రోజు ఇక్కడ ఒక సర్వ ధర్మ సభను కూడా ఏర్పాటు చేశారు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని, మీకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
నేను గమనిస్తున్నటువంటి ఉత్సాహం ప్రతి ఒక్కరి మనస్సు ను, అంతశ్చేతన ను ఏకం చేసివేసింది. వేలాది ప్రజల అంతరంగాలను కమ్ముకొన్న ఇక్కడి వాతావరణం ఏకంగా ఓ ప్రపంచ రికార్డునే సృష్టిస్తున్నట్లు ఉంది.
ఇది మాన్యులైన సిద్దలింగ్ మహారాజ్ గారు, యల్లలింగ్ ప్రభు గారు మరియు సిద్ధ రామేశ్వర్ మహా స్వామి గారుల యొక్క ఆశీస్సు లతో సాధ్య పడింది. వారి యొక్క దీవెనల శక్తి మీ వదనాలలో ప్రతిబింబిస్తోంది. ఆ ఆశీర్వాదాల యొక్క మరియు ఆ శక్తి యొక్క ప్రభావానికి నేను కూడా లోనవుతున్నాను. సోదరులు మరియు సోదరీమణులారా, బెళగావి ని సందర్శించినప్పుడల్లా అది నాకు ఎప్పటికీ ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తూ వచ్చింది. ఇక్కడ ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ యొక్క విశాలమైన దృశ్యాన్ని చూడవచ్చును.
ఇటువంటి ఒక చిన్న ప్రదేశంలో అయిదు వేరు వేరు భాషలను మాట్లాడుతూ ఉండటాన్ని దేశంలో మరే ప్రాంతంలోనైనా చూడడమనేది అరుదుగా సంభవించేటటువంటిది. బెళగావి గడ్డ కు మరియు మీ అందరికి నేను ప్రణమిల్లుతున్నాను. ఇది మహా యోధుడు సంగొళ్లి రాయణ్ణ, కిత్తూరు రాణి చెన్నమ్మ ల పురుటి గడ్డ. వారు బ్రిటిషు వారితో పోరాడారు. స్వామి వివేకానందుల వారు బెళగావి లో 10 రోజులు మకాం చేశారు. ఆయన ప్రఖ్యాత మైసూరు రాజ భవనం లో కూడా బస చేశారు. మైసూరు నుండి ఆయన తమిళనాడు కు మరియు కేరళ కు వెళ్ళారు. ఆయన కన్యాకుమారి లో ఒక కొత్త ప్రేరేపణను పొందారు. ఆయన శికాగో కు పయనమై వెళ్ళేటట్టు చేసింది ఆ ప్రేరణే. శికాగో లో యావత్తు ప్రపంచం అనురాగాన్ని ఆయన గెలుచుకొన్నారు.
శికాగో లో స్వామి వివేకానందుల వారి ప్రసంగానికి ఈ సంవత్సరం 125 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఆ ఉపన్యాసానికి 100 సంవత్సరాలు పూర్తి అయిన ప్రత్యేక సందర్భంలో నేను శికాగో కు వెళ్ళాను. ఆయన ఉపన్యాసం ఇచ్చిన నాటి నుండి అనేక సంవత్సరాలు గడచిపోయాయి. మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం కోసం అన్వేషిస్తున్న ప్రతి సారి, ‘ఓహో! స్వామి వివేకానందుల వారు ఈ విషయాన్ని చెప్పారు; అబ్బ! ఆయన ఎంత సరిగ్గా చెప్పారో కదా..’ అని మనం భావన చేస్తాం. మనం వివేకానందుల వారిని గుర్తుకు తెచ్చుకోనక్కర లేదు. వారు సదా మన ఆలోచనలలోనే నిలచివున్నారు.
ఒక భారతీయుడు ఎలా ఉండాలి అనే అంశంపైన వివేకానందుల వారు చాలా శక్తిమంతమైన మంత్రాన్ని అందజేశారు. దేశానికి తొలి ప్రాధాన్యాన్నివ్వాలనేదే ఆ మంత్రం. ఆ మంత్రంలోని ప్రతి ఒక్క వాక్యమూ శక్తితో, ప్రేరణతో నిండిపోయింది. ఆయన చెప్పింది ఇదీ: ‘ఓ భారతదేశమా, నీ జీవితం వ్యక్తిగత ఆనందం కోసం కాదు అనే సంగతిని నీవు మరచిపోనే కూడదు. సాహసులారా, దయచేసి ‘నేను ఒక భారతీయుడునని, ప్రతి ఒక్క భారతీయుడు నా సోదరుడని గర్వంగా చెప్పండి. మీరు బిగ్గరగా గర్వంతో చెప్పండి.. ప్రతి భారతీయుడు నాకు సహోదరుడు. భారతదేశం నా జీవితం. భారత భూమి నా యొక్క స్వర్గం. భారతదేశ సంక్షేమమే నా సంక్షేమం’ అని. వివేకానందుల వారు ఆ విధంగా ఆలోచించారు. వివేకానందుల వారిలో భారతదేశ స్ఫూర్తి నిండి ఉండేది. ఆయన దేశంతో పూర్తిగా మమేకం అయ్యారు. ఆయన భారతదేశం యొక్క సంతోషాన్ని, దుఃఖాన్ని తన సంతోషంగా, తన దు:ఖంగా భావించారు. ఆయన ప్రతి చెడు తో పోరాడారు. ఆయన భారతదేశాన్ని పాములు ఆడించే వాళ్ళ మరియు గారడీ వాళ్ళ దేశంగా విదేశాలకు చాటిచెప్తూ సాగినటువంటి దుష్ప్రచారాన్ని ధ్వంసం చేశారు. ప్రపంచంలో భారతదేశం యొక్క పేరు ప్రతిష్ఠలను ఆయన ఇనుమడింప చేశారు. విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం, భాష, సంఘ సంస్కరణలతో నిండిన ఇంకా ప్రగతిశీలమైన ప్రపంచానికి అనుగుణంగా ముందుకు సాగే ధైర్యం ఆయనలో మూర్తీభవించింది.
ఆయనలో ఒక యోధుడి స్ఫూర్తి ఉండింది. ఆ స్ఫూర్తిభరితుడైన యోధుడు అంటరానితనం, భేదభావం మరియు కపటత్వాల వంటి సమాజాన్ని పీడిస్తున్న సాంఘిక దురాచారాల మీద పోరాడారు. ఈ భావన ఆయనను ఒక యోధుడైనటు వంటి సన్యాసిగా మార్చివేసింది. స్వామి వివేకానందుల వారు కొలంబో నుండి అల్మోడా కు వెళ్ళినప్పుడు కుల ఆధారిత భేదభావానికి వ్యతిరేకంగా ఎలుగెత్తారు. ఆయన నిర్మోహమాటంగా చెప్పింది ఇదీ: ‘విజ్ఞానం పరంగా, తత్త్వ శాస్త్రం పరంగా చూసినప్పుడు మీ అంతటి మహనీయులు మరొకరు ఉండకపోవచ్చు; కానీ, ప్రవర్తన రీత్యా చూస్తే మీ అంతటి నీచులు మరొకరు ఉండరు’. అటువంటి అంశాలను ఆయన వలె దాదాపు 100-125 సంవత్సరాల క్రితం చెప్పిన అంతటి నిర్మొహమాటంతో చెప్పే సాహసాన్ని ఈ నాటికీ మరెవ్వరూ చేయలేరని అనుకుంటాను.
మిత్రులారా, ఈ వాతావరణాన్ని, ఈ మనస్తత్వాన్ని మనం మార్చాల్సి ఉంది. మనం వివేకానందుల వారిని అనుసరించాలంటే కులపరమైన ప్రతికూల అభిప్రాయాన్ని మరియు విచక్షణ నుండి మనని మనం దూరం చేసుకోవాలి. వీటిని మనం అంతం చేసి తీరాలి. గడచిన కొన్ని దశాబ్దాలలో మీ యొక్క మఠం సిద్ధలింగ్ మహారాజ్ గారి నుండి పొందిన ప్రేరణతో- కులపరమైన విచక్షణ ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిని నిర్మూలించడం కోసం – కృషి చేసింది. సమాజంలోని దుర్భలురైన వారికి మరియు దూరంగా నెట్టివేయబడిన వర్గాలకు అవసరమైన సహాయాలను- బాధితుని కులాన్ని గురించి పట్టించుకోకుండా- మీరు అందిస్తూ వచ్చారు. మీ మఠంతో అనుబంధం కలిగివున్నటువంటి వ్యక్తులు వరదల సమయంలో గ్రామ గ్రామానికి వెళ్తూ, సహాయ సామగ్రిని అందజేస్తూ వచ్చారు. పేదలకు మందులను ఉచితంగా వితరణ చేసేటప్పుడు, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించేటప్పుడు, ఇంకా ఆహారాన్ని, వస్త్రాలను పంచిపెట్టేటప్పుడు మనం కులం గురించి పట్టించుకుంటామా ? ఉహు, పట్టించుకోం.
కొన్ని దశాబ్దాలుగా అతి కష్టం మీద మరియు ప్రజలు చేసిన ప్రయత్నాల కారణంగా దేశం కులతత్వం యొక్క శృంఖలాల నుండి విడివడే దిశగా సాగుతోంది. అయితే, మీ వంటి లక్షలాది ప్రజల హృదయాలపై కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు వాటి దుష్ట దృష్టిని సారించాయి. వీరు కులం పేరిట సమాజాన్ని చీల్చడానికి కుట్రలు పన్నుతున్నారు. అయితే నేటి యువతరం ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రతిస్పందిస్తోంది. భారతదేశం యువతను కొద్ది మంది వ్యక్తులు మోసపుచ్చజాలరు. కులతత్వాన్ని, సంఘం లోని దుష్ట ఆచారాలను, మూఢ నమ్మకాలను దేశంలో నుండి పారదోలాలని శపథం చేసినటువంటి యువకులు వివేకానందుల వారిని పోలిన వారే. వారు నూతనమైన, సాహసవంతులైన, ధైర్యవంతులైన, అభివృద్ధి ప్రధానమైన భారతదేశానికి ప్రతీకలుగా ఉన్నారు.
జాతి నిర్మాణంలో తన వంతు ప్రాతను క్రియాశీలంగా నిర్వర్తించే ప్రతి యువ ప్రతినిధి, ఒక ‘న్యూ ఇండియా’ నిర్మాణం కోసం పవిత్రమైన ప్రతిజ్ఞను స్వీకరించి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి యువ ప్రతినిధి ఒక్కొక్క వివేకానందుల వంటి వారే. ఏదైనా వ్యవసాయ క్షేత్రంలోనో, ఏదైనా కర్మాగారంలోనో లేదా ఏదైనా పాఠశాలలో గాని, లేదా ఏదైనా కళాశాలలో గాని, లేదా మీ ప్రాంతంలో/మీ వీధిలో ఒక వైపున ఉంటూ దేశ ప్రజల సేవకు అంకితమైన ప్రతి వ్యక్తీ కూడా ఒక వివేకానందుల వారే అవుతారు.
‘స్వచ్ఛ భారత్ అభియాన్’ ను ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి, పల్లె పల్లెను సందర్శిస్తూ డిజిటల్ సాక్షరతను అందిస్తున్న వ్యక్తులు సైతం వివేకానందుల వంటి వారే. అణచివేతకు గురైన, వేధింపులకు లోనైన, దోపిడి బారిన పడిన, సమాజం నుండి దూరంగా నెట్టివేయబడిన వ్యక్తుల బాగు కోసం పని చేస్తున్న వారు కూడా వివేకానందుల వారి కోవకు చెందిన వారే. సమాజ శ్రేయస్సు కోసం తన శక్తిని, ఆలోచనలను మరియు నూతన ఆవిష్కారాలను ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తులు కూడా వివేకానందుల వారి వంటి వారే అవుతారు.
మిత్రులారా, కిందటి సంవత్సరం స్మార్ట్ ఇండియా హ్యాకథన్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశంలోని సుమారు 600 సమస్యలకు డిజిటల్ పరిష్కార మార్గాలను అందించడం కోసం 40,000 వేల మందికి పైగా యువతీయువకులు ముందుకు వచ్చారు. నా దృష్టిలో వీరంతా వివేకానందుల వారిని పోలినటువంటి వారే. భారతదేశం మట్టి తాలూకు పరిమళాన్ని మనస్సు లోలోపల నింపుకొన్న, ‘న్యూ ఇండియా’ నిర్మాతలు అయిన లక్షలాది సాధారణ ప్రజానీకం ఆధునిక కాలంలో మన వివేకానందుల వారి ప్రతీకలే అనవచ్చు. వారికి మరియు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రతి ఒక్క వివేకానందుల వారికి, మన దేశం లోని ప్రతి వివేకానందుల వారికి నేను శిరస్సును వంచి ప్రణామం చేస్తున్నాను.
సోదరులు మరియు సోదరీమణులారా, కాలంతో పాటు వచ్చిన మార్పులను వీక్షించిన, వ్యక్తులలో మార్పులను వీక్షించిన, సమాజంలో మార్పులను వీక్షించిన వేలాది సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నటువంటి మన దేశం లోకి గడచిపోయినటువంటి కాలంతో పాటే కొన్ని దుష్ట శక్తులు కూడా చొరబడ్డాయి.
మన సమాజంలోకి ఇటువంటి దుష్ట శక్తులు చొరబడినప్పుడల్లా ఇదే సమాజంలోని ఒక సభ్యుడు సమాజాన్ని సంస్కరించే కార్యాన్ని మొదలుపెట్టడమే మన సమాజంలోని విశిష్టత. ఈ విధమైన సామాజిక సంస్కర్తలు వారి యొక్క కార్యకలాపాలలో ప్రజా సేవకు కేంద్ర స్థానాన్ని ఇస్తూ వచ్చారు. వారు వారి యొక్క మనస్సాక్షి ద్వారా, ప్రసంగాల ద్వారా మరియు కార్యాల ద్వారా సమాజాన్ని విద్యావంతం చేయడంతో పాటు ప్రజలకు సేవ చేయడానికి కూడా ముఖ్యతనిచ్చారు. వారు సామాన్య మానవుడికి అతడికి అర్థం అయ్యే సరళమైన భాషలో ఈ విషయాలను వివరించారు కూడాను.
ఈ పరిణామం కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు సాగిన ప్రజల ఉద్యమాన్ని పోలినటువంటిది. ఈ ఉద్యమం దక్షిణాదిన మధ్వాచార్య, నింబార్కాచార్య, వల్లభాచార్య, రామానుజాచార్య గారు, పశ్చిమ ప్రాంతంలో మీరాబాయి, ఏక్ నాథ్, తుకారం, రాందాస్, నార్సీ మెహ్ తా; ఇంకా ఉత్తరాదిన రామానంద్, కబీర్ దాస్, గోస్వామి తులసీదాస్, సూర్‌దాస్, గురు నానక్‌దేవ్, సంత్ రాయ్ దాస్ లతో పాటు తూర్పు ప్రాంతంలో చైతన్య మహాప్రభు ఇంకా శంకర్ దేవ్ ల వంటి సాధువుల ఆలోచనల ద్వారా శక్తిని పుంజుకొంది. ఇది ఎన్నడూ కూడా మతపరమైన ఉద్యమాలతో తులతూగకపోవడం కూడా మన దేశానికి ఉన్నటువంటి విశిష్టమైన బలం. విజ్ఞానం, భక్తి, ఇంకా కర్మ.. ఈ మూడింటి మధ్య సమతుల్యతను మన దేశంలో సదా ఆమోదిస్తూ వచ్చారు. ‘ఆఖరుకు నేను ఎవరిని ?’ అనేటటువంటి ఈ మౌలికమైన ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడం కోసం ఈ సాధువులు అందరూ వారికి ఉన్నటువంటి విజ్ఞానం పరిధిలో అన్వేషించారు.
అంకిత భావానికి మరొకపేరే భక్తి. కార్యాలు అన్నీ కూడాను సేవ చేసే కర్తవ్యం పైనే పూర్తిగా ఆధారపడ్డాయి. అటువంటి ఎందరో సాధువుల ప్రభావం వల్లే దేశం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ముందుకు పయనించగలిగింది. ఆ కాలంలో, దేశంలోని ప్రతి చోటులోను, ప్రతి ప్రాంతంలోను, ప్రతి ఒక్క దిక్కులోను మన సాధువులు దేవాలయాల మరియు మఠాల వెలుపలకు వచ్చి సామాజిక చైతన్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేశారు. భారతదేశంలో అటువంటి ఒక గొప్ప సంప్రదాయం ఉందని, ఆ విధమైన మహా సాధువులు, ప్రబోధకులు ఎవరైతే వారి యొక్క తపస్సును, జ్ఞానాన్ని జాతి నిర్మాణం కోసం ఉపయోగించారో వారందరూ భారతదేశానికి చెందిన వారే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చును.
ఈ పరంపరలో స్వామి దయానంద్ సరస్వతి, రాజా రాం మోహన్ రాయ్, జ్యోతిబా ఫులే, మహాత్మ గాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్, బాబా ఆమ్టే, పాండురంగ శాస్త్రి అఠావలే, ఇంకా వినోబా భావే ల వంటి అసంఖ్యాక మహనీయులు తెర మీదకు వచ్చారు. వీరు తమ కార్యకలాపాలకు సేవను ప్రధాన కేంద్రంగా చేసుకొని సామాజిక సంస్కరణలను కొనసాగించారు. సమాజం కోసం వారు చేసినటువంటి పవిత్రమైన ప్రతిజ్ఞలు అన్నింటినీ వారు నెరవేర్చారు.
మిత్రులారా, మీ మఠం కూడా పరిత్యాగం, ఇంకా సేవ అనే సంప్రదాయాలను అనుసరించింది. మీ మఠం భవ బంధాలు లేని సన్యాసుల మఠంగా కూడా పేరు తెచ్చుకొంది. ఇక్కడ బంధం లేకపోవడం అంటే ఎటువంటి లౌకిక ప్రమేయం నుండి అయినా విముక్తం కావడం అని అర్థం. మీకు సంబంధించిన 360 కి పైగా మఠాలు వేరు వేరు రాష్ట్రాలలో వ్యాప్తి చెంది తిండి గింజలను విరాళంగా అందించే మార్గాన్ని అవలంబిస్తున్నాయి. ఈ మఠాలు పేదలకు మరియు అన్నార్తులకు తిండి పెడుతున్నాయంటే అది తప్పక భూ మాతకు చేస్తున్నటువంటి ఒక అత్యుత్తమమైన సేవే అవుతుంది. అంతేకాదు, మానవ జాతికి చేస్తున్నటువంటి ఉత్తమమైన సేవ కూడా అవుతుంది.
‘మానవ జాతికి చేసే సేవ మాధవునికి నచ్చుతుంది’ అనేది ఒక మంచి ఉదాహరణ. సేవ చేయడం మన దేశం యొక్క చరిత్రగా ఉంటూ వచ్చింది. సేవ చేయాలన్న భావనను ఈ దేశం అలవరచింది. పేదవారికి ఆహారాన్ని సమకూర్చడం కోసం, ఆశ్రయం ఇవ్వడం కోసం తగిన ఏర్పాట్లను చేయడం మన సంప్రదాయంగా విలసిల్లింది. మన సాధువుల తపస్సుల ఆశీస్సుతో సామన్య ప్రజలు ఇందుకు తగిన ఏర్పాట్లను చేశారు. ఈనాటికీ ఈ సంప్రదాయం ఎన్నో గ్రామాలలో మరియు నగరాలలో కొనసాగడమే కాక వర్ధిల్లుతోంది కూడా.
సోదరులు మరియు సోదరీమణులారా, భారతదేశం యావత్ ప్రపంచానికి మానవత్వం, ప్రజాస్వామ్యం, సుపరిపాలన, ఇంకా అహింస గురించిన సందేశాన్ని వ్యాపింపజేస్తూ వస్తోంది. భారతదేశం ప్రజాస్వామిక విలువలను అమలుచేయడమే గాక అగ్రగామి దేశాల కంటే ముందుగానే వాటిని తన పరిపాలక వ్యవస్థలో భాగంగా చేర్చింది. మరి ప్రపంచం లోని గొప్ప మేధావులు ప్రజాస్వామ్యాన్ని ఒక నూతన మార్గంగా గమనించడం మొదలుపెట్టారు.
12వ శతాబ్దంలో ప్రపంచానికి ప్రజాస్వామ్యం మరియు సమానత్వ భావనలను భగవాన్ బసవేశ్వరుల వారు ప్రసాదించారు. వారు ‘అనుభవ్ మండప్’ అని వ్యవహరించిన ఒక వ్యవస్థను అభివృద్ధి పరిచారు. ఈ వ్యవస్థలో అన్ని రకాల వ్యక్తులు.. పేదలు, అణచివేతకు, వేధింపులకు గురైన వారు, ఇంకా సమాజం దూరంగా నెట్టివేసినటువంటి వర్గాలకు చెంది వారు వారి అభిప్రాయాలను వెలిబుచ్చే వారు. అక్కడ ప్రతి ఒక్కరు సమానులే. నేను 2015లో బ్రిటన్ సందర్శించిన సమయంలో భగవాన్ బసవేశ్వరుల వారి విగ్రహాన్ని సార్వత్రికంగా అంకితం చేసే అవకాశాన్ని పొందినందుకు కూడా నేను అదృష్టవంతుడిని అయ్యాను.
అప్పటి బ్రిటన్ ప్రధాని ఆంగ్లేయుల ప్రాథమిక హక్కుల పత్రం గురించి ప్రస్తావించడం నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది. అయితే ఒక రంగా ఆంగ్లేయుల ప్రాథమిక హక్కుల పత్రాని కన్నా ఎంతో కాలం ముందుగానే భగవాన్ బసవేశ్వరుల వారు తొలి చట్ట సభను మనకు పరిచయం చేశారు.
భగవాన్ బసవేశ్వరుల వారు చెప్పింది ఇదీ: ‘ఆలోచనల మార్పిడి జరగకపోతే, తర్కాన్ని గురించిన చర్చ ఏదీ చోటు చేసుకోకపోయినట్లయితే, అనుభవ గోష్ఠికి సైతం ఉపయుక్తత ఉండదు. అంతేకాదు, ఇటువంటి అంశాలు చోటు చేసుకొన్న ప్రదేశంలో దైవం ఉనికి కూడా ఉండదు.’ ఆయన ఈ విధమైన ఆలోచనల మరియు చర్చల ఆదాన ప్రదానాన్ని శక్తిమంతం గాను, స్వయంగా దైవం వలెనే అత్యవసరమైనవిగాను అభివర్ణించారు.
మహిళలకు స్వేచ్ఛగా మాట్లాడేందుకు అనుభవ మండపం లో అనుమతి ఉండేది. సమాజం లోని ప్రతి వర్గానికి చెందిన మహిళలు వారి ఆలోచనలను వెల్లడించే వారు. వారిలో కొందరు ఆనాటి నాగరక సమాజం మధ్యకు రావడానికి కూడా ఆశను వదలివేసుకొన్న వాళ్ళు. అటువంటి మహిళలు సైతం ‘అనుభవ మండపాని’కి వచ్చి వారి ఆలోచనలను వ్యక్తం చేసే వారు. ఆ యుగంలో మహిళల సశక్తీకరణ దిశగా సాగిన అత్యంత ప్రముఖమైన ప్రయత్నం అది. భగవాన్ బసవేశ్వరుల వారి ప్రబోధాల అనువాదాన్ని 23 భాషలలో గత సంవత్సరం నేను సార్వత్రికంగా అంకితం చేశాను.
ఆ గ్రంథాలు సామాన్యులకు భగవాన్ బసవేశ్వరుల వారి సందేశాన్ని చేరవేయడంలో సహాయకారిగా ఉండి ఉంటాయని నేను భావిస్తున్నాను. భారతదేశ పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ బి.డి. జత్తి కి కూడా నేను ప్రణామం చేస్తున్నాను. బసవ కమిటీకి ఆయన అందించిన తోడ్పాటును ఈ సందర్భంగా నేను స్మరించుకొంటున్నాను. నేను శ్రీ అరవింద్ జెట్టి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించ దలుస్తున్నాను.
మిత్రులారా, మాన్యులైన సిద్ధ రామేశ్వర్ మహా స్వామి గారు మరొక్కసారి అనుభవ మండపాన్ని మొదలు పెట్టాలని తీర్మానించుకొన్న సంగతి నా దృష్టికి వచ్చింది. ఆయన ఇక్కడి మఠంలో దానిని నెలకొల్పాలని కోరుకొన్నారు. ఈ కలను శ్రీ మురుగ రాజేంద్ర మహాస్వామి గారి నాయకత్వంలో సాకారం చేస్తుండడం గొప్ప ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం. ఈ అనుభవ మండపం ద్వారా సమతా సందేశాన్ని దేశంలో వ్యాపింపచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమ వేళ మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘సర్వ జన్ సుఖినో భవంతు’ (ప్రతి ఒక్కరు ఆనందాన్ని అందుకొందురు గాక) మంత్రాన్ని వల్లించడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆనందం చేకూరాలని అభిలషిస్తున్నాను.
మిత్రులారా, 2022 లో మన దేశం స్వాతంత్య్రం యొక్క 75 సంవత్సరాల ఘట్టాన్ని ఉత్సవంగా జరుపుకొనే తరుణాన ఆ సన్నివేశాన్ని మనం మన మనసుల లోపలి చెడులను అట్టేపెట్టుకొనే జరుపుకొంటామా ? ఉహు, కాదు. మనమందరం కలిసి ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించాలనే ప్రతిజ్ఞను చేశాం. మీ తోడ్పాటు ఈ ప్రయాణాన్ని ‘సంకల్పం నుండి సిద్ధి వరకు’ సులభతరంగా మార్చివేయగలుగుతుంది. మీరు కుమార్తెలకు చదువు చెప్పించడం, లేదా యువతకు నైపుణ్యాల అభివృద్ధిలో తోడ్పడడం, లేదా స్వచ్ఛత రంగంలో కృషి చేయడం, లేదా డిజిటల్ అక్షరాస్యతను వ్యాప్తి చేయడంలో సహకరించడం, లేదా సౌర శక్తిని పెంపొందించడంలో సహకరించడం కోసం మీరు పవిత్ర ప్రతినను పూనుతారా ?
ఈ రంగాలలో మీరు ఇప్పటికే కృషి చేస్తున్న విషయం నాకు తెలుసును. అయితే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా ఒక ప్రతిజ్ఞను స్వీకరిద్దామా ? ఉదాహరణకు మీరు రానున్న రెండు సంవత్సరాలలో రెండు లేదా అయిదు వేల పల్లెలను ఆరు బయలు ప్రాంతాలలో మల మూత్రాదుల విసర్జనకు తావు లేని పల్లెలుగా మార్చేందుకు మద్దతును ఇచ్చేటటువంటి ఒక పవిత్ర ప్రతిజ్ఞ ను స్వీకరించగలరా ? రానున్న రెండు సంవత్సరాలలో మీరు గుర్తించిన అయిదు వేల గ్రామాలను ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం ఎల్ఇడి బల్బులను కలిగి వుండేటట్లుగా ఒక ప్రతిజ్ఞను స్వీకరిద్దామా ?
మిత్రులారా, ఈ రంగాలన్నింటిలో ప్రభుత్వం కృషి కొనసాగుతోంది. అయితే, చైతన్యాన్ని రగిలించడంలోనూ మరియు ప్రజలను ప్రేరేపించడంలోనూ మీకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. మీరు అడుగు ముందుకు వేశారంటే గనక అప్పుడు లక్షల మంది వివేకానందుల వారి యొక్క శక్తి మీ సంకల్పాలను సిద్ధింపచేసుకోవడంలో తోడ్పడుతుందనే నమ్మకం నాకు ఉంది.
ప్రస్తుతం బెళగావి లో పది వేల మంది వివేకానందులు గుమికూడారు. అప్పుడు లక్షల కొద్దీ అటువంటి వారు పోగవుతారు. మీరు చేస్తున్న పని విజయవంతం అయినప్పుడు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అనే స్వప్నం సాకారం కావడంతో పాటు మన సామాజిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. స్వామి వివేకానందుల వారు దర్శించిన ఒక బలమైన భారతదేశం తాలూకు స్వప్నం ఆ వేళలో నెరవేరగలదు.
ఈ మాటలతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. వేదిక మీద విచ్చేసి ఉన్న సాధువులందరికీ నేను మరొక్క మారు నమస్కరిస్తున్నాను. జాతీయ యువజన దినంతో పాటు సర్వ ధర్మ సభ సందర్భంగా కూడా మీ అందరికీ మరొక్కసారి నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.
Swami Vivekananda emphasised on brotherhood. He believed that our wellbeing lies in the development of India: PM @narendramodi https://t.co/mH5WSFU7Je
— PMO India (@PMOIndia) January 12, 2018
There was a lot of propaganda against India in the Western world that Swami Vivekananda proved wrong. He also raised a voice against social evils: PM @narendramodi https://t.co/mH5WSFU7Je
— PMO India (@PMOIndia) January 12, 2018
Some people are trying to divide the nation and the youth of this country are giving a fitting answer to such elements. Our youth will never be misled: PM @narendramodi https://t.co/mH5WSFU7Je
— PMO India (@PMOIndia) January 12, 2018
It is India's youth that is taking the Swachh Bharat Mission to new heights: PM @narendramodi https://t.co/mH5WSFU7Je
— PMO India (@PMOIndia) January 12, 2018
India has been home to several saints, seers who have served society and reformed it: PM @narendramodi https://t.co/mH5WSFU7Je
— PMO India (@PMOIndia) January 12, 2018
Seva Bhav is a part of our culture. All over India, there are several individuals and organisations selflessly serving society: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2018
Let us work to make our nation ODF: PM @narendramodi https://t.co/mH5WSFU7Je
— PMO India (@PMOIndia) January 12, 2018