స్వామి చిదానంద సరస్వతి జీ,
శంకరాచాచ్య దివ్యానంద్ తీర్థ్ జీ మహరాజ్,
స్వామి అసంగానంద్ సరస్వతి జీ,
సాధ్వి భగవతి సరస్వతి జీ,
జ్ఞానులు, ఆచార్యులు, మిత్రులారా
వార్షిక అంతర్జాతీయ యోగ ఉత్సవాన్ని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మీ అందరితో భేటీ కావడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది.
మీతో నా భావాలు పంచుకునే ముందు ఇటీవల మన శాస్త్రవేత్తలు సాధించిన ఘనమైన విజయాలను గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను.
గత నెలలో మన అంతరిక్ష శాస్త్రవేత్తలు ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు.
వారు 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి పంపించారు.
వాటిలో 101 ఉపగ్రహాలు యుఎస్ఎ, ఇజ్రాయల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కజాక్ స్తాన్, యుఎఇ లవి.
మన రక్షణ శాస్త్రవేత్తలు భారతదేశం కూడా గర్వపడేటట్లు చేశారు.
ఫిబ్రవరి 11వ తేదీన గగనతలంలో అత్యంత ఎత్తులో బాలిస్టిక్ క్షిపణి రక్షక కవచాన్ని వారు విజయవంతంగా ప్రయోగించారు. ఈ కవచం క్షిపణి దాడుల నుండి మన నగరాలను కట్టుదిట్టమైన రక్షణను అందించగలుగుతుంది.
నిన్ననే వారు మరొక కలికితురాయిని జత చేశారు; తక్కువ ఎత్తులో లక్ష్యాన్ని భేదించగల ఇంటర్ సెప్టర్ క్షిపణి ప్రయోగంలో సఫలమయ్యారు.
మరో నాలుగు దేశాలు మాత్రమే సొంతం చేసకున్న సామర్థ్యమిది.
ఈ విజయాలను సాధించిపెట్టినందుకు మన అంతరిక్ష శాస్త్రవేత్తలను, రక్షణ శాస్త్రవేత్తలను నేను అభినందిస్తున్నాను.
మన అంతరిక్ష, రక్షణ వైజ్ఞానికులు భారత ప్రతిష్ఠను యావత్తు ప్రపంచంలో ఉన్నత స్థాయిలో నిలిపారు.
సోదర సోదరీమణులారా,
శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక విజ్ఞాన రంగాలలో చివరకంటా పరిశోధనలు చేయడం అవసరమని మనం విశ్వసిస్తున్నాం. అదే విధంగా, మన ఆత్మ లోలోపలకు కూడా శోధన తాలూకు ప్రస్థానాన్ని కొనసాగిస్తాం. శాస్త్ర విజ్ఞానం, యోగా.. ఈ రెంటిపైనా పరిశోధన సాగుతూనే ఉంటుంది.
బహుశా అంతర్జాతీయ యోగ సమ్మేళనం నిర్వహణకు ఋషికేశ్ ను మించిన ప్రదేశం మరొకటి ఉండి ఉండకపోవచ్చు.
మునులు, యాత్రికులు, సగటు మనుషులు, భిన్న రంగాల ప్రముఖులు శతాబ్దాలుగా శాంతి మరియు యోగా వాస్తవ సారాన్ని అన్వేషిస్తూ ఇక్కడకు తరలివచ్చారు.
ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు చెందిన భిన్న వర్గాల వారు పవిత్ర గంగానది తీరంలోని ఋషికేశ్ లో ఇంత పెద్ద సంఖ్యలో సమావేశం కావడం చూస్తుంటే జర్మన్ పండితుడు మాక్స్ మూలర్ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఆయన ఇలా అన్న మాటలను నేను ఉదాహరిస్తాను:
“ఏ గగనతలం కింది భూభాగం పూర్తి స్థాయిలో పరిణతి చెందిన మానవ మస్తిష్కాన్ని కలిగిఉన్నదో, జీవితంలోని మహా కష్టాలపై మేధోమథనం చేసి పరిష్కార మార్గాలను కనుగొందో చెప్పాలని నన్ను అడిగితే గనక నేను భారతదేశాన్ని చూపిస్తాను” అని మూలర్ అన్నారు.
మాక్స్ ముల్లర్ నుండి ఈ రోజు ఋషికేశ్ లో భారీ సంఖ్యలో గుమికూడిన మీ వరకు- ఆత్మ పరమార్ధాన్నితెలుసుకోవాలన్న అన్వేషణకు బయలుదేరిన, తమదైన రీతిలో ఘనవిజయాలను సాధించిన వారందరి- గమ్యస్థానం గా నిలచింది భారతదేశమే.
చాలా సందర్భాలలో, అటువంటి అన్వేషణ- వారిని యోగా వైపు అడుగులు వేయించింది.
ప్రజలను జీవనంతో జోడించే , మానవాళిని ప్రకృతితో పునః సంధానం చేసే సంజ్ఞే యోగ.
ఇది మనలోని స్వార్థపూరిత సంకుచిత భావాలను విస్తరింపచేసి మన కుటుంబాలను, సమాజాలను, మానవాళిని మన స్వీయాత్మ యొక్క విస్తృతమైన రూపంగా కనిపింపచేస్తుంది.
అందుకే స్వామి వివేకానంద అన్నారు..“విస్తరించడం అంటే జీవితం, కుంచించుకుపోవడం అంటే మరణం” అని.
యోగ ను సాధన చేయడం ద్వారా ఏకత్వ స్ఫూర్తి అలవడుతుంది.. మనసు, శరీరం, వివేకం వీటితో మమేకం కావడమెలాగనేది ఎరుక అవుతుంది.
మన కుటుంబాలు, మనం నివశిస్తున్న సమాజం, సహజీవనం చేస్తున్న మానవాళి, పక్షులు, జంతువులు, వృక్షాలు...ఇలా ఎవరితో మనం ఈ సుందరమైన భూమండలాన్ని పంచుకుంటున్నామో.. ఆ అన్నింటితో కలవడమే యోగ.
యోగ అనేది “నేను” నుండి “మనం” వైపునకు చేసే యాత్ర.
व्यक्ति से समष्टि तक ये यात्रा है। मैं से हम तक की यह अनुभूति, अहम से वयम तक का यह भाव-विस्तार, यही तो योग है।
ఈ యాత్ర, ఒక సహజమైన ఉప ఉత్పత్తిలాగా ఉంటూ, మంచి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, జీవనంలో సమృద్ధి వంటి అదనపు ప్రయోజనాలను సైతం అందిస్తుంది.
ఒక వ్యక్తిని ఆలోచనలో, ఆచరణలో, జ్ఞానంలో, అంకిత భావంలో మెరుగైన వ్యక్తి అయ్యేటట్లు తీర్చిదిద్దుతుంది.
శరీరాన్ని సరైందిగా ఉంచే కొన్ని వ్యాయామాల శ్రేణిగా మాత్రమే యోగను చూడడమనేది చాలా అర్ధరహితమైన పని అవుతుంది.
యోగ శారీరక వ్యాయామాల కన్నా ఎంతో మిన్న అయినటువంటిది.
ఆధునిక జీవనంలో ఒత్తిడుల బారి నుండి ఊరట పొందాలన్న వెతుకులాట ప్రజలను తరచుగా పొగాకు, మద్యం, చివరకు మత్తు మందుల వైపు నకు తీసుకువెళ్తుంది.
యోగ దానికి కాలపరిమితి అంటూ లేని తేలికపాటి, ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం. యోగ ను ఆచరించడం ద్వారా ఒత్తిడుల నుండి, జీవనశైలికి సంబంధించిన మొండి స్థితుల నుండి బయటకు వచ్చిన రుజువులు అనేకం ఉన్నాయి.
ప్రపంచానికి ఈ రోజు -ఉగ్రవాదం, వాతావరణ మార్పు- అనే రెండు సవాళ్ళు ముప్పు వాటిల్లజేస్తున్నాయి.
ఈ సమస్యలకు స్థిరమైన, దీర్ఘకాలిక సమాధానం కోసం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు, యోగ వైపు చూస్తోంది.
ప్రపంచ శాంతిని గురించి మాట్లాడాలి అంటే, దేశాల నడుమ శాంతి నెలకొనడం అవసరం. అది సమాజంలో అంతర్గతంగా శాంతి ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. శాంతి భావనతో మనుగడ సాగించే కుటుంబాలే శాంతియుత సమాజానికి దోహదకారి కాగలవు. వ్యక్తులకు, కుటుంబానికి, సమాజానికి, దేశానికి.. చివరకు యావత్తు ప్రపంచమంతటా సామరస్యాన్ని, శాంతిని అందించే మార్గం యోగ.
యోగతో మనం ఏకత్వంతో, సామరస్యంతో కూడిన ఒక కొత్త యుగాన్ని సృష్టించగలుగుతాం.
మనం వాతావరణ మార్పులపై పోరాటం గురించి మాట్లాడాల్సి వస్తే జీవనశైలి ఆధారిత వినియోగం లేదా “భోగ” నుండి యోగకు పయనించవలసి ఉంటుంది.
జీవితాన్ని క్రమశిక్షణ, అభివృద్ధి దిశగా నడిపించే బలమైన బలమైన స్తంభమే యోగ.
ఏ ప్రయత్నం నుండి అయినా మనం సాధించాల్సింది వ్యక్తిగత ప్రయోజనమే అన్న భావన నుండి పూర్తిగా భిన్నమైన ధోరణిని అందించేది యోగ.
ఎవరైనా ఏమి అందుకుంటారన్నది కాదు.. ఎవరైనా ఏమి త్యజిస్తారు, దేని నుండి బయటపడతారు అన్న భావనే యోగ.
ఏం పొందుతారనే దాని కన్నా ఈ ప్రపంచంలో మనం తరచు మాట్లాడుకునే విముక్తి లేదా ముక్తికి బాట చూపే సాధనమే యోగ.
ఈ మహోన్నతమైన ఆదర్శాలకు పయనించే బాటను పరమార్థ్ నికేతన్ లో తన చర్యల ద్వారా స్వామి చిదానంద సరస్వతి జీ మనకు చూపించారు.
యోగను మొత్తం ప్రపంచానికి సన్నిహితం చేయడంలో పరమార్థ్ నికేతన్ చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను.
హిందూ ధర్మానికి చెందిన 11 సంపుటాలతో కూడిన ఒక విజ్ఞాన సర్వస్వాన్ని సంపుటీకరించడంలో స్వామి గారు పోషించిన క్రియాశీల పాత్రను నేను గుర్తు చేస్తున్నాను.
కేవలం ఒక ఇరవై అయిదు సంవత్సరాల కన్నా తక్కువ కాలంలో స్వామి గారు మరియు ఆయన బృందం దీన్ని సుసాధ్యం చేశారు. వారి కృషిలోని లోతు పరమ అద్భుతమైనటువంటిది.
హిందూధర్మంలోని అన్ని కోణాలను ఇంచుమించుగా వారు ఈ 11 సంపుటాలలో క్రోడీకరించారు.
ఆధ్యాత్మికతకు కృషి చేస్తున్న వారు, యోగులు, సగటు మానవులు అందరి వద్ద ఉండి తీరవలసిన గ్రంథం ఇది.
ఎన్ సైక్లోపేడియా ఆఫ్ హిందూయిజం వంటి గ్రంథాలను వివిధ భాషలలో అందుబాటులో ఉంచగలిగితే దేశంలోని ఇతర సంప్రదాయాలు, సంస్కృతులపై చైతన్యం పెరిగి, చక్కని అవగాహన ఏర్పడుతుంది.
ఈ ఇతోధిక అవగాహనే ద్వేషం, అవగాహనారాహిత్యం వంటి దుర్లక్షణాలను దూరం చేసి, సముదాయాల మధ్య సహకారం, శాంతి, స్నేహ భావాలను పెంచుతుంది.
పరిశుభ్రమైన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’లో కూడా పరమార్థ్ నికేతన్ పోషించిన క్రియాశీల పాత్రను నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను.
భారతదేశ సంప్రదాయాలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యాన్నిస్తున్నాయి. ఒక వ్యక్తి తన దేహాన్ని శుభ్రంగాను, పవిత్రంగాను ఉంచుకోవాలని స్పష్టంచేయడమే కాదు, తన ఇంటిని, తాను పని చేసే ప్రదేశాన్ని, ఆరాధన స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఎంతో ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సూచించడమైంది.
ఈ ప్రదేశాలలో చెత్త చెదారం పేరుకుపోతే దానిని అపరిశుభ్రంగానే భావిస్తాం మనం.
మన ప్రాచీన ధర్మ గ్రంథాలలోనూ వ్యక్తిగత ఆరోగ్య రక్షణకు సంబంధించిన ప్రాముఖ్యాన్ని మనం గమనించవచ్చు.
అయినప్పటికీ, బహిరంగ ప్రదేశాలలో మలినపదార్థాలను గుమ్మరించే ధోరణి ఉంది.
పాశ్చాత్య దేశాలలో, ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ఈ ధోరణి కనిపించదు. అక్కడివారు సముదాయ పరిశుభ్రతను గురించి, ప్రజారోగ్యం గురించి మరింత స్పష్టమైన అవగాహనతో ఉంటున్నారు. అందువల్ల జల వనరులు, భూమి, వాతావరణం అన్నింటిలోనూ పారిశుధ్యాన్ని పాటించడం, అవగాహనను పెంచడం కీలకం.
వ్యక్తిగత సంక్షేమం, పర్యావరణ సంక్షేమాలతో కూడిన సమష్టి ప్రయత్నంతోనే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా మేము సమాజ పారిశుధ్యం, వ్యక్తిగత ఆరోగ్య రక్షణ.. ఈ రెండింటి మధ్య అనుసంధానాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
దేవాలయాలు చారిత్రకంగా మన సమాజంలో కీలక పాత్రను పోషించాయి.
సాధారణంగా నివాసయోగ్య ప్రాంతాలకు దూరంగా, విస్తారమైన ప్రదేశంలో దేవాలయాలను నిర్మించారు.
అయితే, కాలం గడిచిన కొద్దీ, వాటి చుట్టూ బజారులు, జనావాసాలు వెలిశాయి. దీని వల్ల అపరిశుభ్ర పరిసరాలు వాటికి పెను సవాలుగా మారాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకే స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛతకు ఆలవాలమైన ప్రదేశాలు ( స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేసెస్) అనే ప్రాజెక్టును కూడా చేర్చాం.
ఈ ప్రాజెక్టు తొలి దశలో కామాఖ్య దేవాలయం, పురీ జగన్నాథ్, మీనాక్షి దేవాలయం, తిరుపతి, స్వర్ణ దేవాలయాలు, వైష్ణో దేవి ఆలయం, వాటి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
అలా స్వచ్ఛ భారత్ ఉద్యమానికి విశ్వాసాలతోను, ఆధ్యాత్మికతతోను ముడిపెట్టాం.
2014 సెప్టెంబరులో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ సమావేశాలలో నేను అంతర్జాతీయ యోగ దినాన్ని గురించి ప్రతిపాదించినప్పుడు యోగ పట్ల యావత్తు ప్రపంచం చూపిన ఆసక్తిని మనం కళ్ళారా చూశాం.
ఆ తరువాత అప్రయత్నంగా ఆ ప్రతిపాదనకు మద్దతు వెల్లువెత్తడాన్ని నేను ఊహించలేదన్న సంగతిని నేను ఒప్పుకొనే తీరాలి.
ప్రపంచం నలుమూలల నుండి అసాధారణ రీతిలో లెక్క పెట్టలేనన్ని దేశాలు ఈ ప్రయత్నంలో మాతో చేతులు కలిపాయి.
ఇక ఇప్పడు, ప్రతి సంవత్సరమూ, ఉత్తరాయణంలో జూన్ 21వ తేదీన యావత్తు ప్రపంచం యోగ కోసం ఒక్కటవుతున్నది.
అంతర్జాతీయ యోగ దినం నిర్వహణకు అన్ని దేశాలు ఏకతాటి మీదకు రావడమే యోగ ప్రబోధించే ఏకత్వ భావనను చాటిచెబుతున్నది.
శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం, మానవాళి యొక్క సర్వతోముఖాభివృద్ధి లతో కూడిన ఒక కొత్త యుగాన్ని(నవ శకాన్ని) ఆవిష్కరించగల శక్తి యోగ కు ఉంది.
సోదర సోదరీమణులారా,
సమున్నతమైన హిమాలయాల దీవెనలు మీకు లభించు గాక.
వందల సంవత్సరాల పాటు మన ప్రాచీన మునులు, సాధువులు ధ్యానం చేసిన ఈ పవిత్ర గంగా నది ఒడ్డున జరుగుతున్న ఈ యోగ ఉత్సవంలో మీ అందరూ సఫల మనోరథులు కావాలి గాక, మీరంతా పరమానందాన్ని పొందుదురు గాక.
ఆధ్యాత్మికతకు మారుపేరైన ఋషికేశ్ నగరంలోని పరమార్థ్ నికేతన్ పవిత్ర పరిసరాలలో మీ బస మీకు ఆనందాన్ని మిగుల్చుగాక.
యోగ ప్రతి ఒక్కరికి ప్రయోజనకరం అగుగాక.
ఈ అంతర్జాతీయ యోగ వేడుక గొప్పగా విజయవంతం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
ధన్యవాదాలు.. మీకు అనేకానేక ధన్యవాదాలు.
There can be no better place than Rishikesh to host the @IntlYogaFest : PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017
There is ample evidence that practicing Yoga helps fight stress and life-style related issues: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017
Through Yoga, we will create a new Yuga of togetherness & harmony: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017
I appreciate the work being done by @ParmarthNiketan in bringing Yoga closer to people across the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017
I wish that the @IntlYogaFest becomes a grand success: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017