ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “కోవిడ్-19 నిర్వహణ: అనుభవం, మంచి అభ్యాసాలు మరియు ముందున్న మార్గం” అంశం పై ఏర్పాటైన ఒక వర్క్ షాప్ ను ఉద్దేశించి గురువారం నాడు, అంటే ఈ నెల 18న, ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భారతదేశానికి ఇరుగుపొరుగు న గల 10 దేశాలైన అఫ్ గానిస్తాన్, బాంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, మారిశస్, నేపాల్, పాకిస్థాన్, సెశల్స్, శ్రీ లంక లతో పాటు భారతదేశాని కి చెందిన ఆరోగ్య రంగ ప్రముఖులు, నిపుణులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
మహమ్మారి ప్రబలిన కాలం లో దేశాల ఆరోగ్య వ్యవస్థ లు పరస్పరం సహకరించుకొన్న తీరు ను, జనాభా అత్యంత అధిక సంఖ్యల లో నివసిస్తున్న ఈ ప్రాంతాని కి ఎదురైన సవాలు ను తట్టుకొని నిలబడటం లో కనబరచిన సమన్వయభరిత ప్రతిస్పందన ను ప్రధాన మంత్రి కొనియాడారు.
మహమ్మారి తో పోరాటానికి తక్షణ ఖర్చుల ను భరించడం కోసం కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన నిధి ని ఏర్పాటు చేసిన సంగతి ని, అలాగే మందులు, పిపిఇ కిట్ లు, పరీక్షల కు సంబంధించిన సామగ్రి వంటి వనరుల ను పరస్పరం పంచుకొన్న సంగతి ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చారు. పరీక్షలు నిర్వహించడం లో, సంక్రమణ ను నియంత్రించడం లో వైద్యపరమైన వ్యర్థాల నిర్వహణ లో ఒక దేశం తాలూకు ఉత్తమ అభ్యాసాల ను మరొక దేశం స్వీకరించడం, నేర్చుకోవడం లను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “విలువైన అంశాల ను గ్రహించడం లో సహకరించుకోవాలనే భావన ఈ మహమ్మరి వేళ లో మనకు కలిగింది. దృఢసంకల్పం ద్వారా, దాపరికానికి తావు ఇవ్వకపోవడం ద్వారా ప్రపంచం లో మరణాల రేటు అతి తక్కువ స్థాయి లో నమోదైన దేశాల సరసన మనం నిలువగలిగాం. ఇది ఎంతైనా కొనియాడదగింది. ప్రస్తుతం మన ప్రాంతం ఆశ లు, ప్రపంచం ఆశ లు టీకా మందుల ను శరవేగం గా రంగం లోకి దింపడం పై కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ విషయం లో కూడా మనం అదే తరహా సహకార పూర్వకం అయినటువంటి, సమన్వయం తో కూడినటువంటి భావన ను తప్పక నిలబెట్టుకోవాలి” అని ప్రధాన మంత్రి అన్నారు.
మరింత ఆకాంక్షభరితం గా ముందుకు సాగవలసిందంటూ ఇరుగు పొరుగు దేశాల ను ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. మన వైద్యుల కు, నర్సుల కు ఒక ప్రత్యేక వీజా పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఆలా చేస్తే గనుక వారు ఆరోగ్య పరమైన అత్యవసర పరిస్థితుల లో ఆపన్న దేశం అభ్యర్థించిన మీదట వెనువెంటనే మన ప్రాంత పరిధి లో అవసరమైన చోటులకు వెనువెంటనే ప్రయాణించగలుగుతారని ఆయన సూచించారు. వైద్య పరమైన ఆకస్మిక స్థితులు ఎదురైనప్పుడు ఒక ప్రాంతీయ ఎయర్ ఏమ్ బ్యులన్స్ ఒప్పందాన్ని సాఫీ గా అమలు పరచేందుకు మన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లు ముందుకు రాగలవా? అని కూడా ఆయన అడిగారు. కోవిడ్-19 టీకా మందులు మన జనాభా లలో సమర్ధంగా పని చేస్తున్నాయా అనే విషయం లో సంబంధిత సమాచారాన్ని పోగు చేసి, కూర్చుకొని, అధ్యయనం చేయడం కోసం ఒక ప్రాంతీయ వేదిక ను కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చును అని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా, రాబోయే కాలం లో మహమ్మారులు రాకుండా చూసుకోవడానికి గాను సాంకేతికత అండదండల తో ఎక్కువ మందికి సోకే అంటువ్యాధి పై అధ్యయనాన్ని ప్రోత్సహించే ఒక ప్రాంతీయ నెట్‌వర్క్ ను మనం ఏర్పాటు చేసుకోగలమా? అని కూడా ఆయన ప్రశ్న ను వేశారు.
కోవిడ్-19 కి అతీతం గా, సత్ఫలితాల ను ఇచ్చిన ప్రజారోగ్య విధానాల ను, తత్సంబంధిత పథకాల ను ఒక పక్షం మరొక పక్షానికి వెల్లడి చేయాలని కూడా ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. భారతదేశం లో అమలవుతున్న ‘ఆయుష్మాన్ భారత్’, ‘జన్ ఆరోగ్య’ పథకాలు ఈ ప్రాంతం అంతటికీ అధ్యయనానికి అర్హమైనవే అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. “21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కావాలి అంటే, అది దక్షిణ ఆసియా దేశాలు మరియు హిందూ మహాసముద్ర ద్వీప దేశాల మధ్య ఇప్పటి కంటే ఎక్కువ సమగ్రత జతపడకుండా అయ్యే పని కాదు. ఆ తరహా సమగ్రత కుదిరేదేనని మహమ్మారి కాలం లో మీరు చాటిచెప్పిన ప్రాంతీయ సమైక్య భావన నిరూపించింది” అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.