ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం- మానవాళి సంక్షేమం కోసం సాంకేతికత ను ఉపయోగించుకోవడం’’ అనే అంశం పై ఆయన తన ఆలోచనల ను వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య కార్యనిర్వహణ అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, కరోనా మహమ్మారి నేపథ్యం లో సర్వత్రా భయాందోళనలు వ్యాపించిన నేపథ్యం లో 1.3 బిలియన్ భారతీయుల తరఫున తాను మాట్లాడుతున్నానని, వారి తరఫున వారి ఆత్మవిశ్వాసాలు, సానుకూల దృక్పథాలు, వారి ఆకాంక్ష ల సందేశాన్ని ఇవ్వడమే తన ప్రసంగం లక్ష్యమని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన సమయం లో భారతదేశం దీనిని ఎదుర్కొనే సమర్థత విషయం లో అపోహ లు తలెత్తాయని, అయితే వాటన్నిటికి సమాధానం చెప్పేలా భారతదేశం ముందుకు దూసుకు వెళ్లిందని ప్రధాన మంత్రి అన్నారు. సానుకూల దృక్పథం తో, స్వీయచర్యాశీలత తో వ్యవహరించి కోవిడ్ కు సంబంధించిన ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను, శిక్షణ ను, మానవ వనరుల ను అభివృద్ధి చేసుకొని మహమ్మారి ని కట్టడి చేయడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. అంతే కాదు భారీ ఎత్తున సాంకేతికత ను ఉపయోగించుకోవడం ద్వారా పరీక్షలు చేయడం, కేసులను ట్రాక్ చేయడం జరిగిందని తన ప్రసంగం లో ప్రధాన మంత్రి వివరించారు. కరోనా పై పోరాటం అనేది భారతదేశం లో ప్రజా ఉద్యమం గా మారిందని, అత్యధిక సంఖ్య లో ప్రజల ప్రాణాల ను కాపాడడం లో భారతదేశం సఫలత ను సాధించిందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచ జనాభా లో 18 శాతం భారతదేశం లోనే ఉందని, కాబట్టి భారతదేశం లో సమర్థవంతం గా చేపట్టిన విధానాల కారణం గా మానవాళి ని తీవ్ర స్థాయి లో ప్రమాదం బారి న పడకుండా కాపాడగలిగామని ప్రధాన మంత్రి అన్నారు. దేశమంతటా చేపట్టిన భారీ టీకా మందు కార్యక్రమాన్ని గురించి, ఇంకా మహమ్మారి కాలం లో చేపట్టిన ఇతర చర్యల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు.
విమానయాన మార్గాలన్నిటిని మూసివేసిన కాలం లో భారీ సంఖ్య లో పౌరుల ను తరలించడం జరిగిందని, 150కి పైగా దేశాల కు టీకాల ను సరఫరా చేయడమైందని ఆయన ప్రస్తావించారు. ఈ రోజు న భారతదేశం ప్రపంచవ్యాప్తం గా పలు దేశాలకు అవసరమైన ఆన్ లైన్ శిక్షణ ను అందిస్తోందని, సంప్రదాయ విజ్ఞానం ప్రాధాన్యాన్ని వివరిస్తోందని, టీకా ల గురించి, టీకా ల మౌలిక సదుపాయాల గురించి చెబుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం రెండు ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ టీకా మందుల ను అందుబాటులోకి తీసుకు రావడం తో పాటు మరిన్ని టీకా ల పైన కూడా కృషి జరుగుతోందని, వాటి తరువాత భారతదేశం ప్రపంచంలో అధిక స్థాయి లో, అధిక వేగవంతం గా సాయపడేందుకు సత్తా ను సంతరించుకొంటుందని ప్రధాన మంత్రి తెలిపారు.
ఆర్ధిక రంగం లో భారతదేశం తీసుకొంటున్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో వివరించారు. భారతదేశం ఆర్థిక కార్యకలాపాల ను కొనసాగిస్తూ, బిలియన్ ల కొద్దీ రూపాయలు వ్యయమయ్యే మౌలిక సదుపాయాల కల్పన పథకాల ను ప్రారంభించిందని, ఉపాధి తాలూకు కొన్ని ప్రత్యేక పథకాల ను అమలు చేసిందని ప్రధాన మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యం లో మొదట గా మేము ప్రజల ప్రాణాలను కాపాడడం పై దృష్టిని కేంద్రీకరించాం, మరి ఇప్పుడు మా ధ్యాస దేశాభివృద్ధి వేగాన్ని పెంచడంపై ఉంది అని ఆయన అన్నారు. భారతదేశాన్ని స్వావలంబనయుతమైందిగా తీర్చిదిద్దాలన్న మహత్వాకాంక్ష ప్రపంచీకరణ ను సరి కొత్త రీతి న బలోపేతం చేస్తుందని, ‘ఇండస్ట్రీ 4.0’ కు సాయపడుతుందని ప్రధాన మంత్రి తెలిపారు.
‘ఇండస్ట్రీ 4.0’ కు సంబంధించిన నాలుగు అంశాల పైన కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. కనెక్టివిటి, ఆటోమేశన్, కృత్రిమ మేధ (ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్.. ఎఐ), రియల్ టైం డాటా అనే ఆ నాలుగు అంశాల ను గురించి ఆయన వివరించారు. భారతదేశం లో డాటా చార్జీ లు చాలా తక్కువని, మొబైల్ కనెక్టివిటి బాగా ఉందని, స్మార్ట్ ఫోన్ లు దేశం నలు మూల ల విస్తరించాయని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ఆటోమేశన్ డిజైన్ రంగం లో ప్రతిభ విస్తారం గా ఉందని, ఎఐ రంగం లో భారతదేశం తనదైన ముద్ర ను వేసిందని ప్రధాన మంత్రి అన్నారు. దేశవ్యాప్తం గా పెరుగుతున్న డిజిటల్ మౌలిక సదుపాయాల కారణం గా నిత్యజీవనాని కి అవసరమైన డిజిటల్ పరిష్కారాల ను అందించడం జరుగుతోందని ప్రధాన మంత్రి వివరించారు. దేశం లోని 1.3 బిలియన్ భారతీయులు సార్వత్రిక గుర్తింపు అయినటువంటి ‘ఆధార్’ ను కలిగివున్నారని, వారి గుర్తింపు సంఖ్యల ను వారి ఖాతాల కు, ఫోన్ ల కు సంధానించడమైందని ప్రధాన మంత్రి తెలిపారు. ఒక్క డిసెంబరు లోనే 4 ట్రిలియన్ రూపాయల విలువైన లావాదేవీలు యుపిఐ ద్వారా జరిగాయని ప్రధాన మంత్రి వివరించారు. మహమ్మారి వ్యాప్తి కాలం లో 760 మిలియన్ భారతీయుల ఖాతాల కు 1.8 ట్రిలియన్ రూపాయల విలువైన సహాయాన్ని నేరు గా బదిలీ చేయడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కారణం గా ప్రజల కు అవసరమైన సేవల ను సమర్థవంతం గా, పారదర్శకం గా అందించడమైందన్నారు. భారతదేశం తన ప్రజానీకాని కి ఒక ప్రత్యేకమైన హెల్థ్ ఐడీల ను ఇవ్వడం ద్వారా వారు ఆరోగ్య సౌకర్యాల ను సులువు గా అందుకోవడానికి పూచీ పడిందని ప్రధాన మంత్రి తెలిపారు.
భారతదేశం మొదలుపెట్టిన ఆత్మనిర్భర్ ఉద్యమం ప్రపంచానికి మేలు చేస్తుందని, ప్రపంచ సరఫరా వ్యవస్థల కు మేలు జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థల ను బలోపేతం చేయడాని అవసరమైన సామర్థ్యం, సమర్థత, విశ్వసనీయత లు భారతదేశానికి ఉన్నాయని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశానికి గల వినియోగదారుల విస్తృత పునాది రాబోయే కాలం లో మరింత గా పెరిగి, ప్రపంచ ఆర్ధిక రంగాని కి సహాయకారి అవుతుందని ఆయన అన్నారు.
సంస్కరణల పైనా, ప్రోత్సాహకాల పైనా శ్రద్ధ వహిస్తూ ఉద్దీపన ప్యాకేజీల ను అందిస్తున్న భారతదేశం తగిన ఆత్మవిశ్వాసం తో ఉందని, తన ముందున్న అవకాశాల ను సమర్థవంతం గా ఉపయోగించుకుంటోందని ప్రధాన మంత్రి అన్నారు. కరోనా కాలం లో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాల ద్వారా నిర్మాణాత్మక సంస్కరణల ను చేపట్టడం జరిగిందన్నారు. పన్నుల సంబంధిత వ్యవస్థ లో, ఎఫ్ డిఐ నిబంధనలకు సంబంధించి సులభతరమైన, స్నేహపూర్వక వాతావరణాన్నికల్పించడం ద్వారా సులభతర వాణిజ్య విధానాన్ని భారతదేశం అనుసరిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. అంతే కాదు, జలవాయు పరివర్తన కు సంబంధించి పెట్టుకున్న లక్ష్యాల ను కూడా భారతదేశం అందుకొంటోందని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.
సాంకేతిక విజ్ఞానాన్ని జీవనాన్ని సులభతరం గా తీర్చిదిద్దడం కోసం ఒక ఆయుధం గా మలచుకోవాలి తప్ప అది ఒక ఉచ్చు లాగా ఉండకూడదు అంటూ ప్రధాన మంత్రి జాగ్రత చెప్పారు. దీని ని ఎల్లప్పటికీ దృష్టి లో పెట్టుకొని మసలుకోవాలని, కరోనా మనకు ప్రాణాల విలువ ను గురించి పదే పదే గుర్తు చేసిందంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
సమావేశం లో భాగం గా ప్రశ్నోత్తరాల వేళ లో సిఇఒ లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సీమెన్స్ ప్రెసిడెంట్, సిఇఒ శ్రీ జో కీసర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమం రూపురేఖల ను గురించి తెలియజేశారు. భారతదేశాన్ని నిర్మాణం, ఎగుమతుల కు ఒక ముఖ్య కేంద్రం గా మార్చడం అనేది ఈ ఉద్యమం లక్ష్యాల లో ఒకటి అని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రపంచం లోని పెద్ద కంపెనీ లను భారత్ లో వాటి కార్యకలాపాల ను నిర్వర్తించవలసిందంటూ, మరి అలాగే 26 బిలియన్ డాలర్ విలువైన ఉత్పత్తి తో ముడిపడ్డ లాభాల పథకం (పిఎల్ఐ) తాలూకు ప్రయోజనాలను పొందవలసిందంటూ ఆయన ఆహ్వానించారు. ఎబిబి సిఇఒ శ్రీ జార్న్ రోసెన్ గ్రెన్ అడిగిన ప్రశ్న కు శ్రీ నరేంద్ర మోదీ సమాధానమిస్తూ, దేశం లో నిర్మాణం లో ఉన్న మౌలిక సదుపాయాల తో ముడిపడ్డ ప్రాజెక్టులను గురించి తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాల లో 1.5 ట్రిలియన్ అమెరికా డాలర్ విలువైన జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు లు వరుసగా అమలు లోకి వస్తాయన్నారు. మాస్టర్ కార్డ్ సిఇఒ శ్రీ అజయ్ ఎస్. బంగా ప్రశ్న కు జవాబు గా, దేశం లో అన్ని వర్గాల ను కలుపుకొని పోతూ చేపట్టిన ఆర్ధిక రంగ కార్యకలాపాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని బలోపేతం చేయడానికి చేపట్టిన చర్యలను గురించి వివరించారు. ఐబిఎమ్ ప్రతినిధి శ్రీ అరవింద్ కృష్ణ పరిశీలన కు సంబంధించి స్పందించిన ప్రధాన మంత్రి, భారతదేశ డిజిటల్ విధానం లోతుపాతుల ను గురించి వివరించారు. దేశ డిజిటల్ ప్రొఫైల్ సమూలం గా మారిపోయిందన్నారు. వినియోగదారుల ప్రైవసీ కి భంగం కలగకుండా డిజిటల్ సాధికారిత ను కల్పిస్తున్నామని అన్నారు. ఎన్ ఇసి కార్ పొరేశన్ బోర్డు ఛైర్మెన్ శ్రీ నొబుహిరో ఎందో అడిగిన ప్రశ్న కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ, పట్టణీకరణ అందిస్తున్న అవకాశాల పట్ల భారతదేశ విధానాన్ని గురించి వివరించారు. సులభతర జీవనం, సులభతర వాణిజ్యం, జలవాయు అంశాల పట్ల సూక్ష్మగ్రాహ్యత తో కూడిన అభివృద్ధి ధ్యేయం గా సుస్థిర పట్టణీకరణ పైన తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ నిబద్దత వల్ల 2014-2020 సంవత్సరాల మధ్య కాలం లో 150 బిలియన్ డాలర్ విలువ కల పెట్టుబడులు భారతదేశం అభివృద్ధి పై పెట్టుబడి గా తరలివచ్చాయని ప్రధాన మంత్రి అన్నారు.