కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, తూర్పు ఆఫ్రికా అభివృద్ధిలో, వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కుచి లెవా పటేల్ కమ్యూనిటీ
కృషిని కొనియాడారు. కెన్యా స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయ కమ్యూనిటీ పాత్రను కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సమగ్ర అభివృద్ధికి కుచి సమాజం చేస్తున్న కృషిని , ప్రత్యేకించి 2001 వసంవత్సరంలో కచ్‌లో సంభవించిన భూకంపం అనంతరం, అక్కడ పునరావాసం, పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంలో వారి కృషిని ప్రధానమంత్రి కొనియాడారు.
కచ్ ప్రాంతం ఒకప్పుడు ఎడారి ప్రాంతాన్ని తలపించేదని , అది ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు , సుదూరంలోని కచ్ ప్రాంతానికి నర్మదా నదీ జలాలను తీసుకురావడానికి చేసిన నిరంతర ప్రయత్నాల గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ ప్రాంతంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రెట్టింపు బలంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “ గత కొన్ని సంవత్సరాలలో ఈ ప్రాంతం వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను అందుకుంది ” అని ప్రధానమంత్రి అన్నారు. గుజరాత్‌లోని కచ్- జామ్ నగర్ మధ్య ప్రతిపాదిత ఆర్.ఒ, ఆర్.ఒ సర్వీసు గురించి ప్రధాని వారికి తెలియజేశారు.
ఇండియా, ఆఫ్రికా దేశాల మధ్య కార్యకలాపాలలో పెరుగుదల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. “ఇండియా, ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు సమావేశం ఇటీవల ఇండియాలో జరిగాయి” అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అలాగే ప్రధానమంత్రి హోదాలో తానూ 20కి పైగా సందర్భాలలో పలు ఆఫ్రికా దేశాలలో పర్యటించినట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు.
తన ప్రసంగంలో ప్రధాని, ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ప్రత్యేకించి, 2019 జనవరిలో కుంభమేళా సందర్భంగా ఇండియా సందర్శించలేక పోయిన వారిని ఇండియా సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఇక్కడి సంస్కృతి, భారతీయ ఆథ్యాత్మిక సంప్రదాయాలను అనుభవంలోకి తెచ్చుకోవలసిందిగా వారిని కోరారు.
నైరోబి వెస్ట్ కాంప్లెక్స్ శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.