నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ హర్ష్ వర్ధన్, డాక్టర్ మహేశ్ శర్మ, శ్రీ మనోజ్ సిన్హా
ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం కార్యనిర్వాహక సంచాలకులు, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శి
భారతదేశం నుండి విదేశాల నుండి వచ్చినటువంటి ఉన్నతాధికారులు
మహిళలు మరియు సజ్జనులారా.
1.3 బిలియన్ మంది భారతీయుల పక్షాన మీకు అందరికీ న్యూ ఢిల్లీ లోకి ఎంతో సంతోషంగా స్వాగతం పలుకుతున్నాను.
వివిధ దేశాల నుండి తరలివచ్చి మాతో భేటీ అయిన ప్రతినిధులకు ఢిల్లీ చరిత్ర ను, ఢిల్లీ శోభ ను గురించి తెలుసుకోవడానికి కొంత కాలం చిక్కుతుందని నేను ఆశిస్తున్నాను.
2018 సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినానికి ప్రపంచ ఆతిథేయిగా ఉంటున్నందుకు మేం గర్విస్తున్నాము.
ముఖ్యమైన ఈ సందరభాన్ని వేడుకగా జరుపుకొంటున్న తరుణంలో, మనం మన పూర్వీకులు నెలకొల్పినటువంటి సార్వజనీన సౌభ్రాతృత్వ మర్యాదను గుర్తుకు తెచ్చుకొందాము.
ఇది ప్రఖ్యాత సంస్కృత పద బంధం ‘వసుధైక కుటుంబకమ్’ (ప్రపంచం ఒక కుటుంబం) ద్వారా అభివ్యక్తం అయింది.
మహాత్మ గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలోనూ ఇదే విధమైన మర్యాద ప్రతిబింబించింది. ఆయన ‘ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి చాలినంతగా ప్రకృతి ప్రసాదిస్తోంది; కానీ, ప్రతి మనిషి అత్యాశ కూ సరిపోయినంత మాత్రం ప్రసాదించడం లేదు’ అని అన్నారు.
ప్రకృతి తో సామరస్యంగా జీవించడం ఎంత ముఖ్యమో మన సంప్రదాయాలు చాలా కాలం క్రితమే గట్టిగా చెప్పాయి.
ఇది ప్రకృతి యొక్క భూతాల పట్ల మనం ప్రకటిస్తున్నటువంటి భక్తి,లో శ్రద్ధ లో గోచరిస్తోంది. ఇది మన పండుగలలోను, మన ప్రాచీన గ్రంథాలలోను ప్రతిఫలిస్తోంది.
మహిళలు మరియు సజ్జనులారా.
ఈ రోజున భారతదేశం ప్రపంచం లోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థను కలిగిన దేశం. మా యొక్క ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి మేం కంకణం కట్టుకొన్నాము.
మేం ఎంతో నిబద్ధతతో సుస్థిరమైన, పర్యావరణ హితమైన మార్గంలో ఈ పనిని చేయడానికి వచనబద్ధులమై వున్నాము.
ఈ మార్గం లోనే ఇంతవరకు మేము గత రెండు సంవత్సరాలలో 40 మిలియన్ గ్యాస్ కనెక్షన్ లను అందించాము.
ఇది పల్లెప్రాంతాల మహిళలకు విషపూరితమైన పొగ తాలూకు క్లేశాల బారి నుండి విముక్తిని ప్రసాదించింది.
అంతే కాదు ఇది వారు వంట చెరకు పైన ఆధారపడే స్థితి ని కూడా అంతమొందించింది.
అదే నిబద్ధత, భారతదేశం అంతటా మూడు వందల మిలియన్ ఎల్ఇడి బల్బు లను స్థాపించేటట్లు చేసింది. ఇది విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా, వాతావరణం లోకి భారీ స్థాయి లో బొగ్గు పులుసు వాయువు అదనపు మోతాదులు విడుదల కావడాన్ని కూడా అడ్డుకొంది.
నవీకరణయోగ్య శక్తి ఉత్సాదన దిశగా మేము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాము. 2022 నాటికి 175 గీగా వాట్ ల సౌర శక్తి ని మరియు పవన శక్తి ని ఉత్పత్తి చేసుకోవాలని మేం లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాము.
ప్రపంచంలో మేము ఇప్పటికే సౌర శ క్తి ఉత్పత్తి లో ఐదో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉన్నాము. ఇది మాత్రమే కాదు, నవీకరణ యోగ్య శక్తి ఉత్పత్తి లో మేము ఆరో అతి పెద్ద ఉత్పత్తిదారుగా కూడా ఉన్నాము.
ప్రతి కుటుంబానికి విద్యుత్తు కనెక్షన్ ను సమకూర్చాలని మేము లక్ష్యం గా పెట్టుకున్నాము. ఇది పర్యావరణానికి హాని చేసే ఇంధనాల మీద ఆధారపడడాన్ని మరింతగా తగ్గించగలుగుతుంది.
శిలాజ ఇంధనాల మీద ఆధారపడడాన్ని మేము తగ్గించుకొంటున్నాము. సాధ్యమైన చోటులన్నింటిలోనూ మేము నూతన ఇంధన వనరుల వైపు మళ్లుతున్నాము. మేము నగరాలలోను, ప్రజా రవాణా వ్యవస్థ లోను మార్పులను ప్రవేశపెడుతున్నాము.
మాది యువ రక్తంతో నిండిన జాతి. ఉపాధి కల్పన కై భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా రూపొందించే కృషిలో నిమగ్నం అయ్యాము.
మేము మేక్ ఇన్ ఇండియా ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించాము. ఆ పని చేస్తూపోతూ, మేము ఎలాంటి లోపాలు ఉండనటువంటి, దేనిమీదా దుష్ప్రభావం చూపనటువంటి తయారీ ప్రక్రియలపై శ్రద్ధ వహిస్తున్నాము. దీనికి అర్థం ఏమిటంటే, మా ఉత్పత్తి ప్రక్రియలు లోపరహితంగా మరియు పర్యావరణానికి హాని చేయకుండా ఉంటాయన్న మాట.
నేశనల్లీ డిటర్ మిన్ డ్ కోంట్రిబ్యూశన్స్ లో భాగంగా భారతదేశం జిడిపి లో పర్యావరణ కాలుష్య ఉద్గారాల తీక్షణత ను 2005 నుండి 2030 మధ్య కాలంలో 33 నుండి 35 శాతం వరకు కుదించుకోవడానికి వచనబద్దురాలై ఉంది. 2030 సంవత్సరపు నేశనల్లీ డిటర్ మిన్ డ్ కోంట్రిబ్యూశన్స్ గమ్యాన్ని చేరుకొనే దిశగా మేము సాగిపోతున్నాము.
యుఎన్ ఇపి గ్యాప్ నివేదిక ప్రకారం, కోపెన్ హాగన్ ప్రతిజ్ఞ ను అమలు చేసే దిశగా కూడా భారతదేశం పయనిస్తోంది. భారతదేశ జిడిపి లో ఉద్గారాల తీక్షణత స్థాయిని మేము 2005 స్థాయిలతో పోలిస్తే 2020కల్లా ఇరవై నుండి ఇరవై అయిదు శాతం స్థాయికి తగ్గించుకొంటాము.
మాకు ఒక దృఢమైన జాతీయ జీవ వైవిధ్య వ్యూహం అంటూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు భారతదేశానికి 2.4 శాతం భూప్రాంతం మాత్రమే ఉన్నది. ప్రపంచం లోన నమోదైనటువంటి జీవ జాతుల భిన్నత్వంలో 7నుండి 8 శాతం జీవజాతులకు మా దేశం ఆశ్రయాన్ని ఇస్తోంది. అదే సమయంలో, మానవ జనాభా లో దాదాపు 18 శాతాన్ని భారతదేశం పోషిస్తోంది. మా వృక్షాలు, వన్య ప్రాంత విస్తీర్ణం సైతం గత రెండు సంవత్సరాలలో ఒక శాతం మేర వృద్ధి చెందింది.
మేము వన్యప్రాణి సంరక్షణ రంగం లోనూ చక్కటి ఫలితాలు సాధించాము. పులులు, ఏనుగులు, సింహాలు, ఖడ్గ మృగాల సంతతి పెరుగుతోంది.
నీటి లభ్యత తగ్గిపోతున్న సమస్య ను గుర్తించడమే కాకుండా దానిని ఎలా పరిష్కరించాలన్నది కూడా మేము గ్రహించాము. జల లభ్యత తగ్గిపోవడమనేది ఇప్పుడు భారతదేశంలో ప్రధాన సమస్యగా మారుతోంది. మేము భారీ స్థాయిలో నమామీ గంగే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమం ఇప్పటికే ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం ఎంతో విలువైన గంగానది ని త్వరలోనే పునరుద్ధరించనుంది.
భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయ దేశం. కాబట్టి వ్యవసాయానికి అవసరమైన సాగు నీటిని నిరంతరం అందించవలసి ఉంటుంది. నీరు లేకుండా ఏ పొలమూ ఎండి పోకూడదనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి కృషి సించాయీ పథకాన్ని ప్రారంభించడమైంది. ప్రతి నీటి బిందువు తో మరింత అధికంగా పంట ను రాబట్టుకోవాలనే నినాదంతో దేశం ముందుకు సాగుతోంది.
అన్నదాతలు వారికి సంబంధించిన వ్యవసాయ వ్యర్థాలను దహనం చేసే బదులు వాటిని ఉపయోగించుకొని ఎంతో విలువైన పంట పోషకాలను తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాము.
మహిళలు మరియు సజ్జనులారా.
పలు దేశాలు ప్రతికూల సత్యం పైన దృష్టి పెట్టిన సమయంలో మేము అందరికీ అనుకూలమైన కార్యాచరణ దిశగా కదిలాము.
అనుకూల కార్యాచరణ కోసం ఇచ్చిన పిలుపునకు స్వాగతం పలికిన భారతదేశం, ఫ్రాన్స్ తో కలిసి ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ స్థాపనకు నాయకత్వం వహించింది. పారిస్ శిఖరాగ్ర సమ్మేళనం అనంతరం పర్యావరణ సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏకైక ప్రముఖ పరిణామం ఇదే.
దాదాపు మూడు నెలల క్రితం, ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ స్థాపక సమావేశం కోసమని 45 దేశాలకు చెందిన నాయకులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఇక్కడే న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
అభివృద్ధి అనేది పర్యావరణ హితంగా ఉండాలని మన అనుభవాలు సూచిస్తున్నాయి. మనకు ఉన్న ప్రకృతి వనరులను ధ్వంసం చేసుకొని అభివృద్ధిని సాధించకూడదు.
మిత్రులారా,
ఈ సంవత్సరం ఎంతో ముఖ్యమైనటువంటి ఒక సవాలును పరిష్కరించడానికిగాను ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా కృషి జరుగుతోంది.
ప్లాస్టిక్ అనేది ఇప్పుడు మానవాళి కి చాలా ప్రమాదకారిగా తయారైంది. మనం తయారు చేస్తున్న ప్లాస్టిక్ లో అత్యధికం రీసైక్లింగ్ కోసం రావడం లేదు. మరింత ఆందోళన కలించే విషయం ఏమిటంటే మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ లో అత్యధికం శిథిలమై భూమిలో కలిసిపోవడం లేదు.
ప్లాస్టిక్ కాలుష్యం అనేది మన సముద్ర జీవావరణ వ్యవస్థకు పెను ముప్పు గా మారింది. సముద్ర జీవుల మనుగడ కు ఏర్పడుతున్న ముప్పు ను శాస్త్రవేత్తలతో పాటు మత్స్యకారులు కూడా గుర్తించారు. మత్స్య సంపద తగ్గిపోతోంది. సముద్ర వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సముద్ర జీవుల నివాస ప్రాంతాలు తరిగిపోతున్నాయి.
సముద్ర వ్యర్థాలను తీసుకున్నప్పుడు అందులోని సూక్ష్మమమైన ప్లాస్టిక్ ప్రస్తుతం ఆయా దేశాల హద్దులను దాటి విస్తరిస్తున్న సమస్య. సముద్రాలను శుభ్రంగా ఉంచుకొందామనే ఉద్యమంలో చేరడానికి భారతదేశం సిద్ధమవుతోంది. తద్వారా సముద్రాలను కాపాడడంలో తన వంతు కృషి చేయనుంది.
ప్లాస్టిక్ కాలుష్యమనేది ఇప్పుడు మన ఆహారవ్యవస్థలోకి చేరింది. మనం ఉపయోగించే ఉప్పు, బాటిల్ నీరు, కుళాయి నీరు లాంటి ప్రాథమిక ఆహార పదార్థాలలోకి సూక్ష్మరూపంలో ప్లాస్టిక్ చేరుతోంది.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన దేశాలలోని పలు ప్రాంతాలలో ఉపయోగించే ప్లాస్టిక్ తో పోలిస్తే భారతదేశంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం చాలా తక్కువ.
దేశవ్యాప్తంగా పారిశుధ్యం, పరిశుభ్రమైన వాతావరణం కోసం స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి లో మొదలుపెట్టాము. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపైన ఇది దృష్టి సారించిది.
కేంద్ర పర్యావరణ, అటవీ, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన ను కొద్దిసేపటి క్రితం నేను తిలకించాను. మనం సాధించిన విజయాలను అక్కడ ప్రదర్శించారు. ఐక్య రాజ్య సమితి తో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడంలో వారు తమ విశిష్టమైన పనిని కొనసాగిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను.
మహిళలు మరియు సజ్జనులారా.
పర్యావరణ కాలుష్యం కారణంగా పేదలు, బలహీనులు ఎక్కువగా నష్టపోతారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం. భౌతిక సౌఖ్యాల కోసం కొనసాగుతున్న వెంపర్లాట కారణంగా పర్యావరణం నాశనమైపోకూడదు.
2030 కల్లా సుస్థిర అభివృద్ధి ని సాధించే ప్రణాళికలో భాగంగా ఎవరినీ వెనుకబాటు లో ఉంచకూడదనే నినాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రపంచదేశాలు అంగీకరించాయి. మనందరం ఐకమత్యంగా పని చేస్తేనే తప్ప ఇది సాధ్యం కాదు. అప్పుడే ప్రకృతి మాత మనకు ఇచ్చిన వాటిని రక్షించుకోగలం.
మిత్రులారా,
ఇది భారతీయుల మార్గం. ఈ విశిష్టమైన పర్యావరణ దినం సందర్భంగా ఈ మార్గాన్ని మరోసారి ప్రపంచ ప్రజలతో పంచుకోవడం మనకు ఎంతో సంతోషాన్నిస్తోంది.
ఇక ముగించే ముందు ప్రపంచ పర్యావరణ దినానికి ఆతిథ్యాన్నిచ్చే దేశంగా.. సుస్థిర అభివృద్ధి కోసం భారతదేశానికి వున్న నిబద్దతను మరోసారి చాటుతున్నాను.
అందరమూ కలిసి పని చేద్దాము. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాము. భూగోళాన్ని.. నివాసానికి అనుకూలంగా ఉండేలాగా కాపాడుకుందాము.
ఈ రోజున మనం తీసుకునే నిర్ణయాలు, రేపటి మన సమష్టి భవిష్యత్తు ను నిర్వచిస్తాయి. ఈ నిర్ణయాలు తీసుకోవడం అంత సులువైన పని ఏమీ కాకపోవచ్చు. అయితే చైతన్యం ద్వారాను, సాంకేతిక విజ్ఞానం, ఇంకా మన:పూర్వక ప్రపంచ భాగస్వామ్యం ద్వారాను మనం సరైన నిర్ణయాలను తప్పక తీసుకోగలమనే నేను నమ్ముతున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.