భారతియార్ జయంతి నాడు ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శ్రద్ధాంజలి ఘటించి, ‘అంతర్జాతీయ భారతి ఉత్సవం 2020’ ని ఉద్దేశించి ప్రసంగించారు. మహా కవి సుబ్రమణ్య భారతి 138వ జయంతి ని వేడుక గా జరపడానికి గాను ఈ ఉత్సవాన్ని వానవిల్ సాంస్కృతిక కేంద్రం నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం లో భారతి పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గాను పండితుడు శ్రీ సీనీ విశ్వనాథన్ కు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. శ్రీ సీనీ విశ్వనాథన్ కు పురస్కారాన్ని ఈ కార్యక్రమం లో ప్రదానం చేయడం జరిగింది.
సుబ్రమణ్య భారతి ని గురించి మాటలలో వర్ణించడం అంటే అది ఎంతో కష్టమైన పని అని ప్రధాన మంత్రి అన్నారు. ఏ ఒక్క వృత్తి తోనో, లేదా ఏ ఒక్క కొలత తోనో భారతియార్ ను ముడిపెట్టలేం అని ఆయన అన్నారు. భారతియార్ ఒక కవి, రచయిత, సంపాదకుడు, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య యోధుడు, మానవతావాది, అంతేకాదు.. అంత కంటే మరెంతో ఎక్కువ కూడా అని శ్రీ మోదీ అన్నారు.
ఆ మహా కవి రచనల పెన్నిధి ని, ఆయన పద్యాలను, ఆయన వేదాంతాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి తెలుసుకొని ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. మహా కవి కి వారాణసీ తో ఉన్న సన్నిహిత సంబంధాన్ని శ్రీ మోదీ గుర్తు కు తెచ్చారు. భారతి గారిని ప్రధాన మంత్రి పొగడుతూ, 39 సంవత్సరాల చిన్నదైన జీవన కాలంలోనే ఆయన రాసింది ఎంతో ఉంది, ఆయన చేసింది ఎంతో ఉంది, ఆయన ఎన్నింటిలోనో రాణించారు అన్నారు. ఒక గొప్ప భవిష్యత్తు దిశ లో ముందుకు సాగేందుకు మనకు ఆయన రచనలు దారి ని చూపుతాయి అని శ్రీ మోదీ అన్నారు.
నేటి మన యువతీయువకులు సుబ్రమణ్య భారతి గారి నుంచి నేర్చుకోగలిగింది ఎంతో ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. వాటిలో అత్యంత ముఖ్యమైంది ధైర్యంగా ఉండడం అని ఆయన చెప్పారు. సుబ్రమణ్య భారతి గారికి భయం అంటే ఏమిటో తెలియదు అని ఆయన అన్నారు. ‘భయం అనేది నాలో లేదు, నాలో రవ్వంతైనా భయం అనేది లేదు, యావత్తు ప్రపంచం నన్ను ఎదురించినా సరే..’ అని పలికిన భారతి గారి మాటలను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ నూతన ఆవిష్కరణల, శ్రేష్ఠత్వాల ముందుభాగంలో నిలబడుతున్న యువ భారతం లో ఉట్టిపడుతున్నటువంటి ఈ భావన ను నేను గమనిస్తున్నాను అన్నారు. భారతదేశ అంకుర సంస్థల రంగం భయమంటే ఎరుగని యువత తో నిండిపోయి ఉంది; వారు మానవాళి కి ఏదో కొత్తదనాన్ని అందిస్తున్నారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. అలాంటి ‘మనం చేయగలం’ అనే భావన మన దేశానికి, మన భూ గ్రహానికి ఆశ్చర్యాన్ని తీసుకు రాగలుగుతుంది అని ఆయన నొక్కిచెప్పారు.
పాత, కొత్త ల ఆరోగ్యకరమైన మేళనం ఎంతయినా అవసరం అని భారతియార్ నమ్మారు అని ప్రధాన మంత్రి చెప్పారు. మన మూలాలను అంటిపెట్టుకొని ఉంటూనే, భవిష్యత్తు దిశ గా కూడా చూడడమే వివేకవంతమైంది అని భారతి గ్రహించారు; ఆయన తమిళ భాష ను, మాతృభూమి అయిన భారతదేశాన్ని తన రెండు కళ్లు గా భావన చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. భారతి గారు ప్రాచీన భారతదేశం మహనీయత ను గురించిన, వేదాల, ఉపనిషత్తుల మహనీయత ను గురించిన, మన సంస్కృతి మహనీయత ను గురించిన, మన సంప్రదాయం మహనీయత ను గురించిన, మన కీర్తి ని గురించిన పాటలను పాడారు. అయితే అదే సమయం లో, ఆయన గత కాలపు వైభవం లో జీవిస్తూ ఉంటే అది మాత్రమే సరిపోదు అంటూ మనలను హెచ్చరించారు కూడా అని ప్రధాన మంత్రి అన్నారు. ఒక వైజ్ఞానిక నిశితత్వాన్ని అలవర్చుకోవలసిన అవసరం, పరిశీలన స్ఫూర్తి ని అలవర్చుకోవలసిన అవసరం, ప్రగతి వైపునకు పయనించవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రగతి కి మహాకవి భారతియార్ ఇచ్చిన నిర్వచనం లో మహిళలకు ఒక ప్రధాన పాత్ర ఉండింది అని ప్రధాన మంత్రి చెప్పారు. స్వతంత్రులైన మహిళలు, సశక్తులైన మహిళలు అనే అంశం ఆయన దార్శనికత లో అత్యంత ముఖ్యమైన దృష్టి కోణం అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘మహిళలు వారి తలలను ఎత్తుకొని నడవాలి; మహిళలు ప్రజలను వారి కళ్ల లోకి సూటి గా చూస్తూ నడవాలి‘ అని మహా కవి భారతియార్ రాశారన్నారు. ప్రభుత్వం ఈ దృష్టి కోణం నుంచి ప్రేరణ ను పొందింది, మహిళల నాయకత్వంలో సాధికారిత కల్పన కు పూచీపడడానికి గాను ప్రభుత్వం కృషి చేస్తోంది అంటూ ప్రధాన మంత్రి వివరించారు. ప్రభుత్వ కృషి కి సంబంధించిన ప్రతి రంగంలోను మహిళల గౌరవానికి ప్రాధాన్యం ఉంటోంది అని ఆయన తెలిపారు. ప్రస్తుతం, 15 కోట్ల మంది కి పైగా మహిళా నవ పారిశ్రామికవేత్తలు ‘ముద్ర యోజన’ వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అందుకొంటున్నారు అని ఆయన చెప్పారు. వర్తమాన కాలం లో, మహిళలు శాశ్వత భూమిక తో మన సాయుధ దళాల్లో పాలుపంచుకొన్నారు; ఇవాళ, భద్రమైన పారిశుద్ధ్యానికి నోచుకోనటువంటి నిరుపేద మహిళలు 10 కోట్ల కు పైగా సురక్షిత, ఆరోగ్య రక్షక టాయిలెట్ ల ప్రయోజనాన్ని అందుకొన్నారు. వారు ఇక మీదట సమస్యలను ఎదుర్కోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది న్యూ ఇండియా లోని నారీ శక్తి యుగం. వారు అడ్డుగోడలను ఛేదిస్తూ, వారి ప్రభావాన్ని ప్రసరిస్తున్నారు. ఇది సుబ్రమణ్య భారతి గారికి న్యూ ఇండియా సమర్పిస్తున్న శ్రద్ధాంజలి’’ అని శ్రీ మోదీ అన్నారు.
ముక్కచెక్కలుగా ఉండే ఏ సమాజం అయినా విజయవంతం కాజాలదు అని మహా కవి భారతియార్ గ్రహించారని ప్రధాన మంత్రి చెప్పారు. అదే సమయం లో, సమాజం లోని అసమానత్వాల ను పరిష్కరించని, సమాజం లోని రుగ్మతలను నయం చేయని రాజకీయ స్వేచ్ఛ డొల్లతనాన్ని గురించి కూడా ఆయన రాశారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇప్పుడు మనం ఒక నియమాన్ని రూపొందిద్దాం, మరి ఆ నియమాన్ని ఎప్పుడో ఒకప్పుడు అమలు చేద్దాం, ఒకవేళ ఎవరైనా ఒక మనిషి ఆకలి బాధ ను ఎదుర్కోవలసి వచ్చింనుకోండి, అటువంటప్పుడు ప్రపంచానికి వినాశం తాలూకు వేదన ను ఎదుర్కోవలసి వస్తుంది’’ అంటూ భారతి చెప్పిన మాటలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆయన బోధనలు మనకు ఐకమత్యం తో ఉండాలని, కంకణబద్ధులు అయ్యేందుకు ప్రేరకాలు. ప్రతి ఒక్క వ్యక్తి కి, మరీ ముఖ్యం గా పేదలకు, ఆదరణ కు నోచుకోని వర్గాల వారికి సాధికారిత ను కల్పించాలని మనకు ఆయన బోధన లు గట్టిగా గుర్తు చేస్తుంటాయన్నారు.
భారతి గారి నుంచి మన యువత నేర్చుకోవలసింది ఎంతో ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. మన దేశం లో ప్రతి ఒక్కరు ఆయన రచనలను చదవాలి, మన దేశం లో ప్రతి ఒక్కరు ఆయన నుంచి ప్రేరణ ను పొందాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు. భారతియార్ సందేశాన్ని వ్యాప్తి లోకి తీసుకురావడంలో అద్భుతమైన కృషి చేస్తున్నందుకుగాను వానవిల్ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈ ఉత్సవం ఫలప్రదమైన చర్చోపచర్చలను జరుపుతుందని, ఆ చర్చోపచర్చల సారం భారతదేశాన్ని ఒక కొత్త భవిత దిశ గా నడిపించడంలో సాయపడగలదన్న నమ్మకాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.