ఈ రోజున ఒక అత్యంత మంచిదైన అవకాశం దక్కింది. ఇది దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక గొప్ప పుత్రుడిని స్మరించుకొనే రోజు. ఇది అలుపెరగకుండా పని చేయాలన్న ఒక ఉద్వేగం. దేశం కోసం మనని మనం అంకితం చేసుకొనే సందర్భం. ఇది మనని తేదీ, సమయం మరియు ఒక రోజులో ఏ కాలం అనే అంశాలకు అతీతంగా మన అందరినీ ఒక చోటుకు చేర్చింది.
నేను మీ అందరికీ, మరీ ముఖ్యంగా శాస్త్ర విజ్ఞాన సంబంధ సముదాయానికి ఆచార్య సత్యేంద్రనాథ్ బోస్ గారి 125వ జయంతి సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, ఈ సంవత్సరం మొదట్లో ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశమైన సంతోషం నాకు లభించింది. ఈ పవిత్రమైన అదను కొన్ని ఆలోచనలను మీతో పంచుకోనిస్తుండటం నాకు సంతోషాన్నిస్తోంది.
ఆచార్య సత్యేంద్రనాథ్ బోస్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని ఒక సంవత్సరం పాటు సాగే కార్యక్రమాలకు మనం ఈ రోజున నాంది పలుకుతున్నాం. బోస్ గారు 1894వ సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. ఆయన సాధించిన విజయాలు ఆయన జీవించిన కాలం కన్నా ఎంతో ముందు కాలానికి చెందినటువంటివన్న సంగతిని నేను అర్థం చేసుకొన్నాను.
మిత్రులారా, దేశబంధు చిత్తరంజన్ దాస్ గారు ఇదే విషయాన్ని తన కవిత్వంలో ఇలా రాశారు –
“There is an eternal truth inherent in the water and soil of Bengal.”
ఈ మాటలకు.. బెంగాల్ నేలలో, నీటిలో ఒక దేవతా సంబంధిత సత్యం మిళితమై ఉంది.. అని భావం. ఇది ఎటువంటి సత్యమంటే, బెంగాల్ ప్రజలను చింతన మరియు మననం యొక్క ఏ స్థాయిలకు అయితే తీసుకువెళుతుందో అక్కడకు చేరుకోవడం కష్టమై పోతుంది. ఇది ఎటువంటి సత్యమంటే, దీని కారణంగా బెంగాల్ శాతాబ్దాల తరబడి దేశం యొక్క ఇరుసుగా మారిపోయి, దానిని ఒక్కటిగా ఉంచగలిగింది.
అది స్వాతంత్య్ర ఉద్యమం కావచ్చు, లేదా సాహిత్యం కావచ్చు, లేదా శాస్త్ర విజ్ఞానం కావచ్చు, లేదా క్రీడలు కావచ్చు.. ప్రతి ఒక్క రంగంలో బెంగాల్ నేల ప్రభావం మరియు నీటి ప్రభావం స్పష్టంగా గోచరిస్తుంది. స్వామి రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానంద గారు, గురు రవీంద్రనాథ్ టాగోర్ గారు, సుభాష్ చంద్ర బోస్ గారు, శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు, బంకిమ్ చంద్ర గారు, శరద్ చంద్ర గారు, సత్యజీత్ రే గారు.. మీరు ఏ రంగం పేరైనా తీసుకోండి, బెంగాల్ కు చెందిన ఏదో ఒక నక్షత్రం అక్కడ మిలమిలలాడుతూ కనిపిస్తుంది.
ఈ గడ్డ ఎంతో మంది అగ్రగామి శాస్త్రవేత్తలను ప్రపంచానికి అందించిందనేది భారతదేశానికి గర్వకారణమైన సంగతి. ఆచార్య ఎస్.ఎన్. బోస్ గారికి తోడు జె.సి. బోస్ గారు, మేఘనాథ్ సాహా గారు లతో పాటు ఎంతో మంది దేశంలో నవీన శాస్త్ర విజ్ఞానానికి పునాదిని బలపరిచారు.
వారు ఎంతో పరిమితంగా ఉన్నటువంటి వనరులు మరియు అత్యంత కష్టాల మధ్య తమ ఆలోచనల తోను, నూతన ఆవిష్కారాల తోను ప్రజలకు సేవ చేశారు. వారి యొక్క అంకిత భావం మరియు సృజనల నుండి ఈ రోజుకు కూడా మనం నేర్చుకొంటున్నాం.
మిత్రులారా, ఆచార్య ఎస్.ఎన్. బోస్ గారి జీవితం నుండి మరియు ఆయన చేసిన పనుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన తనకు తానే అవగాహనను కలిగించుకొన్నటువంటి విద్వాన్. ఎన్నో నిర్భంధాల మధ్య ఆయన విజేతగా నిలచారు. వీటిలో సాంప్రదాయక పరిశోధక విద్య కొరవడటం, ప్రపంచ శాస్త్ర విజ్ఞాన సముదాయంతో సంబంధాలు లేకపోవడం వంటివి కొన్ని మాత్రమే. 1924 వ సంవత్సరంలో ఆయన ఆవిష్కరించిన సూత్రం ఆయన యొక్క తదేక సమర్పణ భావం కారణంగానే సాధ్యమైంది.
అది పరిమాణ గణాంకాలకు పునాదులు వేసింది. అలాగే, ఆధునిక అణు సిద్ధాంతానికి ఒక ప్రాతిపదికను అందించింది. ఆయన ఆవిష్కరించిన దానిని పాత పరిమాణ సిద్ధాంతం తాలూకు కడపటి నాలుగు విప్లవాత్మక పత్రాలలో ఒకటిగా ఆయిన్‌స్టాయిన్ ఆత్మకథ రచయిత అబ్రాహం పేస్ పరిగణించారు. బోస్ స్టాటిస్టిక్స్, బోస్ ఆయిన్‌స్టాయిన్ కాండెన్‌సేశన్ మరియు హిగ్స్ బోసాన్ ల వంటి భావనలు మరియు పరిభాష ల ద్వారా శాస్త్ర విజ్ఞాన చరిత్రలో సత్యేంద్ర నాథ్ బోస్ గారి పేరు చిరస్థాయిగా నిలచిపోయింది.
భౌతిక శాస్త్రంలో ఎన్నో నోబెల్ బహుమతులను- ఆయన తదనంతరం వివిధ భౌతిక శాస్త్ర సేవలలో ఆయన ఆలోచనలను ముందుకు తీసుకుపోయిన పరిశోధకులకు- బహూకరించడాన్ని బట్టి ఆయన సాధించిన పనికి ఎంతటి మౌలిక ప్రాముఖ్యం ఉన్నదో గ్రహించవచ్చు.
శాస్త్ర విజ్ఞానాన్ని దేశ భాషలలో బోధించడం కోసం ప్రొఫెసర్ బోస్ గారు ఒక మహోద్యమాన్నే సాగించారు. ఆయన ఒక శాస్త్ర విజ్ఞాన పత్రికను ‘జ్ఞాన్-ఒ-బిజ్ఞాన్’ పేరుతో బెంగాలీ భాషలో తీసుకు వచ్చారు.
మన యువతీయువకులలో శాస్త్ర విజ్ఞానం పట్ల అవగాహనను మరియు మక్కువను పెంపొందించాలంటే, మనం శాస్త్ర విజ్ఞాన సంబంధ సమాచారాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కీలకం అవుతుంది. ఈ కార్య సాధనలో భాష అనేది ఒక అవరోధంగా కాకుండా, ఒక సహాయకారి పాత్రను పోషించవలసి ఉంటుంది.
మిత్రులారా, భారతదేశంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధక వాతావరణం ఎంతో దృఢంగా ఉంటూ వచ్చింది. మన దగ్గర ప్రతిభకు గాని, లేదా కఠిన శ్రమకు గాని, లేదా లక్ష్యానికి గాని ఏ లోటూ లేదు.
గత కొన్ని దశాబ్దాలలో శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞాన రంగంలో భారతదేశం శరవేగంగా దూసుకువచ్చింది. ఐటి రంగం కావచ్చు, లేదా అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం కావచ్చు, లేదా క్షిపణి సంబంధ సాంకేతిక విజ్ఞానం కావచ్చు.. భారతదేశం యావత్ ప్రపంచంలో తనదైన ముద్రను వేసింది. మన శాస్త్రజ్ఞుల మరియు సాంకేతిక విజ్ఞాన నిపుణులు సాధించిన ఈ విజయాలు మొత్తం దేశానికే గర్వకారణమైనవిగా నిలుస్తున్నాయి.
ఐఎస్ఆర్ఒ ఒకే రాకెట్ ద్వారా 100 కు పైగా శాటిలైట్ లను ప్రయోగించినపుడు యావత్ ప్రపంచం కళ్లు విప్పార్చి వీక్షించింది. ఆ సమయంలో మన భారతీయులమంతా తలెత్తి మన శాస్త్రవేత్తల యొక్క ఈ పరాక్రమం పట్ల ప్రఫుల్లితులం అయ్యాం.
మిత్రులారా, ప్రయోగశాలలో మీరు చేసిన కఠిన శ్రమతో పాటు మీరు చేసిన త్యాగం ప్రయోగశాలలకే పరిమితమై పోవడమంటే మీకు మరియు దేశానికి కూడా ఒక గొప్ప అన్యాయమే అవుతుంది. మీరు మీ కఠిన శ్రమ దేశం యొక్క శాస్త్ర విజ్ఞాన సంబంధ సామర్ధ్యాలను ఉత్తేజితం చేయడానికే కాక, వాటిని నవీన కాలానికి తగినట్లు మలచడం ద్వారా సామాన్య మానవుడికి లాభాలను అందించినప్పుడు మరింత ఫలప్రదం కాగలదు.
ఈ కారణంగా మన పరిశోధనలు మరియు మన వినూత్న ఆవిష్కారాల తుది పర్యవసానాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవడం అత్యంత ఆవశ్యకం. మీ పరిశోధన పేదవాడి జీవనాన్ని సరళతరంగా మారుస్తోందా ? అది మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించగలుగుతుందా ?
మన సామాజిక మరియు ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కారాన్ని కనుగొనడమనేది మన శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలకు మూలాధారం అయినప్పుడు మీకు తుది పరిణామాన్ని నిర్దేశించుకోవడం, అలాగే మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం కూడా సులువవుతుంది.
అంతటి సృజనశీల సాంకేతిక విజ్ఞాన సంబంధ పరిష్కార మార్గాలను దేశానికి అందించడాన్ని మన దేశ శాస్త్రవేత్తలు వారి శక్తిమంతమైన ఆలోచన సరళితో కొనసాగిస్తారని, తద్వారా సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, అది వారి జీవనాన్ని మరింత సులభతరంగా మార్చుతుందని నేను నమ్ముతున్నాను.
వివిధ శాస్త్ర విజ్ఞాన సంస్థలు సౌర విద్యుత్తు, శుద్ధ శక్తి , జల సంరక్షణ మరియు వ్యర్థాల నిర్వహణ ల వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటి పరిశోధనను, అభివృద్ధి పథకాలను ఆరంభించిన సంగతిని నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ తరహా ప్రాజెక్టులు మరియు వాటి ఫలితాలు ఒక్క ప్రయోగశాలలకే పరిమితం కాకూడదన్నదే మన సామూహిక బాధ్యత కావాలి.
ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు విద్యార్థులారా, మీరందరూ క్వాంటమ్ మెకానిక్స్‌ను చదివారు. అంతేకాకుండా, అందులో బహుశా నిపుణులు కూడాను. దానిని నేను చదువలేదు. కానీ, భౌతిక శాస్త్రం మనకు దైనందిన జీవనంలో బోధించే అనేక పాఠాలు ఉన్నాయన్న సంగతిని నేను గ్రహించాను. ఒక క్లాసికల్ పార్టికల్ అంత సులభంగా ఒక లోతైన బావిలో నుండి అంత సులభంగా తప్పించుకోజాలదు. కాని క్వాంటమ్ పార్టికల్ ఆ పనిని చేయగలుగుతుంది!
ఒక కారణం గానో లేదా మరొక కారణంగానో మనని మనం ఒంటరితనానికి పరిమితం చేసుకొన్నాం. మనం మన అనుభవాలను ఇతర సంస్థల యొక్క సాటి శాస్త్రవేత్తలతోను, నేషనల్ లేబరేటరీస్‌కు చెందిన సహ శాస్త్రవేత్తలతోను పంచుకోవడం, సహకరించుకోవడం, సమన్వయపరచుకోవడం తక్కువే.
మనం మన సిసలైన సామర్ధ్యాన్ని అందుకోవడానికి మరియు భారతదేశ శాస్త్ర విజ్ఞానాన్ని, దాని యొక్క సరియైనటువంటి యశస్సుకు చేర్చడానికి- తన గిరిని దాటి బయటపడే ఒక క్వాంటమ్ పార్టికల్ మాదిరిగా- వ్యవహరించాలి. శాస్త్ర విజ్ఞానం బోలెడంత బహుళమైన విభాగాలను సంతరించుకొని, ఉమ్మడి కృషి అవసరమైందిగా మారిపోయిన నేపథ్యంలో ఈ వైఖరి ఇవాళ మరింత ముఖ్యం.
ఖరీదైన మరియు అంతకంతకు తక్కువ జీవిత కాలానికి పరిమితమైపోతున్న భౌతిక మరియు పరిశోధక మౌలిక సదుపాయాలను మరింతగా పంచుకోవలసిన ఆవశ్యకతను గురించి నేను పదే పదే చెబుతూ వస్తున్నాను.
మన శాస్త్ర విజ్ఞాన విభాగాలు ప్రస్తుతం బహుముఖీన వైఖరితో కృషి చేస్తున్నాయని నా దృష్టికి వచ్చింది. శాస్త్ర విజ్ఞాన సంబంధ మౌలిక వసతులను పంచుకోవడం కోసం ఒక పోర్టల్ ను అభివృద్ధి పరుస్తున్నారని, అది వనరులను పారదర్శక పద్ధతిలోను మరియు తగిన ట్యాగింగ్ తోను పంచుకొనేందుకు అనుమతిస్తుందని నేను అర్థం చేసుకొన్నాను.
విద్యా సంబంధమైన మరియు పరిశోధన- అభివృద్ధి (ఆర్ & డి) సంస్థల మధ్య చక్కని సమన్వయాల కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. విద్యావేత్తలు మొదలుకొని సంస్థల వరకు, పరిశ్రమలు మొదలుకొని స్టార్ట్-అప్ ల వరకు శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక విజ్ఞాన భాగస్వాములందరినీ ఒక చోటుకు చేర్చడానికి నగరం కేంద్రంగా ఆర్ & డి క్లస్టర్ లను నిర్మించడం జరుగుతోంది.
ఈ ప్రయత్నం యొక్క విజయం అన్ని సంస్థలను మరియు ప్రయోగ శాలలను ఈ వ్యూహంలో భాగం చేయగల మన దక్షత పైన ఆధారపడి ఉంటుంది. దీనికి మనలో ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా తోడ్పాటు అందించవలసి ఉంటుంది. దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న శాస్త్రవేత్త కు సైతం వనరుల తాలూకు నిరంతరాయ లభ్యత.. అది ఐఐటి ఢిల్లీ కావచ్చు, లేదా దెహ్రాదూన్ లోని సిఎస్ఐఆర్ ల్యాబ్ కావచ్చు.. దానిని అందుబాటు లోకి తీసుకు వచ్చేటట్టు ఈ యంత్రాంగం పూచీ పడాలి. మన కృషి వేరు వేరు భాగాల సమాహారం కంటే మించిన రీతిలో సాగాలన్నదే మన ధ్యేయం కావాలి.
మిత్రులారా, అభివృద్ధికి, వృద్ధికి మరియు పరివర్తనకు శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం ఒక అసాధారణమైన చోదక శక్తి వలె పని చేస్తాయి. మీ యొక్క నూతన ఆవిష్కారాలను మన సామాజిక, ఆర్థిక సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకు పోవలసిందని మరొక్కమారు మీ అందరికీ, ఈ దేశంలోని శాస్త్ర విజ్ఞాన రంగ ప్రముఖులకు నేను విజ్ఞప్తి చేయదలుస్తున్నాను.
మన దేశంలో లక్షలాది ప్రజలు, మరీ ముఖ్యంగా ఆదివాసీ సముదాయంలో వేలాది చిన్నారులు సికిల్ సెల్ అనీమియా తో బాధపడుతున్నారన్న సంగతి మీరు ఎరుగుదురు. ఈ విషయమై దశాబ్దాల పాటు పరిశోధనలను నిర్వహించడం జరిగింది. కానీ, ఈ వ్యాధికి తక్కువ ఖర్చుతో కూడిన ఒక సులువైన పరిష్కార మార్గాన్ని ఈ ప్రపంచానికి అందిస్తామన్న ఒక ప్రతిజ్ఞను మనం స్వీకరించగలమా ?
పప్పు ధాన్యాలలో చౌకగా దొరకగల కొత్త కొత్త రకాలను మరియు పోషకాహార లోపం సమస్యను పరిష్కరించేటటు వంటి అధిక మాంసకృత్తులతో కూడిన పప్పు ధాన్యాలను మనం అభివృద్ధిపరచ గలుగుతామా ? మన తిండి గింజలు మరియు కాయగూరల నాణ్యతను మనం మరింత మెరుగు పరచగలుగుతామా ? మన నదులను శుద్ధి చేయడం కోసం, నదులలో అవాంఛనీయ వృక్ష సమూహం ఇంతలంతలుగా పెరిగిపోకుండాను మరియు మన నదులను కాలుష్య రహితంగా మార్చడానికీ సరికొత్త సాంకేతికతలను అభివృద్ధిపరచే ప్రక్రియలను మనం వేగవంతం చేయలగలుగుతామా ?
మలేరియా, క్షయ వ్యాధి, ఇంకా జాపనీస్ ఎన్‌సెఫలైటిస్ ల వంటి వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు కొత్త ఔషధాలను, కొత్త టీకా మందులను మనం అభివృద్ధి పరచగలుగుతామా ? మన సాంప్రదాయక విజ్ఞానాన్ని నవీన శాస్త్ర విజ్ఞానంతో ఒక సృజనాత్మకమైన పద్ధతిలో మిళితం చేయగల రంగాలను మనం గుర్తించగలుగుతామా ?
మిత్రులారా, వేరు వేరు కారణాల వల్ల మనం ఒకటో పారిశ్రామిక విప్లవాన్ని చేజార్చుకొన్నాం. అటువంటి అవకాశాలను ఇవాళ మనం పోగొట్టుకోకూడదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా ఎనలిటిక్స్, మశీన్ లర్నింగ్, సైబర్ – ఫిజికల్ సిస్టమ్స్, జెనోమిక్స్ మరియు విద్యుత్తు వాహనాలు వంటి వర్ధమాన రంగాలు మీరు శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉన్న నూతన సవాళ్ళుగా ముందుకు వస్తున్నాయి. మనం ఒక దేశంగా, ఇటువంటి సరికొత్త సాంకేతికతలతో, నూతన ఆవిష్కారాలతో తులతూగ గలిగేటట్లుగా దయచేసి శ్రద్ధ వహించండి.
ఈ సవాళ్ళను మన శాస్త్ర విజ్ఞాన సముదాయం పరిష్కరించే తీరు స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రీ 4.0 మరియు ఇంటర్ నెట్ – ఆఫ్ – థింగ్స్ లలో మన విజయాన్ని నిర్ధారించగలదు. మన నూతన ఆవిష్కర్తలతోను, నవ పారిశ్రామికులతోను మన శాస్త్ర విజ్ఞాన సంబంధ పర్యావరణ వ్యవస్థ నేరుగా అనుసంధానమై, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దవలసి ఉంది.
మిత్రులారా, జనాభా పరంగా మనకు ఉన్నటువంటి అనుకూలాంశం యొక్క శక్తి యావత్ ప్రపంచానికే ఈర్ష్యను రేకెత్తించేటటువంటిది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ‘స్టాండ్-అప్ ఇండియా’, ‘స్టార్ట్-అప్ ఇండియా’, ‘స్కిల్ డివెలప్ మెంట్ మిషన్’ మరియు ‘ప్రధాన మంత్రి ముద్ర పథకం’ ల వంటి కార్యక్రమాలను అమలుచేస్తోంది. ఈ పరంపరలో ప్రపంచంపై వాటి ముద్ర వేయగలిగిన, ప్రపంచ శ్రేణి సంస్థలుగా గుర్తింపు తెచ్చుకొనే 20 సంస్థలను అభివృద్ధి పరచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ మిశన్ లో చేరవలసిందిగా ఉన్నత విద్య రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను మరియు ప్రైవేటు రంగ సంస్థలను ప్రభుత్వం స్వయంగా ఆహ్వానిస్తూ వస్తోంది. మేం నియమాలలో మార్పులు చేశాం. అలాగే, చట్టాలలో సవరణలు చేశాం. ఎంపిక చేయబడిన ప్రభుత్వరంగ సంస్థలకు ఒక నిర్ణీత కాలం లోపల 1,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.
ఎస్.ఎన్. బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ మరియు అటువంటి ఇతర సంస్థలు తమ తమ సంస్థలను అగ్ర స్థానాలు పొందే సంస్థలలో ఒక భాగం అయ్యేటట్లు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని, ఆ దిశగా పని చేయాలని నేను పిలుపునిస్తున్నాను.
విద్యార్థులకు, యువతీ యువకులకు పరిశోధనలు చేసేందుకు మరింతగా ప్రేరణను ఇచ్చే వాతావరణాన్ని ఈ సంస్థలలో సృష్టించవలసిందిగా కూడా ఇవాళ మిమ్మల్ని నేను కోరుతున్నాను.
ఒక శాస్త్రవేత్త అతడి లేదా ఆమె సమయంలో కొంత సమయాన్ని వెచ్చించి ఒక చిన్నారి శాస్త్ర విజ్ఞానాన్ని అభ్యసించేందుకు మరియు పరిశోధనలు చేసేందుకు ఆసక్తిని పెంచగలిగితే, అది ఈ దేశంలోని లక్షలాది విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్ద గలుగుతుంది. ఇదే ఆచార్య ఎస్.ఎన్. బోస్ గారికి ఆయన 125వ జయంతి నాడు ఇచ్చే అతి పెద్ద నివాళి కాగలదు.
మిత్రులారా, 2017వ సంవత్సరంలో మనమంతా, 1.25 బిలియన్ భారతీయులం కలిసి, ఒక పవిత్రమైన ప్రతిజ్ఞను చేశాం. ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించడం కోసమే ఈ పవిత్ర ప్రతిజ్ఞ. దేశంలోని అంతర్గత లోపాలను 2022 కల్లా నిర్మూలించడం కోసమే ఈ ప్రతిజ్ఞ.
ఈ ప్రతిజ్ఞ మన స్వాతంత్య్ర యోధులు కలలు గన్న భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం కూడాను. ఈ పవిత్ర ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసం 2018వ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సంవత్సరం మనం మన యావత్తు శక్తిని ఈ పవిత్ర ప్రతినను నెరవేర్చుకోవడం కోసం వినియోగించడంపై శ్రద్ధ తీసుకోవలసిన సంవత్సరం.
దీని కోసం దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ, ప్రతి విభాగం మరియు ప్రతి మంత్రిత్వ శాఖ తన స్వీయ తోడ్పాటును అందించాలి. ఒక రైలు స్టేషన్ ను వదలిపెట్టిన 5-10 నిమిషాలలో తన గరిష్ఠ వేగాన్ని అందుకొన్నట్లుగానే 2018వ సంవత్సరం మనం గరిష్ఠ వేగాన్ని పొందేందుకు ఉద్దేశించినటువంటిది.
దేశంలో శాస్త్ర విజ్ఞాన సంబంధ సముదాయంతో పాటు, శాస్త్ర విజ్ఞాన మరియు సాంకేతిక విజ్ఞానంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడాను వారి వారి పరిశోధనలను మరియు నూతన ఆవిష్కారాలను ఒక ‘న్యూ ఇండియా’ నిర్మాణం కోసం వారి దృష్టిని కేంద్రీకరించాలి.
మీ నూతన ఆవిష్కరణలు దేశంలో పేదలను మరియు మధ్యతరగతి ప్రజలను బలపరుస్తాయి: వారు దేశాన్ని బలపరుస్తారు. అది ‘ఆధార్’ కావచ్చు, లేదా ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీ కావచ్చు, లేదా భూమి స్వస్థత కార్డు కావచ్చు, లేదా పథకాలను కృత్రిమ ఉపగ్రహం లేదా డ్రోన్ల ద్వారా పర్యవేక్షించడం కావచ్చు.. ఈ సౌకర్యాలన్నీ మీరు సృష్టించినవే.
ఉద్యోగ ప్రధానమైన ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చేందుకు ఇంకా ఏమేమి చేయాలో అనేది నిర్ధారించడంలో శాస్త్ర విజ్ఞాన సంస్థలు ఒక పెద్ద పాత్రను పోషించగలవు. గ్రామీణ ప్రాంతాల అవసరాలకు తగిన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడంలో మరియు ఆ తరహా సాంకేతిక విజ్ఞానాన్ని పల్లెలకు అందిచడంలో మీ యొక్క పాత్ర అత్యంత ముఖ్యమైనది.
మిత్రులారా, గృహ నిర్మాణం, త్రాగు నీరు, విద్యుత్తు, రైల్వేలు, నదులు, రహదారులు, విమానాశ్రయాలు, సేద్యపు నీరు, కమ్యూనికేశన్ లు మరియు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల వంటి అనేక రంగాలలో నూతన ఆవిష్కరణలు మీ కోసం నిరీక్షిస్తున్నాయి.
ప్రభుత్వం మీ వెన్నంటి ఉంది. వనరులు మీ వెంట ఉన్నాయి. మరి, సామర్ధ్యాల పరంగా మీరు మరెవ్వరికీ తీసిపోరు. కాబట్టి, ఏ విధంగా చూసినా జయం మీదే అవుతుంది. మీరు విజేతలైనప్పుడు దేశం విజేతగా నిలుస్తుంది. మీ ప్రతినలు నెరవేరాయంటే అప్పుడు దేశం యొక్క పవిత్ర ప్రతిజ్ఞలు కూడా సాకారం అవుతాయి.
మిత్రులారా, మీ వద్ద ఒక అనుశీలన కార్యాచరణ ప్రణాళిక ఉన్న పక్షంలో ప్రారంభాల యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఈ కార్యక్రమానికి తరువాయిగా ఉత్తేజభరితమైన మరియు ముఖ్యమైన కార్యక్రమాలు బారు తీరాయని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.
పాఠశాలల్లో మరియు కళాశాలల్లో 100 కు పైగా అవుట్ రీచ్ లెక్చర్స్ కు రంగం సిద్ధం చేశారని నా దృష్టికి వచ్చింది. శాస్త్ర విజ్ఞాన పరంగా సవాళ్ళను రువ్వుతున్న సమస్యలకు 125 పరిష్కార మార్గాలపై అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలను, పోటీలను నిర్వహించడం సైతం ఈ కార్యక్రమ పట్టికలో ఒకటిగా ఉంది.
వివేకవంతమైన ఉపాయాలు, అవి పురుడుపోసుకొన్న కాలానికి అతీతంగా వాటి ఉపయుక్తతను అట్టిపెట్టుకొంటాయి. ఈ రోజుకు కూడా ఆచార్య బోస్ గారి కృషి శాస్త్రవేత్తలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంది.
శాస్త్ర విజ్ఞాన పరిశోధన తాలూకు కొత్త కొత్త క్షేత్రాలలో కృతకృత్యులు అయ్యేందుకు మీ ప్రయత్నంలో మీకు చాలా మంచి జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీ అవిశ్రాంత యత్నాల ద్వారా దేశ ప్రజలు మరింత ఉత్తమమైనటువంటి మరియు ఉజ్జ్వలమైనటువంటి భవిష్యత్తును అందుకొంటారన్న నమ్మకం నాకు ఉంది.
నూతన సంవత్సరం మీకందరికీ సృజనాత్మకం కావాలని, మీ కృషి చక్కగా ఫలించాలని నేను కోరుకొంటున్నాను.
జయ్ హింద్!