వారాణసీ లో ఈ రోజు జరిగిన ఇండియా కార్పెట్ ఎక్స్ పో ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
భారతదేశం లో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అతిథులు మరియు విదేశాల నుండి తరలివచ్చిన అతిథులకు ప్రధాన మంత్రి స్వాగతం పలుకుతూ, ఇండియా కార్పెట్ ఎక్స్ పో ను వారాణసీ లో దీన్ దయాళ్ హస్త్ కళా సంకుల్ లో నిర్వహించడం ఇదే మొదటి సారి అన్నారు. వారాణసీ, భదోహీ ఇంకా మిర్జాపుర్ లు తివాచీ పరిశ్రమ కు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయని ఆయన చెప్పారు. హస్తకళలను, చిన్న పరిశ్రమలను, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు.
హస్తకళల్లో భారతదేశానికి సుదీర్ఘమైనటువంటి సంప్రదాయం ఉందని, ఈ అంశం లో వారాణసీ ఓ కీలక భూమిక ను పోషించిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఇదే ప్రాంతానికి చెందిన మహా కవి సంత్ కబీర్ ను గురించి కూడా ప్రస్తావించారు.
స్వాతంత్ర్య పోరాటం లోను, స్వావలంబన ఉద్యమం లోను హస్తకళలు ప్రేరణ గా నిలచాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ ని గురించి, సత్యాగ్రహాన్ని గురించి, ఇంకా చరఖా ను గురించి ప్రధాన మంత్రి వివరించారు.
ప్రస్తుతం తివాచీ లకు అతి పెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం ఉందని, ప్రపంచ విపణి లో సుమారు 35 శాతం వాటాను భారతదేశం కలిగివుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రంగం లో ఎగుమతులు కూడా చక్కగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఎదుగుతున్న మధ్యతరగతి తో పాటు తివాచీ పరిశ్రమ కు ఇస్తున్నటువంటి తోడ్పాటు ఈ రంగం వర్ధిల్లేందుకు కీలకమైన అంశాలు గా ఉంటున్నాయని ఆయన అన్నారు. ‘‘మేడ్ ఇన్ ఇండియా కార్పెట్’’ ను ఒక పెద్ద బ్రాండు గా మార్చివేసిన తివాచీ తయారీదారుల నైపుణ్యాన్ని ఆయన అభినందించారు. తివాచీ ల ఎగుమతిదారు సంస్థలకు రవాణా సంబంధ మద్దతు ను అందిస్తున్న విషయాన్ని, నాణ్యత తగ్గకుండా చూసేందుకు ప్రపంచ శ్రేణి ప్రయోగశాల లను నెలకొల్పడాన్ని గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఆధునిక మగ్గాలు, పరపతి సౌకర్యాలు సహా ఈ రంగానికి అందుబాటులోకి తీసుకువస్తున్న ఇతర సౌలభ్యాలను గురించి కూడా ఆయన వివరించారు.
ఈ దేశానికి ఉన్నటువంటి బలాలలో తివాచీ తయారీదారుల నైపుణ్యం మరియు కఠోర శ్రమ ఒక బలం గా రూపొందేటట్టు చూడడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.